చైనాతో సంబంధాలు, ట్రంప్ టారిఫ్స్, బంగ్లాదేశ్ - నేపాల్ ఎన్నికలు.. ఈ సవాళ్లను భారత్ అధిగమించగలదా?

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత ప్రపంచ క్రమాన్ని సవాలు చేసేలా గత ఏడాది ప్రపంచ రాజకీయాల్లో మార్పు సంకేతాలు కనిపించాయి. ప్రపంచం ఒక కొత్త అధ్యాయం దిశగా కదులుతున్నట్టు అనిపించింది. కొత్త నిర్మాణాన్ని రూపొందించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
ఈ సమయంలో భారత్ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ప్రశ్న.. మారుతున్న ప్రపంచంలో దాని పాత్ర. భారత్ కేవలం పరిస్థితులకు అనుగుణంగా మారుతోందా లేదా ప్రపంచ రాజకీయ గమనానికి ఓ ఆకారం ఇవ్వడంలో ప్రభావవంతమైన, చురుకైన పాత్ర పోషించిందా?
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌లో ఈ ఏడాది జరిగే ఎన్నికలు ఆయా దేశాల అంతర్గత అంశాలు మాత్రమే కాదు. ఈ ఎన్నికలు దక్షిణాసియా స్థిరత్వం, భారత భద్రతా సమస్యలు, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలతో లోతుగా ముడిపడి ఉన్నాయి.
భారత్ తన పొరుగు దేశాలలో నమ్మకం, సహకారం, భాగస్వామ్య విధానాన్ని బలంగా అనుసరించగలదా? అనేదే పెద్ద ప్రశ్న.

మరోవైపు, యుక్రెయిన్-రష్యా యుద్ధం ఇకపై యూరప్‌కు మాత్రమే పరిమితమైన వివాదం కాదు. ఇది ప్రపంచ ఇంధన సరఫరాలు, ఆహార భద్రత, అంతర్జాతీయ నైతిక విలువలకు తీవ్రమైన పరీక్షగా మారింది.
భారత్ ఇప్పటివరకూ చర్చలు, సమన్వయం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానాన్ని అనుసరిస్తోంది. కానీ, ఈ సమన్వయం దీర్ఘకాలంలో స్థిరంగా ఉంటుందా? లేదా కీలకమైన సమయంలో భారత్ స్పష్టంగా ఏదో ఓవైపు ఉండాల్సి వస్తుందా?
భారత్ చాలాకాలంగా 'బహుళ ధ్రువ ప్రపంచ క్రమం' (మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్) గురించి మాట్లాడుతోంది. అంటే అధికారం కొన్ని దేశాల చేతుల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉండని ప్రపంచం. అయితే 'బహుళ ధ్రువ ప్రపంచం' అనేది ఒక ఆలోచన మాత్రమేనా, లేదా అది నిజంగా వాస్తవ రూపం దాల్చగలదా?
ఈ చర్చలో భారత్ - చైనా సంబంధాలు కూడా కేంద్రబిందువయ్యాయి. ఒకవైపు, రెండు దేశాలు ఆర్థికపరంగా ఒకదానిమీద ఒకటి బాగా ఆధారపడి ఉన్నాయి. మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక అపనమ్మకం పెరుగుతోంది. చర్చలకు మార్గాలు తెరిచే ఉన్నప్పటికీ, అదే సమయంలో అపనమ్మకం స్పష్టంగా ఉంది.
భారత విదేశాంగ విధానం కూడా ఆర్థిక రంగంలో కొత్త దశలోకి ప్రవేశించింది. అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రారంభమవుతున్నాయి. అమెరికాతో వాణిజ్య సంబంధాల్లో సవాళ్లు కొనసాగుతున్నాయి.
బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ 'ది లెన్స్'లో కలెక్టివ్ న్యూస్‌రూమ్ జర్నలిజం డైరెక్టర్ ముకేశ్ శర్మ ఈ అంశాలన్నింటినీ చర్చించారు.
ఇందులో ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌కు చెందిన ప్రొఫెసర్ అర్పితా ముఖర్జీ, లండన్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ జుబేర్ అహ్మద్ పాల్గొన్నారు.

భారత్ - అమెరికా సంబంధాలు
గత ఏడాది ప్రారంభంలో, డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ను కలిసిన మొదటి నలుగురు ప్రపంచ నాయకులలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకరు. ఈ సమావేశంలో మోదీని తన "గొప్ప స్నేహితుడు" అని ట్రంప్ అభివర్ణించారు.
అయితే కొన్నినెలలుగా మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు ట్రంప్ మొదటి పదవీకాలంలో కనిపించినంతగా లేవు. ఈ మారుతున్న వాతావరణంలో ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై రెండు రకాల సుంకాలను విధించింది. ఒకటి వాణిజ్య కారణాలతో, ఇంకొకటి రష్యా నుంచి చమురు కొంటున్నందుకు.
భారత్‌పై అమెరికా మొత్తం 50 శాతం సుంకాలు విధించింది. ఆసియా దేశాలలో విధించిన అత్యధిక సుంకం ఇది.
దీనిపై ప్రొఫెసర్ అర్పితా ముఖర్జీ మాట్లాడుతూ 'ఈ సంవత్సరం భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఏ దిశలో ముందుకు సాగుతాయనేది అతి ముఖ్యమైన ప్రశ్న' అన్నారు.
యూరోపియన్ యూనియన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందం చాలా పురోగతి సాధించిందని ఆమె అభిప్రాయపడ్డారు.
"ఆస్ట్రేలియాతో చర్చలు మంచిస్థాయిలో ఉన్నాయి. న్యూజీలాండ్, ఒమన్‌లతో ఒప్పందాలు కుదిరాయి. యూకేతో ఒక ఒప్పందం ఖరారైంది" అన్నారు అర్పితా ముఖర్జీ.
బ్రిటన్ తర్వాత యూరోపియన్ యూనియన్‌తో, ఆ తర్వాత అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్‌కు చాలా ఉపశమనం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
"జనవరి నెల భారత్‌కు చాలా ముఖ్యమైనది. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరితే 2026 మంచి స్థాయిలో మొదలైందని భావించాలి" అని ప్రొఫెసర్ ముఖర్జీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయంగా చూస్తే అమెరికాతో తన సంబంధాలపై 2026లో భారత్ వీలైనంత ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ జుబేర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"రష్యా నుంచి చమురు కొనే విషయంలో భారత్, అమెరికాల మధ్య ఉద్రిక్తత ఉంది" అన్నారాయన.
భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవలి సంఘటనలను ఆయన ప్రస్తావించారు.
"రెండు దేశాల మధ్య వివాదం తలెత్తినప్పుడు తన స్నేహితులు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని భారత్ కోరుకుంది. కానీ, ఆ సమయంలో అది జరగలేదు" అన్నారు జుబేర్ అహ్మద్.
భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ఆయన అన్నారు.
"భారత్ తన వాణిజ్యాన్ని మరింతగా విస్తరించాలనుకుంటే అమెరికా మద్దతు చాలా ముఖ్యం" అన్నారు జుబైర్ అహ్మద్.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్, నేపాల్ ఎన్నికలు
నేపాల్‌లో సార్వత్రిక ఎన్నికలు 2026 మార్చి 5న జరగనున్నాయి. బంగ్లాదేశ్‌లో 2026 ఫిబ్రవరి 12న ఎన్నికలు జరుగుతాయి. రెండూ భారత్‌కు పొరుగు దేశాలు, వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
ఇటీవలి సంవత్సరాలలో, ఈ రెండు దేశాలతో భారత సంబంధాలు మునుపటిలా సజావుగా లేవు.
మరి.. నేపాల్, బంగ్లాదేశ్‌లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే, భారత్ తన సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అవకాశం దక్కుతుందా? భారత్ ఈ రాజకీయ మార్పులను ఉపయోగించుకొని విశ్వాసాన్ని పునరుద్ధరించగలదా, సంబంధాలను బలోపేతం చేసుకోగలదా? గతేడాది పాకిస్తాన్, భారత్‌ల మధ్య సైనిక ఘర్షణ తలెత్తింది, ఈ సంవత్సరం సంబంధాలు మెరుగుపడతాయా?
2026లో పాకిస్తాన్, భారత సంబంధాలలో పెద్ద మార్పు వస్తుందనే ఆశ చాలా తక్కువని సీనియర్ జర్నలిస్ట్ జుబేర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"పాకిస్తాన్‌తో సంబంధాల మెరుగుదల గురించి మాట్లాడితే, అందుకు ప్రత్యేక అవకాశమేమీ కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితి అలాగే కొనసాగవచ్చు. ఈ విషయంలో భారత్‌కు కొత్తగా ఎలాంటి చొరవ అవసరం లేదు" అని ఆయన అన్నారు.
"బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరిగిన సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే అక్కడి ఎన్నికలు భారత్‌కు చాలా ముఖ్యమైనవి" అన్నారు జుబేర్ అహ్మద్.
ఎన్నికల తర్వాత ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడినా, భారత్ దానితో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన భావిస్తున్నారు.
షేక్ హసీనా ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, ఆ సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. కానీ, భారత్ ఒక పెద్ద వ్యూహాత్మక తప్పు చేసిందని ఆయన అంటున్నారు.
"షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు సంబంధాలు చాలా బాగుండేవి. కానీ, బీఎన్ఏపీ, ప్రతిపక్ష పార్టీలతో సంబంధాలకు ప్రయత్నించకపోవడం తప్పు. ఒకప్పుడు మనకు మంచి పొరుగు దేశం, మిత్రుడైన బంగ్లాదేశ్‌ను ఇపుడు మనం కోల్పోయాం. ఇప్పుడు తీసుకురావడం చాలా ముఖ్యం" అని అన్నారు.
మరోవైపు, భారత్-నేపాల్ సంబంధాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని జుబేర్ అహ్మద్ అంటున్నారు.
నేపాల్‌తో భారత సంబంధాలు కొన్నిసార్లు బాగుంటాయని, మరికొన్నిసార్లు క్షీణిస్తాయని అన్నారు. నేపాల్ ప్రజల్లో భారత్‌పై ఉన్న అసంతృప్తి లేదా ప్రతికూల భావనను తొలగించడం భారతదేశం బాధ్యత అని జుబేర్ అహ్మద్ భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, భారత ఆర్థిక పరిస్థితి చాలావరకు బలంగా ఉందని ప్రొఫెసర్ అర్పితా ముఖర్జీ అంటున్నారు.
"ప్రపంచంలో పరిస్థితులు బాగాలేనప్పటికీ దేశ వృద్ధి రేటు బాగుంది. తలసరి ఆదాయం పెరుగుతోంది. మనది పెద్ద మార్కెట్" అన్నారు.
అయితే, "చైనాలా సరఫరా గొలుసుపై మనకు నియంత్రణ లేదు. వాణిజ్యం రూపంలో వాడగల ఆయుధం మన దగ్గర లేదు. చైనా ఇటీవల అమెరికాకు చేసినట్లు భారత్ చేయలేదు" అని అర్పితా ముఖర్జీ అన్నారు.
భారత్ తన విదేశాంగ, వాణిజ్య విధానంలో వైవిధ్యాన్ని కొనసాగించాలని ఆమె సూచించారు.
"భారత్ అనేక దేశాలతో సంబంధాలను కొనసాగించాలి, ఏదేని విషయం కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా ఉండాలి. ఒకే దేశంపై ఆధారపడితే, అది సమస్యలను సృష్టించవచ్చు" అన్నారు అర్పితా ముఖర్జీ.
"భారత్ చాలాకాలంగా రష్యాతో మంచి సంబంధాన్ని కలిగి ఉంది. అమెరికా, చైనాలతో కూడా సంబంధాలున్నాయి" అని అన్నారు.
చైనా గురించి మాట్లాడుతూ, దానిని విస్మరించడం అసాధ్యమని ప్రొఫెసర్ అర్పితా ముఖర్జీ అంటున్నారు.
"చైనా ప్రపంచ సూపర్ పవర్‌గా మారుతోంది. కీలకమైన ఖనిజాలు, ఆయుధాలలో దాని పాత్రను విస్మరించలేం" అన్నారామె.
"దక్షిణాసియా స్థిరత్వాన్ని పరిశీలిస్తే, చైనా ఉనికి ప్రతిచోటా ఉంది. ఇదే మనల్ని అస్థిరపరుస్తుంది" అన్నారు.
మరోవైపు, "రష్యా, అమెరికా విషయంలో, భారత్ పూర్తిగా ఒక వైపు మొగ్గు చూపే అవకాశం లేదు" అని అర్పితా ముఖర్జీ అభిప్రాయపడ్డారు.
"అమెరికా ఎజెండాను పరిశీలిస్తే, అది 'మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అంటే 'మాగా'. ఈ ఎజెండా కింద, అది దాదాపు అన్ని దేశాలపై సుంకాలను విధించింది" అన్నారామె.
అమెరికా సుంకాలు విధించినప్పుడు, ఎవరు మిత్రుడు, ఎవరు శత్రువు అని చూడలేదని అర్పితా ముఖర్జీ గుర్తుచేశారు.
వాణిజ్య ఒప్పందం ప్రస్తుత పరిస్థితి గురించి అర్పితా ముఖర్జీ మాట్లాడుతూ, "ఆగస్టుకు ముందు వాణిజ్య ఒప్పందం కుదిరి ఉంటే, అది అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు కానీ, ఒకవిధంగా బాగుండేది" అన్నారు.
"ప్రస్తుతం, మన ఎగుమతిదారులు పెద్దగా నష్టపోలేదు. కానీ, మార్చికి ముందు అమెరికాతో చర్చలు జరిపి సుంకాన్ని తగ్గించడం భారత్‌కు చాలా ముఖ్యం" అన్నారు అర్పితా ముఖర్జీ .

ఫొటో సోర్స్, Narendra Modi/YT
భారత్ - చైనా సంబంధాలు, ట్రంప్ సుంకాలు
చైనాతో భారత్ తన సంబంధాలను దీర్ఘకాలంలో బలంగా, స్థిరంగా కొనసాగించాలని సీనియర్ జర్నలిస్ట్ జుబేర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"భారత్ ఎల్లప్పుడూ చైనాతో మంచి, బలమైన సంబంధాలను కొనసాగించాలి. వాణిజ్య సమతుల్యత మనకు వ్యతిరేకంగా ఉండటమే ఏకైక సమస్య" అన్నారాయన.
ఈ దిశలో భారత్ మరింత చురుగ్గా వ్యవహరించాలని జుబేర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"భారత్ చైనా నుంచి మరింత మార్కెట్ డిమాండ్ చేయాలి. మెరుగైన యాక్సెస్ లభిస్తే, అది మన వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది" అన్నారు.
భారత్, చైనా, రష్యాలు 'ప్రపంచ ప్రధాన ఆటగాళ్లు' అని జుబేర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"రష్యా కూడా చేరితే, మనం మాట్లాడుతున్న బహుళ ధ్రువ ప్రపంచం ఇక్కడే ప్రారంభం కావొచ్చు" అన్నారు.
అయితే, ప్రస్తుత కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో వ్యవహరించడంలో ఏ దేశ విదేశాంగ విధానానికైనా పెద్ద పరీక్షేనని జుబేర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
"మీరు ఏ సంవత్సరం గురించి మాట్లాడినా ఎన్ని విధానాలు చేసినా, ప్రస్తుతం డోనల్డ్ ట్రంప్‌ను డీల్ చేయాలి. మీరు ఆయన్ను డీల్ చేయలేకపోతే, మీ విదేశాంగ విధానం ఇబ్బందుల్లో పడవచ్చు" అన్నారు.
"అమెరికా ప్రస్తుత విదేశాంగ విధానం పూర్తిగా వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది" అన్నారు జుబేర్ అహ్మద్.
జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అమెరికా తన మిత్రదేశాలతో కలిసి ముందుకు సాగిందని ఆయన అన్నారు. ఆ సమయంలో, చైనాకు వ్యతిరేకంగా ఉమ్మడి ఫ్రంట్‌ను ఏర్పాటు చేసిన దేశాలలో భారత్ కూడా ఉందన్నారు. ఇందులో యూరప్, జపాన్, దక్షిణ కొరియా, భారత్ ఉన్నాయి.
"గతంలో బాగా లేవనుకున్న అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఇప్పుడు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్తాన్ సైన్యం ఫీల్డ్ మార్షల్, ప్రధాన మంత్రికి వైట్‌హౌస్‌లో స్వాగతం లభించిన విధానం ఈ మార్పును సూచిస్తుంది" అని అన్నారు జుబేర్ అహ్మద్.
అయితే, "ఇదంతా తాత్కాలికమే, ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎటువంటి హామీ లేదు."
భారత వైఖరి గురించి మాట్లాడుతూ "భారతదేశం అమెరికాకు మిత్రదేశం కాదు; మనకు అధికారిక కూటమి లేదు. రష్యాతో కూడా పొత్తు లేదు. మనం కచ్చితంగా వ్యూహాత్మక భాగస్వాములం" అన్నారు.
బైడెన్ పదవీకాలంలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా బలంగా కనిపించిందని జుబేర్ అభిప్రాయపడ్డారు .
"2023లో అధ్యక్షుడు బైడెన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని యూఎస్ పర్యటనకు ఆహ్వానించారు. చాలా తక్కువ మంది ప్రపంచ నాయకులకు దక్కిన గౌరవమది" అని ఆయన గుర్తుచేశారు.
"ప్రధాని మోదీ అయినా లేదా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అయినా, ప్రతి ఒక్కరికీ వారి సొంత అహం ఉంటుంది. కానీ, అతిపెద్ద అహం ట్రంప్. ఆ అహాన్ని ఎవరు డీల్ చేస్తారు, ఎలా చేస్తారనేది ప్రశ్న. బ్రిటన్ దీన్ని చేయగలిగింది" అన్నారు జుబేర్ అహ్మద్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













