మాస్కో విమాన ప్రమాదానికి పిడుగుపాటే కారణమా

ఫొటో సోర్స్, Getty Images
మాస్కోలోని షెరెమెత్యేవో విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయిన రష్యా విమానం పేలిపోయిన దుర్ఘటనలో కనీసం 41 మంది చనిపోయారు.
ప్రయాణికులు ప్రాణాలతో బయటపడేందుకు అత్యవసర ద్వారాలను ఉపయోగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.
చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఫ్లయిట్ అటెండెంట్ కూడా ఉన్నారని రష్యన్ మీడియా తెలిపింది.
మొత్తంగా 78 మంది ప్రయాణికులు, అయిదుగురు సిబ్బంది ఉన్న ఈ విమానం నుంచి కొందరైనా ప్రాణాలతో బయటపడ్డారంటే, అదో అద్భుతమని ఒక ప్రత్యక్ష సాక్షి వ్యాఖ్యానించారు.
గాయపడిన ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి వెరోనికా స్క్వోర్ట్సోవా తెలిపారు.
రష్యా జాతీయ విమానయాన సంస్థ అయిన ఎయిరోఫ్లాట్ అధికారులు 'సాంకేతిక సమస్యల' వల్ల విమానాన్ని వెనక్కి రప్పించాల్సి వచ్చిందని చెప్పారు. అంతకుమించి ఎలాంటి వివరాలూ వారు వెల్లడి చేయలేదు.

ఫొటో సోర్స్, AFP
సుఖోయి సూపర్‌జెట్-100 రకానికి చెందిన ఈ విమానం షెరెమెత్యోవో విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.02 గంటలకు ముర్మాన్స్క్ నగరానికి బయలుదేరింది.
బయలుదేరిన కాసేపటికే 'సాంకేతిక లోపాలు' దృష్టికి రావడంతో సిబ్బంది ప్రమాద సంకేతాలను పంపించారు.
దాంతో, విమానాన్ని వెనక్కి రప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ అయినప్పుడు రన్ వే మీదనే విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయని ఎయిరోఫ్లాట్ తెలిపింది.
"ప్రయాణికులను కాపాడడానికి" సిబ్బంది చేయవలసిందంతా చేశారు. 55 సెకండ్లలో వారిని కిందకు దింపే ప్రయత్నం చేశారు.

సూపర్‌జెట్-100 విమానంలోని 78 మందిలో 37 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని రష్యన్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది.
ఇప్పటివరకు వారిలో గుర్తించిన వ్యక్తుల పేర్ల జాబితాను ఎయిరోఫ్లాట్ రష్యన్ భాషలో వెల్లడించింది. ఆ సమాచారాన్ని అప్డేట్ చేస్తామని తెలిపింది.
అయితే, ముందు చెప్పినట్లు గగనతలంలో కాకుండా నేలకు డీకొన్నట్లుగా ల్యాండ్ అవడం వల్లే విమానం ఇంజన్లలో మంటలు చెలరేగాయని ఇంటర్‌ఫ్యాక్స్ వెల్లడించింది.
అంతేకాకుండా, ఆ విమానం తొలి అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో సఫలం కాలేకపోయిందని కూడా వార్తలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
ప్రయాణికులు ఎలా తప్పించుకున్నారు...
'విమాన సిబ్బంది వల్లే సహకారం వల్లే ప్రమాదానికి గురైన విమానం నుంచి బయటకు దూకగలిగాన'ని మిఖాయిల్ సావ్చెంకో అనే వ్యక్తి తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులు దూరంగా పరిగెడుతున్న దృశ్యాలున్న వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దిమిత్రీ ఖ్లెబుష్కిన్ అనే ప్రయాణికుడు కూజా విమాన సిబ్బంది సాయం వల్లే తాను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డానని వివరించారు.
ప్రస్తుతం షెరెమెత్యేవో విమానాశ్రయంలో ఇతర విమానాలేవీ టేకాఫ్ కావట్లేదని రష్యన్ గాయకుడు క్రిస్టియన్ కోస్తోవ్ తెలిపారు. ఈ దుర్ఘటనను చూసిన జనాలు భయంతో వణికిపోయారని ఆయన అన్నారు.
తాను మరో విమానంలో ఎక్కబోతుండగా ఈ ప్రమాదం జరగడంతో దిగ్భ్రాంతి చెందానని మరో ప్రత్యక్ష సాక్షి పాట్రిక్ హార్లచర్ బీబీసీతో చెప్పారు.
ఈ ప్రమాదం మీద దర్యాప్తు కూడా మొదలైనట్లు తెలుస్తోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఈ ప్రమాదంలో ఆప్తుల్ని కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ముర్మాన్స్క్ రాష్ట్రంలో మూడు రోజుల సంతాప దినాల్ని ప్రకటించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
పిడుగుపాటు వల్లేనా..
పిడుగుపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విమాన పైలట్ డెనిస్ వెవ్డోకిమోవ్ రష్యా మీడియాకు తెలిపారు.
టేకాఫ్ అయిన కాసేపటికే పిడుగు పడటంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో తమకు సంబంధాలు తెగిపోయాయని ఆయన అన్నారు. దీంతో అత్యవసర మ్యానువల్ మోడ్‌లో విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ప్రమాదం నుంచి బయపడ్డ ప్రయాణికులు, ఇతర విమాన సిబ్బంది కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
అయితే, ఇప్పుడున్న ఆధునిక విమానాలు పిడుగుపాటును తట్టుకునేలానే తయారవుతున్నాయి.
రష్యా జాతీయ విమానయాన సంస్థ మాత్రం 'సాంకేతిక కారణాల' వల్లే ఈ విమానం తిరిగి ల్యాండ్ అయ్యిందని పేర్కొంది.
ప్రమాదంపై విచారణ జరుపుతున్న అధికారులు పిడుగుపాటు గురించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక వ్యాఖ్యలూ చేయలేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









