సెక్స్‌లో మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన పరిశోధనలు, ప్రయోగాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనాలియా లోరెంట్
- హోదా, బీబీసీ న్యూస్ ముండో
మహిళల శరీరాలకు సంబంధించిన లైంగిక విజ్ఞానం గురించిన పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తిగా మేరీ బోనాపార్టీని చాలా మంది గుర్తిస్తారు.
ఆమెది రాచ కుటుంబం. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్-1కు మేరీ మునిమనుమరాలు. సంపదతోపాటు చాలా శక్తిమంతమైన వ్యక్తులతో ఆమెకు బలమైన సంబంధాలు ఉండేవి.
మహిళల భావప్రాప్తి, మానసిక విశ్లేషణలపై మేరీకి చాలా ఆసక్తి ఉండేది. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ఆమె శిష్యురాలుగా ఉన్నారు. ఆయన ప్రాణాలను కాపాడారు కూడా.
అన్నింటి కన్నా ప్రధానంగా మేరీ ‘స్వతంత్ర భావాలున్న మహిళ’. మేరీది భిన్నమైన వ్యక్తిత్వమని... రాచకుటుంబ వర్గాల్లోనూ, పరిశోధక వర్గాల్లోనూ ఆమె ప్రత్యేకంగా ఉండేవారని ఆమె జీవిత చరిత్ర రాసినవాళ్లు చెబుతున్నారు. మహిళల లైంగిక ఆనందం గురించి ఆమె నిత్యం అన్వేషిస్తూ ఉన్నారని అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పెళ్లయిన వ్యక్తితో సంబంధం
మేరీ బోనపార్టీ పారిస్‌లో 1882లో పుట్టారు. ఫ్రాన్స్ రాజకుమారుడు రోలండ్ నేపోలియన్ బోనపార్టీ ఆమె తండ్రి. ఆమె తాత ఫ్రాంకోయిస్ బ్లాంక్ కూడా బాగా ధనవంతుడు. క్యాసినో మోంటే కార్లోను ఆయన స్థాపించారు.
మేరీ జీవితం విషాదంతోనే మొదలైంది. ఆమె పుట్టుక సమయంలోనే చావు దరిదాపుల్లోకి వెళ్లి వచ్చారు. ఓ నెల తర్వాత మేరీ తల్లి కన్నుమూశారు.
బాల్యంలో ఆమె ఒంటరితనం, బాధ అనుభవించారు. మేరీ తండ్రి మానవపరిణామ శాస్త్రవేత్త, భూగోళ శాస్త్రవేత్త. మేరీ ఆయన్ను బాగా అనుసరించేవారు. నానమ్మ అంటే మాత్రం ఆమెకు విపరీతమైన భయం.
సైన్స్, సాహిత్యం, రచనలు అన్నా... తన శరీరం అన్నా ఆమెకు ముందు నుంచీ చాలా ఆసక్తి. మేరీ చిన్నప్పుడు హస్త ప్రయోగం చేసుకుంటుంటే, ఆమె ఆయా ఒకరు చూశారు. ‘‘ఇది పాపం. అలా చేస్తే, చచ్చిపోతావు!’’ అని ఆ ఆయా మేరీతో అన్నారు.
1952లో మేరీ తన డైరీలో ఈ విషయాన్ని రాశారు. ‘‘ఎనిమిది లేదా తొమ్మిది ఏళ్ల వయసున్నప్పుడు ఆయా మాటలకు భయపడి హస్త ప్రయోగం మానేశానని బోనపార్టీ చెప్పారు’’ అని ‘ద థియరీ ఆఫ్ ఫీమేల్ సెక్సువాలిటీ ఆఫ్ మేరీ బోనపార్టీ’ అనే వ్యాసంలో నెల్లీ థాంప్సన్ రాశారు.
చిన్నప్పటి నుంచే మేరీలో తిరగబడేతత్వం ఉండేది. మహిళలు లొంగి ఉండాలన్న భావనను ఆమె అంగీకరించేవారు కాదు.
యుక్త వయసులో ఆమె ఇంగ్లీష్, జర్మన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆమె తండ్రి, నానమ్మ ఆమెకు పరీక్షలు రాయొద్దని నిబంధన పెట్టారు.
‘‘రాచకుటుంబాన్ని అవమానపరిచేందుకు రిపబ్లికన్ శత్రువులు ఆ పరీక్షల ఫలితాలను మార్చవచ్చు అని మేరీ తండ్రి, నానమ్మ భయపడ్డారు. ‘నా పేరు, హోదా, సంపద, మరీ ముఖ్యంగా నేను అమ్మాయిననే వివక్ష... అన్నీ పనికిమాలినవి. నేనే అబ్బాయిని అయ్యుంటే, ఎవరూ నన్ను ఆపేవారు కాదు’ అని మేరీ అరిచేవారు’’ అని థాంప్సన్ తన వ్యాసంలో రాశారు.
20 ఏళ్లు రాకముందే మేరీ లైంగిక ఆనందం కోరుకున్నారు. తన తండ్రి సహాయకుల్లో ఓ వ్యక్తితో ఆమె లైంగిక సంబంధం పెట్టుకున్నారు. ఆ వ్యక్తికి అదివరకే వివాహమైంది.
ఈ విషయం వివాదానికి కారణమైంది. ఆమె బెదిరింపులు, అవమానాలకు గురయ్యారు.
ఈ పరిణామాల తర్వాత మేరీని గ్రీస్, డెన్మార్క్ రాకుమారుడు జార్జ్ (1869-1957)కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నారు. మేరీ కన్నా జార్జ్ వయసులో 13 ఏళ్లు పెద్ద.
మేరీ ఈ వివాహానికి అంగీకరించారు. 1907 డిసెంబర్ 12న వారి పెళ్లి జరిగింది. వారికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి పుట్టారు. 50 ఏళ్లు కలిసి ఉన్నప్పటికీ, వారిది సంతోషమైన బంధం కాదు.
భావోద్వేగపరంగా జార్జ్ తనతో నిజమైన బంధంలో లేరని మేరీ గుర్తించారు. ఆమె వేరేవారితో ప్రేమ కలాపాలు సాగించారు.
అయితే, తాను భావప్రాప్తి పొందలేకపోతున్నానని ఆమెకు అనిపించింది. దీంతో ఆమె ఈ విషయంపై అధ్యయనం చేయడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
భావప్రాప్తిపై సిద్ధాంతం
మహిళల భావప్రాప్తి, లైంగికతల గురించి తెలుసుకోవాలన్న తహతహ మేరీలో ఎక్కువైంది.
మహిళలకు భావప్రాప్తి కలగకపోవడం గురించి ‘నోట్స్ ఆన్ ది అనాటమికల్ కాసెస్ ఆఫ్ ఫ్రిజిడిటీ ఇన్ వుమెన్’ శీర్షికతో 1924లో ఆమె ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ఏ.ఈ. నర్జానీ అనే మారు పేరుతో దీన్ని ఆమె రాశారు.
‘‘సెక్స్‌లో తనకెప్పుడూ భావప్రాప్తి కలగకపోవడం మేరీకి విసుగుతెప్పించింది’’ అని అమెరికాలోని ఎమరో యూనివర్సిటీ ప్రొఫెసర్ కిమ్ వాలెన్ అన్నారు.
‘‘నేరుగా క్లిటోరిస్‌ను ఉత్తేజితం చేయడంతోనే మహిళలు భావప్రాప్తి పొందగలరన్న విషయాన్ని ఆమె అంగీకరించలేకపోయారు’’ అని అభిప్రాయపడ్డారు.
సెక్స్ సమయంలో భావప్రాప్తి పొందలేకపోతున్న మహిళల్లో, శరీర నిర్మాణపరంగానే ఏదో లోపముందని మేరీ భావించారు.
ఈ విషయమై ఆమె ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. మహిళ యోని ప్రవేశద్వారం నుంచి క్లిటోరిస్ ఎంత దగ్గరగా ఉంటే, సెక్స్ సమయంలో భావప్రాప్తి పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ సిద్ధాంతాన్ని బలపరిచేందుకు పారిస్‌లో 1920ల్లో ఆమె 240 మంది మహిళల మర్మావయవాల కొలతలు తీసుకున్నారు.
‘‘కానీ, ఇవి ఓ శాస్త్రీయ పద్ధతి ప్రకారం తీసుకున్న కొలతలు కావు. వైద్యులను సంప్రదించేందుకు వచ్చిన మహిళల నుంచి ఆ కొలతలు తీసుకున్నారు. యోని ప్రవేశద్వారం నుంచి క్లిటోరియస్ మధ్య ఉన్న దూరం ఆధారంగా శాంపిల్స్‌ను మూడు వర్గాలుగా మేరీ విభజించారు’’ అని ప్రొఫెసర్ వాలెన్ చెప్పారు.
‘‘మేరీది ఆసక్తికరమైన సిద్ధాంతం. మహిళల శరీర నిర్మాణాలు విభిన్నమని, అందుకే సెక్స్ విషయంలో వారి ప్రతిస్పందనలు కూడా వేర్వేరుగా ఉంటున్నాయని ఓ విప్లవాత్మకమైన సిద్ధాంతీకరణ చేశారు. కానీ, ఆమె పూర్తిగా శరీర నిర్మాణాన్నే దీనికి కారణంగా చూపారు. మానసిక పరిపక్వత, జీవితంలో అసంతృప్తి, మానసిక పరిస్థితి లాంటి అంశాలను పూర్తిగా విస్మరించారు’’ అని డాక్టర్ ఎలిజబెత్ లాయెడ్ అన్నారు.
మేరీ బోనపార్టీ సిద్ధాంతంపై ప్రొఫెసర్ వాలెన్‌తో కలిసి లాయెడ్ అధ్యయనం చేస్తున్నారు.
యోని ప్రవేశద్వారం, క్లిటోరిస్‌ను శస్త్ర చికిత్స ద్వారా దగ్గరికి తేగలిగితే, సెక్స్ సమయంలో భావప్రాప్తి కలిగించేలా చేయొచ్చని మేరీ విశ్వసించారు.
కానీ, ఆమె ఈ విషయంలో పూర్తిగా పొరబడ్డారు. ‘‘ఆ శస్త్ర చికిత్సలు ఘోరంగా విఫలమయ్యాయి. కొంత మంది మహిళలు అసలు అక్కడ స్పర్శనే కోల్పోయారు. కానీ, మేరీ తన సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మారు. స్వయంగా ఆమె కూడా శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఒక్కసారి కాదు, ఏకంగా మూడు సార్లు. కానీ, ఫలితం లేకపోయింది’’ అని ప్రొఫెసర్ వాలెన్ చెప్పారు.
‘‘క్లిటోరియస్ చుట్టూ ఉండే చాలా నరాలకు కోత పెడితే, ప్రతిస్పందనలు రావడం బదులు పోతాయి. అవి చాలా ముఖ్యమైన నరాలు. కానీ, భావప్రాప్తికి అది ఒక్కటే మార్గమని మేరీ భావించారు’’ అని డాక్టర్ లాయిడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాయిడ్‌తో గట్టి బంధం
ఇంత జరిగినా, మేరీ బోనపార్టీ తన కృషిని ఆపలేదు. లైంగికపరంగా తనకున్న అసంతృప్తిని, జీవితంలో తాను పడుతున్న కష్టాలను తీర్చే మార్గాల కోసం అన్వేషణ కొనసాగించారు.
ఆస్ట్రియాకు చెందిన మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి పారిస్‌లోని వైద్య వర్గాల్లో అప్పట్లో బాగా చర్చ జరిగేది. ఆయన్ను కలిసేందుకు మేరీ 1925లో వియన్నా వెళ్లారు.
ఫ్రాయిడ్‌లో ఆమె ఓ తండ్రిని చూసుకున్నారని థాంప్సన్ తన వ్యాసంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
మేరీ బోనపార్టీ ఓ పేషెంట్‌గా ఫ్రాయిడ్ వద్దకు వెళ్లారు. కానీ, వారు స్నేహితులయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మానసిక విశ్లేషణపై మేరీకి ఆసక్తి బాగా పెరిగింది. ఫ్రాయిడ్‌కు ఆమె శిష్యురాలిగా మారారు.
‘‘మానసిక విశ్లేషణ గురించి, అదీ సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర చదువుకున్న తొలి ఫ్రాన్స్ మహిళ మేరీనే. ఫ్రాయిడ్ కూడా ఆమె సాంగత్యాన్ని ఆస్వాదించారు. మేరీ కలిసేనాటికి ఫ్రాయిడ్ వయసు 70 ఏళ్లు. ఆమె ఆసక్తికరమైన మహిళ. తెలివైనవారు. ధనవంతురాలు కూడా. ఫ్రాయిడ్‌తో ఆమె బాగా వాదించేవారు’’ అని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లాసాన్నేలో మనస్తత్వశాస్త్ర ప్రొఫెసర్ రెమీ ఆమోరాక్స్ అన్నారు.
పారిస్‌లో మనస్తత్వ విశ్లేషణకు సంబంధించి ప్రముఖమైన వ్యక్తిగా మేరీ మారారు. తన డైరీలో ఆమె తన వద్దకు వచ్చిన పేషెంట్ల గురించి కూడా రాశారు.
ఆస్ట్రియాను నాజీ జర్మనీ ఆక్రమించినప్పుడు, ఫ్రాయిడ్ ప్రాణాలను మేరీనే కాపాడారు.
తన సంపద, పరిచయాలను ఉపయోగించి... ఫ్రాయిడ్‌ను వియన్నా నుంచి లండన్ తీసుకురాగలిగారు. ఫ్రాయిడ్ చివరి రోజులు లండన్‌లోనే గడిపారు.
‘‘జర్మనీ ఆక్రమణ కారణంగా 82 ఏళ్ల వయసులో వియన్నాలో నా ఇల్లు వదిలి ఇంగ్లండ్‌కు రావాల్సి వచ్చింది. ఇక్కడే స్వేచ్ఛగా నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నా’’ అని ఫ్రాయిడ్ 1938లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘కాలం కన్నా ముందు’
మహిళల లైంగికత విషయంలో తన సిద్ధాంతాన్ని తప్పుపడుతూ మేరీ బోనపార్టీనే మాట్లాడారు. వృత్తిగతంగా ఆమె పరిపక్వతకు ఇది ఉదాహరణ.
‘‘1950లో ‘ఫీమేల్ సెక్సువాలిటీ’ అనే పుస్తకాన్ని మేరీ ప్రచురించారు. తాను ఇదివరకు అధ్యయనంలో చెప్పిన విషయాలను, ఆమె ఉపసంహరించుకున్నారు. భావప్రాప్తి కలగకపోవడానికి శరీర నిర్మాణంతో సంబంధం లేదని, దీని వెనుక పూర్తిగా మానసికపరమైన కారణాలే ఉన్నాయని ఆమె చెప్పారు. అప్పటికి ఆమె 25 ఏళ్లుగా మానసిక విశ్లేషణకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయితే, ఆమె మొదట నిర్వహించిన అధ్యయనం కూడా గొప్ప విషయమే’’ అని ప్రొఫెసర్ వాలెన్ అన్నారు.
పరిజ్ఞానం, అవగాహన విషయంలో మేరీ అప్పటి కాలం కన్నా చాలా ముందు ఉన్నారని డాక్టర్ లాయిడ్ అభిప్రాయపడ్డారు.
మేరీ 1962లో చనిపోయారు.
‘‘మేరీ గొప్ప మహిళ. సాహిత్యవేత్తలు, రాజకీయ నాయకులు, రాచకుటుంబాలు... ఇలా అన్నీ వర్గాలతో ఆమెకు సంబంధాలు ఉండేవి. 20వ శతాబ్దంలో ప్రథమార్ధంలోని గొప్ప గొప్ప వాళ్లందరితో ఆమెకు పరిచయాలు ఉండేవి. స్త్రీ సమానత్వ ఉద్యమానికి సంబంధించి కూడా ఆమె కీలకమైన వ్యక్తి’’ అని ప్రొఫెసర్ ఆమరాక్స్ అన్నారు.
‘‘లైంగికతను ఆమె ఎక్కువగా పితృస్వామ్య దృక్కోణంలోనే చూశారు. భావప్రాప్తి పొందడానికి ఒకే మార్గం ఉందని ఆమె అనుకున్నారు. అదే సమయంలో ఆమె చాలా స్వతంత్రంగా ఆలోచించేవారు. ఫ్రాయిడ్‌ను సైతం సవాలు చేసిన సంక్లిష్టమైన మహిళ ఆమె’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- శ్రీశైలం పవర్ ప్లాంట్: భారీగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనే ప్రమాదం?
- కరోనావైరస్: ఈ పది దేశాల్లో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదుకాలేదు
- హైదరాబాద్‌లో 6 లక్షల మందికి కరోనా సోకిందని సీసీఎంబీ అంచనా
- జీతాల డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి
- సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని సీడబ్ల్యూసీ నిర్ణయం
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- టీవీ షోలో బంగారం వేట.. గంటల్లోనే రెండు కోట్ల విలువైన బంగారం దొరికింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








