కరోనావైరస్: హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్లా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జారియా గోర్వెట్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
''స్పానిష్ ఇన్‌ఫ్లుయెంజా - ఏమిటిది? దీనికి చికిత్స ఎలా చేయాలి?'' - విక్స్ వేపోరబ్ 1918లో ప్రచురించిన ఒక వాణిజ్య ప్రకటనకు శీర్షిక ఇది. దానికింద ఇచ్చిన వివరణలో.. ''శాంతంగా ఉండండి'' అని ''విరేచన మందు తీసుకోండి'' అని రాసింది. ఇక తమ ఆయింట్‌మెంట్‌ను ధారాళంగా వాడాలని కూడా చెప్పిందనుకోండి.
మనం రాసుకున్న చరిత్రలో అత్యంత ప్రాణాంతక మహమ్మారి 1918 స్పానిష్ ఫ్లూ. ఆ సమయంలో 50 కోట్ల మంది.. అంటే నాటి ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది మీద అది ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని బలితీసుకుంది.
అటువంటి సంక్షోభాలతో పాటు కొందరికి అవకాశాలూ వస్తాయి. ఆ కాలంలో విక్స్ వేపోరబ్‌కి అనేక అశాస్త్రీయ విరుగుడు ఔషధాలు గట్టిపోటీనిచ్చాయి. మిల్లర్స్ యాంటీసెప్టిక్ స్నేక్ ఆయిల్, డాక్టర్ బెల్స్ పైన్ తార్ హనీ, షెన్స్క్ మాండ్రేక్ పిల్స్, డాక్టర్ జోనెసెస్ లినిమెంట్, హిల్స్ కాస్కారా క్వినైన్ బ్రోమైడ్, వుల్ఫాంగ్ అండ్‌కోస్ ప్రఖ్యాత మింట్ లోజెంజెస్.. అటువంటి వాటిలో కొన్ని. వార్తా పత్రికల్లో ఆందోళన కలిగించే శీర్షికల పక్కనే.. ఈ ఉత్పత్తుల ప్రకటనలు కనిపించేవి.
వందేళ్ల తర్వాత 2020లోనూ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. స్పానిష్ ఫ్లూ అనంతరం వందేళ్లలో శాస్త్రపరిశోధన ఎంతో పురోగతి సాధించినా.. కోవిడ్-19 విషయంలో లెక్కలేనన్ని నాటు మందులు, లేహ్యాలు, తైలాలు, కషాయాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. అయితే ఈసారి.. రోగనిరోధక శక్తిని ''బలోపేతం'' చేసే ఔషధాలుగా ఇవి ముందుకొచ్చాయి.
హస్తప్రయోగం ఎక్కువగా చేయటం ద్వారా రక్తంలో తెల్ల రక్త కణాలను పెంపొందించుకోవచ్చుననేది వీటిల్లో చాలా విచిత్రమైన ఆలోచన. ఇక ఎప్పటిలాగానే పోషకాహార చిట్కాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి.
1919లో ఉల్లి ఎక్కువగా తినాలని చెప్తే.. ఇప్పుడు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక ప్రచారమైతే ఏకంగా.. కోవిడ్ నుంచి ఫేస్ మాస్కుల కన్నా.. కేయెన్ పెప్పర్, గ్రీన్ టీలతో ఎక్కువ రక్షణ లభిస్తుందని చెప్తోంది. ఇక సూడో శాస్త్రవేత్తలైతే ప్రొబయోటిక్స్ వంటి ట్రెండీ ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోగనిరోధక శక్తిని ‘బూస్ట్’ చేయటమనేది జరగదు
అయితే.. మాత్రలు, ఆకర్షణీయమైన సూపర్‌ఫుడ్స్, ఆరోగ్య అలవాట్లు అనేవి.. ఆరోగ్యవంతమైన రోగనిరోధక శక్తిని పొందటానికి షార్ట్ కట్ అనేది అపోహ మాత్రమే. నిజానికి.. రోగనిరోధక శక్తి ''బూస్టింగ్'' అనే భావనకు శాస్త్రీయమైన అర్థమేదీ లేదు.
''రోగనిరోధక శక్తిలో మూడు విభిన్న అంశాలుంటాయి'' అంటారు అకికో ఇవసాకి. యేల్ యూనివర్సిటీలో ఇమ్యునాలజిస్ట్‌గా పనిచేస్తున్నారామె. ''మొదటిగా.. చర్మం, శ్వాస నాళాలు, శ్లేష్మపొర అనేవి ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించే అడ్డుగోడలుగా పనిచేస్తాయి. వైరస్ వీటిని దాటి శరీరంలోకి వెళ్లినపుడు సహజ (ఇన్నేట్) రోగనిరోధక స్పందిస్తుంది.
ఇందులో రసాయనాలు, శరీరకణాలు అత్యంత వేగంగా అప్రమత్తం చేస్తూ.. చొరబాటుదారులను తరిమివేయటానికి పోరాటం మొదలుపెడతాయి. ''అది సరిపోకపోతే.. అప్పుడు సహాయక (అడాప్టివ్) రోగనిరోధక వ్యవస్థ రంగంలోకి దిగుతుంది'' అని ఇవసాకి తెలిపారు.
ఇది.. సంబంధిత చొరబాటుదారు మీద యుద్ధం చేయటానికి ప్రత్యేకమైన యాంటీబాడీస్‌ను తయారు చేసి పంపుతుంది. ఈ యాంటీబాడీస్ తయారవటానికి కొన్ని రోజులు కానీ, వారాలు కానీ పట్టొచ్చు. ముఖ్యమైన విషయమేమిటంటే.. సహాయ రోగనిరోధక వ్యవస్థ తయారు చేసే ఈ యాంటీబాడీస్ నిర్దిష్ట వైరస్ లేదా బ్యాక్టీరియా మీద మాత్రమే పోరాడగలవు. ''ఉదాహరణకు.. కోవిడ్-19 మీద పోరాటానికి తయారైన ఓ నిర్దిష్ట టీ-సెల్.. ఇన్‌ఫ్లుయెంజా కానీ, బాక్టీరియాకు కానీ స్పందించదు'' అని ఆమె వివరించారు.
చాలా వరకూ ఇన్‌ఫెక్షన్లు ఈ సహాయక రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి. అయితే.. దీనిని రంగంలోకి దించటానికి మరొక మార్గం కూడా ఉంది. అదే టీకాలు వేయటం. అంటే.. ఒక నిర్దిష్ట వైరస్ లేదా బ్యాక్టీరియా సజీవ లేదా నిర్జీవ కణాలను పరిమిత మోతాదులో శరీరంలోకి పంపించటం. దానివల్ల ప్రేరేపితమైన ఈ సహాయ నిరోధక శక్తి.. సదరు సూక్ష్మజీవి మరోసారి శరీరంలోకి వచ్చినపుడు దానిని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉంటుంది.
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటం అంటే.. ఈ ప్రతిస్పందనలను మరింత క్రియాశీలంగా, మరింత బలంగా తయారుచేయటంగా భావిస్తారు.
కానీ వాస్తవంలో ఇలా చేయటం మంచిది కాదు. జలుబు లక్షణాలను పరిశీలించండి - ఒళ్లు నొప్పులు, జ్వరం, తల నొప్పి, ఎక్కువ మోతాదుల్లో చీమిడి, శ్లేష్మం ఉంటాయి. ఈ సమస్యల్లో అత్యధిక భాగం వైరస్ పుట్టించినవి కాదు. నిజానికి అవి మన శరీరం ఒక అవసరార్థం ప్రేరేపించి తయారుచేసేవి: అవి సహజ రోగనిరోధక స్పందనలో భాగం.
జలుబు విషయంలో.. వైరస్‌ను బయటికి కడిగివేయటానికి చీమిడి సహాయపడుతుంది. వైరస్ మన శరీరంలో రెట్టింపు కాకుండా ఉండటానికి వీలుకానంత వేడిగా తయారవటానికి జ్వరం తోడ్పడుతుంది. ఇక ఈ రోగనిరోధక శక్తి.. మన శరీరంలోని రోగనిరోధక కణాలకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో చెప్తూ పంపించే రసాయనాలు నాళాల్లో ప్రవహిస్తుండటం వల్ల ఒళ్లు నొప్పులు వస్తాయి. ఈ లక్షణాలు.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని శరీరం కోలుకోవటానికి వీలు కల్పించాలంటూ మన మెదడుకు కూడా సంకేతాలు పంపిస్తాయి.
ఈ సహజ రోగనిరోధక శక్తి నిరంతరం పూర్తిస్థాయిలో పనిచేసేలా బూస్ట్ చేయాలని మీరు కోరుకోరు. 'రోగనిరోధక శక్తిని బలోపేతం' చేసే గ్రీన్ టీ లేదా ఇతర కషాయాలు నిజంగా ఆ పనిచేస్తే.. అవి ఆరోగ్యవంతమైన ప్రకాశాన్ని ఇవ్వటం కాదు.. ముక్కు నుంచి నిరంతరం చీమిడి కారుతుండాలి.
ఇక సహాయక రోగనిరోధక వ్యవస్థను కూడా మరింత క్రియాశీలంగా ఉంచటం కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఉదాహరణకు.. మన శరీరంలో అతిగా స్పందించే రోగనిరోధక శక్తి కణాలు.. పుప్పొడి రేణువుల వంటి ఫారిన్ బాడీస్ కూడా ప్రమాదకరమని భావించి వాటి మీద పోరాడటం నేర్చుకున్నపుడు అలర్జీలు వస్తాయి. ఇటువంటి బాహ్య పదార్థాలు తారసపడిన ప్రతిసారీ సహజ రోగనిరోధక శక్తిని కూడా ఆ కణాలు ప్రేరేపిస్తాయి. దీంతో పెద్ద ఎత్తున తుమ్ములు, కళ్లు దురదలు, అలసట వరుసపెడతాయి. రోగనిరోధక శక్తికి బూస్ట్ ఇచ్చే చిట్కాలు చెప్తున్న వారు బహుశా ఈ అంశం గురించి ఆలోచించలేదేమో.
పోనీ.. సదరు ఉత్పత్తుల గురించి చెప్తున్న వారి ఉద్దేశం.. రోగనిరోధక శక్తిని బూస్ట్ చేయటం కాకుండా.. దాని ప్రతిస్పందనను ఉపయుక్తకరంగా మెరుగుపరచటం అనుకుందాం.
''ఈ వాదనల్లో చాలా వాటిని బలపరిచే ఆధారమేదీ లేదు. అదే సమస్య'' అంటారు ఇవాసాకి. మరైతే.. వారి వాదనలకు ఆధారం ఏమిటి? వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉందా?

ఫొటో సోర్స్, Reuters
ఆరోగ్యంగా ఉంటే సప్లిమెంట్లు మర్చిపొండి.. విటమిన్ డి తప్ప..
చాలావరకూ మల్టీవిటమిన్లు ''రోగనిరోధక మద్దతు'' ఇస్తాయనో, రోగనిరోధక వ్యవస్థ పనితీరు ఆరోగ్యవంతంగా ఉండేలా చూస్తాయనే చెప్తుంటారు.
అయితే.. ముందుగానే ఆరోగ్యంగా ఉన్నవారిలో విటమిన్ సప్లిమెంట్లు సాధారణంగా పనిచేయవని.. ఒక్కోసారి హానికరం కూడా కావచ్చునని బీబీసీ ఫ్యూచర్ 2016లోనే ఒక కథనంలో వివరించింది.
ఉదాహరణకు 'విటమిన్ సి'ని చూద్దాం. రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన పరిశోధకుడు లైనస్ పాలింగ్.. సాధారణ జలుబు మీద పోరాటంలో దీని సామర్థ్యం గురించి అబ్బురంగా చెప్పినప్పటి నుంచీ దీనిచుట్టూ అనేక పురాణగాథలు అల్లుకున్నాయి. ఏళ్ల తరబడి ఈ విటమిన్ మీద అధ్యయనం చేసిన ఆయన.. రోజుకు 18,000 మిల్లీగ్రాములు తీసుకోవటం మొదలుపెట్టారు - ఇది ప్రస్తుతం సిఫారు చేసిన రోజు వారీ మొత్తం కన్నా 300 రెట్లు అధికం.
అయితే.. జలుబు, ఇతర శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లపై పోరాడి తరిమివేస్తుందనే విటమిన్ సి మహత్తర శక్తిని సమర్థించే ఆధారాలేవీ లేవు.
నిష్పక్షపాత పరిశోధనలకు పేరుగాంచిన కొహ్రేన్ అనే సంస్థ 2013లో చేసిన ఒక సమీక్షలో.. వయోజనుల్లో సాధారణ జలుబు లక్షణాలు మొదలైన తర్వాత వారికి చికిత్సలో భాగంగా అధిక మోతాదుల్లో విటమిన్ సి ఇవ్వటం వల్ల.. సదరు జలుబు కొనసాగే వ్యవధి మీద కానీ, అది కలిగించే లక్షణాల తీవ్రత మీద కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు'' అని గుర్తించింది.
నిజానికి.. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక జనం తమ ఆహారం ద్వారా తగినంత మోదాదులో విటమిన్ సి పొందుతున్నారని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు.. విటమిన్ సిని అధిక మొతాదుల్లో తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
''మీకు విటమిన్ల లోపం లేనట్లయితే.. విటమిన్ సప్లిమెంట్ల వల్ల మీ రోగనిరోధక శక్తికి ఎటువంటి ప్రయోజనం ఉండదు'' అంటారు ఇవాసాకి.
ఇక విటమిన్ డి స్థాయి తక్కువగా ఉంటే.. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.
అసాధారణమైన విషయం ఏమిటంటే.. ఈ విటమిన్ డి లోపం చాలా దేశాల్లో - సంపన్న దేశాల్లో కూడా తీవ్రంగా ఉంది. 2012 అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మందికి ఈ విటమిన్ తగినంతగా లభించటం లేదు. ఇప్పుడు అత్యధిక జనాభా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి కావటంతో.. శరీరం మీద పడే సూర్యకాంతి మరింతగా తగ్గిపోయి.. విటమిన్ డి లోపం ఇంకా పెరుగుతుందనేది సులభంగా అర్థమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
హస్తప్రయోగం వల్ల కూడా రోగనిరోధక శక్తికి ఉపయోగం లేదు
ఈ తరహా లైంగిక కార్యకలాపం మీద పశ్చిమ వైద్య విధానంలో చారిత్రకంగా చాలా అనుమానం ఉండింది. హస్తప్రయోగం వల్ల ఒక ఔన్సు వీర్యం కోల్పోతే.. అది శరీరం మీద 40 ఔన్సుల (1.18 లీటర్ల) రక్తం కోల్పోయినంత ప్రభావం చూపుతుందని 18వ శతాబ్దంలో ఒక వైద్యుడు చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచీ అనేక రకాల రుగ్మతలకు - అంధత్వం మొదలుకుని న్యూరోసిస్ వరకూ - హస్తప్రయోగమే కారణమని నిందించటం మొదలైంది.
ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. ఇటీవలి పరిశోధనలు.. హస్తప్రయోగం వల్ల కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నాయి. ఉదాహరణకు.. పురుషుల్లో వీర్యం ఆరోగ్యవంతంగా ఉండటానికి ఇది సహాయపడుతుందని, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశమూ ఉందని భావిస్తున్నారు.
కానీ.. హస్తప్రయోగం వల్ల రోగనిరోధక శక్తి మరింత మెరుగుపడుతుందని, అది కోవిడ్-19 నుంచి రక్షిస్తుందనే వాదనలు మితిమీరిన అతివాదనలు. పురుషుల్లో లైంగిక ఉద్రేకం కలిగినపుడు, భావప్రాప్తి సమయంలో వారిలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఒక అధ్యయనంలో గుర్తించారన్నది నిజమే. కానీ దీనివల్ల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందనటానికి ఎటువంటి ఆధారాలూ లేవు.
హస్తప్రయోగం వల్ల ఏదైనా రక్షణ ఉందంటే అది.. ఇతరుల నుంచి దూరంగా ఉంచటమే. న్యూయార్క్ నగర ఆరోగ్య విభాగం ఇటీవల ట్విటర్‌లో ఒక సలహా ఇచ్చింది. ఈ కోవిడ్-19 శకంలో ''మీకు మీరే అత్యంత సురక్షితమైన సెక్స్ పార్టనర్'' అని.

ఫొటో సోర్స్, Getty Images
యాంటీఆక్సిడెంట్ మాత్రలు తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు
యాంటిఆక్సిడెంట్లు ఏమైనా సాయపడతాయా అనే ప్రశ్న కొంత ఎక్కువ సంక్లిష్టమైనది.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థ స్పందనలో భాగంగా తెల్ల రక్త కణాలు విషపూరిత ఆక్సిజన్ మిశ్రమాలను విడుదల చేస్తాయి. ఇవి రెండంచుల కత్తి వంటివి. ఒకవైపు.. బ్యాక్టీరియా, వైరస్‌లను అవి సంహరించి మరింతగా పెరిగిపోకుండా నిరోధించగలవు. మరోవైపు ఆరోగ్యవంతమైన శరీర కణాలను కూడా దెబ్బతీయగలవు. అది క్యాన్సర్, వృద్ధాప్యం వంటి వాటికి దారితీయటంతో పాటు.. రోగనిరోధక వ్యవస్థను కూడా బలహీన పరచగలదు.
ఇలా జరగకుండా నిరోధించటానికి శరీరం యాంటీఆక్సిడెంట్ల మీద ఆధారపడుతుంది. అదుపుతప్పిన ఆక్సిజన్ మిశ్రమాలను నియంత్రించి, మన శరీరానికి రక్షణ కల్పించటానికి ఇవి సాయపడతాయి.
ఈ రసాయనమిశ్రమాల నిల్వలు కొంతమేరకు మనం మన ఆహారం నుంచి పొందుతాం. ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల్లో ఇవి ఎక్కువగా ఉండే అవకాశముంది. ఎందుకంటే యాంటీఆక్సిడెంట్లు తరచుగా పిగ్మెంట్లుగా ఉంటాయి: కేరట్లు, బ్లూబెర్రీలు, పసుపు, స్ట్రాబెర్రీలు వంటి వాటికి ఆ రంగులు ఈ యాంటీఆక్సిడెంట్ల ద్వారానే లభిస్తాయి.
కోవిడ్-19 ఉన్న వారికి యాంటీఆక్సిడెంట్లను సప్లిమెంట్లుగా ఇస్తే.. అవి వారు కోలుకోవటానికి సాయపడతాయా అనేది పరీక్షించటానికి ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి.
అయితే.. కోవిడ్-19 చికిత్స కోసం జరుగుతున్న వందలాది ప్రయోగాల్లో ఇది ఒకటి మాత్రమే. కానీ దశాబ్దాల పాటు పరిశోధనలు సాగినా.. యాంటిఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని ''బూస్ట్'' చేస్తాయని కానీ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా నిరోధించటమో, వస్తే తగ్గించటమో చేస్తాయని కానీ.. మనుషుల మీద ఒక పద్ధతి ప్రకారం జరిగిన అధ్యయనాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేదు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

ప్రోబయోటిక్స్ సాయపడొచ్చు.. పడకపోవచ్చు...
కొంబుచ్చా అనే ప్రోబయోటిక్ ఉత్పత్తిలో సజీవ సూక్ష్మజీవులు ఉంటాయి. టీని పులియబెట్టటం ద్వారా కొంబుచ్చా పానీయాన్ని తయారు చేస్తారు. ఇది క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వాటిని నయం చేస్తుందనే వాదనలతో ఇంటర్నెట్ నిండిపోతోంది. ఇప్పుడు కోవిడ్-19 రాకుండా నిరోధిస్తుందనీ చెప్పుకొస్తున్నారు. కానీ.. ఇది ఎటువంటి వ్యాధినైనా తగ్గిస్తుందని కానీ, నిరోధిస్తుందని కానీ చెప్పటానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేదు.
అయితే.. మనుషుల శ్వాసకోస నాళాల్లో పైభాగంలో సోకే ఇన్‌ఫెక్షన్ల సంఖ్యను ప్రోబయోటిక్స్ - ఆహారాలు, పానీయాలు, మాత్రల్లో ఉండే లాభదాయక సూక్ష్మజీవులు - గణనీయంగా తగ్గించాయని, వాటి తీవ్రతను తగ్గించాయని 2015 నాటి సమీక్ష ఒకటి గుర్తించింది. అలాగే.. యాంటీబయోటిక్స్ అవసారాన్ని స్వల్పంగా తగ్గించటంతో పాటు, చిన్నారులు స్కూళ్లకు గైర్హాజరయ్యే రోజులను కూడా కొంత తగ్గించాయి. అయితే.. దీనిని కచ్చితంగా నిర్ధారించటానికి అవసరమైన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ సమీక్ష రచయితలు పేర్కొన్నారు.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోవిడ్-19 నుంచి ఏదైనా ప్రోబయోటిక్ రక్షణ కల్పిస్తుందనటానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారమూ లేదు.
మరి ఏవైనా పనిచేస్తాయని నిరూపణ అయిందా?
ఈ అపోహల్లో చాలా వరకూ నిరపాయకరమైనవని ఇవసాకి అంటారు. కానీ.. వీటిని నమ్మటం వల్ల మనం సురక్షితంగా ఉన్నామనే తప్పుడు భావనకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
''ప్రజలు తమకు రక్షణ ఉందని భావించి.. బయట తిరుగుతూ పార్టీలు చేసుకోరాదనేది నా హెచ్చరిక'' అని ఆమె పేర్కొన్నారు.
ఈ ఆరోగ్య ఉత్పత్తుల సంగతి పక్కనపెడితే.. మీ రోగనిరోధక శక్తికి మద్దతునివ్వటానికి మీరు కొన్ని విధానాలను పాటించవచ్చు. ఇవి అంత ఆకర్షణీయంగా ఉండవు. వీటిని ఎవరూ బాటిళ్లు, ప్యాకెట్లలో అమ్మరు. కానీ ఇవి పనిచేస్తాయని, ఫలితాలిస్తాయని నిరూపణ అయింది. వీటి కోసం మీరు కష్టపడి సంపాదించిన డబ్బులూ వెచ్చించాల్సిన అవసరం లేదు. అవేమిటంటే.. తగినంత నిద్రపోవటం, వ్యాయామం చేయటం, సంతులన ఆహారం తీసుకోవటం, ఒత్తిడికి లోనవకుండా చూసుకోవటం.
ఇవేవీ చేయలేకపోతే.. నిర్దిష్ట సూక్ష్మజీవుల విషయంలో మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవటానికి ఒక కచ్చితమైన మార్గం ఉంది: టీకా వేయించుకోవటం.
ఇవి కూడా చదవండి:
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








