బ్రిటీష్ రాజ్: కరువుతో 10 లక్షలమంది చనిపోతుంటే, ప్రభుత్వమే సహాయాన్ని అడ్డుకుంది.

క్షామం బాధితుల ఫొటో

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, క్షామం బాధితుల ఫొటో
    • రచయిత, దిన్యార్ పటేల్
    • హోదా, చరిత్రకారుడు, బీబీసీ కోసం

అది 1866వ సంవత్సరం, మండు వేసవి. వడగాడ్పులు, కరువు దేశంలోని 33 కోట్ల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలం. తూర్పు భారతదేశంలో దాపురించిన క్షామానికి పది లక్షలకు పైగా భారతీయులు బలయిపోయారు.

సుమారు 156 సంవత్సరాల క్రితం లక్షలాది ప్రజల ప్రాణాలు తీసిన ఒడిశా క్షామం గురించి నేటి తరానికి తెలియకపోవచ్చు. భారత చరిత్ర పుటల్లో దీనికి దక్కిన స్థానం కూడా చిన్నదే.

ఆధునిక కాలంలో ఒడిశా అని పిలుస్తున్న ప్రాంతంలో 1866లో ప్రతి ముగ్గురిలో ఒకరు క్షామానికి బలైపోయారు. 1845–49లలో ఐర్లండ్‌లో సంభవించిన 'ఐరిష్ పొటాటో ఫెమైన్ ' కంటే పెద్ద క్షామం ఇది. మరణాల రేటు అప్పటి కంటే ఎక్కువగా నమోదైంది. 

ఒడిశా క్షామం భారతదేశ రాజకీయలను కూడా మలుపు తిప్పింది. అప్పటి నుంచి భారతదేశంలో పేదరికంపై జాతీయ స్థాయిలో చర్చలు మొదలయ్యాయి.

నేటి ఆధునిక కాలంలో కరువు సహాయక ప్రయత్నాల మధ్య అప్పటి చర్చలు అప్పుడప్పుడూ ప్రతిధ్వనిస్తుంటాయి.

భారతీయ కరువు బాధితుల పురాతన ముద్రణ, 1885

ఫొటో సోర్స్, Alamy

'పరిహారం ఇవ్వకపోవడమే ఉత్తమ పరిహారం '

భారతదేశానికి కరువు కాటకాలు కొత్త కాకపోయినా, బ్రిటిష్ వలస రాజ్య పాలనలో అవి ఇంకా ఎక్కువయ్యాయి. మరణాల రేటు పెరిగింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ, అప్పటికే దేశంలో బలంగా వేళ్లూనుకున్న వస్త్ర పరిశ్రమను నాశనం చేసింది. దాంతో, ప్రజలు వ్యవసాయం వైపు మళ్లసాగారు. దానివల్ల, భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఎక్కువగా రుతువుపవనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సుమారు 156 సంవత్సరాల క్రితం ఒక ఏడాది బలహీనమైన రుతుపవనాలు కరువును మోసుకొచ్చాయి.

"కరువుకు సమీపంలో ఉన్నామన్న విషయాన్ని దాచిపెట్టడం ఇకపై అసాధ్యం అనిపిస్తోంది" అని 1865 చివర్లో కోల్‌కతా వార్తాపత్రిక ఇంగ్లిష్‌మ్యాన్ ప్రకటించింది. 

భారతీయ, బ్రిటిష్ వార్తాపత్రికలన్నీ ధరలు పెరగడం, ధాన్యం నిల్వలు తగ్గిపోవడం, బియ్యం కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న రైతుల గురించి వార్తలు ప్రచురించాయి. 

అయినప్పటికీ, బ్రిటిష్ అధికార యంత్రాంగం పెద్దగా స్పందించలేదు. దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఆ కాలంలో అంటే 19వ శతాబ్దం మధ్యలో క్షామం లేదా కరువు సంభవించినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నది సిద్ధాంతం.

మార్కెట్ దానంతట అదే సమతుల్యం సాధిస్తుందన్నది ఆర్థికశాస్త్రం చెప్పే సూత్రం. అలాగే, జనాభా పెరిగితే అధిక మరణాల ద్వారా ప్రకృతి సమతుల్యం సాధిస్తుందన్నది మాల్థూసియన్ సిద్ధాంతం.

ఇదే తర్కాన్ని అంతకు రెండు దశాబ్దాల ముందు ఐర్లండ్‌లో వచ్చిన క్షామం సమయంలో కూడా ఉపయోగించారు. పరిహారం లేదా సహాయం అందించకపోవడమే ఉత్తమ పరిష్కారం అన్న సూత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలుచేసింది. అది ఎంత దారుణమైన ఫలితాలను అందించిందో చరిత్ర చూసింది.

అయినప్పటికీ, భారతదేశంలో కూడా అదే విధానాన్ని అమలుచేశారు.

1866 ఫిబ్రవరిలో ఒడిశా ప్రాంతంలో పర్యటించిన బెంగాల్ బ్రిటిష్ గవర్నర్ సెసిల్ బీడన్ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. అప్పట్లో ఒడిశా, బెంగాల్‌లో భాగంగా ఉండేది.

"కరువును నిరోధించడానికి లేదా తగ్గించడానికి ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

1900లలో క్షామం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, 1900లలో క్షామం

'చాలా కొంచం, చాలా ఆలస్యం, చాలా మురిగిపోయాయి'

ఆకాశాన్నంటుతున్న ధాన్యం ధరలను నియంత్రించడం వల్ల ఆర్థిక శాస్త్ర సహజ నియమాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, "నేను అలా చేయడానికి ప్రయత్నిస్తే, ఒక దొంగ లేదా దోపిడిదారుడిని అవుతాను" అని గవర్నర్ సెసిల్ బీడన్ అన్నారు.

ఆ ముక్క చెప్పేసి, బీడన్ ఒడిశా ప్రజలను కరువుకే వదిలిపెట్టి కోల్‌కతా తిరిగివచ్చారు.

ఆపై, సహాయక చర్యల కోసం ప్రైవేటుగా వ్యక్తులు/సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను, సమకూరుస్తున్న నిధులను అడ్డుకోవడంలో మునిగిపోయారు.

1866 మేలో, ఒడిశాలో ముంచుకొస్తున్న విపత్తును విస్మరించడం అసాధ్యంగా మారింది.

కటక్‌లో బ్రిటిష్ అధికారులు.. తమ సేనలు, పోలీసు అధికారులు ఆకలితో అలమటిస్తున్నారన్నారని గుర్తించారు.

పూరీలో ప్రాణాలతో మిగిలి ఉన్నవారు చనిపోయినవారి శవాలను పుడ్చిపెట్టడానికి కందకాలు తవ్వారు.

"వారి ఆకలి కేకలు కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించేవి" ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

క్షామం వార్తలు కోల్‌కతా, లండన్ నగరాలలో విస్తారంగా ప్రచారం కావడంతో, గవర్నర్ బీడన్ ధాన్యాన్ని ఒడిశాకు దిగుమతి చేసే ప్రయత్నం చేశారు.

అప్పుడే ప్రకృతి తన క్రూరత్వాన్ని చూపించింది. వర్షాలు, వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ధాన్యం దిగుమతులను అడ్డుకున్నాయి.

ఆ కొద్దిపాటి సహాయక చర్యలు ఆలస్యం కావడంతో ఆహారధాన్యాలు మురిగిపోయాయి.

బ్రిటిష్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి, ఉద్దేశపూర్వకంగా చేసిన జాప్యానికి ఒడిశా ప్రజలు బలైపోయారు.

బ్రిటిష్ పాలన భారతదేశాన్ని పేదరికంలో ముంచుతోందని పశ్చిమ దేశాల్లో చదువుకున్న భారతీయులు గళమెత్తారు. ఒడిశా క్షామం వారి ఆరోపణలను రుజువు చేసింది.

తొలితరం జాతీయవాది, రాజకీయ నాయకుల్లో ఒకరైన దాదాభాయ్ నౌరోజీ భారతదేశంలోని పేదరికంపై జీవితకాలం పరిశోధనలు చేసేలా ప్రేరేపించింది ఈ క్షామం.

1867 ప్రారంభంలో కరువు తగ్గుముఖం పట్టిన తరువాత, నౌరోజీ "డ్రెయిన్ థియరీ" సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

బ్రిటన్, భారతీయుల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి సుసంపన్నంగా ఎదుగుతోందనన్నది ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం.

"జీవిత భద్రత, ఆస్తుల రక్షణ ఈ కాలంలో మెరుగ్గా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ, ఒక క్షామంలో పది లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనేది ఆస్తి, జీవితాల భద్రతను వింతైన కోణంలో చూపిస్తోంది" అని ఆయన అన్నారు. 

1900లలో క్షామం

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, 1900లలో క్షామం

ప్రభుత్వ ఉదాసీనత

నౌరోజీ సూటిగా ఒక ప్రశ్న అడిగారు.. ఆకలితో అలమటించేవారికి ఆహారం అందించగల స్థోమత, ఆహార భద్రత భారతదేశానికి ఉంది. కానీ, ప్రభుత్వం వారిని చావుకు ఎందుకు వదిలిపెట్టింది?

1866లో ఓపక్క ఒడిశా ప్రజలు ఆకలిచావులు చస్తుంటే, మరోపక్క భారతదేశం నుంచి బ్రిటన్‌కు 200 మిలియన్ పౌండ్ల విలువైన ధాన్యాన్ని ఎగుమతి చేశారన్న విషయన్ని నౌరోజీ వెలుగులోకి తీసుకొచ్చారు.

ఇదే కాకుండా, ఇతర కరువుకాటకాలప్పుడు కూడా భారతదేశం నుంచి భారీగా ఎగుమతులు జరుగుతున్నాయన్న విషయాన్ని ఆయన గమనించారు. 

"భగవంతుడా, ఇది ఎప్పటికి అంతమవుతుంది?" అంటూ నౌరోజీ వాపోయారు. 

అయితే, అది అంత త్వరగా అంతం కాలేదు. 1869లో, 1874లో క్షామం చుట్టుముట్టింది. 1876, 1878 మధ్య మద్రాస్‌లో ఏర్పడిన క్షామంలో 40 నుంచి 50 లక్షల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఆ సమయంలో వైస్రాయ్ లార్డ్ లిట్టన్, ఐర్లండ్, ఒడిశాలలో అనుసరించిన విధానాన్నే అనుసరించారు. దాంతో, మద్రాస్ ప్రజలు క్షామానికి బలయ్యారు.

1860ల నుంచి 1901 నాటికి మొత్తం 10 సార్లు క్షామం దాపురించిందని, మొత్తం మరణాల సంఖ్య 1.5 కోట్లకు చేరుకుందని ప్రముఖ జాతీయవాది రమేశ్ చందర్ దత్ లెక్కించారు. 

భారతీయులు దారుణమైన పేదరికంలోకి జారిపోయారు. ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. "ప్రతి కరువు క్షామంగా మారిందని" రమేశ్ చందర్ అన్నారు.

ఈ పరిస్థితులు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారతీయులను ప్రేరేపించాయి. 

నేటి కాలంలో, భారతదేశం వ్యవసాయంపై ఆధారపడడం తగ్గింది. కరువును ఎదుర్కునేందుకు పటిష్టమైన విధానాలు రూపొందాయి.

పేదరికాన్ని అధిగమిస్తూ, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రపంచపటంలో తన స్థానాన్ని చాటుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)