సౌత్ సూడాన్: జీతాలు తీసుకెళ్తున్న విమానం కూలి 8 మంది మృతి.. కాలి బూడిదైన కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images
డబ్బు తీసుకెళ్తున్న విమానం కూలిపోవడంతో ఎనిమిదిమంది మరణించారు.
ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) కోసం డబ్బు తీసుకెళ్తున్న కార్గో విమానం దక్షిణ సూడాన్ రాజధాని జూబా సమీపంలో కుప్పకూలింది.
విమానంలో ఉన్న తొమ్మిదిమందిలో ఎనిమిదిమంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మరణించినవారిలో నలుగురు దక్షిణ సూడాన్ దేశానికి చెందినవారు కాగా, ముగ్గురు రష్యాకు చెందినవారు.
"ఈ ప్రమాదం చాలా విషాదాన్ని కలిగించింది. ఇందులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఆ దేశాధ్యక్షుడు సాల్వా కీర్ తెలిపారు.
జూబా అంతర్జాతీయ విమానాశ్రయమనుంచీ బయరుదేరిన కొద్దిసేపట్లోనే ఈ విమానం కుప్పకూలింది.

ఫొటో సోర్స్, Nichola Mandil
జీతం డబ్బులన్నీ కాలిపోయాయి
పశ్చిమ బాహ్ర్ ఎల్-గజల్ రాజధాని వయూలో ఉన్న డబ్ల్యూఎఫ్‌పీ సిబ్బందికి జీతాలు తీసుకువెళ్లడానికి ఆంటొనోవ్ 36 విమానాన్ని ఆపర్ట్యూనిటీ బ్యాంక్ ఏర్పాటు చేసింది.
"అందులో ఉన్న మొత్తం డబ్బు $35,000 (సుమారు 26 లక్షలు). ప్రమాదంలో ఈ డబ్బు మొత్తం కాలిబూడిదైపోయింది" అని దక్షిణ సూడాన్ రవాణా మంత్రి మదుత్ బ్యార్ యెల్ బీబీసీతో చెప్పారు.
ఈ సంఘటనపై దర్యాప్తు చెయ్యడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








