కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్‌కు అనుమతులు.. ఏఏ కంపెనీలంటే?

విమానయాన రంగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, త్వరలోనే మూడు కొత్త విమానయాన సంస్థల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం తలెత్తిన దాదాపు మూడు వారాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త విమానయాన సంస్థలకు పచ్చజెండా ఊపింది.

కార్యకలాపాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని ఆ మూడు సంస్థలకు తెలిపింది.

భారతదేశంలో విమానయాన కార్యకలాపాలను ప్రారంభించాలనుకుంటున్న 'శంఖ్ ఎయిర్' 'అల్‌హింద్', 'ఫ్లైఎక్స్‌ప్రెస్' ప్రతినిధి బృందాలను గత వారంలో కలిశానని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

డిసెంబర్ ప్రారంభంలో భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో భారీ షెడ్యూలింగ్ సంక్షోభంలో చిక్కుకుంది.

ఫలితంగా వేలాది విమానాలు రద్దు కావడంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో గందరగోళం నెలకొని పెద్దఎత్తున ప్రయాణికులు చిక్కుకుపోయారు.

దేశీయ మార్కెట్లో ఇండిగో 60 శాతానికి పైగా వాటా కలిగి ఉండటటంతో, ఆ సంక్షోభం విమాన ప్రయాణాలపై పెద్దఎత్తున ప్రభావం చూపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శంఖ్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, @RamMNK

ఫొటో క్యాప్షన్, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిని కలిసిన శంఖ్ ఎయిర్ చైర్మన్ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ

కొత్త విమానయాన సంస్థలపై మంత్రి ఏం చెప్పారు?

ఇండిగో సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రభుత్వ విమానయాన విధానం ప్రశ్నార్థకమైంది.

దేశీయ విమానయాన మార్కెట్లో ఇండిగో గుత్తాధిపత్యమే ఈ సంక్షోభానికి దారితీసిందని, ప్రభుత్వం ఇతర కంపెనీలకు అవకాశం ఇవ్వాలని విమర్శకులు వాదించారు.

దీని తరువాత, ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా, విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానయాన రంగంలో పోటీ వాతావరణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

అనంతరం మూడు విమానయాన సంస్థలకు ఎన్ఓసీ జారీ చేయడంపై రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమాలలో సమాచారం ఇచ్చారు.

"భారత గగనతలంపై ఎగరడానికి సిద్ధమవుతున్న కొత్త విమానయాన సంస్థలు శంఖ్‌ఎయిర్, అల్‌హింద్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ బృందాలను కలవడం చాలా ఆనందంగా ఉంది. శంఖ్ఎయిర్ ఇప్పటికే ఎన్‌ఓసీ అందుకుంది, అయితే అల్ హింద్ ఎయిర్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ ఈ వారం తమ ఎన్‌ఓసీ లను అందుకున్నాయి" అని ఆయన రాశారు.

ఈ మూడు కొత్త విమానయాన సంస్థల రాకతో ప్రయాణికులకు మరిన్ని చాయిస్‌లు లభిస్తాయని, విమానయాన రంగంలో 90 శాతం వాటా ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లకు సవాలు విసురుతారని నిపుణులు భావిస్తున్నారు.

రెండు కొత్త విమానయాన సంస్థలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

అల్‌హింద్ విమానం

ఫొటో సోర్స్, alhindair.com/Screengrab

అల్‌హింద్ ఎయిర్‌లైన్స్

కేరళకు చెందిన అల్‌హింద్ గ్రూపు అల్‌హింద్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది.

ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ గ్రూప్ దేశీయంగా తన విమానాలను నడపనుంది.

ఇందుకోసం తొలుత ఏటీఆర్ 72-600 విమానాలను నడపాలని యోచిస్తోంది.

తరువాత అంతర్జాతీయంగా విస్తరించనుంది.

అల్‌హింద్ ఎయిర్‌లైన్స్‌ కొచ్చి కేంద్రంగా ఉంటుంది.

ఫ్లై ఎక్స్‌ప్రెస్ విమానం

ఫొటో సోర్స్, flyexpressairlines.com/Screengrab

ఫ్లైఎక్స్‌ప్రెస్ ఎయిర్‌లైన్

ఎన్‌ఓసీ పొందిన రెండో విమానయాన సంస్థ ఫ్లైఎక్స్‌ప్రెస్.

తన కార్యకలాపాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయం చెప్పలేదు. కానీ తన వెబ్‌సైట్‌లో మాత్రం త్వరలో వస్తున్నాం అని చెప్పారు.

ఈ సంస్థకూడా దేశీయ సర్వీసులను నడపనుంది.

శంఖ్ ఎయిర్‌లైన్స్

ఫొటో సోర్స్, shankhair.com/Screengrab

శంఖ్ ఎయిర్ (ఎయిర్‌లైన్) వెబ్‌సైట్‌లోని సమాచారం మేరకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

ఈ విమానయాన సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన నగరాలను, ఇతర ప్రాంతాలను కలుపుతుంది.

ఈ సంస్థ వారణాసి, గోరఖ్‌పూర్, దిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాలకు విమానాలు నడపనుంది.

శంఖ్ ఎయిర్ చైర్మన్ శ్రవణ్ కుమార్ విశ్వకర్మ.

విమానాశ్రయాలలో గందరగోళం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డిసెంబర్ ప్రారంభంలో ఇండిగో విమానాలు భారీగా రద్దు కావడంతో విమానాశ్రయాలలో గందరగోళం ఏర్పడింది.

ఇండిగో సంక్షోభం కారణంగా ప్రభుత్వ విమానయాన విధానంపై ప్రశ్నలు తలెత్తినప్పుడు త్వరలోనే కొన్ని కొత్త విమానయాన సంస్థల ప్రారంభాన్ని ప్రకటిస్తారని భావించారు.

ఇండిగో పది రోజుల పాటు 4500 విమానాలను రద్దు చేయాల్సి వచ్చినప్పుడు గందరగోళం ఏర్పడింది. ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది.

అయితే, డీజీసీఏ కొన్ని నిబంధనలను సడలించి, ఫిబ్రవరి 2026 వరకు కొత్త నిబంధనలను అమలుచేయకుండా ఇండిగోకు తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది.

రద్దుచేసిన విమాన సర్వీసుల్లో వెళ్లాల్సిన ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వాలని ఇండిగోను మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

ఈ సంఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించి, ఇండిగోకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

తరువాత ఇండిగోను ప్రస్తుత సేవలను పది శాతం మేర తగ్గించాలని ఆదేశించింది.

డిసెంబర్ 8 నుంచి రద్దయిన విమాన సర్వీసుల సంఖ్య తగ్గినా, డిసెంబర్ రెండో వారం వరకు కొనసాగింది.

విమానయాన రంగం

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో విమానయాన రంగం ఎలా ఉంది?

భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ . పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణీకరణ, విమాన ప్రయాణానికి పెరుగుతున్న ప్రాధాన్యం ఈ రంగాన్ని బలోపేతం చేశాయి.

భారత్‌లో 2014లో 74 విమానాశ్రయాలు ఉండగా, సెప్టెంబర్ 2025 నాటికి మొత్తం విమానాశ్రయాల సంఖ్య 162కి పెరిగింది.

భారతదేశంలో విమాన ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఉడాన్ (ఉడే దేశ్ కా హర్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది .

అక్టోబర్ 21, 2016న ప్రారంభమైన ఈ పథకం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, "ఒకప్పుడు విమానయానాన్ని కొంతమందికి మాత్రమే పరిమితమైనదిగా భావించేవారు, కానీ ఉడాన్ రాకతో ఈ ఆలోచన మారిపోయింది. చెప్పులు ధరించే వ్యక్తి కూడా విమానంలో ప్రయాణించేలా చేయడమే నా కల" అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)