పాకిస్తాన్ సైన్యాన్ని తాలిబాన్లు ఎదుర్కోగలరా? వారి సైనిక సామర్థ్యమెంత?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మునజ్జా అన్వర్
- హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్
- చదివే సమయం: 8 నిమిషాలు
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్ సహా కాందహార్, ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు.
మరోవైపు అఫ్గాన్ తాలిబాన్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ యుద్ధం ప్రకటించారు.
ఈ రెండు దేశాలు కొద్ది రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
దిగజారిన సంబంధాలు..
"తీవ్రవాద శక్తులు, వారి సహాయకులు, వారిని పెంచిపోషిస్తున్న వారు ఎక్కడెక్కడున్నారో పాకిస్తాన్‌కు బాగా తెలుసు. టెర్రరిస్ట్ కార్యకలాపాలను కొనసాగిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు" అని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఇటీవల అన్నారు.
తాలిబాన్లు 2021 ఆగస్టులో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత, కాబూల్ సహా ఇతర ప్రాంతాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. అవి సరిహద్దు ఘర్షణలకు దారితీశాయి.
నిషేధిత టీటీపీకి అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వ మద్దతు ఉందని పాకిస్తాన్ తరచూ ఆరోపిస్తోంది. అయితే, పాక్ ఆరోపణలను తిరస్కరిస్తున్న తాలిబాన్లు.. దానిని పాకిస్తాన్ అంతర్గత సమస్యగా పేర్కొంటున్నారు.
నిరుడు రెండు దేశాల మధ్య జరిగిన సరిహద్దు ఘర్షణల అనంతరం ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది.
అయితే, తాజా ఉద్రిక్తతలు ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దిగజార్చాయి.
పాకిస్తాన్ వైమానిక దాడుల నేపథ్యంలో అఫ్గాన్ తాలిబాన్ సైనిక సామర్థ్యమెంత? రానున్న రోజుల్లో ఏం జరగొచ్చు?

ఫొటో సోర్స్, SANAULLAH SEIAM/AFP via Getty Images
'యుద్ధం జరగకపోవచ్చు'
అఫ్గాన్ వ్యవహారాల విశ్లేషకులు, 'ఖొరాసన్ డైరీ' అనుబంధ సీనియర్ జర్నలిస్ట్ ఇఫ్తికార్ ఫిర్దౌజ్ బీబీసీ ఉర్దూతో మాట్లాడుతూ, "ఇది పాకిస్తాన్ దాడులు, అఫ్గాన్ తాలిబాన్లు దాడులు, సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగడం, ఆ తర్వాత చర్చలు మొదలుపెట్టడం వంటి పునరావృత్తమయ్యే సైకిల్. అదే పునరావృత్తమవుతుంది" అని అన్నారు.
సంప్రదాయ యుద్ధం చేయాలంటే సైనిక సామర్థ్యం, వైమానిక వనరులు, సరఫరా గొలుసులు, సుశిక్షితులైన సైనికులు అవసరం.. కాబట్టి తాలిబాన్ పాకిస్తాన్‌తో యుద్ధం చేయడం అసాధ్యమని ఇఫ్తికార్ ఫిర్దౌజ్ అన్నారు.
"అఫ్గాన్ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత సైనిక వనరుల ప్రకారం.. ఈసారి ప్రతీకారం విధ్వంసక కార్యకలాపాల కంటే కాస్త తీవ్రంగానే ఉండొచ్చు" అన్నారు.
తాలిబాన్లు అతి త్వరలోనే కచ్చితంగా బదులిస్తారని, ఎందుకంటే అది వారి గౌరవానికి సంబంధించిన విషయమని ఇఫ్తికార్ చెప్పారు. అయితే, పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు.
ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్ ఎ ఆజమ్ యూనివర్సిటీలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ ఖుర్రమ్ ఇక్బాల్ బీబీసీతో మాట్లాడుతూ, టీటీపీపై చర్యలు తీసుకునేలా అఫ్గాన్ తాలిబాన్లను ఒప్పించేందుకు పాకిస్తాన్ అన్ని శాంతియుత మార్గాలను వినియోగించిందని అన్నారు.
అఫ్గాన్‌లోని టీటీపీ స్థావరాల గురించి పాకిస్తాన్ లేవనెత్తిన ఆందోళనలను ఐక్యరాజ్యసమితితో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు కూడా అంగీకరించాయని ఆయన అన్నారు.
"అఫ్గాన్‌లో టీటీపీ స్థావరాలున్నాయని ఒకసారి కాదు, 2023 నుంచి మూడుసార్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేశాయి. శాంతియుతంగా అన్ని ప్రయత్నాలూ చేసిన తర్వాతే, పాకిస్తాన్ భద్రతా బలగాలను ఉపయోగించాల్సి వచ్చింది" అన్నారు.
డాక్టర్ ఖుర్రమ్ ఇక్బాల్ మాట్లాడుతూ, "అఫ్గాన్‌లో పాలనపరంగా, ఆర్థిక, సామాజికపరంగానూ తీవ్రమైన సమస్యలను చూస్తున్నాం. అంతర్జాతీయ సర్వేల ప్రకారం, పదిలో ఎనిమిది కుటుంబాలు మనుగడ సాగించడం కోసం తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకుంటున్నాయి" అని అన్నారు.

ఫొటో సోర్స్, ISPR
"అఫ్గాన్‌లో నెలకొన్న అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనప్పుడు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తారు. అంటే, బయటి నుంచి సమస్యలు వస్తున్నట్లు చూపిస్తారు. అంతర్గతంగా వారి ఐక్యతను పెంపొందించేందుకు, సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు ఉపయోగపడతాయి. అందుకే వారు ఈ ఉద్రిక్తతలు కొనసాగాలని కోరుకుంటున్నారు."
రెండో కారణం మరింత వాస్తవికమైనదని ఆయన అన్నారు. "అఫ్గాన్ తాలిబాన్లు టీటీపీపై చర్యలు తీసుకుంటే.. టీటీపీ ఫైటర్స్ ఐఎస్‌లోకి ఫిరాయించవచ్చనే భయం కూడా ఉంది. అది గతంలోనూ జరిగింది. టీటీపీపై చర్యలకు తాలిబాన్లు సుముఖత చూపకపోవడానికి ఇది కూడా ఒక కారణం" అన్నారు.
అఫ్గాన్ తాలిబాన్లు ఏం చేయొచ్చు?
‘పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పరిస్థితుల్లో కొత్తగా ఏమీ లేకపోయినప్పటికీ, తాలిబాన్లకు టీటీపీ వంటి అవకాశాలున్నాయి. పాకిస్తాన్‌లోని జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి టీటీపీ వంటి వాటిని వినియోగించుకోవచ్చు’ అని ఇఫ్తికార్ ఫిర్దౌజ్ అన్నారు.
తాలిబాన్ సామర్థ్యాలు, జరగబోయే ప్రతీకార దాడుల విషయంలో డాక్టర్ ఖుర్రమ్ ఇక్బాల్ కూడా ఇఫ్తికార్‌తో ఏకీభవిస్తున్నారు. సంప్రదాయ యుద్ధంలో పాకిస్తాన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం తాలిబాన్‌కు లేదని, కాబట్టి వారు గతంలో మాదిరిగానే సంప్రదాయేతర వ్యూహాలను అనుసరించవచ్చని ఆయన అంటున్నారు.
"పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాల్లో తీవ్రవాద దాడులు పెరగొచ్చు. పట్టణ ప్రాంతాల్లో హింస పెరిగే అవకాశముంది" అన్నారు.
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తాలిబాన్లు పాకిస్తాన్‌తో పూర్తిస్థాయి యుద్ధాన్ని భరించే పరిస్థితిలో లేరని డాక్టర్ ఖుర్రమ్ ఇక్బాల్ అభిప్రాయపడ్డారు.
రానున్న రోజుల్లో పాకిస్తాన్, అఫ్గాన్ బోర్డర్‌లో పరిమిత ఘర్షణలు, కొన్ని దాడులు జరగొచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే రెండు వైపుల నుంచి తీవ్రమైన ప్రకటనలు, వాదనలు, ఆరోపణలు కూడా వినిపించవచ్చని అన్నారు.
"ప్రతీకారం తీర్చుకున్నామనే సందేశం ప్రజల్లోకి పంపేందుకు తాలిబాన్లు గతంలో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కూడా ఇలాగే చేశారు. ఈసారి కూడా బోర్డర్‌లో ఓ మోస్తరుగా ఆయుధాలను ఉపయోగించవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ సైనిక సామర్థ్యమెంత?
తాలిబాన్ ప్రభుత్వ దళాల వద్ద ప్రధానంగా మూడు రకాల ఆయుధాలున్నాయి. గత అఫ్గాన్ ఆర్మీకి చెందిన ఆయుధాలు, సామగ్రి.. అమెరికాతో సహా విదేశీ బలగాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో మిగిలిపోయిన ఆయుధాలు.. అలాగే బ్లాక్ మార్కెట్ నుంచి తాలిబాన్లు సమకూర్చుకున్న కొత్త ఆయుధాలు.
నిపుణుల ప్రకారం.. తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్‌పై తేలికపాటి ఆయుధాలు ఉపయోగించినట్లు, భారీ స్థాయి లేదా దీర్ఘశ్రేణి ఆయుధాల జాడ అంతంతమాత్రంగానే ఉన్నట్లు గతంలో జరిగిన సరిహద్దు ఘర్షణల వీడియోలు చూపుతున్నాయి.
అమెరికా రీకన్‌స్ట్రక్షన్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్, రక్షణ మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం.. అఫ్గానిస్తాన్ గత ప్రభుత్వానికి ఇరవై ఏళ్లలో 16 లక్షలకు పైగా తేలికపాటి, భారీ ఆయుధాలు, పలు సైనిక పరికరాలు అందాయి. ఈ ఆయుధాల్లో 70 శాతం, లేదా 10 లక్షలకు పైగా ఆయుధాలు తాలిబాన్ చేతుల్లోకి వెళ్లాయి.
ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వ బలగాల చేతిలో ఉన్న తేలికపాటి ఆయుధాల్లో కలాష్నికోవ్‌లు, అమెరికన్ ఎం 16, ఎం 4, ఎం 29 వంటి తేలికపాటి మెషీన్‌గన్స్ ఉన్నాయి.
వీటిలో పీకా ఎం 2, ఎం 240 వంటి భారీ మెషీన్ గన్లు, గ్రనేడ్ లాంచర్లు, ఆర్పీజీ 7, ఏటీ 4 వంటి రాకెట్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ మిసైల్స్ ఉన్నాయి.
అఫ్గాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత అమెరికా రక్షణ శాఖ(పెంటగాన్) విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం, గత అఫ్గాన్ ప్రభుత్వ సైన్యానికి అమెరికా అందజేసిన భారీ ఆయుధ వాహనాలు, నౌకలు, భారీ సైనిక పరికరాలు కూడా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లాయి.
ఈ భారీ ఆయుధాల్లో డీ 30గా పిలిచే 122 ఎంఎం హోవిట్జర్లు ఉన్నాయి. ఈ గన్స్‌లో 100 నుంచి 120 వరకు ఇప్పటికీ అఫ్గాన్ వద్ద ఉన్నట్లు అంచనా.
ఇవి కాకుండా, 155 ఎంఎం హోవిట్జర్ మోర్టార్లు, జడ్‌టీ 23 - 2 వంటి అనేక రష్యన్ ఆయుధాలు కూడా తాలిబాన్ల వద్ద ఉన్నాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images
తాలిబాన్ ప్రభుత్వం 2024లో జరిగిన సైనిక కవాతు సందర్భంగా.. బాగ్రామ్ వైమానిక స్థావరంలో భారీ ఆయుధాలను ప్రదర్శించింది. వాటిలో స్కడ్ మిసైల్ ఆర్ 17, ఎల్బ్రోస్ ఆర్ 300 ఉన్నాయి. ఇవి సుమారు 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలవు.
ఫ్రాగ్ 7గా పిలిచే లూనా మిసైల్(ఆరు మైళ్ల రేంజ్ ఆయుధం, లాంచింగ్ సిస్టమ్), గ్రాడ్ రాకెట్ లాంచర్, మిలన్ యాంటీ ట్యాంక్ మిసైల్, ఆర్గాన్ మిసైళ్ల వంటివి ఉన్నాయి. ఇవి 35 కిలోమీటర్ల పరిధి వరకూ లక్ష్యాలను చేరుకోగలవు.
గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి ఆయుధాలను ఉపయోగించలేదు. వీటిలో కొన్నింటిని రక్షణ మంత్రిత్వ శాఖ గోడౌన్లలో, మరికొన్నింటిని పంజ్‌షీర్ పర్వత ప్రాంతాల్లో ఉంచారు.
ఈ ఆయుధాల్లో కొన్నింటిని యాక్టివ్ చేసినట్లు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, వాటి సాంకేతిక పరిస్థితి, అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయా వంటి అంశాల్లో స్పష్టత లేదు.
అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వంతో పోలిస్తే, పాకిస్తాన్‌కు అనుకూలమైన ప్రధానాంశం వైమానిక దళం, ఆధునిక యుద్ధ విమానాలు. దీనిని ఎదుర్కోవడానికి తాలిబాన్‌కు వైమానిక దళం లేదు.
గత ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న అనేక హెలికాప్టర్లకు తాలిబాన్ ప్రభుత్వం మరమ్మత్తులు చేయించింది, అనేక మంది పైలట్లకు శిక్షణ కూడా ఇప్పించింది.
అఫ్గాన్ భద్రతా వ్యవహారాల నిపుణులు బిస్మిల్లా తబాన్ చెప్పిన ప్రకారం, అమెరికా వైదొలగడానికి ముందు అఫ్గాన్ వైమానిక దళాన్ని సన్నద్ధం చేయలేదు. వైమానిక ఆయుధాల నిల్వలను కూడా ధ్వంసం చేసింది.
"అందువల్లే తాలిబాన్ వద్ద ఎయిర్ టు ఎయిర్ ఆయుధాలు లేవు" అన్నారు తబాన్.
అమెరికా రక్షణ శాఖ రిపోర్ట్ ప్రకారం, తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న విమానాల్లో సీ 208 విమానాలు, ఎండీ 530 హెలికాప్టర్లు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, ఏ 29 విమానాలు, ఎంఐ 17 ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్లు, ఎంఐ 24 కంబాట్ హెలికాప్టర్లు, ఎండీ 500 తేలికపాటి దాడుల హెలికాప్టర్లు ఉన్నాయి.
దాదాపు 60 నౌకలు, హెలికాప్టర్లు ఉన్నట్లు తాలిబాన్ ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
గెరిల్లా యుద్ధంలో అనుభవం..
అయితే, తాలిబాన్లకు గెరిల్లా యుద్ధంలో విస్తృత అనుభముంది. దాదాపు రెండు దశాబ్దాలుగా అమెరికా, నేటో, అఫ్గాన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ అనుభవం నేటికీ వారి మిలిటరీ వ్యూహానికి వెన్నెముకగా నిపుణులు చెబుతున్నారు.
తాలిబాన్లు ఇప్పటికీ ఒక దేశ సైన్యం మాదిరిగా కాకుండా, తేలికపాటి ఆయుధాలు కలిగిన ఒక గెరిల్లా గ్రూపులా పోరాడుతున్నట్లు.. 2025 అక్టోబర్‌లో పాకిస్తాన్, అఫ్గాన్ మధ్య బోర్డర్‌లో జరిగిన ఘర్షణలు, ఇటీవల ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలు సూచిస్తున్నాయని బిస్మిల్లా తబాన్ బీబీసీతో చెప్పారు.
ఈ వ్యూహంలో.. ఆయుధాలతో ఆకస్మిక దాడులు జరుగుతాయి.
పాకిస్తాన్‌తో ఘర్షణల్లో పాల్గొన్న ఒక తాలిబాన్ కమాండర్ తన ఐడెంటిటీ బహిర్గతం చేయకూడదన్న షరతుపై మాట్లాడుతూ.. తాలిబాన్ బలగాలు "ఎక్కువగా గెరిల్లా వ్యూహాలపైనే దృష్టి పెట్టాయి. వాటిలో మాకు మంచి అనుభవముంది. అయితే, సాధారణ సైనిక విభాగాలను కూడా అప్పుడప్పుడూ ఉపయోగించేవారు" అని అన్నారు.
తమ భూభాగాలు, పోస్టులపై నియంత్రణ కొనసాగించడమే ప్రాథమిక లక్ష్యమని ఆయన వివరించారు. "కేంద్రం నుంచి ఆదేశాలు వస్తాయి, కానీ బోర్డర్‌లో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి కమాండర్లకు పూర్తి అధికారాలుంటాయి" అన్నారు.
అయితే, తాలిబాన్లు తమ గెరిల్లా గ్రూపును సాధారణ సైన్యంగా మార్చలేకపోయారని, అందుకే వారు తమ పాత గెరిల్లా యుద్ధ వ్యూహాలను అనుసరిస్తున్నారని భద్రతా నిపుణులు అమీర్ రాణా బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













