రెండో ప్రపంచయుద్ధం: ఈ మ్యాప్ ఉంటే కోటీశ్వరులు కావొచ్చా... బంగారం, వజ్రాల నిధిని పట్టుకోవచ్చా

- రచయిత, అన్నా హోలిగన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ సైనికులు కోట్లు విలువ చేసే సంపదను డచ్ గ్రామం ఒమెరెన్‌లో దాచిపెట్టారన్న విషయం వెలుగులోకి రావడంతో ట్రెజర్ హంటర్లు వేట మొదలుపెట్టారు.
దాంతో, విసుగు చెందిన ఒమెరెన్ వాసులు తమ గ్రామాన్ని విడిచిపెట్టమని అభ్యర్థించారు.
ఇదంతా ఒక పాత మ్యాప్ దొరకడంతో మొదలైంది. జర్మన్ సైనికులు తాము దోచుకున్న వజ్రాలు, కెంపులు, బంగారం, వెండితో నింపిన పెట్టెలను ఒమెరెన్ ప్రాంతంలో దాచిపెట్టినట్టు ఆ మ్యాప్ సూచిస్తోందని చెబుతున్నారు. ఈ సంపదను సైనికులు మందుగుండు సామాగ్రి ఉంచే పెట్టెలలో నింపి పాతిపెట్టారని భావిస్తున్నారు.
చేత్తో గీసిన ఈ మ్యాప్‌పై ఎరుపు రంగులో X అని కొన్నిచోట్ల మార్క్ చేసి ఉంది. గత వారం డచ్ నేషనల్ ఆర్కైవ్స్ ఒక కేసు ఫైలును పబ్లిక్‌లో పెట్టింది. దానితో పాటు ఈ మ్యాప్ కూడా బయటికొచ్చింది.
75 సంవత్సరాల గోప్యత వ్యవధి ముగిసిన సందర్భంగా ఈ పత్రాలను బయటపెట్టారు. అయితే మ్యాప్‌ను డీక్లాసిఫై చేశాక ఒమెరెన్‌లో నిధులు ఉన్నాయన్నది అబద్ధమని తేలింది.
మ్యాప్‌లో ఒమెరెన్ గ్రామం దగ్గర X అని మార్క్ చేసి ఉన్న ప్రాంతంలో 1944లో మిత్రదేశాల సైనిక దళాలు 'మార్కెట్ గార్డెన్' ఆపరేషన్‌ను చేపట్టాయి. ఉత్తర జర్మనీలోకి చొచ్చుకుపోయేందుకు భూమార్గాన్ని ఏర్పరచుకోవడానికి సాహసోపేతమైన ఈ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ మ్యాప్ బయటికొచ్చాక ఒమెరెన్‌లో అనేక అనధికారిక తవ్వకాలు కనిపించాయి. పొలాల్లో, అడవుల్లో గుంటలు తవ్వి నిధి కోసం వెతికిన జాడలు కనిపించాయి.
"ఇదొక మారుమూల ప్రాంతమని, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ స్థిరపడ్డాను. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మా ఊరు తెలిసిపోయింది" అన్నారు ఒమెరెన్ నివాసి శాండర్.
ఎక్కడి నుంచో వచ్చి తన తలుపు కొట్టి నిధికి దారెటో చెప్పమంటున్నారని ఆయన వాపోయారు. కొంతమంది యువకులు ఒకచోట నేలను తవ్వడం కూడా చూశానని చెప్పారు.
"ఈ ప్రాంతానికి చాలా చరిత్ర ఉంది. ఇక్కడున్న వైట్ విల్లాను నాజీ అధికారులు ఆక్రమించుకున్నారు. కానీ, అదంతా గతం. ఇప్పుడు మళ్లీ మా గ్రామంపై ప్రజలకు కుతూహలం పెరిగింది. కొత్త రహస్యాలేవో బయటపడినట్లు జనం ఇక్కడకు వస్తున్నారు" అన్నారు శాండర్.

ఫొటో సోర్స్, Reuters
నిజంగా నిధి ఉందా?
డచ్ ఆర్కైవ్స్ పబ్లిక్‌లో పెట్టిన పత్రాల్లో ఒక జర్మన్ సైనికుడు చెప్పిన కొన్ని సంగతులు ఉన్నాయి.
1944 ఆగస్టులో ఒమెరెన్ నుంచి 40 కిమీ దూరంలో ఉన్న అర్న్‌హెం నగరంలోని ఒక బ్యాంకుపై బాంబు దాడి జరిగిందని, బ్యాంకు ఖజానా బద్దలు కావడంతో అందులో ఉన్న ఆభరణాలు, నాణేలు, విలువైన రత్నాలు, బంగారం వాచీలు చెల్లాచెదురయ్యాయని పేర్కొన్నారు.
ముగ్గురు, నలుగురు జర్మన్ సైనికులు చేతికి దొరికినవాటిని జేబులో వేసుకున్నారని, తరువాత వాటిని మందుగుండు సామాగ్రి ఉంచే పెట్టెల్లో, బ్రెడ్ ప్యాకెట్లలలో దాచిపెట్టారని ఆ సైనికుడు పత్రాల్లో పేర్కొన్నారు.
యుద్ధం చివరి దశలో జర్మన్లు ఓడిపోతుండడంతో, సైనికులు తాము దాచిపెట్టిన నిధిని భూమిలో పాతిపెట్టాలని నిశ్చయించుకున్నారు.
యుద్ధం ముగిసిన తరువాత, నాజీలు స్వాధీనం చేసుకున్న వస్తువులను కనిపెట్టడానికి ఒక డచ్ సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ జర్మనీకి చెందిన ఒక యువ పారాట్రూపర్ హెల్మట్ సోండర్‌ను కలిసింది. సోండర్ యుద్ధ సమయంలో జరిగిన విషయాలకు ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు దొరికిన మ్యాప్‌ను గీసింది ఆయనే.
జర్మన్ సైనికులు దాచిపెట్టారని భావిస్తున్న నిధి చాలా విలువైనదని గుర్తించిన డచ్ ప్రభుత్వం ఈ మ్యాప్‌ను రిలీజ్ చేసేముందు పలుచోట్ల తవ్వకాలు జరిపింది.
డచ్ నేషనల్ ఆర్కైవ్స్ ఈ మ్యాప్ విడుదల చేయడంపై ఒమెరెన్ నివాసి పెట్రా వాన్ (42) ఆగ్రహం వ్యక్తం చేశారు. దానివల్లే తమ గ్రామంలో నిధి అన్వేషణ జరుగుతోందని, తాము నిస్సహాయులుగా ఉండిపోయామని అన్నారు.
"నాకు నిద్రపట్టడం లేదు. మా గార్డెన్‌లో తవ్విన గుంటలు నా ఛాతీ వరకు వచ్చాయి" అని ఆమె చెప్పారు.
న్యూస్ రిపోర్టర్లు ఆమె ఇంటి ముందు గుమికూడారు. మైక్రోఫోన్లు, మెటల్ డిటెక్టర్లతో వాళ్ల గార్డెన్‌ను పరిశీలించారు.
రాత్రి పూట మొహంపై టార్చ్‌లైటు పడడంతో మెలుకవ వచ్చిందని పెట్రా పక్కింటివాళ్లు చెప్పారు. తమ గార్డెన్‌లో పారలతో తవ్వడం మొదలెట్టారని ఆమె వాపోయారు.
"అది వేరే వాళ్ల ఆస్తి. దాని గురించి మీకెందు? మా ఊరికి దూరంగా ఉండండి" అంటూ పెట్రా అసహనం వ్యక్తం చేశారు.

'ఇలా జరుగుతుందని ఊహించలేదు'
1940ల నాటి సమాచారాన్ని బయటపెట్టడం మంచిదే కానీ, "ఇలా జరుగుతుందని ఊహించలేదని" నేషనల్ ఆర్కైవ్స్‌లో సమాచార స్వాతంత్య్రం విభాగం సలహాదారు అనెట్ వాల్కెన్స్ అన్నారు.
జనం మ్యాప్ చూసి ఒమెరెన్‌లో నిధి అన్వేషణకు బయలుదేరుతారని ముందే ఊహించి ఉంటే, మా ఆర్కైవ్స్ సిబ్బంది ముందే హెచ్చరించి ఉండేవారని ఆమె అన్నారు.
ఒమెరెన్‌లో తవ్వకాలు పెరిగిపోవడంతో ఇటీవలే మెటల్ డిటెక్టర్లను బ్యాన్ చేశారు. ఔత్సాహిక నిధి అన్వేషకులు పొరపాటున రెండవ ప్రపంచ యుద్ధంలో పేలని గ్రెనేడ్‌లు, బాంబులు లేదా మందుపాతరలను ఢీకొట్టే ప్రమాదం ఉందని డిటెక్టర్లను నిషేధించారు.
ఇంతవరకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఎడాపెడా తవ్వకాలు జరిపినవారికి జరిమానా విధించారు. ఒకవేళ ఎవరికైనా బంగారం దొరికితే వెంటనే స్థానిక అధికారులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది నిధి వేటకు సంబంధించిన జానపద కథలను తలపిస్తున్నప్పటికీ, వాస్తవంలో ఒక యుద్ధం ఎలాంటి పరిస్థితులను మిగుల్చుతుందన్నదానికి నిలువెత్తు సాక్ష్యం. రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు అయిదు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 60 లక్షల యూదులు జర్మన్ల మారణకాండకు బలైపోయారు.
"ప్రతీ యుద్ధం విషాదాన్నే మిగులుస్తుంది. బాంబు దాడులు జరిగిన అర్న్‌హెం లాంటి ప్రాంతాల్లో ప్రజలు తమ సర్వస్వాన్ని కోల్పోయారు" అని అనెట్ అన్నారు.
కాగా, జర్మన్ సైనికులు దాచిపెట్టిన నిధి దొరికితే, అది ఎవరికి సొంతం అవుతుందో ఆర్కైవ్స్‌లో బయటపెట్టిన పత్రాల్లో స్పష్టపరచలేదు. అదంతా అర్న్‌హెం బ్యాంకులో స్థానిక ప్రజలు దాచుకున్న సొమ్ము కావచ్చు. నాజీల దోపిడీ నుంచి తమ ధనాన్ని రక్షించుకోవడానికి బ్యాంకు లాకరులో దాచిపెట్టి ఉండవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ నిధి రహస్యం ఎవరికైనా తెలిసి ఉంటుందా?
ఆర్కైవ్స్ విడుదల చేసిన మ్యాప్‌ను గీసిన జర్మన్ పారాట్రూపర్ మరణించినట్లు సాక్ష్యాలు లేవని పరిశోధకులు అంటున్నారు.
హెల్మట్ సోండర్ బతికి ఉంటే ఆయనకు ఇప్పుడు 98 ఏళ్లు ఉంటాయి. జర్మన్లు దాచిపెట్టిన నిధి రహస్యం ఆయనకు తెలిసి ఉండవచ్చని ఊహిస్తున్నారు.
అయితే, ఇప్పటివరకూ ఎలాంటి నిధులూ బయటపడలేదు. దీనికి డచ్ ఆర్కైవ్స్ నాలుగు కారణాలు చెబుతోంది.
1. హెల్మెట్ సోండర్ అబద్ధం చెప్పి ఉండవచ్చు. కానీ, ఆయన చెప్పిన విషయాలను విస్తృతంగా నిజ నిర్థరణ చేశారు. ఆయన చెప్పిన విషయాలన్నీ నమ్మదగినవనే తేలింది.
2. బహుశా, జర్మన్ సైనికుల్లో ఒకరు మళ్లీ వెనక్కి వచ్చి ఆ నిధులను తవ్వి తీసుకెళ్లిపోయి ఉండవచ్చు. అధికారుల కంటపడకుండా తప్పించుకుని ఉండవచ్చు.
3. డచ్ సంస్థలో ఉద్యోగి అంతర్గతంగా అందిన సమాచారంతో రహస్యంగా నిధిని తవ్వి ఉండవచ్చు. అందుకే అధికారికంగా తవ్వకాలు జరిపినప్పుడు ఎలాంటి నిధి బయటపడలేదు.
4. ఆ కాలంలో ఈ ప్రాంతానికి దగ్గరగా పోరాడుతున్నట్టు కనిపించిన ఇద్దరు అమెరికన్ అధికారులు నిధిని దోచుకుని ఉండవచ్చు.
యుద్ధం తరువాత జర్మన్లు దోచుకున్న సొమ్మును ఎలాగైనా కనిపెట్టాలని పరిశోధకులు పూనుకున్నారు. ఎందుకంటే, అది కొన్ని కోట్లు విలువ చేసే నిధి.
అయితే, ఒకవేళ అలాంటి నిధి ఏమైనా నిజంగా ఉండి ఉంటే, అదెప్పుడో చేజారిపోయి ఉంటుందని డచ్ అధికారులు భావిస్తున్నారు.
నాజీలు దాచి పెట్టిన నిధి దొరకలేదని చెబుతున్నదంతా కట్టు కథ అని ఒమెరెన్ గ్రామస్థులు కొందరు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్: యుద్ధ క్షేత్రంలో కొడుకు మృతదేహాన్ని ఈ తల్లి ఎలా కనిపెట్టారు?
- సౌమ్య తివారీ: బట్టలు ఉతికే కర్రతో క్రికెట్ ప్రాక్టీస్ చేసే దశ నుంచి అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ దాకా...
- జవాన్ ఛాతిలో పేలని గ్రెనెడ్, డాక్టర్లు, బాంబ్ స్క్వాడ్‌ను రప్పించాక....
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
- Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి 'పెద్దన్న' ఎంఎం కీరవాణి















