'ఒక్క మలుపు' ఆమె జీవితంలో ఎంత ప్రమాదానికి దారితీసిందంటే..

కేరళ, కర్ణాటక, ట్రెక్కింగ్, స్పోర్ట్స్, మహిళలు

ఫొటో సోర్స్, Saranya GS

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

ఒక్క మలుపు దగ్గర చేసిన పొరపాటుతో టెకీ శరణ్య కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లా తాడియాండమాల్ ట్రెకింగ్ మార్గంలో దారితప్పిపోయారు.

నాలుగు రోజుల పాటు అదృశ్యమైపోయిన ఆమె కేవలం నీరు తాగి ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు తన తదుపరి ట్రెక్'కు వెళ్లడానికీ ఆమె సంకోచిస్తున్నారు.

కేరళలోని తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల శరణ్య వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వాస్తవానికి ఆమె వచ్చే నెలలో అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ట్రెకింగ్‌కు వెళ్లాలని ఇంతకుముందే ప్లాన్ చేసుకున్నారు.

తనకు ఇష్టమైన ట్రెకింగ్ కోసం ఇప్పుడామె సంకోచించడానికి ప్రధాన కారణం కుటుంబ సభ్యులు అనుమతిస్తారో లేదోనని మాత్రమే కాదు, కొన్ని ఇతర కారణాలూ ఉన్నాయి.

''ఇప్పుడు ప్రజలు నన్ను గుర్తుపడుతుంటారు. ఇది స్వేచ్ఛగా ట్రెకింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు'' అని శరణ్య బీబీసీతో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కూర్గ్‌లోని మడికేరి అటవీ ప్రాంతంలో రెండున్నర గంటల ట్రెకింగ్‌కు వెళ్లిన శరణ్యకు ఎదురైన భయానక అనుభవం తర్వాత.. ట్రెకింగ్ మార్గం, భద్రతా నిబంధనల ఖరారు కోసం నాలుగు రోజుల పాటు ట్రెకింగ్‌ను నిలిపేసింది అటవీ శాఖ.

''ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా స్పష్టమైన సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు సేఫ్టీ ప్రోటోకాల్‌ అమలు చేస్తున్నాం'' అని మడికేరి డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వి.అభిషేక్ బీబీసీతో చెప్పారు.

''ఒక విధానాన్ని రూపొందిస్తున్నాం. ఇకపై ట్రెకింగ్ బృందాలతో పాటు స్థానిక గిరిజన తెగలకు చెందిన వ్యక్తులు కూడా వెళ్తారు'' అని ఆయన వెల్లడించారు.

కేరళ, కర్ణాటక, ట్రెక్కింగ్, స్పోర్ట్స్, మహిళలు

ఫొటో సోర్స్, Saranya GS

ఫొటో క్యాప్షన్, రెస్క్యూ టీమ్‌ సభ్యులతో శరణ్య

అసలేం జరిగింది?

శరణ్య ట్రెకింగ్ కోసం అరణ్య విహార్ వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 2న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

''చెక్‌పోస్ట్ వద్దకు ఆమె ఒంటరిగా వచ్చారు. పది మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి, అటవీ సిబ్బందిని తోడుగా పంపించాం. ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ట్రెకింగ్‌కు వారిని అనుమతించాం'' అని అభిషేక్ చెప్పారు.

''వారు వెళ్లింది చాలా చిన్న, సులభమైన మార్గం. మిగిలిన వారంతా మధ్యాహ్నం 12:30 గంటలకల్లా తిరిగి వచ్చారు. కానీ, ఆమె (శరణ్య) మాత్రం కనిపించలేదు'' అని అన్నారు.

''శరణ్య బస చేసిన హోమ్‌స్టే యజమానికి ఫోన్ చేస్తే, ఆమె దారితప్పిపోయారనే విషయం అర్థమైంది'' అని ఆయన వివరించారు.

ఈ సమాచారం అందగానే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గాలింపు కోసం తమ బృందాన్ని పంపించారు. వారితో పాటు కర్ణాటక పోలీసు శాఖకు చెందిన యాంటీ నక్సల్ ఫోర్స్ (ఏఎన్‌ఎఫ్)ను కూడా రంగంలోకి దించారు.

ఆ రెస్క్యూ టీమ్‌లో దాదాపు 70 నుంచి 80 మంది వరకూ పనిచేశారని అభిషేక్ చెప్పారు.

కేరళ, కర్ణాటక, ట్రెక్కింగ్, స్పోర్ట్స్, మహిళలు

ఫొటో సోర్స్, Saranya GS

ఫొటో క్యాప్షన్, కేరళ నుంచి ట్రెకింగ్ కోసం కర్ణాటక వెళ్లిన శరణ్య

'గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినా... '

ట్రెకింగ్‌కు వెళ్లడం శరణ్యకు ఇదేమీ తొలిసారి కాదు. గత ఏడెనిమిదేళ్లుగా కర్ణాటకలో చిక్కమగ్‌ళూరులోని కుద్రేముఖ్, బ్రహ్మగిరి హిల్స్‌, మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న హరిహర్ కోట వంటి ప్రాంతాలలో ఆమెకు ట్రెకింగ్ అనుభవం ఉంది.

''ఉదయం 10:45 గంటలకు వెనుదిరిగాం. నా కంటే ముందు ఇద్దరు వెళ్తున్నారు. వెనుక కూడా కొంతమంది ఉన్నారు. వాళ్లొక రాయిపై కూర్చున్నారు. వాళ్లు వచ్చేవరకూ ఎదురుచూద్దామని ఆగాను'' అని శరణ్య చెప్పారు.

''ఆమె ఏదో చూడటానికి పక్కకు వెళ్లారని, తిరిగొచ్చేసరికి మిగిలినవారు వెళ్లిపోయారనే విషయం.. ఆమెతో మాట్లాడిన తర్వాత తెలిసింది'' అని అభిషేక్ అన్నారు.

తాను తిరిగివచ్చి చూసేసరికి రాయిపై కూర్చొన్నవారు కనిపించలేదని శరణ్య చెప్పారు.

''అప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాను. అదేమో ఎడమ వైపునకు వెళ్లి, నేరుగా నడవమని సూచించింది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. దారి తప్పిపోయానని అర్థమైంది'' అని ఆమె అన్నారు.

''సాయంత్రం 6:45 గంటల వరకూ నడుస్తూనే ఉన్నాను. మరోవైపు హోమ్‌స్టే యజమానిని ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ, ఏ నంబరుకూ కనెక్ట్ కాలేదు. మధ్యాహ్నం సుమారు 2:45 గంటల సమయంలో నా ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది'' అని చెప్పారు.

శరణ్య చివరి ఫోన్ కాల్ చేసేటప్పటికే, ఆమెను పికప్ చేసుకోవాలని హోమ్‌స్టే యజమాని చెక్‌ పోస్ట్ వద్దకు వచ్చేసి వేచి చూస్తున్నారు.

''నేను దారితప్పిపోయానని ఆయనకు చెప్పాను. అలాగే, చెక్‌పోస్ట్ వారికి సమాచారం అందించాలని కోరాను. కానీ, ఆ విషయం ఆయనకు అర్థమైందని అనుకోవట్లేదు. మా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని నా స్నేహితుడిని కోరుతూ టెక్స్ట్ మెసేజ్ రాశాను. కానీ, అది పంపేలోపే నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోయింది'' అని శరణ్య చెప్పారు.

సాయంత్రం 6:45 గంటల సమయంలో ఆమెకు ఒక చిన్నకాలువ, రాళ్లతో కూడిన ప్రదేశం కనిపించింది. ''చీకటిలో నడవడం సురక్షితం కాదని అర్థమైంది. ఆ బండరాళ్లపైనే ఆగిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేకపోయింది'' అని అన్నారు.

ఉదయం తనతోపాటు తెచ్చుకున్న ఒకే ఒక్క అరటి పండు అప్పటికే ఆమె తినేశారు. తనవద్దనున్న అరలీటర్ నీళ్ల సీసా కూడా ఖాళీ అయిపోయింది.

''నేను భయపడలేదు కానీ, వాలు నుంచి జారిపోయి బండరాయిపై పడిపోయినప్పుడు మాత్రం కంగారుపడ్డాను'' అని శరణ్య చెప్పారు.

ఇక తాను ఏమి చేయాలనేదీ ఆ సమయంలోనే ఆమెకు స్పష్టత వచ్చింది.

''మనోధైర్యం కోల్పోయి కంగారు పడాల్సిన సమయం ఇది కాదని నాకు నేనే చెప్పుకున్నాను. నిజానికి స్వభావరీత్యా నేనేమీ అంత ప్రశాంతంగా ఉండే వ్యక్తిని కాదు'' అని శరణ్య చెప్పారు.

ఆ ప్రాంతంలోనే ఆమె సుమారు 50 నిమిషాల పాటు నిద్రపోయారు.

''రాత్రి 7:50 గంటల వరకూ నిద్రపోయాను. నిద్ర లేచిన తర్వాత పరిసరాలను గమనిస్తూనే ఉన్నాను. నలువైపుల నుంచి ఏవో కొన్ని శబ్దాలు వినిపించేవి. కానీ అక్కడ ఏనుగుల పేడ కానీ, అడవి పిల్లుల పాదముద్రలు కానీ కనిపించలేదు'' అని చెప్పారు.

ఆమెకు ఒకే ఒక్క విషయంలో బాధ కలిగింది.

''అదే నేను శిఖరం పైకి వెళ్లి ఉంటే బాగుండేది. అక్కడి నుంచి ఆ ప్రాంతమంతా కనిపించేది. నేను కూడా ఇతరులకు కనిపించే అవకాశం ఉండేది'' అని శరణ్య అన్నారు.

కేరళ, కర్ణాటక, ట్రెక్కింగ్, స్పోర్ట్స్, మహిళలు

ఫొటో సోర్స్, Saranya GS

ఫొటో క్యాప్షన్, బండరాళ్లపై కూర్చున్న శరణ్య

కాళ్లు పట్టేయడంతో...

మర్నాడు శుక్రవారం ఉదయం శిఖరం వైపు వెళ్లడానికి ఆమె ప్రయత్నించారు.

''కండరాలు పట్టేయడం వల్ల శిఖరం పైకి ఎక్కలేకపోయాను. ఇక అక్కడే ఉండిపోయి, వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని నిర్ణయించుకున్నాను. అలా అక్కడ కాలువలో రోజూ మూడు లీటర్ల నీరు తాగేదాన్ని. బరువు తగ్గడానికి ఉపవాసాలు చేయడమనే అలవాటు ఉంది కాబట్టి ఆహారం తీసుకోకపోవడమనేది నాకు పెద్ద సమస్య కాలేదు'' అని శరణ్య అన్నారు.

డ్రోన్లు ఎగురుతూ తనకు కనిపిస్తాయని, గాలింపు బృందానికి తన గొంతు వినిపిస్తుందని శరణ్య ఆశించినా, ఆ పరిసరాల్లో ఎక్కడా మనుషుల ఆచూకీ లేదు.

శుక్రవారం రాత్రి కూడా ఆమె నిద్రపోలేకపోయారు.

మూడోరోజు శనివారం వర్షం పడింది. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద తలదాచుకున్నప్పటికీ, వర్షంలో ఆమె తడిసిపోయారు.

ఆదివారం కూడా వాతావరణం మేఘావృతంగానే ఉంది.

ఇక మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో శిఖరం వైపు వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో కాలువకు అవతలి వైపు నుంచి ఆమెకు ఒక శబ్దం వినిపించింది. వెంటనే ఆమె స్పందించారు. వారు ఆమెను చెట్టు కిందనే ఉండాలని చెప్పారు.

వారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ సభ్యులని ఆమెకు అర్థమైంది.

''వారు నాకు నీళ్లు, బిస్కెట్లు ఇచ్చారు'' అని శరణ్య చెప్పారు.

ఎట్టకేలకు ఆమె చెక్‌పోస్టు వద్దకు చేరుకునేసరికి సాయంత్రం 6:15 గంటల సమయమైంది. అప్పటికే ఆమె కోసం కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు అక్కడ వేచిచూస్తున్నారు.

ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు నమోదు చేసుకున్నారు.

ఇలా ట్రెకింగ్ బృందం నుంచి విడిపోయినప్పుడు ఏం చేయాలో ఇతర ట్రెక్కీలకు మీరు ఇచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు శరణ్య స్పందిస్తూ, ''ట్రెక్కర్లకు సలహాలు ఇచ్చేటంత నిపుణురాలినేమీ కాదు. ట్రెకింగ్ నాకు కేవలం హాబీ మాత్రమే. కానీ, ఈ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మీరు ఎక్కడి నుంచి అయితే ట్రెక్కింగ్ ప్రారంభించారో, తిరిగి అదే ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయత్నించాలి'' అని చెప్పారు.

''నా తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపై ఇలాంటి పర్యటనలకు వెళ్లబోనని నేనేమీ వారికి వాగ్దానం చేయలేదు. మా నాన్నగారు మాత్రం ఒక్కటే చెప్పారు. నిన్ను ఆపలేను కానీ, అప్‌డేట్స్ మాత్రం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలని కోరారు'' అని శరణ్య అన్నారు.

కేరళ, కర్ణాటక, ట్రెక్కింగ్, స్పోర్ట్స్, మహిళలు

ఫొటో సోర్స్, Office of Karnataka DCM

ఫొటో క్యాప్షన్, శరణ్య ఆచూకీ తెలుసుకోవాలని కోరుతూ ఆమె తల్లి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

గత అనుభవాలతోనే భారీ రెస్క్యూ టీం ఏర్పాటు

''అడవిలో దారితప్పిపోవడం, పూర్తిగా వేరే ప్రదేశానికి వెళ్లిపోవడం సహజమే'' అటవీ శాఖ అధికారులు అన్నారు.

కేరళలోని పాలక్కాడ్ జిల్లా మలప్పూజ సమీపంలోని చేరాడ్ కురుంబాచి కొండలలో 2022 ఫిబ్రవరిలో దారితప్పిన ఓ యువకుడి ఉదంతం నేపథ్యంలో, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పెద్దయెత్తున గాలింపు బృందాలను పంపుతున్నారు.

బాబు అనే 23 ఏళ్ల వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెయ్యి మీటర్ల ఎత్తున్న కురుంబాచి కొండలు ఎక్కుతూ, కొండల మధ్యనున్న ఇరుగ్గా, లోతుగా ఉన్న చీలికలో పడిపోయారు. ఆయన కాలికి తీవ్ర గాయమైంది. దాదాపు 45 గంటల పాటు ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో కలిసి పోలీసులు, జిల్లా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. చివరకు బెంగళూరుకు చెందిన పారాచ్యూట్ రెజిమెంటల్ సెంటర్ ప్రత్యేక బృందాలు తాళ్ల సహాయంతో ఆయన్ను రక్షించాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)