విశాఖపట్నం: సైకిళ్లు, ఎడ్ల బండ్ల మీద పన్నులు వేసిన ఈ నగరం.. అంతర్జాతీయ స్థాయికి ఎలా ఎదిగింది?

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
విశాఖలో ఒకప్పుడు సైకిల్ తొక్కాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. లైసెన్స్‌లేని సైకిళ్ళను సీజ్ చేసేవారు. సైకిళ్లతోపాటు జట్కా, ఎడ్లబళ్ళకు కూడా లైసెన్స్ పద్దతి ఉండేది.
వీటి లైసెన్స్, ఫైన్‌ల ద్వారా వచ్చిన ఆదాయంతోనే అప్పటీ మున్సిపాల్ వలంటరీ అసోసియేషన్ (ఎంవీఏ ) ఆదాయం సమకూర్చుకునేది.
160 ఏళ్ల కిందట క్రితం ఎంవీఏ పేరుతో మొదలైన పురపాలక సేవల సంఘం ప్రస్తుతం రూ. 3,600 కోట్ల బడ్జెట్ కలిగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ స్థాయికి చేరింది.
మత్స్యకార పల్లె నుంచి మహానగరంగా ఎదిగిన విశాఖను ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు కార్పోరేషన్‌కి ఎన్నికలు జరుగుతుండటంతో ఈ నగరంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

ఫొటో సోర్స్, Rajana Ramani
కమిషన్... కౌన్సిల్... కార్పొరేషన్
1800-02 మధ్యలో విశాఖకి క్రిస్టియన్ మిషనరీల రాక మొదలైంది. ఆ క్రమంలోనే బ్రిటిషర్లు 1805లో విశాఖ చేరుకున్నారు. విశాఖలోని సహజ నౌకాశ్రయంను ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార అవసరాల కోసం వినియోగించుకోవడం మొదలుపెట్టింది. దాంతో విశాఖ క్రమంగా పల్లె నుంచి పట్టణ స్థాయికి మారింది.
ఆ క్రమంలోనే విశాఖ మున్సిపల్ వలంటరీ అసోసియేషన్ 1858లో మొదలైంది. అప్పటి వ్యాపారులు, జమీందార్లు స్వచ్చంధంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
వీధి దీపాలు, శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాట్లను ఈ సంఘం ద్వారా చేసేవారని చరిత్ర పరిశోధకులు ఎడ్వర్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.
"మున్సిపల్ వలంటరీ అసోసియేషన్ 1865లో మున్సిపల్ కమిషన్ గా మారింది. ఇందులో కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్లు ఉండేవారు. వీళ్ల ఆధ్వర్యంలోనే విశాఖపట్నం పురపాలక అభివృద్ధి జరిగేది.
ఎన్నికలు లేకుండా కలెక్టర్ నామినేషన్ పద్దతిపై పదవులిచ్చేవారు. నిర్ణయాలన్నీ కలెక్టరే తీసుకునేవారు. 1884లో కమిషన్ కౌన్సిల్‌గా మారింది. అప్పుడు విశాఖలో కేవలం 6 వార్డులే ఉండేవి" అని పాల్ వివరించారు.
ఆ తర్వాత 95 ఏళ్లకు అంటే 1979లో కౌన్సిల్ కార్పోరేషన్ అయ్యింది.

ఫొటో సోర్స్, Edward paul
రాత్రయితే భయం భయం
ఇప్పుడు విశాఖలో ఎక్కడ చూసినా ఎల్ఈడీ, సోలార్ లైట్ల వెలుగులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కిరోసిన్ దీపాలే దిక్కు. అది కూడా కూడళ్లలోనే. అవే స్ట్రీట్ లైట్ల కింద లెక్క.
"శతాబ్ధం కిందట విశాఖ ఒక చిన్న గ్రామం. సముద్రం ఉండటంతో నౌకల ద్వారా వ్యాణిజ్యం జరిగేది. ఈ కారణంగానే వన్‌టౌన్ ఏరియాలో ప్రజల అలికిడి కనిపించేది. మిగతా ప్రాంతమంతా అడవే. సాయంత్రమైతే చాలు భయకరంగా ఉండేది. దాంతో చీకటిపడేసరికి ఎవరు బయటకు వచ్చేందుకు సాహసించేవారు కాదు. మున్సిపాలిటీ సిబ్బంది అక్కడక్కడ కిరోసిన్ తో దీపాలు వెలిగించేవారు. అక్కడో ఊరు ఉందని సముద్రం నుంచి తీరానికి చేరుకునేవారికి గుర్తుగా ఉండేవి" అని ఆంధ్రవిశ్వవిద్యాలయం హిస్టరీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె. సూర్యనారాయణ చెప్పారు.
"సహజ సిద్ధమైన ఓడరేవు విశాఖ అభివృద్ధికి ప్రధాన కారణం. ఓడరేవు కారణంగా విశాఖలో వాల్తేరు రైల్వే డివిజన్ వచ్చింది. కోల్కతా- చెన్నై మధ్య రాకపోకలు విశాఖ మీదుగా జరిగేవి. దీంతో విశాఖ క్రమంగా పట్టణ స్థాయికి ఎదిగింది. 1858లోనే విశాఖ మునిసిపల్ అసోసియేషన్ ఏర్పడింది. 1872 నాటి లెక్కల ప్రకారం విశాఖ కేవలం ఆరు చదరపు మైళ్ల విస్తీర్ణంలో 32వేల జనాభా ఉన్న పట్ణణం. 1933లో విశాఖ పోర్టు ట్రస్టు ఏర్పడటంతో పారిశ్రామిక విస్తరణ వేగంగా జరిగింది. పోర్టు ఉండటం, నౌకల రాకపోకలకు అనుకూలంగా ఉన్న ప్రాంతం కావడంతో తూర్పు నౌకాదళ స్థావరంగా మారింది. ఇలా విశాఖ క్రమంగా ఎదుగుతూ ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు తెచ్చుకుంది" అని ప్రొఫెసర్ సూర్యనారాయణ నగరం చరిత్రను వివరించారు.

ఫొటో సోర్స్, Edward Paul
సెంట్రల్ జైల్...సిటీ సెంటరైంది
"నా వయసు 80 సంవత్సరాలు. ఇక్కడే పుట్టి పెరిగాను. వన్‌టౌన్ ఒక్కటే నా చిన్నతనంలో పెద్ద ఊరు. పోర్టు రావడంతోనే ఇక్కడ కాలుష్యం పెరిగిపోయి ఇప్పుడు ఇది మసిగుడ్డలా తయారైంది.
ఇప్పుడు తళతళ మెరిసే ఊరంతా ఒకప్పుడు దట్టమైన అడవి. అడవి మధ్యలో టీబీ ఆసుపత్రి కట్టారు. టీబీ జబ్బు గాలి నుంచి అందరికి వస్తుందనే భయంతో అలా అడవిలో కట్టారు.
పెద్ద పెద్ద నేరాలు చేసిన వారిని ఇతర ప్రాంతాల నుంచి విశాఖ సెంట్రల్ జైల్‌కు తీసుకొచ్చేవారు. ఊరు పాడైపోయినా నాకు వన్‌టౌన్‌ను వదిల బుద్ది కావడం లేదు. ఎన్నో జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి." అని తాను పని చేసిన పోర్టు ఏరియావైపు చూస్తూ బీబీసీతో చెప్పారు స్థానికుడు దండేటి దామోదరరావు.

ఫొటో సోర్స్, Edward Paul
లైసెన్స్ లేకపోతే సైకిల్‌కి ఫైన్
గ్రామ పంచాయితీ నుంచి గ్రేటర్ కార్పోరేషన్ వరకూ దేనికైనా ఆదాయపు వనరు ప్రధానంగా పన్నులు, ఫైన్లు, లైసెన్సులే. ఇప్పుడు గ్రేటర్ కార్పోరేషన్‌గా మారిన విశాఖకి దశాబ్ధం కిందట ఇంటి పన్నుతోపాటు సైకిళ్లు, ఎద్దులు, జట్కా బండ్లే ఆదాయ వనరు.
"ఆదాయం కోసం మున్సిపల్ వలంటరీ అసోసియేషన్ అప్పటి ప్రజా రవాణా, సరుకు రవాణా కోసం వాడే సైకిళ్లు, ఎడ్లబళ్ళు, జట్కా బళ్లకి లైసెన్స్ విధానం తీసుకుని వచ్చింది. ఏడాది కాలం పాటు ఆ లైసెన్స్‌కి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తరువాత రెన్యూవల్ చేయించు కోవాలి.
ఎవరైనా లైసెన్స్ తీసుకోకపోయినా, రెన్యూవల్ చేయించుకోకపోయినా అధికారులు తనిఖీల్లో పట్టుకునేవారు. ఒక చిన్న లోహపు బిళ్లను లైసెన్సుగా ఇచ్చేవారు. ఆ బిళ్ల లేకపోతే సైకిళ్ళు, గుర్రాలను, ఎడ్లను అధికారులు జప్తు చేసి మున్సిపల్ కార్యాలయంలో ఉంచేవారు.
మద్రాస్, కోల్‌కతాల మధ్య ప్రయాణాలు చేసేవారు విశాఖలో ఫెర్రీ (పడవ) ద్వారా సముద్రం దాటవలసి వచ్చేది. దీనికి కూడా చార్జీలు వసూలు చేసేవారు." అని ఎడ్వర్డ్ పాల్ చెప్పారు.

ఎంవీఏ నుంచి కార్పొరేషన్ వరకు...
1858లో మున్సిపల్ వలంటరీ అసోసియషన్, ఆ తర్వాత మున్పిపల్ కమిషన్, ఆపై మున్సిపల్ కౌన్సిల్‌గా మారిన విశాఖ 1979లో కార్పోరేషన్ అయ్యింది. 1981లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఎం.ఎస్.ఎన్. రెడ్డి పరోక్ష ఎన్నిక పద్ధతిలో మేయర్ అయ్యారు.
ఆ తర్వాత 1987లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో డీవీ సుబ్బారావు మేయర్‌గా ఎన్నికయ్యారు.1992 నుంచి 1995 వరకు మళ్లీ ప్రత్యేక అధికారే పరిపాలన సాగించారు.
1995లో జరిగిన ఎన్నికల్లో సబ్బం హరి మేయరై 2000 సంవత్సరం వరకు ఆ పదవిలో కొనసాగారు. 2000లో జీవీఎంసీ ఎన్నికల్లో రాజాన రమణి మేయర్ అయ్యారు. తర్వాత మళ్లీ 2005 నుంచి 2007 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది.
కొన్ని పంచాయితీలను విలీనం చేసి 2005 నవంబర్ 1వ తేదీ నుంచి విశాఖ మున్సిపాలిటీని 72 వార్డులతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా(జీవీఎంసీ) మార్చారు. 2007లో మళ్లీ ఎన్నికలు జరిగాయి.
"2012లో పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారి పాలనలోనే ఉంది. ప్రస్తుతం జీవీఎసీం పరిధిలోకి అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు కొన్ని పంచాయతీలను కలిపారు.
దీంతో 50 వార్డులతో మొదలైన విశాఖ కార్పొరేషన్ ప్రస్థానం 8 జోన్లు, 98 వార్డులకు చేరింది. ప్రస్తుతం 25 లక్షలకు పైగా ఉన్న జనాభాలో 18 లక్షలకుపైగా ఓటర్లున్నారు." అని మాజీ మేయర్ రాజాన రమణి బీబీసీతో చెప్పారు.

వెన్స్‌డే- విమెన్స్‌డే
విశాఖ నగరం దినదినాభివృద్ధి చెందుతూ నేటికి ఈ స్థితికి చేరుకుందని మాజీ మేయర్ రాజాన రమణి అన్నారు. ఇందులో ప్రజలు, ఉద్యోగులు, నాయకులు...ఇలా అందరి పాత్రా ఉందంటారామె.
" ఇసక పట్నంగా పిలిచే విశాఖ ఇప్పుడు ప్రపంచ స్థాయి నగరం. జీవీఎంసీ బడ్జెట్ రూ.3600 కోట్లు. విశాఖ నగరాభివృద్ధికి ప్రతి నాయకుడు, అధికారి ఉత్సాహం చూపేవారు. ఈ నేలలో, గాలిలో ఆ మ్యాజిక్ ఉంది '' అన్నారు రాజాన రమణి.
"ప్రతి బుధవారం మహిళలకే కేటాయించేదాన్ని. సమస్యలపై వచ్చిన వారికైనా, కొత్త ఆలోచనలతో వచ్చే అధికారులకైనా, సాధారణ ప్రజలకైనా ఇలా బుధవారం కేవలం మహిళలకే పూర్తిగా కేటాయించడం ద్వారా వారికి ప్రాధాన్యత ఇచ్చాను." అని రాజాన రమణి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








