'భారత్‌పై వాడిన ఎయిర్‌క్రాఫ్ట్'లను అమ్మకానికి పెట్టిన పాకిస్తాన్

పాకిస్తాన్, భారత్, యుద్ధ విమానాలు, జేఎఫ్ 17

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, ఒక జేఎఫ్-17 థండర్ విమానం ధర సుమారు 40 మిలియన్ల నుంచి 50 మిలియన్ డాలర్లు.
    • రచయిత, రోహన్ అహ్మద్
    • హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్

జేఎఫ్-17 థండర్ విమానాలను విక్రయించడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది.

పాకిస్తాన్, చైనా సంయుక్తంగా తయారు చేసిన జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను విక్రయించే ఒప్పందం కోసం అనేక దేశాలతో 'చర్చలు' జరుపుతున్నట్లు పాకిస్తాన్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్టర్ రజా హయత్ హరాజ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు.

"చర్చలు జరుగుతున్నాయి. దీనికి కొంత సమయం పడుతుంది. (ఈ విమానాలపై) చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి" అని అన్నారు.

జేఎఫ్-17 థండర్ బ్లాక్ III అనేది 4.5 జనరేషన్ మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, దీనికి యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ ఎరే (ఏఈఎస్ఏ) రాడార్, లాంగ్-రేంజ్ బీవీఆర్ ఉంది. ఇది పలు రకాల మిషన్లలో పాల్గొనగలదు.

లిబియా, సూడాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలతో పాకిస్తాన్ జేఎఫ్-17 సహా రక్షణ ఒప్పందాలపై చర్చిస్తున్నట్లు రాయిటర్స్ పలు కథనాలు ప్రచురిస్తున్న సమయంలో మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరికి అమ్ముతున్నారు?

"ఇవి రహస్యంగా ఉంచాల్సిన విషయాలు, నేను ఏ దేశం పేరూ చెప్పలేను. వారితో మేం ఏ స్థాయిలో చర్చలు జరుపుతున్నామో చెప్పలేను" అన్నారు పాకిస్తాన్ మంత్రి రజా హయత్ హరాజ్.

"ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ వెళ్లినప్పుడు, ఏ దేశాలు వాటిని కొనుగోలు చేశాయో ప్రపంచానికి తెలుస్తుంది" అన్నారు.

జేఎఫ్-17 థండర్‌ను పాకిస్తాన్, చైనా సంయుక్తంగా నిర్మించాయి. మే 7–10 మధ్య (పాకిస్తాన్ - భారత్ ఘర్షణ) ఈ విమానాన్ని పరీక్షించినట్లు మంత్రి రజా హయత్ హరాజ్ తెలిపారు.

"ఆ సమయంలో ఈ విమానం పనితీరును ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైమానిక దళాలు గమనించాయి. వారు దానిని ప్రశంసించారు" అన్నారు.

ధర ఎంత?

విమానం పనితీరుతో పాటు, ధర కూడా ముఖ్యమైనదని రజా హయత్ హరాజ్ అన్నారు. ఇలాంటి ఫైటర్ జెట్ల ధర 250–350 మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ, జేఎఫ్-17 చాలా చౌక అని చెప్పారు.

జేఎఫ్-17 విమానం ధర ఎంత అని అడగ్గా, మంత్రి స్పందిస్తూ "దీని ధర దాదాపు 40 - 50 మిలియన్ డాలర్లు, విమానం రకం ఆధారంగా కాస్త ఎక్కువగానూ ఉండవచ్చు" అన్నారు.

"ఇందులోని కొన్ని భాగాలు చైనాలో, మరికొన్ని పాకిస్తాన్‌లో తయారయ్యాయి. మేం ఎవరితో ఒప్పందం చేసుకున్నా అందులో చైనా కూడా భాగంగా ఉంటుంది" అని రజా హయత్ హరాజ్ అంటున్నారు.

పాకిస్తాన్, భారత్, యుద్ధ విమానాలు, జేఎఫ్ 17
ఫొటో క్యాప్షన్, రజా హయత్ హరాజ్‌తో ఇంటర్వ్యూ

పాకిస్తాన్ భారీస్థాయిలో ఉత్పత్తి చేయగలదా?

ఒక పెద్ద కాంట్రాక్టు వస్తే, తగినన్ని జేఎఫ్-17 థండర్ జెట్‌లను పాకిస్తాన్ సమయానికి ఉత్పత్తి చేయగలదా?

ఈ ప్రశ్నకు పాకిస్తాన్ మంత్రి రజా హయత్ హరాజ్ సమాధానమిస్తూ "ఇది మా దేశ రక్షణకు సంబంధించిన ప్రశ్న. ఇవి మా రహస్యాలు, వాటిని అలాగే ఉండనివ్వండి" అన్నారు.

"ఇది ఒక రోజులో నిర్మించేది కాదు. ఒక గదిని నిర్మించడానికి కూడా సమయం పడుతుంది. ఇది అత్యాధునిక విమానం. సమయం పడుతుంది" అన్నారు.

విశ్లేషకులు ఏమంటున్నారు?

జేఎఫ్-17 థండర్ వంటి ఒప్పందాల విషయంలో పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

విమానాల కోసం రక్షణ ఒప్పందాలు పూర్తి కావడానికి సంవత్సరాలు పడుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విశ్లేషకులు మొహమ్మద్ ఫైసల్ బీబీసీతో అన్నారు.

"జేఎఫ్-17 చైనాతో కలిసి నిర్మించారు. కొన్ని ముఖ్యమైన భాగాలు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి, ఒప్పందాలు చేసుకునేటప్పుడు పాకిస్తాన్ జాగ్రత్తగా ఉండాలి" అని అన్నారు.

జేఎఫ్-17 థండర్ ప్రాజెక్టులో చైనా అనేది పాకిస్తాన్ సీనియర్ భాగస్వామి అని, అమ్మకాలను నిశితంగా పరిశీలిస్తుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.

పాకిస్తాన్, భారత్, యుద్ధ విమానాలు, జేఎఫ్ 17

ఫొటో సోర్స్, Getty Images

"పాకిస్తాన్ ఈ విమానాలను అమ్మవచ్చు, కానీ ఈ సాంకేతికత చైనా నియంత్రణలోనే ఉంటుంది. ఏ అమ్మకమైనా చైనా సీనియర్ భాగస్వామిగా, ఉమ్మడి ఒప్పందంగా ఉంటుంది" అని చైనా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్‌లో సీనియర్ ఫెలో అయిన ఐనార్ తంజిన్ అన్నారు.

పాకిస్తాన్ ఉత్పత్తిని పెంచడానికి చైనా సహాయపడవచ్చు, కానీ అది బీజింగ్ నియంత్రణలోనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ అమ్మకంపై పాకిస్తాన్‌లోని చైనా రాయబార కార్యాలయాన్ని, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను బీబీసీ సంప్రదించింది. కానీ, ఈ వార్త ప్రచురించే సమయం వరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

కాగా, జేఎఫ్-17ను అన్ని దేశాలకు విక్రయించబోమని పాకిస్తాన్ మంత్రి రజా హయత్ హరాజ్ అన్నారు.

"మేం స్నేహపూర్వక దేశాలకు మాత్రమే విక్రయిస్తాం. భౌగోళిక రాజకీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటాం. ఈ విమానాలను శత్రువుకు విక్రయించలేం కదా" అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)