విశాఖ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలకు కారణమదేనా, బాధ్యత ఎవరిది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా,అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో ఇదే అతిపెద్దది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి.
గత ఐదేళ్లుగా విశాఖలో 119 ప్రమాదాలు జరిగితే, అందులో 120 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం చంద్రబాబు అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 2012లో జరిగిన ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ ప్రమాదం నుంచి.. ఇప్పుడు అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదం వరకు, దాదాపు 25 ప్రమాదాలు ఉమ్మడి విశాఖ ప్రజలను బెంబేలెత్తించాయి.
ఈ ప్రమాదాలలో ఎక్కువ భాగం పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలోనే జరిగాయి. అందులోనూ ఫార్మా కంపెనీల్లోనే ఎక్కువగా జరగ్గా, వాటిల్లోనూ రియాక్టర్లు, బాయిలర్ల పేలుడు వలన జరిగిన ప్రమాదాలే అధికం.

వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉంటే పరిశ్రమలు పాఠాలు నేర్వడం లేదా? అధికారులు నేర్పలేకపోతున్నారా?
సెజ్‌లలో జరిగిన ఏ ప్రమాదంపైన అయినా ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పందించాయా? వరుస ప్రమాదాల నేపథ్యంలో ‘ఏ ఒక్క ఫ్యాక్టరీలోకైనా మళ్లీ మేం ప్రాణాలతో తిరిగి వస్తాం’ అనే నమ్మకంతో కార్మికులైనా, ఉద్యోగులైనా పనికి వెళ్లగలుగుతున్నారా? అసలు, వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?

ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆగస్ట్ 21వ తేదీ మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో 17 మంది మరణించగా.. 22 అర్ధరాత్రి పరవాడ సెజ్‌లోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రెడియంట్స్ సంస్థలో మరో ప్రమాదం జరిగి నలుగురికి తీవ్రగాయాలవడం విశాఖవాసులను కలవరపెట్టింది.
ఇవి కాకుండా గత 12 ఏళ్లలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది మృతి చెందిన కొన్ని ప్రమాదాలను చూస్తే...
- 2012 జూన్ 13న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ప్లాంట్ ట్రయల్ రన్ సందర్భంగా పేలుడు.. 11 మంది మృతి
- 2014 జూన్ 16న స్టీల్ ప్లాంట్‌లో కార్బన్ మోనాక్సైడ్ లీక్.. ఇద్దరి మృతి
- 2014 డిసెంబరు 27న మైలాన్ కంపెనీలో భారీ పేలుడు.. ఇద్దరి మృతి
- 2019 డిసెంబర్ 27న స్మైలాక్స్ ల్యాబ్‌లో గ్యాస్ లీక్.. ఇద్దరి మృతి
- 2018లో పరవాడ సెజ్‌లోని సైనార్ లైఫ్ సైన్సెస్‌లో రియాక్టర్ పేలుడు.. ఇద్దరి మృతి
- 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 13 మంది మృతి
- 2020 ఆగస్ట్ 1న హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో క్రేన్ ప్రమాదం.. 11 మంది మృతి
- 2022 జూన్, ఆగస్టు నెలల్లో 'సీడ్స్' కంపెనీలో రెండుసార్లు విష వాయువు లీక్, 500 మందికి పైగా మహిళా కార్మికులకు అస్వస్థత
- 2023 జూన్ 30న సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు.. నలుగురి మృతి
- 2023 ఆగస్ట్ 10న సింహాద్రి ఎన్టీపీసీలో ప్రమాదం.. ఇద్దరి మృతి
ఇవి కాకుండా ఒకరు మాత్రమే మృతి చెందినవి, కార్మికులు లేదా ఉద్యోగులు తీవ్రగాయాలపాలైన ప్రమాదాలు విశాఖ పరిశ్రమల్లో నిత్యం జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా సెజ్‌లలో.

‘ప్రమాదానికి అసలు కారణమదే’
పరిశ్రమల్లో వరుస ప్రమాదాలకు కారణాలపై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మాజీ డైరెక్టర్ వీఎస్ఆర్కే ప్రసాద్ బీబీసీతో మాట్లాడారు.
ఎసైన్షియా ఫ్యాక్టరీలోని ప్రమాద కారణాలపై ఆయన మాట్లాడుతూ, ''సాల్వెంట్ లీక్ అవ్వగానే ముందుగా దాని ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించాలి. అలా చేయకుండా ప్రొడక్షన్ ఆగిపోతుందనే భయంతో అక్కడ రిపేర్ చేయడం మొదలుపెట్టారు. దాని వలన మీథైల్ టెర్ట్ – బ్యూటైల్ ఈథర్ (ఎంటీబీఈ) అనే రసాయనం (బయటకు వస్తే గ్యాస్‌గా మారుతుంది) లీకైంది. ఇది గమనించడంలో ఆలస్యం జరిగినట్లుంది. దాంతో సాల్వెంట్, లీకైన గ్యాస్ మధ్య రసాయన చర్య జరిగింది. అదే ఈ ప్రమాదానికి కారణమైందని అక్కడ జరిగిన విషయాలను వరుసగా గమనిస్తే అర్థమవుతోంది'' అన్నారు.
''సరైన అర్హతలు కలిగి, రసాయన చర్యలపై అవగాహన ఉన్న వారు (కెమిస్టులు) విధుల్లో ఉంటే ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం చేసుకోగలరు. మిగతా వారు స్విచ్‌లను ఆపరేట్ చేయడం తప్ప, ఏమీ చేయలేరు'' అన్నారాయన.
నిజానికి చాలా ఫ్యాక్టరీలలో పని చేస్తూ...అక్కడ ఉపయోగించే రసాయనాల పేర్లు, వాటి ప్రభావం వంటివి తెలియనివారే ఎక్కువగా ఉండటం తాను గమనించానని వీఎస్ఆర్కే ప్రసాద్ తన అనుభవాలను వివరించారు.

ప్రమాదాల నివారణకు...
'పరిశ్రమల్లో ప్రమాదాలు' అనే అంశంపై డాక్టర్ వీఎస్ఆర్కే ప్రసాద్ అనేక పరిశ్రమలలోని సిబ్బందికి అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు, సెమినార్లు నిర్వహించారు.
“పరిశ్రమల ప్రమాదాలపై మేం నిర్వహించే సెమినార్లకు పరిశ్రమల తరపున హాజరయ్యే వారు రెండు, మూడు రోజులు సెలవు దొరికినట్టుగా భావిస్తారు. ఒక సర్టిఫికేట్ పట్టుకుని వెళతారు. కానీ, ఇక్కడ ఏం నేర్చుకున్నారో వారి ఫ్యాక్టరీలో చేసి చూపించరు. యాజమాన్యం కూడా చూపించమని అడగదు” అని ప్రసాద్ చెప్పారు.
ప్రమాదాల నివారణ కోసం కంపెనీలు, పరిశ్రమలకు ఆయన కొన్నిసూచనలు చేశారు.
- సేఫ్టీ కల్చర్ పాటించాలి. దీని కోసం క్రమంతప్పకుండా సేఫ్టీ ఆడిట్లు, సేఫ్టీ ఎక్సర్‌సైజులు (మాక్ డ్రిల్స్ వంటివి) అలవాటుగా మార్చాలి.
- ఎలాంటి తప్పులు జరిగినా .. ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీల డిజైన్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దీనినే హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇంజనీరింగ్ అంటారు.
- ప్రమాదం జరిగితే ఏం చేయాలనేది వాచ్‌మెన్ నుంచి యాజమాని వరకూ తెలిసే విధంగా సేఫ్టీ మ్యాన్యువల్ ఉండాలి.
- రెడ్ కేటగిరీలోని పరిశ్రమలపై (కెమికల్ గోడౌన్స్, కెమికల్ పైప్‌లైన్స్, ట్యాంక్స్, బాయిలర్లు, రియాక్టర్లు, ఎలక్ట్రికల్ బోర్డ్స్) నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.
- ప్రతి పరిశ్రమకూ ఫైర్ ఇంజిన్ ఉండాలి. లేదంటే అయా పరిశ్రమలకు సరిపడా విధంగా ప్రభుత్వం ఫైరింజన్లను ఏర్పాటు చేయాలి.
బీబీసీ 2023 జులైలో, 2024 ఆగస్టులో పరిశీలించినప్పుడు దాదాపుగా ఏ పరిశ్రమకూ సొంతంగా ఫైరింజన్ లేదు. అచ్యుతాపురం సెజ్‌లోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఒకే ఒక్క ఫైరింజన్ ఉందనే విషయాన్ని బీబీసీ గమనించింది. ఎసైన్షియా పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు కూడా బయట నుంచే ఫైరింజన్లు వచ్చాయి.
పరిశ్రమల్లో వరుస ప్రమాదాలను చూస్తుంటే మేం పని చేసే పరిశ్రమలో కూడా ప్రమాదం జరుగుతుందా? అనే భయం పెరుగుతోందని లారస్ ల్యాబ్స్‌లో పని చేస్తున్న ఆనంద్ కుమార్, శ్రీనివాసరావు బీబీసీ వద్ద అందోళన వ్యక్తం చేశారు.

చర్యలు ఉంటున్నాయా?
పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన వెంటనే నాయకులు, అధికారుల హడావుడి కనిపించడం పరిపాటే. వెంటనే కమిటీలు వేయడం, నివేదికలు కోరడమూ మామూలే.
“ప్రమాదాలపై ప్రభుత్వాలు నియమించిన కమిటీలు నివేదికలు ఇస్తుంటాయి. కానీ, వాటిని బయటకు చూపించరు. ఆ రిపోర్టులలో ఏం ఉంటుందో ఎవరికీ తెలియదు” అని సేఫ్టీ ఆడిట్‌లపై థర్డ్ పార్టీ రిపోర్టులు రూపొందించే విశాఖలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ అధిపతి అన్నారు.
2020లో ఎల్జీ పాలీమర్స్ ఘటనపై నీరబ్ కుమార్ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ప్రభుత్వానికి కొన్నిసూచనలు చేసింది. కానీ ఆ తర్వాత, అంతకు ముందు జరిగిన అనేక ప్రమాదాలపై వేసిన కమిటీల నివేదికలు ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదని చెప్పారు.
గత ఏడాది జూన్ 30న సాహితి సాల్వెంట్స్‌లో జరిగిన ప్రమాదం తర్వాత వేసిన కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు అనకాపల్లి జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
‘ఎసైన్షియా’లో తనిఖీలు చేశారా?
అచ్యుతాపురం సెజ్‌లో 2022 ఆగస్టులో బ్రాండిక్స్ గ్యాస్ లీక్ తర్వాత రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలనూ తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరి ఈ ఆదేశాలకు అనుగుణంగా అనకాపల్లి జిల్లాలో తనిఖీలు జరిగాయా లేదా అనే విషయంపై ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పి.చిన్నారావుతో బీబీసీ మాట్లాడింది.
“బ్రాండిక్స్ ప్రమాదం తర్వాత పరవాడ, అచ్యుతాపురం సెజ్‌లలోని దాదాపు అన్నీ కంపెనీలలో పరిశ్రమల శాఖ తరపున తనిఖీలు చేశాం. అన్ని పరిశ్రమలకూ వాటి పరిస్థితులకు తగినట్టుగా సేఫ్టీ రికమెండేషన్స్ చేశాం. వాటిపై ఆయా పరిశ్రమలు చర్యలు తీసుకుని.. ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు. వాటి వివరాలు మాకు తెలియదు” అని చిన్నారావు తెలిపారు.
ఒకసారి మేం తనిఖీలు చేసి సేఫ్టీ కోసం సూచనలు చేసిన తర్వాత మళ్లీ ఆ పరిశ్రమలో విస్తరణ, ఉత్పత్తిలో మార్పులు, కొత్త యంత్రాల కొనుగోలు జరిగితే మళ్లీ వాటికి తగినట్టుగా సేఫ్టీ రికమండేషన్లు చేస్తుంటాం. ఇది నిరంతర ప్రక్రియ. ప్రమాదం జరిగిన ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో 2022 అక్టోబర్‌లో తనిఖీలు చేసి 60 సూచనలు చేశామని చిన్నారావు బీబీసీకి చెప్పారు.
ఎసైన్షియా యాజమాన్యం వివరణ కోసం ఆగస్ట్ 22వ తేదీన ఈమెయిల్ ద్వారా బీబీసీ సంప్రదించింది. ఇంకా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఎసైన్షియా బయో ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న సురేష్ పార్దానీని ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన కంపెనీ వ్యవహారాలపై మాట్లాడేందుకు నిరాకరించారు.
ఎసైన్షియా పరిశ్రమలో హెచ్‌ఆర్‌గా పని చేస్తున్న రామును , సేఫ్టీ ఏర్పాట్ల గురించి బీబీసీ ప్రశ్నించింది. "సిబ్బంది రక్షణ కోసం అన్ని రకాలైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రమాదాలే జరగలేదు. ఇదే తొలిసారి. సేఫ్టీ కి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో పక్కాగా ఉంటాం" అని ఆయన సమాధానమిచ్చారు. మరింత సమాచారం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

ఫొటో సోర్స్, Twitter/N Chandrababu Naidu
‘ఎవరి నిర్లక్ష్యం?’
ప్రమాదాలు జరిగినప్పుడు ‘‘మీ నిర్లక్ష్యం వల్లే ఇదంతా’’ అంటూ ప్రతిపక్షం, అధికార పక్షాలు ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది.
‘‘2020లో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై హైపవర్ కమిటీ వేశారు. దాని రిపోర్టును గాలికి వదిలేశారు. అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఫొటో సోర్స్, YSRCP
ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వల్లే ఎసైన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు.
‘‘ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు నీరబ్ కుమార్ ప్రసాద్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2020లో జీవో తీసుకొచ్చాం. ఫ్యాక్టరీ భద్రత, కాలుష్య నియంత్రణ వంటి వాటి కోసం ప్రోటోకాల్ కూడా తీసుకొచ్చాం. ప్రస్తుతం ప్రభుత్వం ఆ ప్రోటోకాల్‌ను పాటించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు’’ అని జగన్ అన్నారు.
విశాఖపట్నం వద్ద ఉండే ఫార్మా సెజ్‌లలో ఎప్పుడు ప్రమాదం జరిగినా సంబంధిత సంస్థల యాజమాన్యాలు నోరువిప్పవు, మీడియాతో మాట్లాడవు అనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఎసైన్షియా ఫార్మా విషయంలోనూ అదే జరిగింది.
కనీసం చనిపోయిన కార్మికులు, గాయపడిన వారిని చూడటానికి కూడా కంపెనీ రాలేదని చంద్రబాబు అన్నారు.
‘‘పరిశ్రమలు, ప్రజలూ రెండూ ముఖ్యమే. అందుకే పరిశ్రమలపై వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నా ముఖ్యమంత్రిగా సమన్వయంతో ఆలోచిస్తున్నా’’ అన్న చంద్రబాబు, సేఫ్టీ ఆడిట్‌పై ఒక కమిటీ వేస్తాం అని తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














