'తెల్లారకముందే ఇళ్లు కూల్చేశారు, నెత్తీనోరు కొట్టుకున్నా వినలేదు'.. ఖమ్మంలో ఏం జరిగింది?

ఖమ్మం
ఫొటో క్యాప్షన్, ఇక్కడ ఇళ్లు కట్టుకొని పదేళ్ల నుంచి ఉంటున్నామని కళమ్మ అంటున్నారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఊరికి దూరంగా చిన్నపాటి గుట్టలపై గుడిసెలు..

ఫ్లెక్సీలను పైకప్పుగా వేసుకున్న గూళ్లు..

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు..

నగరంలో అద్దెలు కట్టుకోలేక కరెంటు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా దాదాపు 10 ఏళ్లకి పైగా ఆ గుట్టలపైనే ఇళ్లు వేసుకుని నివసిస్తూ ఉన్నారు. కొందరు పైసాపైసా కూడగట్టుకుని చిన్నపాటి పక్కా ఇళ్లు కూడా నిర్మించుకున్నారు.

ఈలోగా నగరం విస్తరించింది. ఈ ఇళ్లు ఉన్న కాలనీ చుట్టూ డెవలప్ అయింది, రియల్‌ వెంచర్లు వెలిశాయి. గెస్ట్‌ హౌస్‌లు, విల్లాలు కొలువుదీరాయి. హైక్లాస్‌ అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల జిల్లా నూతన కలెక్టరేట్‌ కార్యాలయ భవనం కూడా ఈ కాలనీకి దగ్గర్లోనే వచ్చింది.

చుట్టూ పెద్ద పెద్ద భవంతుల మధ్య ఉన్న ఈ పూరి గుడిసెలు, రేకుల షెడ్లు, చిన్నచిన్న డాబా ఇళ్లను తొలగించాలని పాలకులు నిర్ణయించారు. ఖాళీ చేయించి ఇళ్లన్నీ కూల్చేశారు.

ఇందుకు అధికారులు చెబుతున్న వాదన ఇలా ఉంది..

"అవి ప్రభుత్వ భూములే, అక్కడ కొందరు పేదలు నివసిస్తున్న మాట కూడా నిజమే. కానీ, ఇటీవల ఆ పేదల ముసుగులో కొందరు దళారులు ప్రవేశించారు. ఆ స్థలాలను కాజేసే కుట్ర చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల విలువైన ఆ స్థలాలను కాపాడుకునేందుకే ప్రభుత్వం అలా చేసింది''.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఖమ్మం, కూల్చివేతలు

ఫొటో సోర్స్, Chakilam Manjula

ఫొటో క్యాప్షన్, కూల్చివేత సమయంలో సాయుధ పోలీసులు

అధికారులు చెబుతున్నది కూడా నిజమే అయినా అలాంటప్పుడు ఆ దళారులను కదా నియంత్రించాలి? పేదలు ఏం చేశారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నిరుపేదల ఇళ్లను ఎలా కూల్చివేస్తారు, ఇప్పుడు కనీసంగా గూడు లేని ఆ పేద ప్రజల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

కళ్ల ముందే తమ గూడు కూలిపోతే.. విలవిస్తూ రోడ్డు మీదకు వచ్చేసిన ఆ ప్రజలు చెబుతున్నదేంటి..? అధికారులు ఏమంటున్నారు?

తెలంగాణలోని ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని వినోభా నవోదయ కాలనీలో గత ఐదురోజులుగా వివాదాస్పదంగా మారిన ఇళ్ల తొలగింపు నేపథ్యంపై బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

ఖమ్మం, ఇళ్ల కూల్చివేత

ఫొటో సోర్స్, Chakilam Manjula

ఫొటో క్యాప్షన్, బుల్‌డోజర్‌తో ఇళ్ల కూల్చివేత దృశ్యం

'మా బతుకులు తెల్లారిపోయాయి'

"ఫిబ్రవరి 24 వేకువ జామున, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. నాలుగున్నర, ఐదుగంటల సమయంలో ఒక్కసారిగా వేలాదిమంది మా కాలనీలోని ఇళ్లపై పడ్డారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ఇళ్లు కూల్చడం మొదలుపెట్టారు. కాలనీ చుట్టూ ఆయుధాలతో అధికార సిబ్బందే, నెత్తీనోరు కొట్టుకున్నా వినలేదు. నా కళ్ల ముందే ఇల్లు కూల్చేశారు. నేను నా భర్త ఇద్దరమే ఉంటున్నాం. వృద్ధులం. మేం ఇప్పుడు ఏం పని చేసి మళ్లీ ఇల్లు కట్టుకోగలం" అని బాధితురాలు బెల్లంకొండ రమాదేవి బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

"పదేళ్ల కిందట గుడిసె వేసుకున్నాం. రూపాయి రూపాయి పోగేసుకుని 6 లక్షలు ఖర్చు పెట్టి చిన్నపాటి పక్కా ఇల్లు నిర్మించుకున్నాం. మా కష్టం కళ్ల ముందే ధ్వంసమైంది. ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పించి, తిరిగి ఇల్లు కట్టివ్వాలి'' అన్నారు.

"ఇక్కడ పదేళ్ల నుంచీ ఉంటున్నాం. తోట పనులకు వెళ్తూ పూట వెళ్లదీస్తున్నాం. తెల్లారేసరికి వచ్చి ఇల్లు కూల్చేశారు. నాకు ఎక్కడికీ వెళ్లే తోవలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు'' అని ఆ కూల్చేసిన ఇళ్ల శిథిలాల మధ్యనే మూడు రోజులుగా ఉంటున్న కళమ్మ అనే మహిళ విలపించారు.

ఖమ్మం, ఇళ్ల కూల్చివేత

'సామాను కూడా తీసుకెళ్లనివ్వలేదు'

"పదేళ్ల కిందట ఇక్కడ అడవిలా ఉండేది. పెద్దపెద్ద పాములు, విషపు జంతువులు ఉండేవి. చెట్లు, చేమలు అన్నీ సరిచేసుకుని గుడిసెలు, షెడ్లు వేసుకున్నాం. నాదొక చిన్న రేకుల షెడ్డు.. మేకలు కాసుకుంటూ ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఉంటున్నా. మంగళవారం ఇంకా తెల్లారనేలేదు. చీకటిగానే ఉంది. ఒక్కసారిగా వచ్చేసి.. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా బయటపడేసి, ఇల్లు కూల్చేశారు. కనీసం ఆ సామాను కూడా బయటకు తీసుకు వెళ్లనివ్వలేదు'' అని ఇల్లు కొల్పోయిన లింగయ్య అనే వ్యక్తి చెప్పారు.

ఖమ్మం, ఇళ్ల కూల్చివేత
ఫొటో క్యాప్షన్, లింగయ్య

"2018 నుంచి ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటున్నాం. నా భర్త అనారోగ్యంతో చనిపోతే పిల్లలతో ఇక్కడే ఉంటున్నాం. ఒక కొడుకు కూలిపనికి వెళ్తుంటే ఇంకో కొడుకు గవర్నమెంట్‌ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. ఇటీవల నాకు గుండె ఆపరేషన్‌ అయింది. ఒక్కసారిగా ఇల్లు కూల్చేసి.. అన్నీ ధ్వంసం చేసి పారేస్తే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి? '' అని జ్యోతి అనే మహిళ ప్రశ్నించారు.

ఖమ్మం, ఇళ్ల కూల్చివేత
ఫొటో క్యాప్షన్, ఇల్లు కూల్చొద్దంటూ ప్రాథేయపడినా తనను పక్కకు లాగి, ధ్వంసం చేసేశారని శాంతి అనే మహిళ అన్నారు.

'నోటీసులు కూడా ఇవ్వలేదు'

"ఏదో జరుగుతోందని మాకు సోమవారం కొంత సమాచారం వచ్చింది. అయితే గవర్నమెంటోళ్లు కదా.. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా ఇళ్లు కూలుస్తారని మేం సర్దిచెప్పుకున్నాం. కానీ, ఊహించిన దాని కంటే దారుణం చేసేశారు. వేలాదిమంది వచ్చి కాలనీని ధ్వంసం చేసేశారు. ఇది చాలా అన్యాయం. ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారు'' అని అక్కడ పాస్టర్‌గా పని చేస్తూ ఇల్లు కోల్పోయిన బాబూరావు ప్రశ్నించారు.

శాంతి అనే మరో బాధితురాలు మాట్లాడుతూ.. "ఇల్లు కూల్చొద్దంటూ ప్రాథేయపడినా నన్ను పక్కకు లాగి పడేసి ధ్వంసం చేసేశారు. మూడు రోజులుగా తెలిసినవారి ఇళ్లకు వెళ్లి ఉంటున్నా, కళ్ల ముందే ఇల్లు కోల్పోవడం తల్చుకుంటే ఏడుపొస్తోంది'' అని కన్నీరు పెట్టుకున్నారు.

ఖమ్మం, ఇళ్ల కూల్చివేత, ఆర్డీవో నరసింహారావు
ఫొటో క్యాప్షన్, ఆ స్థలం భూదాన్‌ బోర్డు పేరుతో ఉన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ పట్టాలు కేటాయించలేదని ఖమ్మం ఆర్డీవో నరసింహారావు బీబీసీకి తెలిపారు.

అధికారులు ఏమంటున్నారు?

దశాబ్దాల క్రితం ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా చేపట్టిన భూదాన్‌ ఉద్యమంతో స్పూర్తి పొందిన కొందరు దాతలు.. ఖమ్మం నగర సమీపంలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో సుమారు 31 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలంటూ ప్రభుత్వానికి ఇచ్చారు.

అయితే భూదాన్‌ బోర్డు పేరుతో స్థలం ఉన్నప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా అక్కడ ఎవరికీ పట్టాలు కేటాయించలేదని ఖమ్మం ఆర్డీవో నరసింహారావు బీబీసీకి తెలిపారు.

"పేదలు అక్కడ ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న మాట నిజమే. పదేళ్లుగా అక్కడ 500 నుంచి 600 వరకు ఇళ్లు వెలిశాయి. అయితే ఇటీవల కాలంలో అక్కడ అర్హులైన పేదల కంటే దళారుల పాత్ర ఎక్కువైంది. ఈ క్రమంలో విలువైన భూమి అన్యాక్రాంతం కాకుండా హైకోర్టు ఆదేశాల మేరకే ఇళ్లు కూల్చివేశాం'' అని ఆర్డీవో వెల్లడించారు.

ఇందుకోసం ఎవరికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు నగరంలోని అంబేద్కర్‌ భవన్‌ సమీప ప్రాంగణానికి తరలించామని, అక్కడ వారికి కొద్దిరోజుల పాటు వసతి కల్పించామని ఆర్డీవో నరసింహారావు తెలిపారు.

బీబీసీ అక్కడికి వెళ్లి పరిశీలించగా.. పదుల సంఖ్యలో మాత్రమే అక్కడ ఉన్నారు. ఇళ్ల కూల్చివేత తర్వాత శిథిలాల మధ్య మిగిలిన వస్తువులను తీసుకుని తలదాచుకుంటున్నారు.

అయితే అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని అధికారులు బలవంతం చేస్తున్నారని నర్సమ్మ అనే మహిళ ఆరోపించారు. దీంతో, తిరిగి కాలనీకే వచ్చి శిథిలాల మధ్యనే కాలం వెళ్లదీస్తున్నామని ఆమె చెప్పారు.

ఖమ్మం ఇళ్లు కూల్చివేత

'అర్హులకు వేరే చోట ఇస్తాం'

ఇక్కడున్న అర్హులైన పేదలను గుర్తించి, ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలాలు ఇచ్చే యత్నం ప్రభుత్వం చేస్తుందని ఆర్డీవో నరసింహారావు తెలిపారు. ఆ మేరకు సర్వే కూడా మొదలైందని చెప్పారు.

"ముందుగా ప్రత్యామ్నాయం చూపించి కదా, ఇళ్లను తొలగించాల్సింది'' అని బీబీసీ ప్రశ్నిస్తే, ఈ ఇళ్ల కూల్చివేత తర్వాత తనకు బదిలీ అయిందని అంతవరకే చెప్పగలనని ఆర్డీవో నరసింహారావు అన్నారు.

ఘటనపై ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యని బీబీసీ ఫోన్‌లో సంప్రదించగా.. "అంతా రెవెన్యూ వాళ్లు హ్యాండిల్‌ చేశారు. మేం మ్యాన్‌పవర్, మిషినరీ మాత్రమే సప్లయ్‌ చేశాం. డీటెయిల్స్‌ అన్నీ వారికే తెలుసు. రెవెన్యూ వాళ్లనే సంప్రదించండి'' అని చెప్పారు.

దీనిపై జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ను బీబీసీ ప్రతినిధి కలిసి మాట్లాడే ప్రయత్నం చేయగా, ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

"అది అయిపోయింది. ఇక దాని గురించి మాట్లాడలేం'' అని చెప్పారు.

ఖమ్మం, ఇళ్ల కూల్చివేత

ఫొటో సోర్స్, Chakilam Manjula

ఫొటో క్యాప్షన్, కూల్చివేత సమయంలో సాయుధ పోలీసులు

సమాచారం లేదన్న ఎంపీ, అందుబాటులోకి రాని ఎమ్మెల్యే

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని బీబీసీ కలిసి ఇళ్ల కూల్చివేత విషయం ప్రస్తావించగా.. "దానిపై నాకు సమాచారం లేదు. అయినా నేను మాట్లాడే సబ్జెక్ట్‌ కాదు'' అని సమాధానమిచ్చారు.

600 ఇళ్ల కూల్చివేత చిన్న విషయం కాదు కదా, మీ పరిధి కాదంటారేమిటి? అని ప్రశ్నిస్తే.. "అధికారులు నగర ప్రజాప్రతినిధులు హ్యాండిల్‌ చేస్తున్నారు. వారే పక్కా సమాచారం చెప్పగలరు'' అని ఎంపీ చెప్పారు.

ఇదే విషయంపై ఖమ్మం ఎమ్మెల్యే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడేందుకు బీబీసీ యత్నిస్తోంది. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. రాగానే ఇక్కడ అప్‌డేట్‌ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)