ఇరాన్ నిరసనలు: ‘‘తల, కళ్లల్లో బుల్లెట్లతో ఆందోళనకారులు వస్తున్నారు, గాయపడిన వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి’’

దేశంలో రాజధాని సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో రాజధాని సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్నాయి.
    • రచయిత, హెలెన్ సులివాన్, సోరౌష్ పక్జాద్, రోజా అసదీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఇరాన్‌లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆందోళనల పట్ల అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయని బీబీసీతో రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది చెప్పారు.

తెహరాన్‌లోని ఒక కంటి ఆసుపత్రి పెరుగుతున్న పేషెంట్లతో ఇబ్బందికర పరిస్థితికి చేరుకుందని ఒక వైద్యుడు తెలిపారు.

ఆసుపత్రిలో రోగుల సంఖ్య విపరీతంగా ఉందని, వారికి చికిత్స చేయడానికి సరిపడా సర్జన్లు లేరని మరో ఆసుపత్రికి చెందిన వైద్య సిబ్బంది ఒకరు బీబీసీకి మెసేజ్ ద్వారా తెలిపారు.

ఇరాన్ పెను సంక్షోభంలో ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శుక్రవారంనాడు అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇరాన్‌లో నిరసనలు తెలుపుతున్న ఆందోళనకారులను హతమార్చాలనుకుంటే వారిని రక్షించడానికి అమెరికా రంగంలోకి దిగుతుందని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి రాసిన లేఖలో అమెరికాను విమర్శించిన ఇరాన్, తమ దేశంలో జరుగుతున్న నిరసనలను 'హింసాత్మకం, దేశాన్ని అస్థిరపరిచే చర్యలు'గా అభివర్ణించింది.

ఈ నిరసనలు పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసానికి, ఘర్షణలకు దారి తీశాయని ఇరాన్ పేర్కొంది.

ఇరాన్‌లో గురువారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోయింది
ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో గురువారం సాయంత్రం నుంచి ఇంటర్నెట్ నిలిచిపోయింది

నిరసనకారుల కళ్లలో, తలపై కాల్పులంటూ నివేదికలు

ప్రజలు శాంతియుతంగా నిరసన చేసే హక్కును కాపాడాలంటూ అంతర్జాతీయ నాయకులు కోరుతున్నారు.

ఇరాన్‌లోని చాలా నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో 50 మందికి పైగా నిరసనకారులు చనిపోయినట్లు రెండు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి.

బీబీసీతో పాటు ఇంకా వేరే అంతర్జాతీయ వార్తా సంస్థలను ఇరాన్‌ లోపల రిపోర్టింగ్ చేసేందుకు అనుమతించడం లేదు.

గురువారం సాయంత్రం నుంచి ఆ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది.

ఇరాన్‌కు చెందిన డాక్టర్ ఒకరు శుక్రవారం రాత్రి స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా బీబీసీని సంప్రదించారు.

తెహరాన్‌లోని ప్రముఖ కంటి ఆసుపత్రి ఫరాబీలో ఎమర్జెన్సీ సేవల బృందం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని ఆయన చెప్పారు.

ఆసుపత్రిలో సాధారణ సర్జరీలు, అడ్మిషన్లను ఆపేసి కేవలం అత్యవసర కేసులనే చూస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం అదనంగా సిబ్బందిని పిలిపించినట్లు చెప్పారు.

షిరాజ్ నగరంలోని ఒక ఆసుపత్రి సిబ్బంది పంపిన వీడియోలు, ఆడియో సందేశాలు బీబీసీకి అందాయి.

గాయపడిన వారిని పెద్దసంఖ్యలో ఆసుపత్రికి తీసుకొస్తున్నారని, రోగులందరికీ చికిత్స చేసేందుకు సరిపడా సర్జన్లు అందుబాటులో లేరని ఆ సిబ్బంది ద్వారా తెలిసింది.

గాయపడిన వారిలో చాలామందికి కళ్లలో, తలపై బుల్లెట్లు తగిలినట్లు ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు.

నిరసనల సందర్భంగా ఆస్తులను ధ్వంసం చేసిన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిరసనల సందర్భంగా ఆస్తులను ధ్వంసం చేసిన ప్రజలు

26 మంది చనిపోయినట్లు నిర్ధరణ

డిసెంబర్ 28న నిరసనలు మొదలైనప్పటి నుంచి 50మందికి పైగా నిరసనకారులు, 15 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్లు, 2311 మందికి పైగా అరెస్ట్ అయినట్లు అమెరికాకు చెందిన హ్యుమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

తొమ్మిది మంది పిల్లలతో సహా 51 మందికి పైగా నిరసనకారులు మృతి చెందినట్లు నార్వేలోని ఇరాన్ హ్యుమన్ రైట్స్ (ఐహెచ్‌ఆర్‌ఎన్‌జీవో) తెలిపింది.

అయితే, 26 మంది మృతిని బీబీసీ పర్షియన్ ధ్రువీకరించింది. ఇందులో అయిదుగురు చిన్నారులు ఉన్నట్లు నిర్ధరించింది.

ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పట్ల ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఆందోళన చెందుతోందని యూఎన్ సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ అన్నారు.

'తమ పౌరులను రక్షించాల్సిన బాధ్యత ఇరాన్‌పై ఉంది. ప్రజలు భయపడకుండా తమ భావాలను వ్యక్తీకరించడానికి, శాంతియుతంగా సమావేశం కావడానికి ప్రభుత్వం అనుమతించాలి' అని ఒక సంయుక్త ప్రకటనలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, జర్మన్ చాన్స్‌లర్ ఫ్రెడెరిక్ పేర్కొన్నారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఏమంటున్నారు?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ శుక్రవారం టీవీ ప్రసంగంలో తీవ్ర హెచ్చరికలు చేశారు.

‘‘లక్షలమంది గౌరవనీయులైన ప్రజల రక్తంతో ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారంలోకి వచ్చింది. దీన్ని వ్యతిరేకించేవారి ముందు ప్రభుత్వం తలొగ్గదు’’ అని ఆయన అన్నారు.

అనంతరం జరిగిన మద్దతుదారుల సమావేశంలో మాట్లాడుతూ, విధ్వంసకర శక్తులను ఎదుర్కోవడంలో ఏమాత్రం సంకోచించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వ టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.

శుక్రవారం నాటి నిరసన ప్రదర్శనలు అద్భుతమని ఇరాన్ చివరి షా కుమారుడైన రెజా పహ్లావి అభివర్ణించారు. వారాంతంలో లక్షిత నిరసనలు చేపట్టాలని ఇరానియన్లకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో సందేశం ఇచ్చారు.

ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న రెజా పహ్లావీ, తాను స్వదేశం వచ్చేందుకు సన్నద్ధం అవుతున్నానని చెప్పారు.

వాహనాలను తగులబెడుతున్న నిరసనకారులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వాహనాలను తగులబెడుతున్న నిరసనకారులు

'ఇప్పుడు మన లక్ష్యం కేవలం వీధుల్లోకి రావడమే కాదు, నగర కేంద్రాలను స్వాధీనం చేసుకోవడం. వాటిపై నియంత్రణ సాధించడం' అని వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి రాసిన లేఖలో అమెరికాపై ఆరోపణలు చేశారు ఇరాన్ రాయబారి.

'అమెరికా బెదిరింపులకు పాల్పడటం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అస్థిరపరచడం, హింసను ప్రోత్సహించడం వంటివి చేయడం ద్వారా ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది' అని లేఖలో ఇరాన్ రాయబారి పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం ఇరాన్‌లో పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ అన్నారు.

'ప్రజలు కబ్జా చేస్తోన్న నగరాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాయని కొన్ని వారాల క్రితం వరకు కూడా ఎవరూ ఊహించి ఉండరు. ఎక్కడ కొడితే వాళ్లకు గట్టి దెబ్బ తగులుతుందో అక్కడే మేం బలంగా కొడతాం. దీనర్థం వారి నేలపైకి సైనికులను పంపిస్తామని కాదు' అని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

'ఇరాన్‌లోని ధైర్యవంతులకు మా మద్దతు'

ఇజ్రాయెల్, అమెరికా దేశాలు నిరసనలను రెచ్చగొడుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన ఆరోపణలపై అమెరికా స్పందించింది.

'తమ దేశంలోని సమస్యల నుంచి ప్రజలను తప్పు దారి పట్టించేందుకు ఇరాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది' అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం తెల్లవారుజామున ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు.

'ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతు ఇస్తుంది' అని ఆ ట్వీట్‌లో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)