ఒకరు భారత్, మరొకరు పాకిస్తాన్ తరఫున యుద్ధం చేసిన అన్నదమ్ముల కథ

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, సాహిబ్‌జాదా యూనుస్ ఖాన్, సాహిబ్‌జాదా యాకూబ్

ఫొటో సోర్స్, Saman Ali Khan

ఫొటో క్యాప్షన్, సాహిబ్‌జాదా యూనుస్ ఖాన్(ఎడమ), సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్(కుడి)
    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 10 నిమిషాలు

సర్ అబ్దుస్ సమద్ ఖాన్ రాంపూర్ సంస్థానానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన పెద్ద కుమారుడు యూనుస్ ఖాన్ మొదట దేహ్రాదూన్‌లోని కల్నల్ బ్రౌన్ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత ఆయన ఇండియన్ మిలిటరీ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడి నుంచి గఢ్వాల్ రైఫిల్స్‌లో చేరారు.

సమద్ ఖాన్ చిన్న కొడుకు సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ కూడా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి ఎంపికయ్యారు. అక్కడి నుంచి 1940లో 18వ కింగ్ ఎడ్వర్డ్ అశ్వికదళంలో నియమితులయ్యారు.

వారిద్దరూ రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేశారు. ఇండియన్ జనరల్ సర్వీస్ మెడల్‌ పొందారు.

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరఫున పోరాడటానికి యాకూబ్ ఆఫ్రికా వెళ్ళారు. అక్కడ ఈజిప్ట్, లిబియా సరిహద్దుకు దగ్గరలో ఉన్న తోబ్రూక్ యుద్ధంలో ఇటాలియన్ దళాలు ఆయన్ను బంధించాయి.

ఆయన పాకిస్తాన్, భారత్‌కు చెందిన ఇద్దరు ‘భవిష్యత్ జనరల్స్’ యాహ్యా ఖాన్, పి.పి. కుమారమంగళంతో కలిసి తప్పించుకున్నారు. యాహ్యా, కుమారమంగళం పూర్తిగా అక్కడి నుంచి బయటపడినా యాకూబ్ మాత్రం మళ్లీ దొరికిపోయారు.

యుద్ధ ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఇటాలియన్, జర్మన్ భాషలు నేర్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో ఆయన విడుదలయ్యారు. స్నేహితులు ఆయన్ను "జైకబ్" అని పిలిచేవారు. ఈ సమయంలో ఆయన అన్న యూనుస్ ఖాన్ బర్మాలో ఉండేవారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Saman Ali Khan

ఫొటో క్యాప్షన్, సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్

కుటుంబ విభజన

దేశ విభజన సమయంలో అన్న సాహిబ్‌జాదా యూనుస్ ఖాన్ భారత సైన్యంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన తమ్ముడు సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంలో చేరారు.

యాకూబ్ ఖాన్ పాకిస్తాన్‌కు బయలుదేరిన విషయాన్ని 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' లో డొమినీక్ లాపియర్, లారీ కొలిన్స్ వివరిస్తూ... "రాత్రి భోజనాల సమయంలో పాకిస్తాన్‌కు వెళ్లాలనే తన నిర్ణయం గురించి యాకూబ్ ఖాన్ తన తల్లికి చెప్పినప్పుడు అది విని ఆమె ఆశ్చర్యపోయారు. ఆమె చాలా కోప్పడ్డారు కూడా" అని రాశారు.

"'మనం రెండు శతాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నాం. మన కుటుంబానికి చెందినవారి సమాధులు ఇక్కడ ఉన్నాయి. నాకు రాజకీయాలు అర్థం కావు. కానీ ఒక తల్లిగా నా కోరికలు ఇలాగే ఉంటాయి. మనం శాశ్వతంగా విడిపోతున్నామని నేను భయపడుతున్నాను'" అని ఆమె అన్నారు''.

కానీ యాకూబ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మరుసటి రోజు ఉదయం రాంపూర్ నుంచి బయలుదేరారు.

"తల్లి ఆయనకు వీడ్కోలు పలికేటప్పుడు శోకానికి చిహ్నంగా తెల్లటి చీర ధరించారు. ఆమె ఖురాన్ నుంచి శ్లోకాలు చదివారు. 25 ఏళ్లగా వాళ్ల ఇంట్లో వంటచేస్తున్న రామ్‌లాల్, డ్రైవర్ కుందన్ సింగ్ కన్నీళ్లతో వీడ్కోలు పలికారు" అని లాపియర్, కొలిన్స్ రాశారు.

"పాకిస్తాన్‌లో స్థిరపడిన తర్వాత తిరిగి వచ్చి తన వస్తువులన్నీ తీసుకెళ్తానని ఆయన తన కుటుంబానికి చెప్పారు. కానీ యాకూబ్ ఎప్పుడూ తన పూర్వీకుల ఇంటికి తిరిగి రాలేదు. తన తల్లి ముఖాన్ని కూడా మళ్లీ చూడలేదు".

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Vikas Publishing House

ఫొటో క్యాప్షన్, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పుస్తకంలో యూనుస్ ఖాన్, యాకూబ్ ఖాన్ గురించి వివరించారు.

కశ్మీర్ పోరాటంలో ఇద్దరు సోదరులు

భారత్ విడిచి వెళ్ళిన కొన్ని నెలలకే సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ కశ్మీర్‌లోని మంచుకొండల్లో పాకిస్తాన్ సైన్యంలోని ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహించారు.

"పాకిస్తాన్ దళాలను ఆపడానికి గఢ్వాల్ రెజిమెంట్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. యాకూబ్‌ఖాన్‌లానే ఆ కంపెనీకి కూడా ఒక ముస్లిం అధికారి నాయకత్వం వహించారు" అని లాపియర్, కొలిన్స్ రాశారు.

"జూలై 1947లో ఆయన పాకిస్తాన్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. భారత సైన్యంలోనే ఉన్నారు. ఆ అధికారి రాంపూర్ నివాసి కూడా. ఆయన పేరు యూనుస్ ఖాన్. ఆయన సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ అన్న" అని రాశారు.

కశ్మీర్ యుద్ధభూమిలో ఇద్దరు సోదరులు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. అప్పటికి ఇద్దరూ మేజర్లుగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్ తరఫున ఒకరు, భారత్ తరఫున మరొకరు వారివారి బెటాలియన్లకు నాయకత్వం వహిస్తున్నారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Saman Ali Khan

ఫొటో క్యాప్షన్, యూనుస్ ఖాన్(ఎడమ వైపు), యాకూబ్ ఖాన్(కుడి వైపు)

కాల్పుల ఘటనపై భిన్న కథనాలు

పాకిస్తానీ జర్నలిస్ట్ హమిద్ మీర్ తన 'ది స్టోరీ ఆఫ్ టూ ఖాన్స్' అనే వ్యాసంలో "మేజర్ యూనుస్ ఖాన్ తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ ఆయన తమ్ముడు యాకూబ్ ఖాన్‌ను గాయపరిచింది" అని రాశారు.

"గాయపడిన వ్యక్తి తన తమ్ముడు అని తెలిసిన తర్వాత 'బాధపడకు చిన్నా, మనం సైనికులం, మనం మన విధిని నిర్వర్తించాము' అని యూనుస్ ఖాన్ అన్నారు. ఆ సమయంలో కల్నల్‌గా పనిచేస్తున్న సామ్ మానెక్‌షా ఆ తర్వాత యూనుస్ ఖాన్ ధైర్యాన్ని ప్రశంసించారు"

కానీ కల్నల్ యూనస్ కోడలు సమన్ అలీ ఖాన్ ఈ కథ పూర్తిగా నిజం కాదని చెప్పారు.

"కశ్మీర్ యుద్ధంలో ఇద్దరు సోదరులు ఒకరినొకరు ఎదుర్కొన్నారు. కానీ యాకూబ్‌ను యూనస్ కాల్చలేదు. దీని గురించి నేను మా అత్తయ్యను, నా భర్తను అడిగాను. అలాంటి సంఘటన జరగలేదని వారు చెప్పారు. మేం ఒకే యుద్ధరంగంలో పోరాడుతున్నామని తర్వాతే తెలిసిందని మా మావయ్య.. అత్తయ్యతో చెప్పారు" అని సమన్ వివరించారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Saman Ali Khan

ఫొటో క్యాప్షన్, యూనుస్ ఖాన్ కోడలు సమన్ అలీ ఖాన్

యూనస్ అభినందన సందేశం

ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు ఇద్దరు సోదరుల మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఇద్దరూ సైన్యంలో కొనసాగారు.

1960లో సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ కోల్‌కతాకు చెందిన తూబా ఖలీలీ అనే భారతీయ అమ్మాయిని వివాహం చేసుకున్నప్పుడు అన్నయ్య యూనుస్ ఆయనకు అభినందన సందేశం పంపారు.

యాకూబ్ ఖాన్ మేనకోడలు మునీజా షంసీ తన 'ఇన్ మెమోరియమ్ సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ మై అంకుల్' అనే వ్యాసంలో కొన్ని వివరాలు రాశారు.

"పెళ్లి సమయంలో మామ ఒక బ్రిగేడియర్. నవాబ్, బేగం రాంపూర్ ప్రత్యేకంగా భారత్ నుంచి కరాచీకి ఆయన వివాహానికి హాజరు కావడానికి వచ్చారు. అధ్యక్షుడు(పాకిస్తాన్) అయూబ్ ఖాన్ వారికి ప్రభుత్వ అతిథుల హోదా ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత ఆయన పాకిస్తాన్ సైన్యంలో అతి పిన్న వయస్కుడైన మేజర్ జనరల్ అయ్యారు" అని రాశారు.

1965లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ ఒక పాకిస్తాన్ విభాగానికి నాయకత్వం వహించారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Muniza Shamsi

ఫొటో క్యాప్షన్, యాకూబ్ ఖాన్ మేనకోడలు మునీజా షంసీ

సైనిక చర్యకు అనుకూలంగా లేని యాకూబ్

1971 నాటికి సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. తూర్పు పాకిస్తాన్‌లో పాకిస్తాన్ సైన్యానికి కమాండర్‌గా నియమితుడయ్యారు.

1971 మార్చిలో షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్‌పై సైనిక చర్య ప్రారంభించాలని ఆదేశాలు అందినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధబలగాలను ఉపయోగించవద్దని యాకూబ్ ఖాన్ ‘సైనిక నియంత’ జనరల్ యాహ్యా ఖాన్‌కు సలహా ఇచ్చారు.

"చర్చలు విఫలమైనప్పుడు గవర్నర్ అడ్మిరల్ అహ్‌సన్, నా మామ ఇద్దరూ సమస్యకు రాజకీయ పరిష్కారం మాత్రమే ఉంటుందని సలహా ఇచ్చారు. కానీ యాహ్యా ఖాన్, ఆయన సలహాదారులు సైనిక పరిష్కారానికి మొగ్గు చూపారు" అని పాకిస్తానీ రచయిత్రి, యాకూబ్ మేనకోడలు మునీజా షంసీ రాశారు.

"రాబోయే సంక్షోభం గురించి మామకు పూర్తిగా తెలుసు. ఈ నిర్ణయంలో భాగం కావడం కంటే తన పదవికి రాజీనామా చేయడమే ఉత్తమమని ఆయన భావించారు. 1971, మార్చి 5న ఆయన తన రాజీనామాను జనరల్ యాహ్యాఖాన్‌కు పంపారు. ప్రారంభంలో ఆయన యాహ్యా కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది కానీ తరువాతి సంఘటనలు ఆయన చెప్పింది నిజమేనని నిరూపించాయి" అని షంసీ రాశారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనరల్ యాహ్యాఖాన్(ఎడమ), రిచర్డ్ నిక్సన్(కుడి)ఫైల్ ఫోటో

భుట్టోను ఉరితీయొద్దని సలహా

సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్‌కు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, రష్యన్, పర్షియన్,అరబిక్ సహా 10 భాషల్లో ప్రావీణ్యం ఉందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోకు తెలుసు.

ఢాకాలో ఉన్నప్పుడు ఆయన కొద్దిగా బెంగాలీ కూడా నేర్చుకున్నారు. 1972లో ఫ్రాన్స్‌లో పాకిస్తాన్ రాయబారిగా నియమితులయ్యారు. 1977లో భుట్టోను జనరల్ జియా-ఉల్-హక్ పదవీచ్యుతుణ్ని చేసినప్పుడు యాకూబ్ మాస్కోలో పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు.

"ప్రభుత్వంలో భాగమైనప్పటికీ భుట్టోను ఉరితీయవద్దని జనరల్ జియాకు సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ సలహా ఇచ్చారు. కానీ జియా ఆయన సలహాను పట్టించుకోలేదు. ఇద్దరిమధ్యా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ జియా ఉల్ హక్1982లో సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్‌ను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా నియమించారు" అని హమిద్ మీర్ రాశారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాకూబ్ ఖాన్, ఐకే గుజ్రాల్

35ఏళ్ల తర్వాత దిల్లీలో కలుసుకున్న సోదరులు

1982లో యాకూబ్ ఖాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా న్యూదిల్లీకి వచ్చారు.

"35 ఏళ్ల తర్వాత యాకూబ్, యూనుస్ దిల్లీలో కలిశారు. ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను. మా నాన్న వారిద్దరినీ తన ఇంటికి ఆహ్వానించారు. వాళ్లు కారు దిగి లోపలికి వచ్చినప్పుడు ఆ దృశ్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. సోదరులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని బాగా ఏడ్చారు" అని యూనుస్ కోడలు సమన్ ఖాన్ గుర్తుచేసుకున్నారు.

"మా నాన్న యాకూబ్‌ను తన పాత ముద్దుపేరు అయిన నట్టాతో పిలిచేవారు. యాకూబ్ పొడవుగానే ఉంటారు. కానీ ఆయన సోదరులిద్దరూ ఆయన కంటే ఎత్తుగా ఉంటారు. దీంతో వారు ఆయన్ని నట్టా అని పిలిచేవారు. కఠినమైన మనస్తత్వం ఉంటుందని భావించే ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు బహిరంగంగా అలా ఏడవడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయా"

"ఆ క్షణంలో వారి మధ్య రక్తసంబంధం స్పష్టంగా కనిపించింది. వారిద్దరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కశ్మీర్‌లో జరిగిన పోరాటాల గురించి వారిద్దరూ ప్రస్తావించలేదు" అని ఆమె రాశారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Saman Ali Khan

ఫొటో క్యాప్షన్, యూనుస్ ఖాన్(ఫైల్ ఫోటో)

పదవీ విరమణ తర్వాత అలీగఢ్‌లో స్థిరపడిన యూనుస్ ఖాన్

యూనుస్ ఖాన్ భారత్ చివరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి, భారత్ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌లకు ఏడీసీగా పనిచేశారు.

"తర్వాత ఆయన జమ్మూకశ్మీర్ గవర్నర్‌కు ఏడీసీగా కూడా పనిచేశారు. 1962 భారత్-చైనా యుద్ధంలో ఆయన కశ్మీర్‌లో ఉన్నారు, 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో బరేలీలో ఉన్నారు. ఆయన దేశభక్తుడు. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. సాధారణ జీవితాన్ని గడపాలని నమ్మేవారు" అని యూనుస్‌పై పరిశోధనలు చేసిన నిహారిక సింగ్ అంటున్నారు.

"ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు. తెరవెనక ఉండటానికి ఇష్టపడేవారు. 1969లో భారత సైన్యం నుంచి పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసిన మరుసటి రోజు కల్నల్ యూనుస్ ఎప్పటిలాగే తయారవుతున్నారని, తన సైనిక యూనిఫాం ధరించి, అద్దంలో తనను తాను చూసుకుంటున్నారని, తర్వాత పదవీ విరమణ గుర్తుకు వచ్చి ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయని, యూనస్ కుమారుడు నదీమ్ ఖాన్ నాతో చెప్పారు'' అని నిహారిక సింగ్ తెలిపారు.

''నేను ఆయన రెండో కొడుకును వివాహం చేసుకున్నాను. యూనుస్ ఖాన్ చాలా క్రమశిక్షణతో పెరిగారు. ప్రతి పనికి ఒక నిర్ణీత సమయం ఉండేది. సాయంత్రం నడకకు వెళ్లేవాడు. మంచి దుస్తులు ధరించడం అంటే చాలా ఇష్టం" అని యూనుస్ ఖాన్ కోడలు సమన్ అలీ ఖాన్ చెప్పారు.

"ఆయన భారతీయ దుస్తులు ధరించాలనుకుంటే కుర్తా పైజామా, షేర్వాణీ చాలా బాగా కుట్టించుకునేవారు. పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు వాటిని పూర్తిగా బ్రిటిష్ శైలిలో వేసుకునేవారు. శీతాకాలం, వేసవిలో ఆయన ఆహార్యం భిన్నంగా ఉండేది"

"చలికాలంలో వేడి సూప్, వేడి ఆహారాన్ని ఇష్టపడేవారు. వేసవిలో చల్లని సూప్, సలాడ్‌ను ఇష్టపడేవారు. సైనికుడైనప్పటికీ ఆయనకు భావోద్వేగాలు చాలా ఎక్కువ. ఎక్కువ అవకాశాలు లేనివారి విషయలో చాలా శ్రద్ధ వహించేవారు. ఆయన చాలా ఉన్నతమైన నైతిక స్వభావం గలవారు" అని చెప్పారు.

సైన్యం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత యూనుస్ ఖాన్ అలీగఢ్‌లోని అఫ్తాబ్ మంజిల్‌ను తన నివాసంగా చేసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో గౌరవ పరిపాలనా అధికారిగా పనిచేశారు. 1984 జనవరి 30న మరణించారు. ఆయనను అలీగఢ్‌లో ఖననం చేశారు.

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1999లో భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది.

‘పాకిస్తాన్ విదేశాంగ విధానంలో యాకూబ్ కీలక పాత్ర’

ఆయన తమ్ముడు సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ చాలా సంవత్సరాలు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. యాకూబ్ ఉర్దూ కవిత్వాన్ని, ముఖ్యంగా గాలిబ్ కవిత్వాన్ని బాగా చదివేవారు. ఆయనకు చిత్రలేఖనం అంటే కూడా ఇష్టం.

"ఆయన దుస్తులు చాలా స్టైలిష్‌గా ఉండేవి. ఆయన సూట్లు, షేర్వాణీలు లండన్‌లోని ప్రసిద్ధ సేవిల్ రోలో కుట్టించుకునేవారు. అఫ్గానిస్తాన్‌లో సోవియట్ దళాలను వ్యతిరేకించడంలో, పాకిస్తాన్ విదేశాంగ విధానంలో ఆయన ఒక ముఖ్యమైన భాగం" అని మునీజా షంసీ రాశారు.

"1986లో జనరల్ జియా తన విదేశాంగ మంత్రికి కార్గిల్‌ను స్వాధీనం చేసుకునే ప్రణాళిక గురించి చెప్పినప్పుడు ఆయన దానిని పూర్తిగా తిరస్కరించారు. జియా ఆయన సలహాను గౌరవించి ఆ ప్రణాళికను విరమించుకున్నారు" అని హమిద్ మీర్ రాశారు.

"కొన్ని సంవత్సరాల తరువాత బెనజీర్ భుట్టో తన క్యాబినెట్ సహచరులతో కార్గిల్ కొండలను స్వాధీనం చేసుకోవాలని తన సైనిక కమాండర్లకు చెప్పారు. యాకూబ్ మళ్లీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి బెనజీర్ భుట్టోను అలా చేయవద్దని ఒప్పించారు"

"1999లో మూడోసారి పాకిస్తాన్ సైన్యం ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా ఈ ప్రణాళికను అమలు చేయడానికి ప్రయత్నించింది. దీని వల్ల పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడింది. అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది"

భారత్, పాకిస్తాన్, దేశ విభజన, ముంబై, దిల్లీ, కరాచీ, యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి క్రిస్టోఫర్‌తో యాకూబ్ ఖాన్

సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ మరణం

సాహిబ్‌జాదా యాకూబ్ ఖాన్ పాకిస్తాన్‌లో ఎక్కువ కాలం విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆయన జియా-ఉల్-హక్, బెనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్‌ల ఆధ్వర్యంలో పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ దళాల ఉపసంహరణ ఖరారైంది.

తన చివరి రోజుల్లో ఆయన నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి అనధికారిక సలహాదారుగా పనిచేశారు.

"ఒకసారి ఆత్మకథ రాయమని ఆయనతో అన్నప్పుడు ఆయన సమాధానం - నా విజయాలు, బాధలను ప్రదర్శించడం నాకు ఇష్టం లేదు. భారత్‌కు సేవ చేసిన నా సోదరుడి గురించి ప్రస్తావించకుండా నేను నా కథను చెప్పలేను. మేం ఒకరిపై ఒకరం పోరాడాం. ఆయన పని ఆయన చేశారు. నా పని నేను చేశాను"అని చెప్పారని హమిద్ మీర్ రాశారు.

తన అన్న మరణించిన దాదాపు 32 ఏళ్ల తర్వాత, తమ్ముడు 2016 జనవరి 26న కన్నుమూశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)