శిల్పినే కబళించబోయిన ఆల్చిప్పల ఆడమ్ శిల్పం

ఫొటో సోర్స్, Gillian Gensen / BBC
జీవం ఆవిర్భావంపై తాను రూపొందిస్తున్న కళాఖండమే నెమ్మదిగా తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయారు కెనడా శిల్పి గిలియన్ గెన్సర్.
అబ్రహమిక్ మతాలు దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే 'ఆడమ్' శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు ఆమె 15 ఏళ్లు కృషి చేశారు.
ఆ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. ఆమె సమస్యకు కారణం ఏంటో తెలియక వైద్యులు తలలుపట్టుకున్నారు.
ఎట్టకేలకు ఆమె శిల్పాన్ని పూర్తిచేసినా ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. అయితే, ఆమెకు వచ్చిన జబ్బు శిల్పం తయారీ కారణంగానే అని వైద్యులు చివరికి గుర్తించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

గెన్సర్ స్వస్థలం కెనడాలోని టొరంటో. 1991 నుంచి ఆమె ఆల్చిప్పలు వంటివి, పగడాలు, ఎండిపోయిన మొక్కలు, జంతువుల ఎముకల వంటి సహజ పదార్థాలను ఉపయోగించి శిల్పాలను రూపొందిస్తున్నారు.
యూదుల జానపథ కథల ప్రకారం మొదటి మహిళ అయిన 'లిలిత్' శిల్పాన్ని 1998లో ఆమె తయారుచేశారు.
అప్పుడే, ఆల్చిప్పలతో 'ఆడమ్'ను రూపొందించాలన్న ఆలోచన ఆమెకు వచ్చింది.
కెనడాలోని అట్లాంటిక్ తీరంలో దొరికే ఆల్చిప్పలను టొరంటోలోని చైనాటౌన్‌లో పెద్ద మొత్తంలో ఆమె కొనుగోలు చేసేవారు.
వేల ఆల్చిప్పలను జల్లెడపట్టి తనకు అవసరమైన ఆకృతుల్లో ఉన్నవాటిని ఎంచుకునేవారు.
''ఆడమ్ శరీరానికి తగ్గట్లుగా ఆల్చిప్పలను సానబెట్టేందుకు, అరగదీసేందుకే రోజులో 12 గంటలు శ్రమించేదాన్ని. కండరాల్లో ఉండే గీతలు వీటితో బాగా వచ్చేవి'' అని టొరంటో లైఫ్ మ్యాగజైన్‌కు రాసిన వ్యాసంలో గెన్సర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Gillian Genser
'ఆడమ్‌ను పూర్తి చేస్తే చాలు'
'ఆడమ్'పై పని చేయడం ప్రారంభించిన కొన్ని నెలలకే గెన్సర్ అనారోగ్యం బారినపడ్డారు.
''ఎప్పుడూ కోపం వచ్చేది. తలనొప్పి అనిపించేది. వాంతులు చేసుకునేదాన్ని. న్యూరాలజిస్ట్‌లు, ర్యుమటాలిజస్ట్‌లు, ఎండోక్రినాలజిస్ట్‌లు.. నా సమస్య ఏదో కనిపెడతారని ఇలా లెక్కలేనంతమంది స్పెషలిస్ట్‌లను కలిశా. ఏదైనా హానికర పదార్థాలతో పనిచేస్తున్నారా? అని వాళ్లు అడిగేవారు. సహజ పదార్థాలను వాడుతున్న విషయం చెప్పేదాన్ని'' అని గెన్సర్ చెప్పారు.
అయితే, రోజులు గడిచిన కొద్దీ ఆమె సమస్య మరింత తీవ్రంగా మారుతూ వచ్చింది.
ఆల్చిప్పలను కొన్ని గంటలు సానబెట్టిన తర్వాత ఎటూ కదల్లేని స్థితికి చేరుకునేదాన్నని ఆమె చెప్పారు. కండరాలు నొప్పిపెట్టేవని, పరికరాలు వాడుతున్నప్పుడు చేతులు పట్టేసేవని అన్నారు.
ఏదో దురదృష్టం తనను వెంటాడుతున్నట్లు భావించేదాన్నని గెన్సర్ బీబీసీతో చెప్పారు. ప్రాణాలు పోయేలోపు 'ఆడమ్'ను పూర్తి చేయాలన్న ఒకే ఒక్క కోరిక మాత్రం తనకు ఉండేదని అన్నారు.
అప్పుడు తెలిసింది
''చివరికి నాకు తీవ్రమైన డిమెన్షియా లక్షణాలన్నీ వచ్చాయి. ఏకాగ్రత ఉండేది కాదు. తికమకపడేదాన్ని. ఏది ఎక్కడ అమర్చాలో అర్థమయ్యేది కాదు. కోపం, ఆందోళన, నిస్పృహ, ఆత్మహత్య చేసుకోవాలన్న భావనలు నన్ను ఆవహించేవి'' అని గెన్సర్ అన్నారు.
సమస్య తీవ్రమైన స్థితికి చేరుకున్నాక.. తాను పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేదాన్నని ఆమె చెప్పారు. వీధి చివరకు వెళ్లి అక్కడ ఎవరూ లేకున్నా గట్టిగా తిట్టేదాన్నని అన్నారు.
''చివరకు ఓ మానసిక వైద్యురాలిని కలిశా. ఆమెకు కూడా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో అర్థం కాలేదు. వివిధ రకాల ఔషధాలను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది'' అని గెన్సర్ చెప్పారు.
''ఎముకలు, ఆల్చిప్పలు వాతావరణంలో ఉండే విషపూరిత పదార్థాలను ఆకర్షించి పోగుచేసుకుంటాయన్న విషయాన్ని ఓ రోజు నా వైద్యురాలు తెలుసుకున్నారు. అప్పుడే అసలు విషయం మాకు అర్థమైంది'' అని గెన్సర్ వివరించారు.

ఆల్చిప్పల పొడి వల్లే..
విషపూరితమైన భారీ లోహపదార్థాలు గెన్సర్ దేహంలో ప్రమాదకర స్థాయిల్లో ఉన్నట్లు 2015లో వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఆమె శరీరంలో ఆర్సెనిక్, లెడ్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఆడమ్ కోసం గెన్సర్ సానబెట్టిన వేల ఆల్చిప్పల నుంచి వెలువడిన పొడే ఆమె సమస్యకు కారణమైంది.
పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల్లో ప్రమాదకర లోహాలు ఉంటాయి. నీటిలో కలిసిన వీటిని ఆల్చిప్పలు పెరిగే క్రమంలో పోగు చేసుకుంటాయి.
గెన్సర్ ఆల్చిప్పలను సానబెట్టేటప్పుడు ఈ విషపదార్థ రేణువులు గాల్లోకి రేగేవి. అలా అవి ఆమె శరీరంలోకి చేరేవి.
ప్రకృతితో మనుషులకు చెదిరిన బంధం గురించి సహజ పదార్థాలతోనే రూపొందించిన కళాఖండం ద్వారా చెప్పాలనుకున్నారు గెన్సర్. కానీ, విచిత్రంగా ఆ ప్రయత్నంలోనే ఆమె శరీరం నెమ్మదిగా విషపూరితమైంది.
''భూమి విషపూరితమవుతున్న విషయం గురించిన బాధాకరమైన సందేశాన్ని నా శరీరం మోస్తోంది'' అని గెన్సర్ అన్నారు.

'అందమైన మరణం'
ఆడమ్ కళాఖండాన్ని 2015లో గెన్సర్ పూర్తి చేశారు.
ఆ పనిని పూర్తి చేయలేకపోతే తన జీవన ప్రయాణం అసంపూర్తిగా మిగిలిపోయేదని ఆమె అంటుంటారు.
గెన్సర్‌కు నాడీకణ సంబంధమైన నష్టం తీవ్రంగా జరిగింది. ఆమె వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. శాశ్వతమైన మానసిక ఆరోగ్య సమస్యల బారినపడ్డారు.
భవిష్యత్తులో అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు కూడా ఆమెకు ఉంది.
శరీరం మరింత విషపూరితంగా కాకుండా చూసుకుంటూ తన పనిని కొనసాగించేందుకు గెన్సర్ ఇప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గడిచిన విషయాల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోనని గెన్సర్ బీబీసీతో అన్నారు.
''ఆడమ్‌ను చూసినప్పుడు నా మనసులో ఈ భూమి గురించి, నా గురించి బాధ ఉప్పొంగుతుంది. కానీ, ఓ రకమైన సంతృప్తి కూడా కలుగుతుంది. అదో అద్భుతమైన కళాఖండం. అలా ఆలోచించి నేను ఆనందం పొందుతా. 'నా అందమైన మరణం' అని ఆ కళాఖండాన్ని నేను పిలుచుకుంటా'' అని గెన్సర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సోషల్ మీడియాపై శ్రీలంక నిషేధం: మంచిదేనా? ప్రజలు ఏమనుకొంటున్నారు?
- శ్రీలంక పేలుళ్లు: ముసుగులపై నిషేధం
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా?
- లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








