జెల్లీక్యాట్ టాయ్స్: బొమ్మలు, స్టిక్కర్లు, బ్యాగులు, కీ రింగ్స్ సేకరణతో యువతి గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఫొటో సోర్స్, Guinness World Records

    • రచయిత, క్లో బ్లాక్, లిలీ మే సైమండ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బెడ్‌ఫోర్డ్‌కు చెందిన 19 ఏళ్ల హోప్ రాబర్ట్స్ అనే యువతి అత్యధిక సంఖ్యలో జెల్లీక్యాట్ బొమ్మలను సేకరించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సృష్టించారు.

ఆమె దగ్గర మెత్తటి బొమ్మలు, స్టిక్కర్లు, బ్యాగులు, కీ రింగ్స్ కలిపి మొత్తం 877 వస్తువులు ఉన్నాయి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు నాలుగు గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి, డిసెంబర్‌లో ఆమెకు ఈ రికార్డును ఖరారు చేశారు.

'వారు చెప్పేవరకు నా దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయన్న సంగతి నాకే తెలియదు. ఆ సంఖ్య తెలుసుకున్నాక చాలా ఆశ్చర్యపోయా' అని హోప్ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రెండేళ్ల కిందట ఒక చారిటీ షాప్‌లో సుమారు 24 (20 పెన్నీ) రూపాయలతో ఆమె ఒక కుందేలు బొమ్మను కొన్నారు. అప్పటినుంచి ఈ బొమ్మల సేకరణ ఆమెకు అలవాటుగా మారింది.

'అప్పటివరకు ఈ బొమ్మల గురించి నాకు పెద్దగా తెలియదు. ఇలాంటి బొమ్మలు ఉంటాయని తెలుసు. కానీ, నేనెప్పుడూ వాటిని చూడలేదు' అని హోప్ అన్నారు.

కుందేలు బొమ్మ కొన్న తర్వాత నుంచి ఆమె పాత సామాన్లు అమ్మేచోట ఇలాంటి బొమ్మల కోసం వెతకడం, స్నేహితుల దగ్గర బహుమతులుగా తీసుకోవడం ద్వారా ఈ స్థాయిలో బొమ్మలను సేకరించారు.

గిన్నిస్ రికార్డ్స్‌లో చేరినప్పటి నుంచి ఆమె దగ్గర ఉన్న బొమ్మల సంఖ్య మరింతగా పెరిగింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో హోప్ రాబర్ట్స్

ఫొటో సోర్స్, Guinness World Records

ఫొటో క్యాప్షన్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో హోప్ రాబర్ట్స్

ఇప్పుడు తన దగ్గర ఉన్న బొమ్మల సంఖ్య 1,000కి దగ్గర్లో ఉందని హోప్ చెప్పారు.

జెల్లీక్యాట్ బొమ్మల ధర కొన్ని వందల నుంచి లక్షల రూపాయల వరకు (అరుదైన బొమ్మల కోసం) ఉంటుంది.

జెల్లీక్యాట్ కంపెనీ 1999లో మొదలైనప్పటికీ, కోవిడ్ సమయంలో వీటికి క్రేజ్ పెరిగింది.

హోప్ తన దగ్గర ఉన్న బొమ్మలను సోషల్ మీడియాలో చూపిస్తుంటారు.

ఆమె కలెక్షన్‌ను అమెరికన్ సెలబ్రిటీ నిక్కీ హిల్టన్ కూడా మెచ్చుకున్నారు.

'చాలా క్రేజీగా అనిపించింది. గూగుల్ చేసి మరీ, మెచ్చుకుంది ఆమేనని ధ్రువీకరించుకున్నా' అని హోప్ సంతోషంగా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)