బెల్టులో బంగారం: సినీనటి రన్యారావు అరెస్ట్, అసలేం జరిగింది? విదేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు

ఫొటో సోర్స్, ranyarao/X
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బెంగళూరు నుంచి బీబీసీ ప్రతినిధి
కన్నడ,తమిళ సినీనటి రన్యారావును బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అరెస్ట్ చేసింది. దుబయి నుంచి 14.8 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ ఆమె విమానాశ్రయంలో పట్టుబడ్డారు.
ఈ బంగారం విలువ సుమారు రూ.12 కోట్లరూపాయలని చెబుతున్నారు.
కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి కుమార్తె రన్యారావు.
బంగారంతో మంగళవారం కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రన్యారావు వచ్చారని చెప్పింది.
రన్యారావు తాను ధరించిన ప్రత్యేక బెల్టులో గోల్డ్ బార్లను దాచారని ఆర్ఐడీ చెప్పింది. దీంతో పాటు, ఆమె వద్ద నుంచి 800 గ్రాముల బంగారు ఆభరణాలనూ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.


ఫొటో సోర్స్, ranyarao/X
రన్యా రావును విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన తర్వాత, డీఆర్ఐ అధికారులు ఆమె ఇంటిని సోదా చేశారు.
ఈ సోదాల్లో, రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను, రూ.2.67 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
''కస్టమ్స్ యాక్ట్, 1962 కింద ఒక మహిళా ప్రయాణికురాలిని అరెస్ట్ చేశాం. ఆమెను జ్యూడిషియల్ కస్టడీకి పంపించాం.'' అని డీఆర్ఐ చెప్పింది.
ఈ కేసులో మొత్తంగా రూ.17.29 కోట్లను సీజ్ చేశారు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేసే వారికి ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ.
14.8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇటీవల బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద మొత్తం అని డీఆర్ఐ చెబుతోంది.
రన్యా రావు తరచూ దుబయికి వెళ్లి రావడంపై డీఆర్ఐ నిఘా పెట్టినట్టు పోలీసు అధికారులు చెప్పారు. కేవలం 15 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఆమె దుబయి వెళ్లి రావడంతో మరింత అనుమానం పెరిగింది.
కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు జిల్లాకు చెందిన వ్యక్తి రన్యా రావు. ఆమె తల్లి కాఫీ రైతు కుటుంబం నుంచి రాగా, తండ్రి రామచంద్ర రావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హెడ్‌గా ఉన్నారు.
రన్యారావు కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం లేదని, తన కూతురు, అల్లుడు వ్యాపారం గురించి తనకేం తెలియదని స్థానిక వార్తా పత్రికకు రామచంద్ర రావు చెప్పారు.
నాలుగు నెలలకిందటే ఆమెకు పెళ్లయింది.

ఫొటో సోర్స్, Getty Images
విదేశాల నుంచి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?
విదేశాల నుంచి అసలెంత బంగారాన్ని ఉచితంగా తెచ్చుకోవచ్చు? నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
మార్కెట్‌లో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది.
దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులతోపాటు బంగారంపై మోజు ఉన్న వారు విదేశాల నుంచి అక్రమ పద్ధతులలో బంగారాన్ని తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో నిర్దేశిత కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.
విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి.
విదేశాల నుంచి బంగారం తీసుకురావడం అక్రమం కాదని కస్టమ్స్ అధికారులు చెబుతున్న మాట. నిర్దేశిత కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే స్మగ్లింగ్‌గా పరిగణిస్తారు.
''బంగారం తీసుకురావడంపై ఎక్కడా ఆంక్షలు లేవు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోతేనే స్మగ్లింగ్ కిందనో.. అక్రమంగా తీసుకువస్తున్నట్టో గుర్తించి సీజ్ చేస్తారు.'' అని హైదరాబాద్‌కు చెందిన కస్టమ్స్ అధికారి ఒకరు గతంలో బీబీసీతో చెప్పారు.
బంగారంపై కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం గత ఏడాది 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అలాగే, గోల్డ్ బార్‌పై ఈ డ్యూటీని 14.35 శాతం నుంచి 5.35 శాతానికి తగ్గించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
''మగవారు 20 గ్రాములు, ఆడవారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకు రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతులలో తీసుకు వస్తుంటారు. కొద్ది కాలం అక్కడ ఉండి పావు కిలో నుంచి కిలో వరకు తీసుకువస్తుంటారు. అలాంటప్పుడు కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే సీజ్ చేస్తాం. కిలోకు మించి తీసుకువస్తే అరెస్టు చేస్తాం'' అని ఆయన బీబీసీకి వివరించారు.
అయితే, కస్టమ్స్ ట్యాక్స్ రేట్లు భారత పౌరులు ఆ దేశాల్లో ఎంతకాలం ఉన్నారు, ఎంత బరువైన బంగారం తెచ్చారు అనేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, hydcus
అరబ్ దేశాల నుంచి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దుబయి, జోర్దాన్, కువైట్, సూడాన్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్నారని వివరిస్తున్నాయి. అక్కడ బంగారం ధర కూడా తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
అరబ్ దేశాల నుంచి తీసుకువచ్చే బంగారం నాణ్యతతో పోల్చితే నేరుగా వ్యాపారులకు వచ్చే బంగారంలో పెద్దగా తేడా ఉండదని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం కస్టమ్స్ డ్యూటీ కారణంగా రేటు విషయంలో తేడా వస్తోందని అంటున్నారు.
తక్కువ ధరకే దుబయిలో కొనుగోలు చేసి తీసుకువచ్చి.. కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా మార్కెట్లోకి తీసుకెళితే ఎక్కువ లాభాలు పొందవచ్చని అక్రమ మార్గాల్లో బంగారం తీసుకువస్తున్న వారి ఆలోచనగా ఉంది.

ఫొటో సోర్స్, hydcus
ఎలా గుర్తిస్తారు?
అక్రమ మార్గాల్లో బంగారం తీసుకువచ్చేవారిని గుర్తించేందుకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో కీలకమైనవి బిహేవియర్, పర్సన్ ప్రొఫైలింగ్ అని కస్టమ్స్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారి బీబీసీకి ఒకరు చెప్పారు. ఇవి కాకుండా మెటల్ డిటెక్టర్ల సాయంతో పరీక్షించి పట్టుకుంటారన్నారు.
బిహేవియర్ ప్రొఫైలింగ్..
సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే మనిషిలో తెలియకుండా కంగారు, చూపుల్లో తేడా గమనిస్తుంటాం. బంగారం స్మగ్లింగ్ చేసే ప్రయాణికుల హడావుడి, కదలికల ఆధారంగా గమనించి పట్టుకుంటారు.
పర్సన్ ప్రొఫైలింగ్
స్మగ్లర్లను పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు ఎంచుకునే మరో మార్గం పర్సన్ ప్రొఫైలింగ్.
ఈ విషయంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల జాబితా కస్టమ్స్ అధికారులకు అందుతుంది. దాని ప్రకారం గతంలో ఆ ప్రయాణికుడు విదేశాలకు ఎన్నిసార్లు వెళ్లి వచ్చాడు..? ఎప్పుడెప్పుడు వెళ్లి వచ్చాడు..? అన్ని సార్లు ఎందుకు వెళుతున్నాడనే విషయాలపై ఆరా తీస్తారు.
అలా అనుమానితులతో ప్రత్యేకంగా జాబితా తయారు చేస్తారు.
ఆ జాబితాతో ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాక గుర్తిస్తారు. వారిని, సామగ్రిని పూర్తిగా తనిఖీ చేస్తారు.
''పర్సన్ ప్రొఫైలింగ్ అనేది కస్టమ్స్ అధికారులు అంతర్గతంగా చేపట్టే వ్యవహారం. ఇలా ప్రొఫైలింగ్ చేసినప్పుడు ఎక్కువ సార్లు విదేశాలకు వెళ్లి వచ్చే వారి జాబితాను తీసుకుని విశ్లేషించి వారు ఎయిర్‌పోర్టులో దిగగానే గుర్తించి తనిఖీలు చేస్తాం. కొన్ని సార్లు ఎక్కువ సార్లు వెళ్లి వచ్చే వారి జాబితాలో కంపెనీల సీఈవోలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాంటి వారు ఐడీ కార్డులు చూపిస్తే విడిచిపెడుతుంటాం'' అని కస్టమ్స్ అధికారి బీబీసీకి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













