బంగారం: విదేశాల నుంచి ‘ఉచితంగా’ ఎంత తెచ్చుకోవచ్చు? ఏం చేస్తే స్మగ్లింగ్ అంటారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 20.77 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
ఇది ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పట్టుకున్నది మాత్రమే. దీని విలువ బహిరంగ మార్కెట్లో 11.40 కోట్ల వరకు ఉంటుందని ట్విటర్ ఖాతాలో కస్టమ్స్ అధికారులు ప్రకటించారు.
మార్కెట్లో బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజురోజుకీ బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది.
దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు వ్యాపారులతోపాటు బంగారంపై మోజు ఉన్న వారు విదేశాల నుంచి అక్రమ పద్ధతులలో తీసుకువస్తున్నారు. ఇలా తీసుకువచ్చేప్పుడు నిర్దేశిత కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.
2022 సంవత్సరంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో 65.88 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. స్మగ్లింగ్‌కు ఎన్నో రకాల పద్ధతులు అనుసరిస్తున్నారు.

ఫొటో సోర్స్, hydcus
శరీరం, లోదుస్తులు, అట్టపెట్టెలలో ఉంచి తరలింపు
గత జులైలో దుబాయి నుంచి వచ్చి ఇద్దరు ప్రయాణికులపై ఎయిర్ ఇంటిలిజెన్స్ యూనిట్ అనుమానం వ్యక్తం చేసింది. వారిని మెటల్ డిటెక్టర్ సాయంతో తనిఖీ చేశారు.
ఏకంగా మలద్వారంలో బంగారం దాచి అక్రమంగా తరలిస్తూ వారు దొరికిపోయారు.
ఇలా తరచూ ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి వస్తున్న కొందరు ప్రయాణికులు అక్రమంగా బంగారం తరలిస్తుండగా, కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి.
దీనిపై హైదరాబాద్ కస్టమ్స్ డిపార్టమెంట్ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ విభాగంలో పనిచేశా. కొందరు అండర్ వేర్‌కు ప్రత్యేకంగా జిప్ ప్యాకెట్ కుట్టించి అందులో గోల్డ్ బిస్కెట్లు పెట్టుకుని తీసుకువస్తుంటారు. మరికొందరు మోకాలి ప్యాడ్స్‌కు జిప్ ప్యాకెట్ పెట్టి అందులో బంగారం ఉంచి తీసుకువస్తుంటారు. బెల్ట్ బకెల్‌కు పెడతారు. బంగారాన్ని పేస్టుగా చేసి నడుము చుట్టూ ప్యాంట్స్ కాలర్లో పెట్టి తీసుకువస్తుంటారు. మోకాలికి దెబ్బ తగిలిందని కట్టుకుని బంగారం పేస్టు దాని చుట్టూ పెట్టి తీసుకువస్తుంటారు’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, hydcus
బంగారం బిస్కెట్ రూపంలోనో.. నగల రూపంలోనో తీసుకువస్తే సులువుగా గుర్తించే వీలుంటుంది. అందుకే స్మగ్లర్లు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా బంగారాన్ని పేస్టులా చేస్తున్నారు.
అలా ఆ పేస్టును వీపుకు పట్టిలా వేసుకుంటున్నారు. హెయిర్ బ్యాండ్ చుట్టూ ఉంచడం, షూ లేదా చెప్పుల అడుగు భాగంలో రంధ్రంగా చేసి ఉంచడం, కార్ స్పేర్ పార్టులు, బొమ్మల చక్రాలలో ఉంచి కూడా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.
సన్నని రేకులా మార్చి అట్టపెట్టె చుట్టూ, ప్యాంట్ లేదా చొక్కా పొరల మధ్య ఉంచి అక్రమంగా తరలిస్టూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్నారు.
శరీర అంతర్భాగాలు, లోదుస్తులలోనూ ఉంచి తరలిస్తున్నారు.

ఫొటో సోర్స్, hydcus
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
విదేశాల నుంచి బంగారం తీసుకువచ్చే క్రమంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి.
విదేశాల నుంచి బంగారం తీసుకురావడం అక్రమం కాదని కస్టమ్స్ అధికారులు చెబుతున్న మాట.
నిర్దేశిత కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే స్మగ్లింగ్‌గా పరిగణిస్తారు.
ఈ విషయంపై హైదరాబాద్‌కు చెందిన కస్టమ్స్ అధికారి ఒకరు బీబీసీతో మాట్లాడారు. ‘‘బంగారం తీసుకురావడంపై ఎక్కడా ఆంక్షలు లేవు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకపోతేనే స్మగ్లింగ్ కిందనో.. అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించి సీజ్ చేస్తారు’’అని ఆయన అన్నారు.
‘‘ఎవరైనా విదేశాల్లో ఆరు నెలల్లోపే ఉండి తిరిగి వచ్చేప్పుడు బంగారం తీసుకువస్తే 38.5శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి.
ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఉండి తిరిగివస్తే 13.75శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇందులో మగవారు 20గ్రాములు, ఆడవారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకుని రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతులలో తీసుకువస్తుంటారు. కొద్ది కాలం అక్కడ ఉండి పావు కిలో నుంచి కిలో వరకు తీసుకువస్తుంటారు. అలాంటప్పుడు 38.5శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే సీజ్ చేస్తాం. కిలోకు మించి తీసుకువస్తే అరెస్టు చేస్తాం’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, hydcus
వలస కార్మికులు , అమాయకులే లక్ష్యం
అరబ్ దేశాల నుంచి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతోందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దుబాయి, జోర్దాన్, కువైట్, సూడాన్ నుంచి అక్రమంగా తీసుకువస్తున్నారని వివరిస్తున్నాయి. అక్కడ బంగారం ధర కూడా తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ, ఏపీలో కొందరు వ్యాపారులు అక్రమంగా అరబ్ దేశాల నుంచి బంగారం కొనుగోలు చేయించి తీసుకువచ్చి ఇక్కడ అమ్ముకుని లాభపడాలని చూస్తుంటారు. ఇందుకు ప్రత్యేకంగా ముఠాలు ఏర్పాటు చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు.
బంగారం తీసుకెళ్లే విషయంలో ఆయా దేశాలలో ఎలాంటి ఆంక్షలు లేవు. అందుకే అక్రమ మార్గాలలో హైదరాబాద్‌కు గోల్డ్ స్మగ్లింగ్ చేసేందుకు అమాయకులు, వలస కార్మికులను ముఠాలు ఎంచుకుంటున్నాయి.
వారికి విమాన ప్రయాణ టికెట్లు, ఇతర ఖర్చులు పెట్టుకుంటామని వలలో వేసుకుంటున్నాయి.
అలా వారికి బంగారం తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తున్నాయి. టికెట్ల డబ్బులు కలిసి వస్తాయన్న ఉద్దేశంతో వారు ఒప్పుకొంటున్నారు.
కస్టమ్స్ అధికారులు అనుమానంతో తనిఖీ చేస్తే పట్టుకుని సీజ్ చేస్తున్నారు. లేకపోతే బంగారం మార్కెట్‌కు చేరుతోంది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగాక ముఠా సభ్యులు కాపుగాసి వారి నుంచి బంగారం తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, hydcus
నాణ్యతలో ఏదైనా తేడా ఉందా..
అరబ్ దేశాల నుంచి తీసుకువచ్చే బంగారం నాణ్యతతోపోల్చితే నేరుగా వ్యాపారులకు వచ్చే బంగారంలో పెద్దగా తేడా ఉండదని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం కస్టమ్స్ డ్యూటీ కారణంగా రేటు విషయంలో తేడా వస్తోందని అంటున్నారు.
తక్కువ ధరకే దుబాయిలో కొనుగోలు చేసి తీసుకువచ్చి.. కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా మార్కెట్లోకి తీసుకెళితే ఎక్కువ లాభాలు పొందవచ్చని అక్రమ మార్గాల్లో బంగారం తీసుకువస్తున్న వారి ఆలోచనగా ఉంది.
ఈ విషయంపై హైదరాబాద్ బంగారం వ్యాపారుల సంఘం ప్రతినిధి సునీల్ జైన్ బీబీసీతో మాట్లాడారు. ‘‘బంగారం నాణ్యత విషయంలో ఏమీ తేడా ఉండదు. కస్టమ్స్ డ్యూటీ సక్రమంగా కట్టి తీసుకువస్తే ఖర్చుఎక్కువ అవుతుంది. అలా కాకుండా కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా తీసుకువస్తే ఆ లాభం వారికే మిగులుతుంది. కొన్ని సందర్భాల్లో కేజీ బంగారంపై 5 నుంచి 7 లక్షల వరకు మిగులుతుంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, hydcus
కస్టమ్స్ ఎలా గుర్తిస్తోంది..?
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఉంటారు.
అక్రమ మార్గాల్లో బంగారం తీసుకువచ్చేవారిని గుర్తించేందుకు వివిధ మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో కీలకమైనవి బిహేవియర్, పర్సన్ ప్రొఫైలింగ్ అని కస్టమ్స్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారి బీబీసీకి ఒకరు చెప్పారు. ఇవి కాకుండా మెటల్ డిటెక్టర్ల సాయంతో పరీక్షించి పట్టుకుంటారన్నారు.
బిహేవియర్ ప్రొఫైలింగ్..
సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే మనిషిలో తెలియకుండా కంగారు, చూపుల్లో తేడా గమనిస్తుంటాం. బంగారం స్మగ్లింగ్ చేసే ప్రయాణికుల హడావుడి, కదలికల ఆధారంగా గమనించి పట్టుకుంటారు.
పర్సన్ ప్రొఫైలింగ్
స్మగ్లర్లను పట్టుకునేందుకు కస్టమ్స్ అధికారులు ఎంచుకునే మరో మార్గం పర్సన్ ప్రొఫైలింగ్.
ఈ విషయంలో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల జాబితా కస్టమ్స్ అధికారులకు అందుతుంది. దాని ప్రకారం గతంలో ఆ ప్రయాణికుడు విదేశాలకు ఎన్నిసార్లు వెళ్లి వచ్చాడు..? ఎప్పుడెప్పుడు వెళ్లి వచ్చాడు..? అన్ని సార్లు ఎందుకు వెళుతున్నాడనే విషయాలపై ఆరా తీస్తారు.
అలా అనుమానితులతో ప్రత్యేకంగా జాబితా తయారు చేస్తారు.
ఆ జాబితాతో ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాక గుర్తిస్తారు. వారిని, సామగ్రిని పూర్తిగా తనిఖీ చేస్తారు.
‘‘పర్సన్ ప్రొఫైలింగ్ అనేది కస్టమ్స్ అధికారులు అంతర్గతంగా చేపట్టే వ్యవహారం. ఇలా ప్రొఫైలింగ్ చేసినప్పుడు ఎక్కువ సార్లు విదేశాలకు వెళ్లి వచ్చే వారి జాబితాను తీసుకుని విశ్లేషించి వారు ఎయిర్‌పోర్టులో దిగగానే గుర్తించి తనిఖీలు చేస్తాం. కొన్ని సార్లు ఎక్కువ సార్లు వెళ్లి వచ్చే వారి జాబితాలో కంపెనీల సీఈవోలు, సీనియర్ అధికారులు ఉంటారు. అలాంటి వారు ఐడీ కార్డులు చూపిస్తే విడిచిపెడుతుంటాం’’ అని కస్టమ్స్ అధికారి బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
- ప్రియాంక గాంధీ దూకుడు కాంగ్రెస్ పార్టీకి గత వైభవాన్ని తీసుకురాగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















