2026లో బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, నిపుణుల అంచనాలేంటి?

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
- రచయిత, పీటర్ హాస్కిన్స్
బంగారం, వెండి ధరలు 1979 సంవత్సరం తర్వాత మళ్లీ 2025లో అత్యధిక వార్షిక లాభాలను నమోదు చేసే దిశగా సాగినప్పటికీ, ఏడాది చివరలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
పసిడి ధర ఏకంగా 60 శాతానికి పైగా పెరిగింది. ఒకానొక దశలో రికార్డు స్థాయిలో ఒక ఔన్సు 4,549 డాలర్లు (సుమారు రూ.4 లక్షలు) మార్కును తాకింది. అయితే, క్రిస్మస్ తర్వాత ధరలు కొంత తగ్గి, కొత్త సంవత్సరం ముందు రోజు సుమారు 4,330 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.
అదే సమయంలో, సోమవారం 83.62 డాలర్ల వద్ద ఆల్-టైమ్ రికార్డును తాకిన వెండి ధర, ఒక ఔన్సు సుమారు 71 డాలర్ల (రూ.6,390) వద్ద ట్రేడ్ అవుతోంది.
వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయనే అంచనాలతో సహా పలు కారణాల వల్ల 2025 సంవత్సరంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
అయితే, ఈ ఏడాదిలో కనిపించిన భారీ పెరుగుదల కారణంగా 2026 సంవత్సరంలో వీటి ధరలు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
ధరలు ఎందుకు పెరిగాయంటే...
వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు 'సురక్షితమైన పెట్టుబడి' వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు 2025లో ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
"అనేక ఆర్థిక, పెట్టుబడులు, భౌగోళిక రాజకీయ కారణాల వల్ల బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి" అని ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌ఎస్.కామ్‌కు చెందిన రానియా గులే తెలిపారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ 2026లో మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల వల్లే ఈ లోహాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు.
వీటితో పాటు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు 'సురక్షితమైన పెట్టుబడి' వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం, వెండి ధరలకు ఊతం లభించింది.
ద్రవ్యోల్బణం పట్ల నెలకొన్న ఆందోళనలు, అలాగే స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ లోహాల వైపు మొగ్గు చూపడం వల్లే బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ఏజే బెల్ మార్కెట్స్ హెడ్ డాన్ కోట్స్‌వర్త్ చెప్పారు.
యూకే, యూఎస్ దేశాల్లో పెరిగిన ప్రభుత్వ రుణాలు, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బబుల్ ఏర్పడవచ్చనే భయాందోళనల వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి ధరలు పెరుగుతాయనే ఆశావహ దృక్పథంతో ఉండే అవకాశం ఉందని కోట్స్‌వర్త్ చెప్పారు.
అయితే, 2025లో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం వల్ల, కొత్త సంవత్సరం 2026లో ఇవి ఒక్కసారిగా భారీగా పడిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
''ఒకవేళ, ఆర్థిక మార్కెట్లు కష్టకాలంలో చిక్కుకుంటే, తమ పెట్టుబడులను నగదుగా మార్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లు గత ఏడాది కాలంగా మంచి లాభాలను ఇచ్చిన ఆస్తులను లేదా సులభంగా అమ్ముడయ్యేవాటిని ఎంచుకుంటారు. బంగారానికి ఈ రెండు లక్షణాలు ఉన్నాయి'' అని కోట్స్‌వర్త్ వివరించారు.
బంగారం ధరల పెరుగుదల 2026లో కూడా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్లు గులే అన్నారు. 2025లో నమోదైన రికార్డు స్థాయి పెరుగుదలతో పోలిస్తే ఈసారి స్థిరమైన వేగంతో వృద్ధి ఉండవచ్చని చెప్పారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ నిల్వలకు వందలాది టన్నుల బంగారాన్ని అదనంగా చేర్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
వెండి ధరలు ఎందుకు పెరిగాయి?
మరోవైపు, వెండి ధరల పెరుగుదలకు "సరఫరా కొరత, పారిశ్రామిక డిమాండ్" కారణమని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ స్కై లింక్స్ క్యాపిటల్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు డేనియల్ టకీద్దీన్ వివరించారు.
ప్రపంచంలోనే వెండి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న చైనా, ఈ లోహపు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది.
వనరులను, పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో, వెండితో పాటు టంగ్‌స్టన్, యాంటిమనీ వంటి లోహాల ఎగుమతులపై కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు 2025 అక్టోబర్‌లో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దీనిపై టెస్లా అధినేత ఎలన్ మాస్క్ స్పందిస్తూ, "ఇది మంచి పరిణామం కాదు. అనేక పారిశ్రామిక ప్రక్రియలకు వెండి చాలా అవసరం" అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) వంటి పెట్టుబడుల ద్వారా ఈ మార్కెట్‌లోకి భారీగా నిధులు తరలివచ్చాయని టకీద్దీన్ ప్రస్తావించారు.
ఈ ఈటీఎఫ్‌ల ద్వారా భౌతికంగా బంగారాన్ని తన వద్ద ఉంచుకోకుండానే స్టాక్ మార్కెట్ తరహాలో సులభంగా వ్యాపారం చేయవచ్చు.
2026లో కూడా బంగారం ధరలు పెరుగుతాయని, అయితే 2025లో చూసిన రికార్డు స్థాయిలతో పోలిస్తే ఇది కొంత "స్థిరమైన వేగంతో" ఉండవచ్చని గులే అంచనా వేస్తున్నారు.
వెండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, భారీ లాభాల తర్వాత అంతే వేగంగా ధరలు తగ్గే ప్రమాదం ఉందని టకీద్దీన్ హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










