ఇరాన్ తన మిత్రులు రష్యా, చైనా నుంచి ఎలాంటి సాయం ఆశించొచ్చు?

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, 2026 మార్చి 1న తెహ్రాన్‌లో ఉన్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ భవనం పరిసరాల నుంచి ఆకాశంలోకి ఎగసిపడుతున్న పొగలు.
    • రచయిత, గ్లోబల్ జర్నలిజం టీం
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 'రక్షణాత్మక' దాడుల కోసం తన వైమానిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు బ్రిటన్ వాషింగ్టన్‌‌ను అనుమతించిన నేపథ్యంలో, తెహ్రాన్‌కు విదేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించవచ్చనే అంశంపై దృష్టి కేంద్రీకృతమైంది.

ఇస్లామిక్ రిపబ్లిక్‌తో రష్యా, చైనా రెండూ బలమైన దౌత్య, వాణిజ్య, సైనిక సంబంధాలను కలిగి ఉన్నాయి.

అయితే, ప్రస్తుత సంఘర్షణలో అవి ఎంతవరకు ఇరాన్‌కు అండగా నిలుస్తాయనేది కీలకంగా మారింది.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా

ఫొటో సోర్స్, SPUTNIK/KREMLIN POOL/EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, 2025 సెప్టెంబర్ 1న చైనాలో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరచాలనం.

రష్యా మద్దతు పరిమితమా?

ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త దాడుల పట్ల మాస్కో స్పందన గట్టిగానే ఉన్నప్పటికీ, అది పరిమితంగానే ఉంది.

తెహ్రాన్‌కు సంఘీభావం, దాడులపై ఆగ్రహాన్ని సూచిస్తున్నప్పటికీ, రష్యా నేరుగా ఈ ఘర్షణలోకి దిగకుండా జాగ్రత్త పడుతోందని బీబీసీ న్యూస్ రష్యన్ ప్రతినిధి సెర్గీ గోర్యాష్కో తెలిపారు.

వాషింగ్టన్, తెహ్రాన్ మధ్య చర్చలు జరిగినప్పటికీ, పరిస్థితి దిగజారడంపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ 'తీవ్ర అసంతృప్తి' వ్యక్తం చేశారు. ఇరాన్ నాయకత్వంతో పాటు, ఈ ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన గల్ఫ్ దేశాలతో మాస్కో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ఆయన తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులు "హెచ్చరిక లేకుండా జరిగిన దురాక్రమణ"గా రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. సార్వభౌమ దేశాల నాయకులను లక్ష్యంగా చేసుకోవడాన్ని విమర్శించింది.

సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం సందేశం పంపారు. ఇది "మానవ నైతికత, అంతర్జాతీయ చట్టాల ఘోరమైన ఉల్లంఘన"గా పుతిన్ అభివర్ణించారు.

అయినప్పటికీ, క్రెమ్లిన్ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడుతోంది, యుక్రెయిన్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఇప్పటికీ కృతజ్ఞతగా ఉంటోంది.

ఇకపై వాషింగ్టన్‌ను మాస్కో ఎలా చూస్తుందని అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ సమాధానమిస్తూ, రష్యా మొదట తనను తాను మాత్రమే నమ్ముతుందని, సొంత ప్రయోజనాలను కాపాడుకుంటుందని తెలిపారు.

యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడి ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు డ్రోన్లు సరఫరా చేస్తూ, అత్యంత సన్నిహిత మిత్రదేశాలలో ఒకటిగా ఇరాన్ ఉన్నప్పటికీ, రష్యా మద్దతు కేవలం మాటలకే ఎందుకు పరిమితమైందో ఈ వ్యూహాత్మక ప్రయోజనాలే వివరిస్తాయని మా ప్రతినిధి తెలిపారు.

మానవ హక్కుల కంటే దేశాల హక్కులే ముఖ్యమని, ప్రభుత్వాలకే పూర్తి నియంత్రణ ఉండాలనే క్రెమ్లిన్ "మల్టీపోలార్ ఆర్డర్" విజన్‌కు ఇరాన్ సరిగ్గా సరిపోతుంది. ఇరాన్ లాంటి పాలన పతనమవ్వడం అనేది రష్యా నమ్మే ఆ నమూనాకు గట్టి దెబ్బ అవుతుంది.

అదే సమయంలో, తన భాగస్వామ్య దేశాల కోసం రష్యా భారీ రిస్క్ తీసుకోదని గతంలో వెనెజ్వెలా, సిరియా విషయాల్లోనూ, అలాగే 2025 వేసవిలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం సమయంలోనూ స్పష్టమైంది.

రష్యా ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధంలో తీవ్రంగా నిమగ్నమై ఉంది. అందుకే దౌత్యపరమైన మద్దతు, సైనిక - సాంకేతిక సహకారం తప్ప అంతకుమించి సహాయం అందించడానికి రష్యా ఇష్టపడటం లేదు, బహుశా అందించలేని స్థితిలో ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఒప్పందాల సంగతేంటి?

2025 జనవరి 17న సంతకం చేసిన రష్యన్ - ఇరానియన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం పూర్తి 'పరస్పర రక్షణ ఒప్పందం' కాదు. సమాచారాన్ని పంచుకోవడం, ఉమ్మడి విన్యాసాలు నిర్వహించడం, ప్రాంతీయ భద్రతను పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై మాస్కో, తెహ్రాన్ అంగీకరించాయి తప్ప, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు వస్తామని వాగ్దానం చేసుకోలేదు.

రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు కూడా స్వల్పంగానే ఉన్నాయి. వాణిజ్యం 4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్ల మధ్యే కొనసాగుతోంది. కానీ, సైనిక, పారిశ్రామిక సంబంధాలు మాత్రం పెరుగుతున్నాయి.

ఫిబ్రవరిలో ప్రచురితమైన ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, 500 మిలియన్ యూరోల విలువైన 'వెర్బా' మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ఇరాన్‌కు సరఫరా చేయడానికి రష్యా ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పటికే యాక్-130 శిక్షణా విమానాలను, ఎంఐ-28 అటాక్ హెలికాప్టర్లను ఇరాన్ పొందింది. అలాగే ఎస్‌యూ - 35 యుద్ధ విమానాల కోసం వేచిచూస్తోంది. అయితే, రష్యా ఇంకా వెర్బా సిస్టమ్స్‌ను సరఫరా చేయాల్సి ఉంది.

ఇరాన్ తయారీ 'షాహెద్' డ్రోన్ల వాడకం యుక్రెయిన్‌లో రష్యా దళాల వ్యూహాలను గణనీయంగా మార్చివేసింది. కానీ, గత ఏడాది కాలంగా మాస్కో తన సొంత డ్రోన్ల ఉత్పత్తిని వేగంగా విస్తరించింది, దీనివల్ల ఇరాన్ ఆయుధాలపై రష్యా ఆధారపడటం తగ్గింది.

ఇరాన్ పతనాన్ని రష్యా ఇష్టపడదు. అలాగే, దాని కోసం యుద్ధం చేసేంత ముఖ్యమైన మిత్రదేశమూ కాదు. భవిష్యత్తులో ఈ లెక్కలు మారొచ్చు కానీ, ప్రస్తుతానికి రష్యా జోక్యం కేవలం మాటలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం, చైనా

ఫొటో సోర్స్, IRANIAN FOREIGN MINISTRY HANDOUT/EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, చైనాలో 2025 జులై 15న జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌ సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి (ఎడమ) స్వాగతం పలుకుతున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.

ఆర్థిక జీవనాధారంగా చైనా

అయతొల్లా అలీ ఖమేనీ హత్యను చైనా తీవ్రంగా ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల ప్రభుత్వాలను పడగొట్టే అమెరికా వ్యూహాలను బీజింగ్ ఏళ్లుగా వ్యతిరేకిస్తూనే ఉంది.

చైనా - ఇరాన్ బంధానికి ప్రధాన ఆధారం పరస్పర ప్రయోజనకరమైన ఆర్థిక భాగస్వామ్యమని బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ చైనా యూనిట్‌కు చెందిన షాన్ యువాన్ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు, అత్యంత ముఖ్యమైన ఎనర్జీ కస్టమర్ కూడా.

ఇరాన్‌పై అమెరికా ఏళ్ల తరబడి కఠినమైన ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, బీజింగ్ మాత్రం తెహ్రాన్‌కు ఆర్థిక జీవనాధారంగా నిలుస్తోంది. ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి తప్పుడు రిజిస్ట్రేషన్లతో నడిచే "ఘోస్ట్ ఫ్లీట్స్" నౌకల నెట్‌వర్క్ ద్వారా చైనా భారీ మొత్తంలో ఇరాన్ చమురును తక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది.

ఉదాహరణకు, 2025లో ఇరాన్ ఎగుమతి చేసిన చమురులో 80 శాతానికి పైగా చైనాయే కొనుగోలు చేసింది. పాశ్చాత్య మార్కెట్లు మూసుకుపోయినప్పటికీ, చైనా కొనుగోళ్ల ద్వారా వచ్చిన ఆదాయం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించుకోవడానికి, రక్షణ వ్యయాలకు నిధులు సమకూర్చుకోవడానికి ఇరాన్‌కు సహాయపడింది.

2021లో కుదుర్చుకున్న 25 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది. దీని ద్వారా ఇరాన్ మౌలిక సదుపాయాలు, టెలీకమ్యూనికేషన్ రంగాలలో వందల బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడులు వస్తాయని హామీ లభించింది.

చైనా 'సుదీర్ఘ వ్యూహం'

చరిత్రాత్మకంగా చూస్తే.. ఇరాన్ - ఇజ్రాయెల్, ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతల విషయంలో చైనా అనుసరిస్తున్న విధానం "స్ట్రాటజిక్ హెడ్జింగ్" (అంటే ఎటువైపు మొగ్గు చూపకుండా తన ప్రయోజనాలను కాపాడుకోవడం).

2025 వేసవిలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధంతో సహా, గతంలో ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారీ చైనా నిరంతరం "సంయమనం" పాటించాలని పిలుపునిస్తూనే ఉంది.

అదే సమయంలో, ఈ పరిస్థితికి "బాహ్య జోక్యం" కారణమని నిందించేది. ఇది అమెరికా విధానాలను ఉద్దేశించి చేసిన ప్రత్యక్ష విమర్శ అని మా ప్రతినిధి తెలిపారు.

గతంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణల్లో, తెహ్రాన్‌కు చైనా ఒక 'దౌత్య కవచం'లా పనిచేసింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాల తీవ్రతను తగ్గించడానికి తన వీటో అధికారాన్ని ఉపయోగించడం లేదా వీటో చేస్తామని బెదిరించడం ద్వారా ఇరాన్‌కు అండగా నిలిచింది. అయినప్పటికీ, చైనా ఎప్పుడూ నేరుగా సైనిక జోక్యం చేసుకోలేదు.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగేలా ప్రాంతీయ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా చూస్తూనే, పశ్చిమాసియాలో అమెరికాను చిక్కుల్లో పడేలా చేయడమే బీజింగ్ ప్రధాన వ్యూహమని మా ప్రతినిధి వివరించారు.

తెహ్రాన్‌లో గనుక పాశ్చాత్య అనుకూల ప్రభుత్వం ఏర్పడితే, అది చైనాకు ప్రపంచ రాజకీయాలపరంగా కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఎందుకంటే, చైనాకు తెహ్రాన్ కేవలం ఇంధనాన్ని అందించడమే కాకుండా, ఆ ప్రాంతంలో అమెరికా ప్రభావానికి వ్యతిరేకంగా ఒక బలమైన రాజకీయ శక్తిగా కూడా నిలుస్తోంది.

బ్రిక్స్, షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో ఇరాన్ సభ్య దేశంగా ఉంది. అంతేకాకుండా, మధ్య ఆసియా, కాకసస్, పశ్చిమాసియా ప్రాంతాలను కలిపే భౌగోళిక వారధిగానూ పనిచేస్తుంది.

ఒకవేళ ఇస్లామిక్ రిపబ్లిక్ గనుక పతనమైతే.. మాస్కో, బీజింగ్ బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్న మల్టీలేటరల్ మెకానిజం విశ్వసనీయత బలహీనపడే అవకాశం ఉంది. అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర చేయనంత వరకు, అక్కడి రాజకీయ, మిలిటరీ వ్యవస్థ అలాగే కొనసాగవచ్చు.

ఖమేనీ తర్వాత ఇరాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టే వారెవరైనా సత్సంబంధాలు కొనసాగించేలా బీజింగ్ తన అలవాటు ప్రకారం 'సుదీర్ఘ వ్యూహాన్ని' అనుసరిస్తుంది. అదే సమయంలో రష్యా కూడా తన ప్రయోజనాలు వెతుక్కునే ప్రయత్నాల్లో ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)