టిప్పు సుల్తాన్ మరణానికీ, హైదరాబాద్‌లోని మీరాలం చెరువుకు సంబంధమేంటి?

ఫొటో సోర్స్, BBC/PRINT COLLECTOR
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లోని మీరాలం (మీర్-ఆలం) చెరువుపై కేబుల్ వంతెన నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది పూర్తయితే, హైదరాబాద్‌లో దుర్గం చెరువు తర్వాత మరో కేబుల్ వంతెన అందుబాటులోకి వస్తుంది.
దీనికోసం ప్రభుత్వం 2025 జులైలోనే రూ.430 కోట్లు కేటాయించింది.
పాతబస్తీలోని శాస్త్రిపురం నుంచి బెంగళూరు హైవేను అనుసంధానం చేసేలా 2.42 కిలోమీటర్ల మేర మీరాలం చెరువుపై ఈ వంతెన ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, మీరాలం చెరువుకు చారిత్రక మైసూరు యుద్ధానికి సంబంధం ఉంది.
టిప్పు సుల్తాన్‌ను ఓడించిన తర్వాత వచ్చిన సంపదలో కొంత మొత్తాన్ని వెచ్చించి అప్పట్లో మీరాలం చెరువు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
మూడో నిజాం వద్ద దివాన్ (ప్రధాన మంత్రి)గా పనిచేసిన మీర్ ఆలం పేరుతోనే ఈ చెరువు నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.

రెండేళ్లలో తవ్వకం
మీరాలం చెరువును మూడో నిజాం సికిందర్ జా (అసఫ్ జా-3) సమయంలో నిర్మించారు.
ఈయన వద్ద 1804-1808 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్ ప్రధాన మంత్రి (దివాన్)గా పనిచేశారు మీర్ ఆలం.
మీరాలం చెరువు నిర్మాణానికి 1804 జులై 20న శంకుస్థాపన చేయగా, 1806 జూన్ 8 నాటికి పూర్తయినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

మీర్ ఆలం పేరుతోనే చెరువు నిర్మాణం
చెరువు నిర్మాణానికి టిప్పు సుల్తాన్‌కు సంబంధం ఉందని చెప్పారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చరిత్ర కారుడు మొహమ్మద్ సఫీవుల్లా.
"1799లో నాలుగో ఆంగ్లో మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించారు. టిప్పు సుల్తాన్ సామ్రాజ్యంలోని సంపదలో కొంత భాగం హైదరాబాద్ నిజాంకు బ్రిటిషర్లు కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత ఆ సంపదలోని కొంత డబ్బును వెచ్చించి మీర్ ఆలం చెరువును దివాన్ మీర్ ఆలం తవ్వించారు" అని చెప్పారు.
మీర్ ఆలం స్వయంగా చెరువు నిర్మాణాన్ని పర్యవేక్షించారని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ చిగురుపాటి రామచంద్రయ్య, హెచ్‌సీయూ సెంటర్ ఫర్ రీజినల్ స్టడీస్ ప్రొఫెసర్ షీలా ప్రసాద్ తన పరిశోధన పత్రంలో రాశారు.
శేరింగపటం (శ్రీరంగపట్నం) పతనం అయ్యాక వచ్చిన ప్రైజ్ మనీతో ఈ చెరువు నిర్మాణం చేపట్టినట్లు ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, fb/Mohammed Riyaz Ali
నిజాం సైన్యానికి మీర్ ఆలం నేతృత్వం
నాలుగో ఆంగ్లో-మైసూరు యుద్ధం 1799లో జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇందులో బ్రిటిష్ సేనలకు అప్పటి హైదరాబాద్ నిజాం సహకారం అందించారు. టిప్పుకు వ్యతిరేకంగా బ్రిటిషర్ల తరఫున నిజాం సైన్యం పోరాడింది.
శేరింగపటం (శ్రీరంగపట్నం) వద్ద జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయారు.
ఈ యుద్దంలో నిజాం సైన్యానికి మీర్ ఆలం నేతృత్వం వహించారు. ఆ క్రమంలో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా ఉన్న లార్డ్ వెల్లస్లీకి మీర్ ఆలం ఎంతో దగ్గరయ్యారని 'ది నిజాం, హిజ్ హిస్టరీ అండ్ రిలేషన్స్ విత్ ది బ్రిటిష్ గవర్నమెంట్' పుస్తకంలో రాశారు.
ఆ తర్వాత 1804లో నిజాం ప్రభుత్వంలో మీర్ ఆలం ప్రధాన మంత్రి కావడానికి బ్రిటిషర్ల ప్రోత్సాహం ఎంతో ఉందని పుస్తకంలో రచయితలు బ్రిగ్స్, హెన్రీ జార్జ్ ప్రస్తావించారు.

అప్పటికే హుస్సేన్ సాగర్ ఉండటంతో...
మీర్ ఆలం ప్రధాని అయ్యాక అప్పటికే ఉన్న హుస్సేన్ సాగర్ వైపు కాకుండా మూసీ నదికి దక్షిణ దిక్కులో మరో చెరువు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
మీరాలం చెరువు నిర్మాణం తర్వాత నిజాం కాలంలో తాగునీటి అవసరాలకు ఈ చెరువునే వినియోగించుకునేవారని చరిత్రకారులు చెబుతున్నారు.
''కుతుబ్ షాహీల కాలంలో హుస్సేన్ సాగర్ నిర్మించి, అక్కడి నుంచి తాగునీటి అవసరాలు తీర్చుకునేవారు. అసఫ్ జాహీల కాలం.. అంటే 1724 తర్వాత హుస్సేన్ సాగర్ కాకుండా పాత నగరంలో మరో చెరువు ఉండాలని భావించారు.
హుస్సేన్ సాగర్ దూరంగా ఉండటంతో మీరాలం చెరువు నిర్మాణం చేపట్టారు. ఇది పూర్తయ్యాక అప్పటి తాగునీటి అవసరాలను తీర్చడం ప్రారంభించింది'' అని హైదరాబాద్‌కు చెందిన చరిత్రకారుడు పరవస్తు లోకేశ్వర్ బీబీసీతో చెప్పారు.
చెరువు నిర్మాణానికి ఫ్రెంచ్ ఇంజినీర్లు సహకారం అందించారని చరిత్ర చెబుతోంది.
అప్పట్లో మీర్ ఆలం బ్రిటిషర్లతో పాటు ఫ్రెంచ్ వారితోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారని ''ది నిజాం, హిజ్ హిస్టరీ అండ్ రిలేషన్స్ విత్ ది బ్రిటిష్ గవర్నమెంట్'' పుస్తకంలో ప్రస్తావించారు.
మీరాలం చెరువుకు ఎంజేఎం రేమండ్ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించారు.

నిజాంల తాగునీటి అవసరాలు తీర్చిన చెరువు
'ఇంపాక్ట్ ఆఫ్ అర్బన్ గ్రోత్ ఆన్ వాటర్ బాడీస్.. ది కేస్ ఆఫ్ హైదరాబాద్' పేరుతో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ చిగురుపాటి రామచంద్రయ్య, హెచ్‌సీయూ సెంటర్ ఫర్ రీజనల్ స్టడీస్ ప్రొఫెసర్ షీలా ప్రసాద్ రాసిన పరిశోధన పత్రం 2008 జనవరిలో 'రీసెర్చ్ గేట్ 'లో ప్రచురితమైంది.
మీరాలం చెరువు నిర్మాణం పూర్తయ్యేసరికి ట్యాంకు చుట్టుకొలత 8 మైళ్లు ఉండేదని ఈ పరిశోధన పత్రం స్పష్టం చేస్తోంది.
1960-70ల వరకు మీరాలం చెరువు నుంచి నగరంలోని చాలా ప్రాంతాలకు తాగునీరు సరఫరా అయ్యేదని చెప్పారు పరవస్తు లోకేశ్వర్.
''మీరాలం చెరువు నుంచి వచ్చే నీటినే తాగేవాళ్లం. అప్పట్లో చెరువులో నీరు చాలా స్వచ్ఛంగా ఉండేది'' అని చెప్పారాయన.
చెరువు నీరు కలుషితంగా మారిందని 2005లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నివేదిక స్పష్టం చేస్తోంది.
మీరాలం చెరువు పక్కనే కూరగాయల తోటలు ఉండేవని, ఆ నీటితోనే కూరగాయలు పండేవని చరిత్రకారులు చెబుతున్నారు.
''మీరాలం చెరువు నీటితో పండించిన కూరగాయలను సమీపంలోకి తీసుకువచ్చి విక్రయించేవారు. క్రమంగా అది మీరాలం మండీగా మారింది'' అని పరవస్తు లోకేశ్వర్ చెప్పారు.

ఎక్కడుంది ఈ మీరాలం చెరువు?
నెహ్రూ జూ పార్కును ఆనుకుని బెంగళూరు జాతీయ రహదారి పక్కన మీరాలం చెరువు కనిపిస్తుంది.
దీని వాస్తవ విస్తీర్ణం 460 ఎకరాలు కాగా, ప్రస్తుతం 260 ఎకరాలకు తగ్గిపోయిందని హెచ్ఎండీఏ గతంలో జరిపిన సర్వేలో తేలింది.
మీరాలం చెరువులోకి కాలుష్య కారక పదార్థాలు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నాయని పరిశోధనల్లో తేలింది.
సెమీ సర్య్కులర్ రింగ్స్ గోడ నిర్మాణం
చెరువుకు ఉన్న మరో ప్రత్యేకత సెమీ సర్క్యులర్ రింగులతో కూడిన రిటైనింగ్ వాల్. చెరువు నిర్మాణంలో ఒకవైపు ఈ తరహాలో నిర్మించారు.
21 అర్ధ వృత్తాకార రింగుల ఆకృతిలో రాతితో గోడ కట్టి నీటిని నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశారు.
''ఈ తరహా అర్ధ వృత్తాకారపు రింగులతో కూడిన రిటైనింగ్ వాల్ నిర్మాణం చాలా అరుదు. అందుకే ఈ నిర్మాణ శైలికి గుర్తింపుగా 2011లో ఇంటాక్ అవార్డు అందించాం'' అని ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్, కల్చర్ అండ్ హెరిటేజ్ (ఇంటాక్) హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ అనురాధ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఇక్కడ నిర్మాణం చూసిన తర్వాత మెక్సికోలోని మరో చెరువుకు ఇదే తరహాలో అర్ధ వృత్తాకార రింగులతో గోడ నిర్మించారని ఆమె వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














