టీ20 ప్రపంచకప్, IND vs WI: బ్యాటింగ్ సరే, బౌలింగ్ మాటేమిటి?

భారత్, టీ20 ప్రపంచకప్‌, సూర్యకుమార్ యాదవ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, ప్రవీణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత, భారత జట్టు బలమైన పునరాగమనం చేసింది. గురువారం జరిగిన రెండో సూపర్-8 మ్యాచ్‌లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించింది.

ఈ భారీ విజయంతో, భారత్ తన నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది, సెమీఫైనల్స్ రేసులో బలంగా నిలబడింది. ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్‌లా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ చేరుకుంటుంది. గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.

దక్షిణాఫ్రికాపై 'ఊహించని ఓటమి' తర్వాత, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చాలా బలహీనతలను అధిగమించింది. కానీ, ఇప్పటికీ భారత్‌ను ఆందోళనపరిచే అంశాలు ఉన్నాయి, దాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అంగీకరించాడు. ఇంతకీ ఏంటవి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
టీ20 ప్రపంచకప్‌, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఓపెనింగ్ జోడీలో మార్పు

జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం, క్రికెట్ విశ్లేషకులు ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ బంగర్ జియోస్టార్‌లో మాట్లాడుతూ, భారత జట్టు కొత్త ఓపెనింగ్ వ్యూహాన్ని స్వాగతించారు.

"ఇషాన్ కిషన్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయాలని నేను కోరుకోను. కానీ, టోర్నీలో ఆఫ్ స్పిన్నర్లతో భారత్ ఇబ్బంది పడింది. ఇషాన్‌కు బదులుగా సంజుతో ఓపెనింగ్ చేయాలనే భారత నిర్ణయం ఈ మ్యాచ్‌లో పనిచేసింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఈ ఎత్తుగడతో ఆశ్చర్యపోయాడు, అందుకే మొదట్లో ఆఫ్ స్పిన్నర్లను ప్రయత్నించలేదు" అన్నాడు ఇర్ఫాన్ పఠాన్.

సంజయ్ బంగర్ మాట్లాడుతూ, "వాస్తవానికి, కోచ్ అయిన తర్వాత గౌతమ్ గంభీర్ ప్రారంభించిన చోటికే టీమిండియా తిరిగి వచ్చింది. మొదట్లో సంజు సామ్సన్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ ఆడారు. ఆ తర్వాత, మార్పులు చేశారు కానీ, వర్కవుట్ కాలేదు. భారత జట్టు తన తప్పును సరిదిద్దుకుంది" అన్నాడు.

ప్రపంచకప్ చివరలో ఉన్నందున భారత్ ఈ కాంబినేషన్‌ను మార్చబోదని ఇర్ఫాన్ పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

టోర్నీలో భారత్‌కు బ్యాటింగ్‌ ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారింది. దీంతో, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు బదులుగా సంజు సామ్సన్‌కు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే బాధ్యతను అప్పగించింది. ఇది టీమిండియాకు కుడి-ఎడమ ఓపెనింగ్ కలయికను అందించింది.

గతంలో, టాప్ త్రీలో ఉన్న ముగ్గురు బ్యాటర్లు ఎడమచేతి వాటం కావడంతో, ప్రత్యర్థి జట్లు వారిపై వ్యూహాలను రూపొందించడంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈసారి భారత్ ఎత్తుగడ ఫలించింది, ఓపెనింగ్ జోడి మొదటి వికెట్‌కు 3.4 ఓవర్లలో 48 పరుగులు జోడించింది. సంజు 24 పరుగులకే ఔటైనా, భారీ స్కోరుకు పునాది వేశాడు.

గత నాలుగు మ్యాచ్‌ల్లో 0, 0, 0, 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, జింబాబ్వే బౌలర్లను ఎలాంటి తడబాటు లేకుండా, సమర్థంగా ఎదుర్కొన్నాడు. 30 బంతుల్లోనే 55 పరుగులు సాధించాడు.

టీ20 ప్రపంచకప్‌, అభిషేక్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

స్పిన్నర్లపై పైచేయి

ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత బ్యాట్స్‌మెన్ అతిపెద్ద బలహీనత స్పిన్‌ను బాగా ఆడలేకపోవడం. ఈ మ్యాచ్‌కు ముందువరకు, టోర్నీలో ప్రత్యర్థి జట్ల స్పిన్నర్లు భారత్‌పై మొత్తం 19 వికెట్లు తీశారు. అందులో 12 వికెట్లు ఆఫ్-స్పిన్నర్ల ఖాతాలో పడ్డాయి. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఈ బలహీనతను సమర్థంగా అధిగమించారు.

భారత్‌పై జింబాబ్వే నాలుగు వికెట్లే పడగొట్టింది, అందులో ఒకటే స్పిన్నర్‌కు దక్కింది.

మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "మేం గతంలో జరిగిన విషయాలను పక్కన పెట్టి ఈ మ్యాచ్‌కు వచ్చాం. మా వీడియో అనలిస్ట్ ప్రత్యేకంగా స్లైడ్స్ తయారు చేశాడు. మేం ఏడాది పొడవునా ఎలా ఆడామో చూశాం. అది చూసిన తర్వాత మాలో మంచి సానుకూల భావన కలిగింది. మా బ్యాటర్లందరూ, టాప్ నుంచి ఆరో నంబర్ వరకు సత్తా చాటారు" అన్నాడు.

గత మ్యాచ్‌లలో టీమిండియా ప్రారంభంలో వికెట్లు కోల్పోతే, ఒత్తిడికి గురై నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండేది. కానీ, ఈసారి భారత్ దాన్ని సరిదిద్దుకుంది, భారీ రికార్డులను సృష్టించే విధంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 150కిపైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒక జట్టులోని టాప్ సిక్స్ బ్యాటర్లు 150కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడటం ఇదే మొదటిసారి.

దీంతో, భారత జట్టు టోర్నీలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అంతేకాదు, ప్రపంచకప్‌లో భారత జట్టుకు అత్యధిక స్కోరు(256 పరుగులు) కూడా. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 17 సిక్సర్లు కొట్టారు. ఇవి టీ20 ప్రపంచ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో భారత్ కొట్టిన అత్యధిక సిక్సర్లు.

టీ20 ప్రపంచకప్‌, భారత్

ఫొటో సోర్స్, Getty Images

బౌలింగ్‌పైనే సందేహాలు

జింబాబ్వేపై అద్భుతమైన విజయంలో కూడా, భారత బౌలింగ్ బలహీనత బయటపడింది. 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు సాధించింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే బ్యాటర్లు 11 సిక్సర్లు కొట్టారు.

ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంకలాంటి జట్లను ఓడించిన జింబాబ్వే, ఈ మ్యాచ్‌లో లక్ష్యం తక్కువగా ఉంటే భారత బలహీనమైన బౌలింగ్‌ను సద్వినియోగం చేసుకుని ఆశ్చర్యపరిచేదేమో. జింబాబ్వే బ్యాటర్లు ప్రారంభంలో భారత బౌలర్లపై వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. కానీ, 6 ఓవర్ల తర్వాత వారి ఆట మారింది. భారత స్పిన్నర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు తమ 4 ఓవర్ల కోటాలో చెరో 35 పరుగులు ఇచ్చి, తలో వికెట్ మాత్రమే తీసుకున్నారు.

ఆరో బౌలర్‌గా శివమ్ దూబేను ప్రయత్నించింది భారత్, కానీ అతను 2 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే, అర్ష్‌దీప్ సింగ్ తన 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి, 3 వికెట్లు పడగొట్టి, భారత్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ అంత బాగా లేదని అంగీకరించాడు.

"నిజాయితీగా చెప్పాలంటే, మేం బౌలింగ్‌లో మెరుగ్గా రాణించాల్సింది. గెలిచినందుకు సంతోషమే. కానీ, మేం దీన్ని దృష్టిలో ఉంచుకుంటాం. వెస్టిండీస్‌తో ఆడేటపుడు దీనిపై వర్కవుట్ చేయాల్సి ఉంది" అన్నాడు సూర్యకుమార్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)