విశాఖ తీరాన్ని సముద్రం ఎందుకిలా కోసేస్తోంది, కారకులెవరు, పరిష్కారమేంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల పొడవైనా తీరం స్వరూపం రోజూ మారిపోతోంది. ఆ మార్పుల కారణంగానే ఒక్కోసారి ఒక్కోచోట తీరం కోతకు గురవుతోంది. కొద్దిరోజుల కిందట విశాఖ ఆర్కే బీచ్ సమీపంలోని చిల్డ్రన్ పార్కు దగ్గర బీచ్ కోతకు గురై, పార్కు అంతా బీటలువారి...సముద్రంవైపు ఒరిగింది.
ఏ సముద్ర తీర స్వరూపమైనా స్థిరంగా ఉండదు. రోజురోజుకు మారుతూ ఉంటుంది. మరి సముద్ర స్వరూపం అలా మారుతుతుంటే, తీరం పొడవునా టూరిస్టు స్పాట్లు ఉండే విశాఖ తీరం, అక్కడికి వచ్చే సందర్శకులు, సమీప గ్రామాలు సురక్షితమేనా...?
గత కొన్నేళ్లుగా...విశాఖ తీరంలో నిర్మాణాలు క్రమంగా పెరుగుతున్నప్పటి నుంచి బీచ్ తరచూ కోతకు గురవుతుంది. అయితే వీటిలో అపార్టుమెంట్స్, టూరిజం, హోటల్స్, పోర్టు అవసరాల కోసం జరిపిన, జరుపుతున్న నిర్మాణాలు ఉన్నాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరంగా పేరున్న విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు అనేక చోట్ల తీరం కోతకు గురవుతోంది. దీంతోపాటు నగరానికి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కవచంగా నిలిచే కొండలు తరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి పనులు పేరుతో ప్రభుత్వం కొండలను తవ్వడం వివాదస్పదం కూడా అవుతోంది.

కోతకు గురైన చోటే చిల్ట్రన్ పార్క్
హార్బరు నుంచి ప్రయాణం మొదలు పెడితే ..ఆర్కే బీచ్, సబ్ మెరైన్, లైట్ హౌస్, వుడా పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్కు, సాగర్ నగర్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి...ఇలా విశాఖలో అడుగడుగునా టూరిస్టు ప్లేస్ ఉంటుంది. ఈ ప్రాంతాలన్నిటిలోనూ తీరం కోతకు గురవుతూనే ఉంటుంది. అయినా ఇక్కడ మళ్లీ మళ్లీ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు.
"తీరం వెంబడి భారీ కట్టడాలు, బ్రేక్ వాటర్స్ కోసం చేసే నిర్మాణాలు...సముద్రం నుంచి తీరానికి వచ్చే బలమైన అలల దిశను మార్చేస్తుంటాయి. దిశ మారిన అలలు ఒక్కోసారి ఒక్కోచోట తీరాన్ని బలంగా తాకుతాయి. దీనివల్ల అప్పటికే బలహీనంగా ఉన్న తీర ప్రాంతంలోని మట్టి లేదా ఇసుక జారిపోయి...తీరం ఎక్కువగా కోతకు గురవుతుంది. ఆ ప్రదేశాల్లో ఏవైనా నిర్మాణాలుంటే అవి కూలిపోతాయి" అని ప్రొఫెసర్ ధనుంజయ్ బీబీసీతో అన్నారు. ఆంధ్రాయూనివర్సిటీ జియాలజీ విభాగంలో ధనుంజయ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
ఒక్కో తీరం...ఒక్కో తీరు...
తుపాను సమయంలో అలలు ఉధృతి ఎక్కువగా ఉండి తీరం కోతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇసుక మేటలను తీసే ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండే ప్రాంతం కూడా కోతకు గురవుతూనే ఉంటుందని విశాఖ తీరం కోతపై పరిశోధన చేసిన చెన్నై ఐఐటీకి చెందిన నిపుణులు బృందం తేల్చింది.
"కోత అనేది సహజంగా జరిగేది. దీని ఆపలేం. కానీ నియంత్రించగలం. కోతకు గురయ్యే అవకాశాలున్న ప్రదేశాలపై ముందుగా సెడిమెంట్ మూమెంట్ స్టడీ చేయాలి. ఆ రిపోర్టు ఆధారంగా చేసుకుని సెండ్‌వాల్ ఫెన్సింగ్, సీ వాల్ ఫెన్సింగ్ లు నిర్మించడం ద్వారా కోతను తగ్గించడంతో పాటు అప్పటికే అక్కడ ఏవైనా నిర్మాణాలు ఉంటే వాటిని కాపాడవచ్చు. ఒకచోట కోతను నియంత్రించినా...మరొక చోట కోతకు గురవుతుంది. తీరానికి హాని కలిగించే విధంగా సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, సహజ సిద్ధంగా రక్షణ ఇస్తున్న కొండల్ని తవ్వేయడం వంటివి ఆపితే కోతను నియంత్రించవచ్చు" అని విశాఖ తీరం కోతపై అనేక పరిశోధనలు చేసిన ఏయూ జియాలజీ విభాగాధిపతి కేఎస్ఎన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

పచ్చని రుషికొండ...ఎర్రగా మారింది...
విశాఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖమైనది రుషికొండ. ఇక్కడ తీరానికి ఆనుకుని అనేక కొండలు ఉంటాయి. తీరానికి సమీపంగా ఉన్న ఒక కొండపై 14 ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం రిసార్ట్స్ నిర్మించింది. దీనిని ప్రస్తుత ప్రభుత్వం తొలగించి...కొత్తగా ఈ రిసార్ట్స్‌ని నిర్మించేందుకు కొండను తవ్వడం, చదును చేయడంలాంటి కార్యక్రమాలు చేపట్టింది.
తీర ప్రాంతాల్లో ఉండే కొండలు సముద్ర విపత్తుల నుంచి నగరాన్ని కాపాడతాయని తెలిసినా...ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట కొండలను నాశనం చేస్తున్నారని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు.
"రోడ్డుపై నుంచి వెళ్తున్నా, రుషికొండ బీచ్ కు వెళ్లినా...ఈ కొండ పచ్చగా కనిపించేది. కానీ ఇప్పుడు తవ్వకాలతో ఎర్రగా కనిపిస్తోంది. గతంలో ఉన్న రిసార్ట్స్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండే రిసార్ట్స్ నిర్మిస్తూ...దాదాపు 10 ఎకరాల్లో కేవలం 139 చెట్లు మాత్రమే తొలగించామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. విశాఖలో ముఖ్యంగా తీర ప్రాంత సమీపంలో ఉన్న కొండలు మాయమైపోయాయి. ఇప్పటికే కొండలు, రాళ్ల వంటి రక్షణ లేని చోట తీరం తీవ్రంగా కోతకు గువవుతోంది. జిల్లాలో అనేక చోట్ల మత్స్యకార గ్రామాలైతే నిత్యం కోత భయంతో గడుపుతున్న పరిస్థితి ఉంది" అని పర్యావరణవేత్త సోహన్ హటంగడి బీబీసీతో చెప్పారు.

ప్రమాదంలో గ్రామాలు
పర్యాటకానికి కేరాఫ్ అడ్రసైన విశాఖ తీర ప్రాంతాలు చాలాచోట్ల కోతకు గురవుతున్నాయి. దీని వలన సందర్శకులలో ఆందోళనతో పాటు...తీరం అందం చెడిపోతోంది. విశాఖ జిల్లాలోని తీరం వెంబడి 43 మత్స్యకార గ్రామాలుంటే, వాటిలో 15 గ్రామాలు తరచూ కోతకు గురవుతూ ఉంటాయి.
"తీరం కోతకు గురైంది అనే మాట ఒకప్పుడు విశాఖలో అప్పుడప్పుడూ వినిపించేంది. కానీ ఇప్పుడు తరచూ ఆ మాట వినిపిస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశమే. ఐపీసీసీ (ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో....ప్రమాదంలో ఉన్న తీరప్రాంత నగరాల్లో విశాఖ కూడా ఉందని చెప్పింది.
"బ్యూటీఫికేషన్, అభివృధ్ది, టూరిజం, ఇండస్ట్రీస్...వీటికోసం...తీరానికి రక్షణ కవచాల్లాంటి కొండలు, ఇసుక దిబ్బలు, మడ అడవులు లేకుండా చేస్తున్నారు. ఇది తీర ప్రాంతాలకే కాకుండా సమీపంలోని మత్స్యకార గ్రామాలకు కూడా పెను ప్రమాదమే. విశాఖ నుంచి భీమిలి వెళ్లే దారి పొడవునా ఉన్న తీరంలో చాలా వరకు ఎర్రమట్టి ఉంటుంది. దీనికి చిన్నపాటి అలలు తాకినా... మట్టి కరిగిపోతూ...తీరం వైపుగా జారిపోతుంది. అలాంటిది బలమైన అలలు తగిలితే....భూ ఉపరితలంపై పగుళ్లు ఏర్పడి, నేల కుంగిపోతుంది. భీమిలి సమీపంలోని చేపలుప్పాడ, ఐఎన్ఎస్ కళింగ, బోయివీధి, తోటవీధి, నగరంలో ఆర్కేబీచ్, పెద జాలరిపేట, వాసవానిపాలెం, జోడుగుళ్లపాలెం, రుషికొండ తీరాలు ఎక్కువగా కోతకు గురవుతున్నాయి" అని ఏయూ బే ఆఫ్ బెంగాల్ స్టడీస్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి. రామారావు తెలిపారు.

తీరం తగ్గుతోంది...
విశాఖలో పోర్టు విస్తరణ, తీరం వెంబడి భారీ నిర్మాణాలు, కట్టడాలతో సమతుల్యత దెబ్బతిని మేటలు వేయకపోవడం, భారీగా కోతకు గురికావడం వంటివి జరుగుతున్నాయి. విశాఖలో చాలా తీరాల వద్ద సముద్రం...కోత కారణంగా ముందుకు వచ్చిందని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అధికారులు చెప్తున్నారు.
ఆరు దశాబ్ధాలుగా ఈ కోత క్రమంగా పెరుగుతోందని...తద్వారా తీరం తగ్గుతోందని అంటున్నారు.
"సీఆర్‌జెడ్ నిబంధనలు పాటించడం తీరాన్ని కాపాడటంలో తొలి అడుగుగా చెప్పుకోవాలి. సరుగుడు, తాటిచెట్లు, మడ అడవులను విస్తారంగా పెంచాలి. హుద్‌హుద్ తర్వాత కోతపై విస్తృతమైన అధ్యయనం చేశాం. తుపాన్లు, ఆటుపోట్ల సమయాల్లో అలలు వేగంగా తీరాన్ని తాకకుండా ముంబాయిలో మాదిరిగా సిమెంటు దిమ్మలు వేస్తే కోతను చాలా వరకు అడ్డుకోవచ్చు. అలాగే గతంలో ఉప్పాడ తీరంలో వేసినట్లు జియో ఫెన్సింగ్ కూడా వేయవచ్చు. వీటికన్నా, సహజ రక్షణ కవచాలైన కొండలు, చెట్లను ధ్వంసం చేయకుండా ఉంటే చాలు" అని ఓషనోగ్రఫీ మాజీ రీజినల్ హెడ్ జీపీఎస్ మూర్తి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
టూరిస్టులకు ఏం తెలుసు...?
సీజన్లతో సంబంధం లేకుండా విశాఖకు నిత్యం టూరిస్టుల సందడి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ వచ్చిన వారెవరైనా...ఇక్కడ బీచ్‌లకు వెళ్లకుండా ఉండరు. సాయంత్రమైందంటే చాలు స్థానికులు, పర్యాటకుల రాకతో తీర ప్రాంతాలు కిటకిటలాడతాయి.
"మాది హైదరాబాద్. మేం వచ్చిన ముందు రోజే చిల్ట్రన్ పార్క్ వద్ద తీరం కోతకు గురైందని తెలిసి...ఆ ప్రాంతాన్ని చూశాం. కోత చాలా ఎక్కువగా ఉంది. మాలాంటి టూరిస్టులకు ఇక్కడున్న ప్రకృతి అందాలను చూసి ఆనందించడమే తప్ప...ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందో ఎలా తెలుస్తుంది?'' అని సురేందర్ అనే టూరిస్ట్ అన్నారు.
''ఎక్కడ ప్రమాదకరమైన ప్రదేశాలున్నాయో అక్కడ నో ఎంట్రీ బోర్డులు పెట్టాలి. తెలియని వాళ్లు ప్రమాదాల పాలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'' అని ఆయన సూచించారు.
నిపుణుల బృందం...ఉన్నత స్థాయి సమావేశం
గతేడాది అక్టోబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖ పోర్టులో ఉన్న బంగ్లాదేశ్ కు చెందిన నౌక ఒకటి...గాలుల ప్రభావానికి పోర్టు నుంచి తెన్నేటి పార్కు బీచ్ వరకు కొట్టుకొచ్చింది. అంత భారీ నౌక కొట్టుకురావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
తీరంలో వీచే గాలులకి భారీ నౌకలే కొట్టుకొస్తుంటే...తీవ్రమైన గాలులతో పాటు బలమైన అలలు తీరాన్ని తాకితే...ఆ ప్రాంతంలో తీరం భారీగా కోతకు గురవుతుంది. ఈ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చిల్డ్రన్ పార్కు వద్ద తీరం కోతకు గురైన సంఘటన తెల్లవారు జామున జరిగింది కాబట్ట ఎవరికీ ఏమీ కాలేదు.
"విశాఖలో తీరం కోతపై చెన్నై ఐఐటీ నిపుణుల బృందం అధ్యయనం చేసింది. ఏయూ కూడా కొన్ని అధ్యయనాలు చేసింది. వీటన్నింటిని చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. టూరిజం అభివృద్ధి చేస్తున్నాం తప్ప ...తీరం కోత కారణంగా ప్రమాదాలకు అవకాశమున్న ప్రాంతాల్లో ఎటువంటి పనులు చేపట్టం. అలాగే రుషికొండపై ఉన్న రిసార్ట్ ని ఆధునీకరిస్తున్నామేగానీ, అక్కడ పర్యావరణానికి హానీ కలిగించే పనులేమీ చేయడం లేదు" అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- భర్త చనిపోయాడని భార్యకు మళ్లీ పెళ్లి.. 12 ఏళ్ల తర్వాత భారత్‌కు పాకిస్తాన్ లేఖ.. అందులో ఏముందంటే..
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- ‘రేప్ నుంచి తప్పించుకోలేనప్పుడు పడుకుని ఎంజాయ్ చేయాలి’ అంటూ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ వ్యాఖ్య.. ఆపై క్షమాపణలు
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- మెక్సికో: కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లి.. బైక్‌పై వచ్చి కాల్చి చంపిన దుండగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








