కరోనావైరస్: ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
- రచయిత, భార్గవ్ పరీఖ్
- హోదా, బీబీసీ కోసం
తాను అనుభవిస్తున్న బాధను వ్యక్తం చేయడానికి తేజల్ శుక్లాకు గొంతు పెగలడం లేదు. ఆమె 48 గంటల వ్యవధిలోనే తన తల్లినీ, తండ్రినీ కోల్పోయారు.
తేజల్‌ది గుజరాత్‌లోని గాంధీనగర్. ఆమె వయసు 28 ఏళ్లు.
కోవిడ్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో తేజల్ తల్లిదండ్రులద్దరినీ ఇటీవల గాంధీనగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ప్రాణాలతో లేరు.
తన తల్లిదండ్రుల మరణాలపై విచారణ జరపాలని కోరుతూ తేజల్ ఆగస్టు 20న జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.
తల్లిదండ్రులను కోల్పోయిన తేజల్‌ను మరో విషయం వేధిస్తోంది. తన తల్లిదండ్రుల ఆసుపత్రిలో చేరిన సమయంలో ధరించిన ఆభరణాలను ఆసుపత్రి తమకు తిరిగి ఇవ్వలేదని ఆమె చెబుతున్నారు.
అవి తన తల్లిదండ్రుల ఆఖరి గుర్తులని, ఎమోషనల్‌గా తమకు ఎంతో ముఖ్యమైనవని ఆమె అంటున్నారు. ఆ ఆభరణాల కోసం తేజల్ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
‘నిర్ధారించుకోకుండానే’
‘‘నాలుగేళ్ల క్రితం మా అమ్మకు గుండె సమస్య ఉన్నట్లు గుర్తించాం. అప్పటి నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు. జూన్ 15న ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఛాతిలో నొప్పిగా ఉందని ఆమె అన్నారు. ప్రైవేటు డాక్టర్లు ఎవరూ ఆమెకు వైద్యం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమెను గాంధీనగర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాం’’ అని బీబీసీతో చెప్పారు తేజల్.
తేజల్ తల్లి పేరు తారా రావల్. ఆమె అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసేవారు. తండ్రి పేరు గణ్‌పత్ రావల్. ఆయన డ్రైవర్.
తేజల్‌కు ఓ తోబుట్టువు కూడా ఉన్నారు. ఆమె పేరు పూనమ్. పూనమ్ భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రులతోపాటే ఉంటూ వచ్చారు. పూనమ్‌కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. వీరి పోషణ బాధ్యతలను తారా, గణ్‌పత్‌లే చూసేవారు.
‘‘మా అమ్మకు కోవిడ్ ఉందో, లేదో నిర్ధారించుకోకుండానే ఆమెను ఆసుపత్రి సిబ్బంది కోవిడ్ వార్డులో పెట్టారు. మేం షాక్ తిన్నాం. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అమ్మ ఆసుపత్రిలో చేరికవ్వగానే, నాన్నకు ఆందోళన పెరిగింది. ఆసుపత్రి నుంచి అమ్మ వీడియో కాల్ చేసి, ఏడ్చింది. ఆమెను ఆ స్థితిలో నాన్న చూడలేకపోయారు’’ అని తేజల్ అన్నారు.
మరుసటి రోజు తమ ఇంటికి ఓ వైద్య బృందం వచ్చిందని... ఇంటిని శానిటైజ్ చేసి, తమ కుటుంబంలోని అందరికీ చెకప్ చేసిందని ఆమె వివరించారు.
‘‘మా నాన్న కాస్త నీరసంగా, ఇబ్బందిగా ఉందని వాళ్లతో చెప్పారు. ఆయన్ను కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లి, జూన్ 19న కోవిడ్ వార్డులో పెట్టారు. వాళ్లను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదు. ఆసుపత్రి నుంచి అమ్మ, నాన్న మాకు వీడియో కాల్ చేసి... ఇంటికి తీసుకుపొమ్మని వేడుకునేవాళ్లు. అది తలుచుకుంటే నాకు నిద్ర కూడా పట్టడం లేదు’’ అని తేజల్ చెప్పారు.
‘‘అమ్మ జూన్ 21న, నాన్న జూన్ 23న మరణించారు. మా గుండె పగిలింది. దూరం నుంచి వాళ్ల ముఖాలను మాత్రమే చూడగలిగాం’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, BHARGAV PARIKH
‘అంటరానివాళ్లమైపోయాం’
తల్లిదండ్రుల మరణంతో కుదేలైన తేజల్, పూనమ్‌ల బాధను ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెట్టింపు చేశాయి.
వారిని ఓదార్చేందుకు బంధువులు ఎవరూ రాలేదు.
‘‘మా ఇంట్లో కోవిడ్ సోకిందని తెలియగానే, మొత్తం సమాజం మాకు దూరంగా జరిగింది. స్నేహితులు, బంధువులు, ఆఖరికి పక్కింటివాళ్లు కూడా మాతో మాట్లాడటం మానేశారు. మేం పూర్తిగా అంటరానివాళ్లమైపోయాం’’ అని వాపోయారు తేజల్.
గుజరాతీ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా చనిపోతే 12 రోజుల వరకు ఇంట్లో వంట చేసుకోరు. కానీ, ఈ 12 రోజులు తేజల్, పూనమ్, వారి ముగ్గురు పిల్లలకు సాయం చేసేందుకు ఎవరూ రాలేదు.
‘‘కన్న పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఎవరూ చూడలేరు. వారు ఆకలితో పడుకోకూడదని హోటల్ నుంచి ఆహారం తెప్పించుకున్నాం’’ అని తేజల్ చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి చూస్తే, వారి ఆభరణాలు కనిపించలేదని ఆమె అన్నారు. తన తండ్రి ఉంగరం, తల్లి బంగారు గొలుసు, వెండీ పట్టీలు పోయాయని చెప్పారు.
‘అవి ఎంత ముఖ్యమో మాకే తెలుసు’
‘‘మా నాన్నకు అది అత్తింటివారు పెట్టిన ఉంగరం. దాన్ని ఆయన ఎప్పుడూ తీసేవారు కాదు. తమ వివాహం జరిగి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాన్న అమ్మకు బంగారు గొలుసు, వెండి పట్టీలు బహుమతిగా ఇచ్చారు. ఆమె కూడా వాటిని పదిలంగా చూసుకునేది. ఎప్పుడూ వాటిని వేసుకునే ఉండేది. ఆ ఆభరణాలు ఎంత ముఖ్యమైనవో మాకు మాత్రమే తెలుసు. మా తల్లిదండ్రుల ఆఖరి గుర్తులు అవి’’ అని తేజల్ చెప్పారు.
ఆభరణాల గురించి ప్రశ్నించినప్పుడు ఆసుపత్రి సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె అన్నారు.
‘‘ఆసుపత్రి సిబ్బంది ‘వాళ్లు చనిపోయి రెండు నెలలు అవుతుంది, మా దగ్గర రికార్డులేవీ లేవు’ అని చెప్పారు. న్యాయం కోసం నేను జిల్లా కలెక్టర్‌ను కలిశా’’ అని తేజల్ చెప్పారు.
‘అప్పగించినట్లు రసీదు ఉంది’
తేజల్ తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేరికయ్యేటప్పటికే వివిధ ఆరోగ్య సమస్యలతో ఉన్నారని గాంధీనగర్ ప్రభుత్వ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ సుధా శర్మ అన్నారు.
నిబంధనల ప్రకారం వారికి చికిత్స అందించామని, ఆసుపత్రి సిబ్బంది వారిని తగిన విధంగా చూసుకున్నారని చెప్పారు.
‘‘జిల్లా కలెక్టర్‌కు మేం నివేదిక సమర్పిస్తాం. కుటుంబ సభ్యులకు ఆభరణాలు అప్పగించినట్లుగా రసీదు సహా మా దగ్గర పత్రాలన్నీ ఉన్నాయి’’ అని సుధా శర్మ చెప్పారు.
మరోవైపు అవసరమైతే ఆసుపత్రి ముందు తాను నిరాహార దీక్ష చేస్తానని, తన తల్లిదండ్రుల ఆభరణాలు తమకు అందజేసేవరకూ ఊరుకోనని తేజల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఏయే రంగాల్లో అవకాశాలు ఉంటాయి?
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- పార్టీ సమావేశంలో ప్రత్యక్షమైన కిమ్ జోంగ్ ఉన్... ఇంతకీ ఆయనకేమైంది?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










