ఎసైన్షియా కంపెనీ ఎవరిది? హైదరాబాద్‌లో వీరికి ఉందంటున్న మరో కంపెనీ చిరునామాలో ఉన్నదేంటో తెలుసా

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’లో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు.
ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు.
ఈ ఘటనపై ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ప్రమాదం తర్వాత.. అసలు ఆ కంపెనీ వివరాలేంటి, యాజమాన్యం ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది.


బల్క్ డ్రగ్ తయారీ
ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ అనేది ఫార్మా కంపెనీ. ఇక్కడ బల్క్ డ్రగ్స్ తయారు చేస్తుంటారు.
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో నమోదైన వివరాల ప్రకారం.. ఈ కంపెనీలో పెండ్రి యాదగిరి రెడ్డి, పెండ్రి కిరణ్ రెడ్డి, దండు చక్రధర్, అజిత్ అలెగ్జాండర్ జార్జ్, వివేక్ వసంత్ సవే డైరెక్టర్లుగా ఉన్నారు.
సీఎఫ్ఓ(చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా కోరాడ శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు.
కంపెనీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పెట్టిన వివరాల ప్రకారం ... ఎసైన్షియా కంపెనీ అమెరికా సాంకేతికతతో బల్క్ డ్రగ్స్ తయారు చేస్తోంది.
దీన్ని యాదగిరి పెండ్రి 2007లో స్థాపించారు. ఆయనే కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. కంపెనీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పెండ్రి కిరణ్ ఉన్నారు.
కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలోని సౌత్ విండ్సర్‌లో ఉన్నట్లు లింక్డ్ఇన్‌లో రాసి ఉంది.
ఈ కంపెనీలో 1001 నుంచి 5000 మంది మధ్య ఉద్యోగులున్నట్లు ఆ ప్రొఫైల్ పేజ్ చెబుతోంది.
ఏపీఐఐసీలో పేర్కొన్న వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురం సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్)లో ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ కంపెనీ ఉంది.
బల్క్ డ్రగ్ అంటే చికిత్సల కోసం వినియోగించే మందుల తయారీలో వాడే పదార్థం.
ఉదాహరణకు నొప్పిని తగ్గించే మందులు చాలా ఉన్నాయి. అందులో వాడే పారాసిట్మాల్ అనేది బల్క్ డ్రగ్. పారాసిట్మాల్‌తో నొప్పిని తగ్గించే మందులు తయారు చేస్తుంటారు.
ఎసైన్షియాకు అమెరికా, అచ్యుతాపురంతోపాటు హైదరాబాద్‌లోనూ కంపెనీలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

అసలు అక్కడ కంపెనీయే లేదు
హైదరాబాద్ అడిక్‌మెట్‌లో ఎసైన్షియా బయో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మైనింగ్ అండ్ మెటల్స్ కంపెనీ ఉన్నట్లు కంపెనీ ప్రొఫైల్‌లో ఉంది.
అడిక్‌మెట్‌లో 1-9-815 డోర్ నంబర్‌తో కంపెనీ రిజిస్టర్ అయింది.
‘బీబీసీ’ అక్కడికి వెళ్లి పరిశీలించింది.
కంపెనీ ప్రొఫైల్‌లో పేర్కొన్న చిరునామాలో ఒక పాత నివాస భవనం మాత్రమే ఉంది.
పక్కన ఉన్న షాపులకు డోర్ నంబరు వేసి ఉన్నప్పటికీ.. ఈ కంపెనీ రిజిష్టర్ అయిన భవనానికి డోర్ నంబరు వేసి లేదు.
ఎసైన్షియా బయో ఫార్మా కంపెనీలో మరో డైరెక్టర్ గా ఉన్న సురేష్ పార్దానితో ఫోన్లో బీబీసీ మాట్లాడింది. అయితే ఆయన ఈ కంపెనీ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.

కంపెనీ ఎవరు ప్రారంభించారంటే..
ఎసైన్షియాను పెండ్రి యాదగిరి స్థాపించినట్లుగా లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఉంది.
మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్‌లో నమోదైన వివరాల ప్రకారం విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలో 2020 సెప్టెంబరు 9 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు యాదగిరి. దీనికి ముందు అదే ఏడాది ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబరు 9 వరకు అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు.
ఎసైన్షియా లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2008 ఆగస్ట్ 1 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారు యాదగిరి. ఈయనతోపాటు మన్నం స్వర్ణలత అనే మరో మహిళ కూడా అదే తేదీ నుంచి డైరెక్టర్‌గా ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రికార్డుల్లో ఉంది.
అలాగే 2008 జనవరి 22 నుంచి ఎసైన్షియా బయో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, 2013 ఫిబ్రవరి 27 నుంచి ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోనూ యాదగిరి డైరెక్టర్‌గా ఉన్నారు.
ఈ కంపెనీలు ఏర్పాటు చేయకముందు 1988 నుంచి 2005 వరకు బ్రిస్టల్ మైయిర్స్ స్క్విబ్ కంపెనీలో సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగాలలో ఆయన పనిచేశారు.
పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు.
1985-88 మధ్య యూటీ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు.
డ్రగ్ ఆవిష్కరణ, డ్రగ్ తయారీలో అనుభవం ఉన్నట్లు యాదగిరి లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.
విమ్టా ల్యాబ్స్ కంపెనీలో పేర్కొన్న వివరాల ప్రకారం యాదగిరికి డ్రగ్ ఆవిష్కరణ, తయారీలో 15 దాకా అమెరికా పేటెంట్స్ ఉన్నాయి. 35కు పైగా రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కంపెనీలో యజమానుల మధ్య గొడవలు నడుస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
‘‘ఎసైన్షియా కంపెనీకి ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒకరు హైదరాబాద్‌లో ఉంటారు. ఇప్పుడున్న అతనికి, మాకు సంబంధం లేదని వారిలో ఒకరు చెబుతున్నారు. వాళ్లిద్దరి మధ్య ఏదో గొడవ ఉంది. దానివల్ల సేఫ్టీ నిబంధనలు పాటించే బాధ్యత తీసుకునే నాయకత్వం లేకపోవడం వల్ల ఇలా జరిగింది’’ అని పవన్ కల్యాణ్ మీడియాకు చెప్పారు.
అయితే, కంపెనీ డైరెక్టర్లలో ఎవరెవరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు మెయిల్ ద్వారా కంపెనీ ప్రతినిధులను బీబీసీ సంప్రదించింది. వారి నుంచి సమాధానం రావాల్సి ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















