నిఖిల్, రమ్యశ్రీ: రెణ్నెల్ల కిందటే ప్రేమ పెళ్లి, పాశమైలారం పేలుడుతో ఈ జంట కథ విషాదాంతం

నవ దంపతులు
ఫొటో క్యాప్షన్, నిఖిల్‌ రెడ్డి, రమ్యశ్రీ రెండు నెలల కిందట ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కంపెనీలో పేలుడు కారణంగా మరణించినవారి గాథలు ఒకొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 36మంది మరణించినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.

ఈ ప్రమాదంలో మరణించినవారిలో రెండు నెలల కిందట ప్రేమ వివాహాం చేసుకున్న నిఖిల్‌రెడ్డి, రమ్య అనే యువ దంపతులు కూడా ఉన్నారు.

వీరి మరణంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటను, వివాహమైన రెండు నెలలు గడవకముందే మృత్యువు కబళించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాశమైలారం పేలుడు
ఫొటో క్యాప్షన్, నిఖిల్ రెడ్డి

ఆర్య సమాజ్‌లో పెళ్లి

నిఖిల్‌రెడ్డి, రమ్యశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్‌లో వీరి వివాహం జరిగింది. అయితే, ఇటీవలే వీరి పెళ్లిని పెద్దలు ఆమోదించారు.

శ్రావణమాసంలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్న తరుణంలోనే వారు పని చేస్తున్న సిగాచీ కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిఖిల్‌రెడ్డి, రమ్యశ్రీ మరణించడంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

నిఖిల్ రెడ్డి ఏడేళ్లుగా సిగాచీ కంపెనీలో పనిచేస్తున్నారు. రమ్యశ్రీ కూడా అదే కంపెనీలో ఆరునెలల కిందట జాయిన్ అయ్యారు. ఇద్దరూ క్వాలిటీ చెక్ విభాగంలోనే పనిచేస్తున్నారు

వీరు పటాన్‌ చెరు ప్రాంతంలో నివాసం ఉండేవారు.

నిఖిల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వారు. పటాన్ చెరు ప్రాంతంలోనే నివసించే ఆలేరుకు చెందిన మరో కుటుంబానికి నిఖిల్ అత్యంత సన్నిహితుడు.

నిఖిల్‌ను తమ సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకునేవారమని ఆ కుటుంబం తెలిపింది.

ప్రమాద వార్త తెలియగానే ఈ కుటుంబం పరుగున ఆస్పత్రికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.

‘‘కడపకంటే ఆలేరులోని మా ఇంటికే నిఖిల్ ఎక్కువసార్లు పండుగలకు వచ్చేవాడు’’ అని ఆ కుటుంబం తెలిపింది.

ప్రమాదంలో రమ్యశ్రీ శరీరం ఎక్కువగా కాలిన గాయాలయ్యాయని, నిఖిల్ శరీరానికి పెద్దగా గాయాలు కాలేదని, దుస్తులు కూడా సక్రమంగానే ఉన్నాయని మృతదేహాన్ని చూసిన వారు చెప్పారు.

‘‘ఉదయం ఐదు గంటలకే నిఖిల్ డ్యూటీ కి వెళ్ళాడు 9:30 కల్లా ఆయన మరణ వార్త తెలిసింది’’ అంటూ వాపోయారు నిఖిల్ సన్నిహిత కుటుంబసభ్యురాలు ఒకరు.

అయితే వీరి మృతదేహాలను మాత్రం ఆయా కుటుంబాలు వేర్వేరుగా తమ సొంతూళ్లకు తీసుకెళుతున్నట్లు తెలిసింది.

పాశమైలారం ఘటనలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఫొటో క్యాప్షన్, పాశమైలారం ఘటనలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రమాద ప్రాంతంలో ఇప్పటిదాకా ఏం జరిగింది?

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అక్కడి సిగాచీ కెమికల్స్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.

తొలుత ప్రమాదంలో 12 మంది చనిపోయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. కానీ మృతుల సంఖ్య 36కు పెరిగినట్టు మంగళవారంనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మంగళవారం ఉదయం ఘటనాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు.

‘‘ఇది అత్యంత విషాదకరమైన దుర్ఘటన’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఫ్యాక్టరీలో మొత్తం 143మంది ఉన్నారని, వీరిలో 58మందిని అధికారులు గుర్తించారని తెలిపారు. ఇన్ని ప్రాణాలను తీసిన దుర్ఘటన తెలంగాణలో ఇప్పటిదాకా జరగలేదని ముఖ్యమంత్రి అన్నారు.

చనిపోయిన కుటుంబాలకు కోటిరూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, పాక్షికంగా గాయపడినవారికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

గాయపడినవారికి మెరుగైన చికిత్సఅందించాలని ఆదేశించామని, ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రమాదంపై నిపుణులతో సవివరమైన నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించారు.

అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.

పాశమైలారంలో దెబ్బతిన్న భవనం

మృత దేహాల గుర్తింపు

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడులో బాధితులైనవారికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మొత్తం 36 మంది మరణించారు.

ఈ కథనం ప్రచురించే సమయానికి 11 మృతదేహాలను మాత్రమే గుర్తించి బంధువులకు అప్పగించారు.

ఇక ప్రభుత్వమే అంబులెన్సులలో మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.

మరణించినవారి కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా లక్షరూపాయల నగదును జిల్లా కలెక్టర్ అందించారు.

ఇది పరిహారం కాదని, కేవలం తక్షణ సాయం మాత్రమేనని ముఖ్యమంత్రి అంతకుముందు ప్రకటించారు.

మృతదేహాలను పటాన్‌చెరు ప్రాంతీయ ఆస్పత్రిలో భద్రపరిచారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)