తెలంగాణ: 'మా బతుకులు, భవిష్యత్తును బొందపెట్టే జీవో ఇది'

- రచయిత, ప్రవీణ్ శుభం
- హోదా, బీబీసీ కోసం
ఆదిలాబాద్ ఏజెన్సీ మొదలుకుని ఖమ్మం - భద్రాచలం వరకు జీవో 49ను వ్యతిరేకిస్తూ ఆదివాసీలు ఆందోళనలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు వచ్చిన జీవో ఇది. పర్యావరణ, ఆదివాసీ, ప్రజా, హక్కుల సంఘాలు ఈ జీవోను వ్యతిరేకిస్తున్నాయి.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని సుమారు 3 లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని 'కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్'గా ప్రకటిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను జారీ చేసింది.
సరిహద్దు మహారాష్ట్ర నుంచి వచ్చే పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు, తరచూ ఎదురవుతున్న మానవ-వన్యప్రాణి సంఘర్షణను నివారించడంలో ఈ జీవో ఎంతగానో సహకరిస్తుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
అయితే, ఇందులో ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్ర దాగుందని ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టాయి.
"మా జాతుల మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తూ, మా బతుకులు, భవిష్యత్తును బొందపెట్టే జీవో ఇది" అని ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరుకు చెందిన ఆదివాసీ యువకుడు మేడి సతీశ్ బీబీసీతో అన్నారు.


కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఏంటి?
ప్రధానంగా, మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను అటవీప్రాంతం గుండా కలిపే కారిడార్ ప్రాంతాన్ని "కుమ్రం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్'' గా ప్రకటిస్తూ మే 30,2025న తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను జారీ చేసింది.
జాతీయ వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం-1972 లోని 36-ఏ నిబంధన ప్రకారం కన్జర్వేషన్ రిజర్వ్‌గా డిక్లేర్ చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఈ నిబంధన ప్రకారం.. స్థానికులతో సంప్రదింపుల అనంతరం అభయారణ్యాలు, వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను అనుసంధానించే ప్రాంతాలను అక్కడి వృక్ష, జంతు జాలం , వాటి ఆవాసాలను రక్షించడానికి పరిరక్షణ రిజర్వ్ ( కన్జర్వేషన్ రిజర్వ్) గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించవచ్చు.

'సంప్రదింపులు జరపలేదు'
వన్యప్రాణి సంరక్షణ చట్టం చెబుతున్నట్టుగా 'సంప్రదింపులు' జరపకుండానే ఏకపక్షంగా జీవో జారీ చేశారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.
"రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ రక్షణ పరిధిలోకి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ వనరులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు 'పెసా' చట్టం( PESA Act-1996) స్థానిక గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టింది. అధికారులు వాటిని అమలు చేయడం లేదు. గ్రామసభలు నిర్వహించలేదు. మాయమాటలు చెప్పి , దొడ్డి దారిన జీవో 49ను తెచ్చిన అధికారులపై చీటింగ్ కేసులు నమోదు చేయాలి'' అని ఆదివాసీ సంఘ నాయకుడు కొడప శంకర్ అన్నారు.
అయితే, ఈ ఆరోపణలను తెలంగాణ అటవీశాఖ ఖండించింది.

ఫొటో సోర్స్, UGC
ఈ కన్జర్వేషన్ రిజర్వ్ పరిధిలోని 339 గ్రామాలతో సంప్రదింపులు జరిపామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది.
గత పదేళ్లుగా స్థానికులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, ఆ తర్వాతే జీవో నోటిఫికేషన్ వచ్చిందని తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( పీసీసీఎఫ్) సి. సువర్ణ అన్నారు.
'ఈ జీవో వల్ల స్థానికులకు లాభమే కానీ నష్టం లేదు. ఈ విషయం వారు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం' అని ఆమె అన్నారు.

'అడవి బయటకు పంపే కుట్ర ఇది'
జీవో అమలుతో వన్యప్రాణులు, స్థానికులు సహజీవనం చేసేలా పరిస్థితులుంటాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అటవీశాఖ చెబుతోంది. అయితే, ఇది ఆదివాసీలను పూర్తిగా అడవికి దూరం చేసే కుట్ర అని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
"5వ షెడ్యూల్ ప్రకారం ఆ ప్రాంతంలోని చెట్టూ, పుట్టా, జంతువులు.. ఇలా స్థిర, చరాస్థులన్నిటి పైనా ఆదివాసీలకు హక్కుంది. ఇప్పుడు ఇవి ఫారెస్ట్ భూములంటున్నారు. అయితే, కుమ్రం భీమ్ పోరాటం తర్వాత మాకు వచ్చిన హక్కులు ఏమయ్యాయి? పులులపేరు చెప్పి ఆదివాసీలను అడవి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు"' అని అఖిల భారతీయ గోండ్వానా పరిషత్ కు చెందిన సిడాం అర్జు ప్రశ్నించారు.
ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ఇటీవల కొన్ని ఆదివాసీ సంఘాలు తెలంగాణ గవర్నర్‌ను కలిశాయి.
''ఇది ఆదివాసీలను మరో పోరాటానికి సిద్దం చేయడమే. దీన్ని ఆషామాషీగా తీసుకోం. మావానాటే- మావా రాజ్య ( మాఊర్లో – మా ప్రభుత్వం) నినాదంతో చట్టబద్ద హక్కులకోసం పోరాడతాం'' అని సిడాం అర్జు అన్నారు.

అటవీశాఖ చెబుతున్న ఉపాధి అవకాశాలపై తమకు నమ్మకం లేదని స్థానిక యువకులు అంటున్నారు.
"కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గూడేలకు ఇలాంటి మాటలు చెప్పే అక్కడివారిని అడవి నుంచి బయటకు తెచ్చారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏమయింది? పూర్తి పరిహారం అందలేదు, పునరావాస కాలనీలో కనీస వసతులు లేక తిరిగి అడవిలోకి వెళ్తున్నారు" అని మేడి సతీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నదే ఐదు లక్షల పైచిలుకు జనాభా. జిల్లాలో సగం భూమిని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి తెస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఒక చేత్తో పోడు పట్టాలు ఇచ్చి మరో చేత్తో భూములు లాక్కుంటున్నారు. వట్టివాగు ప్రాజెక్ట్‌ను కూడా జీవో పరిధిలోకి వచ్చే ప్రాంత మ్యాప్‌లో చూయించారు. ఇది న్యాయం కాదు' అని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావ్ అన్నారు.
'బందిఖానాగా మార్చేస్తారు'

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేపట్టే విషయంలో చాలాకాలంగా అటవీ శాఖతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆదివాసీలకు మధ్య ఒకవిధమైన ఘర్షణ కొనసాగుతోంది.
ఫారెస్ట్ చట్టాల పేరుతో అంగన్‌వాడీలు, సోలార్ పంప్ సెట్లు, బ్రిడ్జిలు, సెల్‌ఫోన్ టవర్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు.. వంటి మౌలిక నిర్మాణాలను అటవీ శాఖ అడ్డుకుంటోందని వారు ఆరోపిస్తున్నారు.
జీవో 49తో ఈ పనులు మరింత కష్టంగా మారతాయని ఆదివాసీల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఏనుక అమృత.. నాయకపోడ్ ఆదివాసీ మహిళ. బెజ్జూరులో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
జీవో 49 విషయంలో అమృతకు కొన్ని సందేహాలతో పాటు భయాలూ ఉన్నాయి.
"జీవో 49 వచ్చాక స్వతంత్రం కంటే ముందున్న పరిస్థితులు వస్తాయేమో? అడవి లోపలికి వెళ్లే దారులు మూసేస్తే మా గూడేలు బందిఖానాలుగా మారుతాయోమే అన్న భయం ఉంది. మా పరిస్థితే ఇలా ఉంటే రాబోయే మా తరాల సంగతేంటీ?"అని అమృత ప్రశ్నిస్తున్నారు.
"మా పోడు భూములను లాక్కునేందుకే జీవో 49 తెచ్చారు. పులులకు, పర్యావరణానికి మేము వ్యతిరేకం కాదు. అయితే, దీని వెనుక అసలు ఉద్దేశం ఇక్కడి ఖనిజాలను తరలించాలనుకోవడమే తప్ప వన్యప్రాణి కారిడార్ కాదు" అని సోయం చిన్నన్న అన్నారు.
ఆదివాసీల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాల అమలు తీరే సరిగ్గా లేదని , కొత్త జీవోలతో తమ జీవితాల్లో మార్పులు వస్తాయంటే ఎలా నమ్మాలని తుడుందెబ్బ ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్ అన్నారు.
"ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌తో ఇప్పటివరకు ఆదివాసీలు బాగుపడ్డది లేదు. జీవో అమలైతే ఇల్లు కట్టాలన్నా, బోరు వేయాలన్నా, చివరకు వ్యవసాయ పనుల కోసం గొడ్డలి తీసుకుని చేనులోకి పోవాలన్నా అటవీ శాఖ వారి అనుమతి కావాలి. జల్, జంగల్, జమీన్ కోసం పోరాటం చేయకపోతే బతుకుదెరువు లేదని ఆదివాసీలందరికి అర్థం అయింది" అని విజయ్ అన్నారు.
‘‘ఇప్పుడు కాకపోయినా వచ్చే ఇరవై ఏళ్ల కైనా మమ్నల్ని అడవి నుంచి తరలిస్తారు. జీవో 49 కు వ్యతిరేకంగా అన్నీ ఆదివాసీ గూడాల్లో పెసా గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తాం.’’

'వందేళ్లైనా ఆదివాసీల హక్కులకు ఢోకా లేదు'
జీవో 49తో కొత్త ప్రతిబంధకాలేవి ఉండవని, పాత నిబంధనలే అమల్లో ఉంటాయని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అంటోంది.
"జీవో 49 పై ఆదివాసీల్లో అనేక ఆపోహలున్నాయి. అడవి, పోడు భూముల హక్కులకు వచ్చిన ఢోకా ఏమీ లేదు. అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోతాయన్నది, గ్రామాలు ఖాళీ చేయిస్తారన్నది అవాస్తవం. వచ్చే వందేళ్లైనా వారు ఇక్కడి నుంచి ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదు" అని కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ టీబ్రేవాల్ బీబీసీతో అన్నారు.
"కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుతో ఈ ప్రాంతం దేశంలోనే ఐదు అత్యుత్తమ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో ఒకటిగా ఎదిగే అవకాశం ఉంది. కేంద్ర నిధులతో పర్యటకం అభివృద్ది, స్థానికులకు మెరుగైన ఉపాధి, మానవ-వన్యప్రాణి ఘర్షణలో నష్టపోయిన వారికి మెరుగైన పరిహారం అందుతుంది'' అని డీఎఫ్ఓ టీబ్రేవాల్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, UGC
గత అనుభవాలతో, అటవీశాఖపై ఆదివాసీలకు ఏర్పడిన అపనమ్మకంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన 'గ్రీన్ ప్లానెట్' సంస్థ తాడోబా టైగర్ రిజర్వ్ ఏర్పాటు సమయంలో స్థానిక ఆదివాసీలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. ఆ సంస్థ నిర్వాహకుడు సురేష్ చోపానే బీబీసీతో మాట్లాడారు.
''ఫారెస్ట్, స్థానిక ఎన్జీవోలు కలిసి ఆదివాసీలకు పరిస్థితిని సరిగ్గా వివరించలేకపోయారని అర్థమవుతోంది. కన్జర్వేషన్ రిజర్వ్ సఫలం అయితేనే కవ్వాల్ టైగర్ జోన్ కోర్ ఏరియాలోకి పులులు చేరుకుంటాయి. మానవ-వన్యప్రాణి సంఘర్షణ తగ్గుతుంది. టూరిజం పెరిగితే స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. ఇచ్చే పరిహారం నాణ్యతతో కూడి ఉండాలి'' అని చోపానే అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














