అచ్యుతాపురం సెజ్: ‘ఇంత డేంజర్ కంపెనీల పక్కన ఉంటున్నామని ఇప్పుడే తెలిసింది’

అచ్చుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘టూ వీలర్ టైర్ పంక్చరై శబ్దం వచ్చినా కూడా రియాక్టర్ పేలిందేమో అని భయమేస్తోంది.. అచ్యుతాపురం సెజ్‌లో తరచూ జరిగే పేలుళ్లు మాకు భయాన్ని కలిగిస్తున్నాయి. తరచూ రియాక్టర్లు పేలడం వలన ఏ చిన్న శబ్దం విన్నా మేం ఉన్న చోటు నుంచి దూరంగా వెళ్లిపోవడం అలవాటైపోయింది” అని దిబ్బపాలెం గ్రామానికి చెందిన అప్పలరాజు చెప్పారు.

జూన్ 30న రియాక్టర్ పేలి నలుగురు ప్రాణాలు కోల్పోయిన సాహితి ఫార్మా ప్యాక్టరీకి సుమారు కిలోమీటరు దూరంలో దిబ్బపాలెం ఉంది.

అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదాలు, ప్రాణ నష్టం సాధారణమైపోయాయి.

ఇక్కడ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?

వీటిని ఆరికట్టడంలో ప్యాక్టరీ యాజమాన్యాలు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు?

అచ్యుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

ఒక్కటే ఫైర్ ఇంజిన్

సాహితి ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-1లో జరిగిన ప్రమాదంలో మొత్తం నలుగురు మరణించారు.

ప్రమాదం జరిగన రోజు ఇద్దరు, ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మరో ఇద్దరు మరణించారు. గాయాలపాలైన వారిలో కూడా 60 నుంచి 90 శాతం శరీరం కాలిపోయిన వారున్నారు.

సాహితి ఫార్మాలో జరిగిన ప్రమాదం చుట్టు పక్కల గ్రామాల్లో తీవ్రమైన భయాన్ని కలిగించింది.

ఫ్యాక్టరీ దగ్గర పోలీసుల కాపలా ఉన్నారు. జాగ్రత్త కోసం ఒక ఫైర్ ఇంజిన్ కూడా ఉంది.

అచ్యుతాపురం సెజ్‌లో 208 ఫ్యాక్టరీలున్నాయి. సెజ్‌లోని మరికొన్ని ప్యాక్టరీలవైపు వెళ్లి చూసిన బీబీసీ బృందానికి ఎక్కడా ఫైర్ ఇంజిన్, అంబులెన్స్‌లు కనిపించలేదు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడినప్పుడు, ‘‘ఆ విషయాలు మాకు తెలియవు’’ అనే సమాధానం వారి నుంచి వచ్చింది.

ఫ్యాక్టరీలకు ఫైర్ ఇంజిన్ లేదా మంటలు ఆర్పే వ్యవస్థలు ఉండాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి.

“సాహితి ఫార్మా వద్ద ఉన్న ఫైరింజిన్ యలమంచిలి ఫైర్ స్టేషన్‌ది. అచ్యుతాపురం సెజ్‌లో కొన్ని కంపెనీల వద్ద మాత్రమే సొంత ఫైర్ ఇంజిన్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకుని ఏపీఐఐసీ తరపున ఒక ఫైర్ ఇంజిన్ నిర్వహిస్తున్నాం.” అని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సీతారాం బీబీసీతో చెప్పారు.

అచ్యుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

ప్రమాదాలు ఇలా...

అనకాపల్లి జిల్లాలోని స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) దాదాపు 10 వేల ఎకరాల్లో ఏర్పాటైతే, అందులో 3 వేల ఎకరాలు ఫార్మా సెజ్‌కు కేటాయించారు. దీనినే అచ్యుతాపురం ఫార్మా సెజ్ అంటారు. రసాయనాల తయారీ, నిల్వ చేసే ఈ ఫ్యాక్టరీలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

గత తొమిదేళ్లలో జరిగిన ప్రమాదాలు:

  • 2014 డిసెంబరు 27న మైలాన్ కంపెనీలో భారీ పేలుడు..ఇద్దరు మృతి
  • 2019 ఏప్రిల్ 8న ఏషియన్ పెయింట్స్ కంపెనీ ప్రమాదం...ఒకరి మృతి
  • 2020 జనవరి 14న సన్వీరా లిమిటెడ్ కంపెనీ చిమ్నీ కూలి ఒకరు మృతి
  • 2021 జూలై 23న వశిష్ట ఫార్మాలో ప్రమాదం...ఒకరి మృతి
  • 2022 జూన్, ఆగస్టులలో 'సీడ్స్' కంపెనీలో రెండు సార్లు విష వాయువు లీక్, 500 మందికి పైగా మహిళ కార్మికులకు అస్వస్థత
  • 2022 అక్టోబరు 22న సెయింట్ గ్లోబైన్ కంపెనీలో గ్యాస్ లీక్, ఒకరి మృతి
  • 2023 జనవరి 11న జీఎంఎఫ్సీ ల్యాబ్‌లో బాయిలర్ పేలుడు, ఒకరి మృతి
  • 2023 ఫిబ్రవరిలో మిథాన్ ఫెర్రోస్ ఫార్మాలో ప్రమాదం, ఒకరి మృతి
  • 2023 జూన్ రెండోవారం అభిజిత్ ఫెర్రో కంపెనీలో ప్రమాదం...ఒకరి మృతి
  • 2023 జూన్ 30న సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు, 4గురు మృతి

ఈ గణాంకాలు చూస్తే ఇటీవల కాలంలో అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

అచ్చుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

‘ఇంత డేంజర్ అనుకోలేదు’

అచ్యుతాపురం సెజ్‌లో జరుగుతున్న వరుస ప్రమాదాలు తమకు భయాన్ని కలిగిస్తున్నాయని బీబీసీతో మాట్లాడిన కొందరు సెజ్ ఉద్యోగులు, కార్మికులు, సమీప గ్రామల ప్రజలు అన్నారు.

“ఫ్యాక్టరీల కోసం మా భూములిచ్చాం. అక్కడ ప్యాక్టరీలు వచ్చాయి. వాటికి సమీపంలోనే మాకు నిర్వాసితుల కాలనీ ఇచ్చారు. కానీ ఎప్పటికప్పుడు పేలుతున్న రియాక్టర్లతో మా గ్రామాలకు ఏమవుతుందా అని భయంతో ఉంటున్నాం. ఇంత డేంజర్ కంపెనీల పక్కన ఉంటున్నామని మాకు ఇప్పుడే తెలిసొచ్చింది” అని అచ్యుతాపురం సెజ్ నిర్వాసిత కాలనికి చెందిన నవీన బీబీసీతో అన్నారు.

“అన్నీ రసాయనాలు తయారు చేసేవి, వాటిని నిల్వ చేసే ప్యాక్టరీలే కావడంతో ఇక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. రియాక్టర్లు పేలితే ఎవరు ఏమీ చేయలేరు. అయితే దురదృష్టవశాత్తు అచ్యుతాపురం సెజ్‌లో ఎక్కువగా రియాక్టర్లే పేలుతున్నాయి. వేల లీటర్ల రసాయనాలు ఉండే రియాక్టర్లు పేలుతుంటే...దానిని ఆరికట్టేందుకు సరైన వ్యవస్థలు దాదాపుగా ఏ ప్యాక్టరీలోనూ ఉండవు” అని ఫార్మా ఉద్యోగి ఒకరు తెలిపారు.

అచ్చుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

‘ఆడిట్ అంటే కాగితాల మీద కాదు...ప్యాక్టరీలో జరగాలి’

‘‘పెద్దవి, ప్రాణాలు పోయిన ప్రమాదాలే తప్ప సెజ్‌లో జరిగే ఇతర ప్రమాదాలేవి బయటకు తెలియనివ్వరు. అలాంటి ప్రమాదాలు చాలానే జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని యాజమాన్యం ఎప్పుడూ సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడం లేదు’’ అని అచ్యుతాపురంలో జరిగే వరుస ప్రమాదాలు చెబుతున్నాయని పరిశ్రమల్లో ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించే సోమశేఖర్ చెప్పారు.

థర్డ్ పార్టీల తరపున సోమశేఖర్ ఆడిట్‌లు నిర్వహిస్తుంటారు.

సాధారణంగా ఐఎస్ఓ 14489 (1998) ప్రకారం సేఫ్టీ ఆడిట్ నిర్వహించి దానిని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు సమర్పించాలి. ఈ ఆడిట్‌ను ఏటా ప్రతి ఫ్యాక్టరీ చేయించుకోవాలి. ఫైర్ సేఫ్టీ, కార్మికుల భద్రత, పర్యావరణ కాలుష్యంతోపాటు పైపులు, రియాక్టర్లు, ట్యాంకర్లు, ఇతర పనిముట్ల జీవిత కాలం, ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి? అనే అంశాలను ఆడిట్‌లో భాగంగా చెక్ చేయాలి.

“సేఫ్టీ ఆడిట్ అనేది చాలా కంపెనీలు, ఫ్యాక్టరీల పేపర్లపైనే చేయిస్తాయి. అసలు ఫ్యాక్టరీలకు వెళ్లకుండా ఆడిట్ రిపోర్టును సమర్పించే ప్రైవేటు సంస్థలున్నాయి. అక్కడే అవకతవకలకు అవకాశం ఏర్పడుతుంది. నిపుణులైన ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో కూడిన కమిటీతో ఈ ఆడిట్లు చేయిస్తే, అసలైన రిపోర్టులు వస్తాయి.

నిజాయితీగా ఇండస్ట్రీయల్ యాక్ట్ ప్రకారం చేసే సేఫ్టీ ఆడిట్‌లో ఏ కంపెనీ కూడా పాస్ కాదు. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు. ఫ్యాక్టరీల విస్తరణ, కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటు, లైసెన్స్ రెన్యూవల్, బ్యాంకు లోన్స్ వంటి అవసరాల కోసం ఆడిట్లు చేయిస్తారే తప్ప, ఏటా తప్పనిసరిగా సేఫ్టీ ఆడిట్లు చేపట్టే ఫ్యాక్టరీలు దాదాపుగా లేవనే చెప్పుకోవచ్చు” అని సోమశేఖర్ అన్నారు.

అచ్చుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

‘మాట్లాడని యాజమాన్యాలు?’

2020లో ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం తర్వాత ప్రభుత్వం సేఫ్టీ ఆడిట్ కమిటీలు ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలు పరిశ్రమలో పర్యావరణ సంరక్షణ, భద్రత, ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలు వంటి అంశాలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించాలి.

అచ్యుతాపురంలో సెజ్‌లో సేఫ్టీ ఆడిట్ క్రమం తప్పకుండా జరుగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి చెబుతున్నారు. కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

“జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన సేఫ్టీ ఆడిట్‌ కమిటీలతో అక్కడి ఫ్యాక్టరీలు ఆడిట్ చేయించుకోవాలి. ఈ కమిటీ ఆయా జిల్లాల్లోని ఉన్న కెమికల్ అండ్ ఫార్మా పరిశ్రమలపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. అచ్చుతాపురం సెజ్‌లో ఉన్న ప్యాక్టరీలన్నింటికి ఇచ్చిన తేదీల ప్రకారం ఆడిట్లు నిర్వహిస్తున్నాం. కానీ ప్రమాదాలు జరగడం దురదృష్టకరం.” అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.

అటు పరవాడ ఫార్మా సెజ్‌లో కానీ, ఇటు అచ్యుతాపురం సెజ్‌లో కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా ప్యాక్టరీల యాజమాన్యాలు మీడియాతో కానీ, బాధితులతో కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. నష్టపరిహారం, ఇతర విషయాలన్ని కూడా ప్రభుత్వం తరపున మంత్రులు, ఎమ్మేల్యేలే మాట్లాడతారు.

అసలు ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోయినా కూడా యాజమాన్యాలు ముందుకు వచ్చి మాట్లాడవు. బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ ప్రమాదం నుంచి సాహితి ఫార్మాలో నలుగురు చనిపోయిన రియాక్టర్ పేలుడు ప్రమాదం వరకు ఎప్పుడు యాజమాన్యాలు మాట్లాడటం కనపడలేదు.

అచ్చుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

గత నివేదికలు ఏవి?

నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా కంపెనీలు నడపుతుండటమే తరుచూ జరిగే ప్రమాదాలకు కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు.

సెజ్‌లలో చాలా ఫ్యాక్టరీలు రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలకు చెందినవే. అందుకే సెజ్‌లలో జరిగే ప్రమాదాలు కమిటీలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే సెజ్‌లలో జరిగిన చాలా ప్రమాదాల్లో కమిటీలు వేశారు. మరి అవి ఇచ్చిన నివేదికలను ఎప్పుడైనా బయట పెట్టారా అని గ్రీన్ గో స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఆదినారాయణ అన్నారు.

గతంలో జరిగిన ప్రమాదాలపై ఎటువంటి నివేదికలు వచ్చాయి? వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయంపై మాట్లాడేందుకు సేఫ్టీ కమిటీలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులను బీబీసీ సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు. అయితే ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సీతారాం మాత్రం ఈ విషయంపై మాట్లడారు.

“సెజ్‌లో ప్రమాదాలు జరిగినప్పుడు వేసే కమిటీ ఓ నివేదిక తయారు చేస్తుంది. మళ్లీ ప్రమాదాలు జరగకుండా ఆ ప్యాక్టరీ ఎటువంటి చర్యలు చేపట్టాలో రెకమెండేషన్స్ చేస్తూ రిపోర్టు రూపొందిస్తుంది. ఆ రిపోర్టును కూడా ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అయితే దీనితో ఏపీఐఐసీకి సంబంధం ఉండదు. కాబట్టి ఆ రిపోర్టు మీడియాకు, ప్రజలకు బహిర్గతం చేస్తారో లేదో మాకు తెలియదు” అని సీతారాం బీబీసీతో చెప్పారు.

ఎన్ని పరిశ్రమలు ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రతా ప్రమాణాలు మెరుగుపరచాయి? ఏం చర్యలు తీసుకున్నాయి?...అనేది అధికారులు బయటకు వెల్లడించడం లేదు.

అచ్చుతాపురం సెజ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas

ఏదైనా ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారా?

“పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్‌లలో జరిగిన ప్రమాదాలకు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణమని తేలుతోంది. కానీ ఆ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తారు. ఆ తర్వాత ఏం పట్టించుకోరు.” అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము బీబీసీతో అన్నారు.

అయితే గతంలో ప్రమాదం జరిగినప్పుడు దానికి గల కారణాలు చెప్తూ నివేదిక విడుదల చేయడం తామెప్పుడూ చూడలేదని బాధితులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇక్కడ ప్లాస్టిక్ చెత్తను ఇస్తే ఉచితంగా భోజనం పెడతారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)