జయప్రకాశ్ నారాయణ్-ఇందిరా గాంధీ: వీరిద్దరి సైద్ధాంతిక విభేదాలు, పట్టుదలలే దేశంలో ఎమర్జెన్సీకి దారి తీశాయా?

ఇందిర జీవితం ముగియలేదు అంటూ పరోక్షంగా ఆమెపై ప్రతీకారం వద్దని అనుచరులకు చెప్పారు జేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిర జీవితం ముగియలేదు అంటూ పరోక్షంగా ఆమెపై ప్రతీకారం వద్దని అనుచరులకు చెప్పారు జేపీ
    • రచయిత, రేహన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1974 నాటికి భారతదేశంలో రాజకీయ వాతావరణం ఇందిరకు వ్యతిరేకంగా, జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ)కు అనుకూలంగా ఉంది. ఆయన ఈ దేశాన్ని రక్షించే వ్యక్తిగా కనిపించారు. జేపీ ఇచ్చిన సంపూర్ణ విప్లవం నినాదం ప్రజలను ఆకర్షించడమే కాకుండా, పార్టీరహిత ప్రజాస్వామ్యం అన్న ప్రతిపాదన కూడా అందరినీ ఆలోచింపజేసింది.

జేపీని ఢీకొట్టడానికి బదులు కలుపుకుపోవాలని, ఒకసారి ఆయనతో మాట్లాడాలని కాంగ్రెస్‌ వర్గాల నుంచి ఇందిరాగాంధీపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. దీంతో అయిష్టంగానే ఆయనతో సమావేశానికి ఇందిరాగాంధీ అంగీకరించారు.

ఈ చర్చలు ఇద్దరి మధ్యే ఉంటాయని జేపీకి తెలియజేశారు. దీంతో 1974 నవంబర్ 1 రాత్రి ఇందిరా గాంధీని కలవడానికి జేపీ నెంబర్‌ 1, సఫ్దర్‌జంగ్‌ రోడ్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.

ఆయన వచ్చి కూర్చున్న వెంటనే ఇందిర జగ్జీవన్‌ రామ్‌ను పిలిచారు.

ఒప్పందం డ్రాఫ్ట్‌ను చదివిన తర్వాత “ఇందులో మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పవచ్చు” అని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జేపీని కోరినట్లు మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ తన జీవిత కథ ‘జిందగీ కా కారవా’లో రాశారు.

బిహార్‌ శాసన సభను సస్పెండ్‌ చేసే వరకు ఓకే, కానీ దానిని రద్దు చేసే విషయం ఇందులో ఎందుకు రాయలేదు అని ప్రశ్నించారు జేపీ. ఇందిరాగాంధీ దానికి మౌనంగా ఉండిపోయారు. ఐదు పది నిమిషాల తర్వాత జేపీ లేచి వెళ్లిపోయారు.

ఢిల్లీలో జేపీ సభను విఫలం చేయడానికి దూరదర్శన్ లో 'బాబీ' సినిమా వేయించారు ఇందిర మంత్రి

ఫొటో సోర్స్, Rupa & Company

ఫొటో క్యాప్షన్, ఢిల్లీలో జేపీ సభను విఫలం చేయడానికి దూరదర్శన్ లో 'బాబీ' సినిమా వేయించారు ఇందిర మంత్రి

ఇందిర-జేపీల చర్చలు విఫలం

ఇందిరాగాంధీ జీవిత చరిత్ర “ఇందిరాగాంధీ ఎ పర్సనల్‌ అండ్‌ పొలిటికల్ బయోగ్రఫీ’’లో రచయిత ఇందర్‌ మల్హోత్రా రెండు విషయాలు చెప్పారు. ఇందిరా, జేపీల మధ్య చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. అమెరికా ఆదేశాలతో కొందరు ధనవంతులు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఇందిర విమర్శించగా, భారతదేశాన్ని ఇందిర రష్యావంటి నియంతృత్వ దేశంగా మారుస్తున్నారని జేపీ ఆరోపించారు.

“బిహార్‌ అసెంబ్లీ రద్దును అందరూ కోరుతున్నారు. దీనిని మీరు అంగీకరించాల్సిందేనని ఇందిరాగాంధీని జేపీ పట్టుబట్టారు. మీరు దేశం గురించి ఆలోచించండి అని ఇందిర అన్నారు. దీంతో జేపీకి కోపం వచ్చింది. నేను దేశం గురించి తప్ప వేరే ఏ విషయం గురించీ ఆలోచించడం లేదని జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆమెకు తేల్చి చెప్పారు’’ అని సంపూర్ణ విప్లవంలో పాల్గొన్న ప్రఖ్యాత జర్నలిస్టు రామ్‌ బహదూర్‌ వెల్లడించారు.

ఇందిరా గాంధీ తనను చర్చలకు పిలిచి అవమానించారని జేపీ భావించారు. అందుకే ఎన్నికల్లోనే ఆమెతో తేల్చుకుంటానని చెప్పడం ప్రారంభించారని ఆయన వెల్లడించారు.

ఇందిరకు ఉత్తరాల కట్ట ఇచ్చిన జేపీ

ఈ వాడి వేడి చర్చల తర్వాత తాను ఇందిరా గాంధీతో ఒక్క నిమిషం మాట్లాడాలని జేపీ కోరారు.

“జగ్జీవన్‌ రామ్‌ పక్క గదిలోకి వెళ్లారు. జేపీ ఒక పసుపు రంగు కాగితాల కట్టను పట్టుకున్నారు. ఇందిర తల్లి కమలా నెహ్రూ 1920, 30లలో జేపీ భార్య ప్రభావతికి రాసిన లేఖలు అందులో ఉన్నాయి. ప్రభావతి వాటిని చక్కగా దాచి ఉంచారు” అని జేపీ ఇందిరాగాంధీతో చెప్పినట్లు ఆమె జీవిత చరిత్ర రాసిన ఇందర్‌ మల్హోత్రా వెల్లడించారు.

ఆ లేఖలలో నెహ్రూ వంశం మహిళల పట్ల వ్యవహరించే అవమానకరమైన తీరును కమలా వివరంగా రాశారు. గత ఏడాది తన భార్య మరణించిన తర్వాత ఆమె కాగితాలలో ఈ లేఖలు దొరికాయని జేపీ ఇందిరతో అన్నారు. ఈ లేఖలను చూసిన ఇందిర ఉద్వేగానికి లోనయ్యారు.

కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. వారిద్దరి మధ్య అంతరం బాగా పెరిగి పోయింది.

జేపీతో మాజీ ప్రధాని చంద్రశేఖర్

ఫొటో సోర్స్, Rajakaml Prakashan

ఫొటో క్యాప్షన్, జేపీతో మాజీ ప్రధాని చంద్రశేఖర్

దూరం పెంచిన భువనేశ్వర్‌ సభలు

ఇందిరాగాంధీ, జేపీల మధ్య ఉన్న బంధం గురించి రామ్‌బహదూర్‌ వివరించారు.

“ఇందిరాగాంధీ, జేపీ మధ్య మేనకోడలు, మేనమామ అనుబంధం ఉండేది. కానీ ఇందిరాగాంధీ అవినీతి పాలన గురించి జేపీ మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత వారి మధ్య సంబంధాలు తెగిపోయాయి. పెద్ద పెద్ద పెట్టుబడిదారుల డబ్బుతో వృద్ధి చెందుతున్న వారికి అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదని 1974 ఏప్రిల్ 1న భువనేశ్వర్‌లో ఇందిరాగాంధీ వ్యాఖ్యానించారు. దీనికి జేపీ తీవ్రంగా కలత చెందారు" అని రామ్ బహదూర్ తెలిపారు.

"ఈ వ్యాఖ్యల తర్వాత ఆయన ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉండిపోవడం నేను చూశాను. వ్యవసాయం, ఇతర వనరుల ద్వారా తనకు వచ్చిన ఆదాయం వివరాలను పత్రికలకు, ఇందిరాగాంధీకి పంపారు” అని ఆయన వెల్లడించారు.

“పాలసీ వ్యవహారాలు వదిలేయండి. నా సలహా ఏంటంటే జేపీకి కాస్త విలువ ఇవ్వండి అని గాంధీ పీస్‌ ఫౌండేషన్‌కు చెందిన సుగత్‌ దాస్‌ గుప్తా నాతో అన్నారు’’ అని ఇందిరా కార్యదర్శిగా పని చేసిన పి.ఎన్‌.ధర్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన “ఇందిరాగాంధీ-ది ఎమర్జెన్సీ అండ్‌ ఇండియన్‌ డెమొక్రసీ’’ పుస్తకంలో పేర్కొన్నారు. సుగత్‌ దాస్‌ గుప్తా ఇందిరాగాంధీకి, జేపీకి మధ్యవర్తిగా వ్యవహరించేవారని ధర్‌ తెలిపారు.

ఇందిరా గాంధీ ప్రధాని అయిన తర్వాత గాంధీ, నెహ్రూలతో వ్యవహరించిన మాదిరిగానే తనతో కూడా వ్యవహరిస్తారని జేపీ భావించారు. ఇందిర కూడా జయప్రకాశ్‌ నారాయణ్‌ను ఉత్తమ మానవుడు అంటూ కీర్తించేవారు.

అయితే చాలా విషయాలలో ఆమె జేపీ విధానాలతో ఏవీభవించేవారు కాదు. ఆమె దృష్టిలో ఆయన అసాధ్యమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే సిద్ధాంతకర్త. ఇలాంటి అభిప్రాయాలున్న తర్వాత రాజకీయంగా వారి మధ్య అవగాహన ఉండటం సాధ్యం కాదు. అందుకే వారిద్దరికీ ఘర్షణ తప్పలేదు.

“ఒక్కోసారి చట్టాలను పని చేయనివ్వడానికి జేపీ అనుమతి ఇవ్వలేదు. బహుశా జేపీకి ఇందిరాగాంధీ మీద ఉన్న అపనమ్మకం దీనికి కారణం కావచ్చు. వీరిద్దరి మధ్య సైద్ధాంతిక విభేదాలు, పట్టుదలలు చివరకు దేశంలో అత్యవసర పరిస్థితి విధించేందుకు దారి తీశాయి. అంతకు ముందు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో జేపీ ప్రసంగించారు’’ అని పి.ఎన్‌.ధర్‌ తన పుస్తకంలో రాశారు.

“ఈ సభలను జనానికి దూరంగా ఉంచేందుకు అప్పటి సమాచార, ప్రసారశాఖ మంత్రి విద్యాచరణ్ శుక్లా దూరదర్శన్‌లో ఆదివారం సినిమా సమయాన్ని సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటలకు మార్పించారు. అప్పటికే నిర్ణయించిన ‘వక్త్‌’ సినిమా స్థానంలో 1973 నాటి బ్లాక్‌బస్టర్‌ మూవీ 'బాబీ'ని ప్రసారం చేయాలని నిర్ణయించారు'’ అని ప్రఖ్యాత జర్నలిస్ట్‌ కూమి కపూర్ తన 'ది ఎమర్జెన్సీ- ఎ పర్సనల్ హిస్టరీ' అనే పుస్తకంలో రాశారు. " కానీ బాబీకన్నా జేపీ, బాబు జగ్జీవన్ రామ్ లకే జనం ఆకర్షితులయ్యారు'' అని ఆ పుస్తకంలో రాశారు.

జయప్రకాశ్ నారాయణ్

ఫొటో సోర్స్, Subramanian Swamy

ఎమర్జెన్సీ విధింపు - జయప్రకాశ్‌ నారాయణ్‌ అరెస్ట్

1975 జూన్ 25 అర్ధరాత్రి గాంధీ పీస్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి రాధాకృష్ణ కుమారుడు చంద్రహర్‌ ఆరు బైట నిద్రిస్తున్నారు. హఠాత్తుగా ఆయన లోపలకు పరుగెత్తుకుంటూ వచ్చి తన తండ్రిని లేపి ‘’ పోలీసులు వారంట్ తీసుకుని వచ్చారు’’ అని చెవిలో చెప్పారు.

రాధాకృష్ణ బయటకు వచ్చారు. జేపీ అరెస్టు వారంట్‌ను వారు ఆయనకు చూపించారు. మీరు కాసేపు వెయిట్ చేయండి. ఆయన నిన్న చాలా అలసిపోయారు, నిద్రిస్తున్నారు అని చెప్పారు రాధాకృష్ణ. ఆ ఉదయం జేపీ విమానంలో వెళ్లాల్సి ఉండగా, ఆయన ఎటూ మూడు నాలుగు గంటలకు మేల్కోవాలి. దీంతో పోలీసులు వేచి ఉండటానికి అంగీకరించారు.

అయితే ఈలోగా ఈ విషయాన్ని ఎవరికి చేరవేయాలో వారికి చేరవేయమని టెలీఫోన్‌ ఆపరేటర్‌కు రాధాకృష్ణ పురమాయించారు. మొరార్జీ దేశాయ్‌కు, చంద్రశేఖర్‌కు విషయం తెలిసింది.

మూడు గంటలకు పోలీసులు మళ్లీ రాధాకృష్ణ ఇంటి తలుపులు తట్టారు. జేపీని మేల్కొలుపుతారా? ఆయన్ను ఎందుకు స్టేషన్‌కు తీసుకురాలేదని మాకు మెసేజ్‌లు వస్తున్నాయి అని పోలీసులు రాధాకృష్ణతో అన్నారు.

టాక్సీలో వచ్చిన చంద్రశేఖర్‌

రాధాకృష్ణ జేపీ గదిలోకి వెళ్లారు. అక్కడాయన గాఢ నిద్రలో ఉన్నారు. కాసేపటికి మేల్కొన్నారు. రాధాకృష్ణ పరిస్థితి వివరించారు. ఇంతలో ఓ పోలీస్‌ అధికారి కూడా అక్కడికి చేరుకున్నారు. "క్షమించండి. మిమ్మల్ని నాతో తీసుకు రావాలని మాకు ఆదేశాలు వచ్చాయి” అన్నారు ఆ పోలీసు అధికారి. “ సిద్ధం కావడానికి నాకు అరగంట సమయం ఇవ్వండి" అని జేపీ అడిగారు. అయితే ఈ వ్యవహారంలో ఆందోళన చెందుతున్న రాధాకృష్ణ ఆయన బయలుదేరే సమయానికి అక్కడికి చాలామంది నాయకులు చేరుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. “మీరు వెళ్లి ముందు టీ తాగండి’’ అని ఆయన పోలీసు అధికారికి సూచించారు.

అలా 10 నిమిషాలు గడిచాయి. ఇంకెందుకు ఆలస్యం వెళదాం పదండి అని జేపీ ముందుకు కదిలారు. జేపీ పోలీసు కారులో కూర్చుని అలా బయలుదేరారో లేదో దాని వెనకాలే ఓ ట్యాక్సి వేగంగా వచ్చి ఆగింది. అందులోంచి చంద్రశేఖర్‌ దిగారు. కానీ అప్పటికే జేపీని తీసుకెళ్లిపోయారు.

వినాశకాలే విపరీత బుద్ధి

రాధాకృష్ణ, చంద్రశేఖర్ కారులో.. జేపీ వెళుతున్న పోలీసు కారును అనుసరించారు. జేపీని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన్ను తీసుకువచ్చిన ఓ పోలీస్‌ అధికారి పక్క రూమ్‌లోకి వెళ్లారు. తర్వాత చంద్రశేఖర్‌ను పక్కకు తీసుకెళ్లి “ మిమ్మల్ని అరెస్టు చేయడానికి ఓ బృందాన్ని ఇప్పుడే మీ ఇంటికి పంపించాం’’ అని చెప్పారు. చంద్రశేఖర్ నవ్వుతూ "నేను ఇక్కడికే వచ్చాను కదా...అరెస్టు చేయండి’’ అని అన్నారు. పోలీసులు అదే పని చేశారు.

“మీరు ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు” అని రాధాకృష్ణ జేపీని అడిగారు. “వినాశకాలే విపరీత బుద్ధి” అన్నారు జేపీ. 1976లో ఆయన పెరోల్‌పై విడుదలయ్యారు.

ఇందిరాగాంధీ పుస్తకం

ఫొటో సోర్స్, OXFORD India

తిరిగొచ్చిన ఇందిర డబ్బు

జేపీ ఆరోగ్యానికి సంబంధించిన ఓ ఘటన కూడా ఇందిరకు, ఆయనకు మధ్య సంబంధాలను మరింత చెడగొట్టింది. జేపీ డయాలిసిస్‌ కోసం మెషిన్‌ కొనుగోలు చేయడానికి సహకరించాలని గాంధీ పీస్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ రాధాకృష్ణ విదేశాలలో ఉంటున్న భారతీయులకు విజ్జప్తి చేశారు.

“రాధాకృష్ణ సలహాకు నేను మద్దతు పలకడంతో ఇందిరాగాంధీ డయాలసిస్‌ మెషిన్‌ కొనుగోలుకు అవసరమైన రూ. 90,000లను జేపీకి పంపారు. ఆయన వాటిని స్వీకరించి రసీదు కూడా ఇచ్చారు. అయితే ఇందిర గాంధీ చొరవ ఆయన వర్గంలోని చాలామందికి నచ్చలేదు. చివరకు ఆయన తనకు అందిన డబ్బును తిరిగి ఇందిరకు పంపారు’’ అని పి.ఎన్‌.ధర్‌ తన పుస్తకంలో వెల్లడించారు.

జేపీ చర్యలను వ్యతిరేకించడానికి ఇందిరకు ఈ వ్యవహారం సాకుగా మారింది. తన శిబిరంలోని మతతత్వవాదులను కాదని ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరని ఇందిర ఆరోపించారు. 1977 జనవరిలో ఇందిరాగాంధీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇందిరాగాంధీ తన సొంత సీటులో కూడా ఓడిపోయారు.

ఎమర్జెన్సీ తర్వాత - విద్వేష రాజకీయాలకు వ్యతిరేకినన్న జేపీ

1977లో జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత పార్టీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలలో ఉన్నారు ఆ పార్టీ నేతలు. ఈ సమయంలో సంజయ్‌ గాంధీ బలవంతంగా సాగించిన కుటుంబ నియంత్రణను వ్యతిరేకించిన వారు ఆయనపై దాడి చేస్తారేమోనని ఇందిర భయపడ్డారు. ఆయనకు బలవంతంగా కుటుంబ నియంత్రణ చేస్తారని ఆమె ఆందోళన చెందారు.

ఆమె స్నేహితుడు పుపుల్ జయకర్ విదేశాంగ శాఖ కార్యదర్శి జగత్ మెహతాకు ఫోన్ చేసి ఇందిర ఈ విషయంలో చాలా ఆందోళనగా ఉన్నారని చెప్పారు.

జగత్‌ మెహాతా స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రణాళిక సంఘంలో కొన్నాళ్లు పని చేశారు. తర్వాత దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయన వెంటనే జేపీ దగ్గరకు వెళ్లారు. “ ఈ మాట విన్న జేపీ కలత చెందారు. ఇందిరాగాంధీని స్వయంగా కలవడానికి ఆమె నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వెళ్లి ఆమెతో టీ తాగారు’’ అని “సివిల్‌ డిస్‌ఒబీడియెన్స్‌-టు ఫ్రీడమ్‌ స్ట్రగుల్స్‌ ఇన్‌ వన్‌ లైఫ్’’ అన్న బయోగ్రఫీ పుస్తకంలో లక్ష్మీచంద్‌ జైన్ వెల్లడించారు.

ఇందిర జీవితం అయిపోలేదు

ఈ సమావేశం తర్వాత జేపీ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. “ ఇందిర జీవితం ముగియలేదు’’ అన్నారు. పరోక్షంగా ఆమెను టార్గెట్ చేసుకోవద్దు అని తన పార్టీ వర్గాలకు సందేశం ఇచ్చారు. వాళ్లు దానిని వినకపోవడం వేరే విషయం.

“ఇప్పుడు మీరు ప్రధాని కాదు. జీవితం ఎలా నడుస్తుంది, ఖర్చులు ఎలా’’ అని జేపీ ఇందిరను ప్రశ్నించారు. నెహ్రూ పుస్తకాల రాయల్టీ మీద వచ్చిన ఆదాయంతో జీవితానికి ఇబ్బందిలేదని ఇందిర బదులిచ్చారు. తాను ద్వేషం, పగతో వ్యవహరించబోనని ఆమెకు మాటిచ్చారు జేపీ. ఇదే విషయాన్ని మొరార్జీదేశాయ్‌, చరణ్‌సింగ్‌లకు కూడా చెప్పారాయన.

పాట్నాలో చివరి దర్శనం

జనతా పార్టీపై జేపీకి ఉన్న భ్రమలు కూడా కొద్ది రోజుల్లోనే కరిగిపోయాయి. అనారోగ్యంతో చివరి రోజుల్లో ఆయన పాట్నాలో గడిపారు. జనతా పార్టీ నాయకులు ఆయన్ను పట్టించుకోలేదు. జేపీని పరామర్శించి రావాల్సిందిగా మొరార్జీ దేశాయ్‌కు సూచించగా “నేను గాంధీనే చూడటానికి వెళ్లలేదు. జేపీ ఏంటి’’అని అన్నారని కులదీప్‌నయ్యర్‌ వెల్లడించారు.

అందుకు విరుద్ధంగా వ్యవహరించారు ఇందిరా గాంధీ. పాట్నాకు వెళ్లిన ఆమె జేపీని కలిశారు. అప్పుడాయన ఇందిరను ‘నీ శత్రువులకన్నా నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుంది’ అని ఆశీర్వదించారు.

జీవితపు చివరి రోజుల్లో ఆయన ఇందిరాగాంధీకి మళ్లీ దగ్గరయ్యారని జేపీ గురించి బాగా తెలిసిన రజీ అహ్మద్‌ తెలిపారు. ఇందిర కూడా జేపీతో విభేదాలు రాజకీయాలలో మాత్రమేనని భావించేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)