రూ. 944 కోట్ల విలువైన బ్రిటిష్ యుద్ధ విమానం ఇండియాలో నిలిచిపోయింది.. మరమ్మతులు కాకపోతే ఏం చేస్తారు?

- రచయిత, గీతా పాండే, అష్రఫ్ పదన్న
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు వారాలుగా నిలిచిపోయిన బ్రిటిష్ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం సరిచేయడానికి 14 మంది సభ్యుల బ్రిటిష్ ఇంజినీర్ల బృందం పని ప్రారంభించింది.
జూన్ 14న కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో ఫైటర్ జెట్ ఎఫ్-35బీ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని తిరువనంతపురం విమానాశ్రయానికి మళ్లించారు.
ఆ తర్వాత, విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన విమాన వాహక నౌక హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌కు జెట్ తిరిగి వెళ్లలేకపోయింది.
భారతదేశంలో ఈ విమానం చాలా రోజులు ఉండటంతో, అటువంటి ఆధునిక విమానం విదేశీ గడ్డపై ఇంతకాలం ఎలా ఉండిపోయిందనే ప్రశ్నలు తలెత్తాయి.
హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌లోని ఇంజినీర్లు జెట్ వద్దకు చేరుకొని పరిశీలించినా, సాంకేతిక లోపాన్ని సరిచేయలేకపోయారు. దీంతో బ్రిటన్ నుంచి ఇంజినీర్ల బృందం రావాల్సి వచ్చింది.
ఎఫ్-35బీ మరమ్మతులకు యూకే నుంచి ఇంజనీర్ల బృందాన్ని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పంపినట్లు బ్రిటిష్ హైకమిషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
"మరమ్మతులకు అవసరమైన పరికరాలను బృందం తీసుకువచ్చింది" అని పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
24 గంటలూ పర్యవేక్షణ
ఆదివారం పీటీఐ, ఏఎన్ఐ వార్తాసంస్థలు విడుదల చేసిన వీడియోలు తిరువనంతపురంలో సాంకేతిక నిపుణుల బృందం దిగుతున్నట్లు చూపించాయి.
"విమానాన్ని మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ ఫెసిలిటీకి తీసుకెళ్లాలనే ప్రతిపాదనకు ఆమోదం దక్కింది. కానీ, యూకే నుంచి రావాల్సిన పరికరాల కోసం వేచి ఉన్నాం" అని బ్రిటిష్ హైకమిషన్ గతంలో చెప్పింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎఫ్-35బీని హ్యాంగర్ వైపు తీసుకెళుతుండటం వీడియోలో చూడవచ్చు.
ఎఫ్-35బీ విమానం లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన అత్యంత అధునాతన జెట్. ఈ జెట్ చిన్న రన్‌వేల నుంచి టేకాఫ్ అయి హెలికాప్టర్ లాగా నేరుగా కిందకు దిగగలదు.
ఈ విమానం ధర భారత కరెన్సీలో దాదాపు రూ. 944 కోట్లు, ఆరుగురు ఆర్ఏఎఫ్ సిబ్బంది ఈ జెట్‌ను 24 గంటలూ పర్యవేక్షిస్తుంటారు.
భారత విమానాశ్రయంలో చిక్కుకున్న జెట్ సమస్యపై బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్‌లో కూడా చర్చ జరిగింది.
అయితే, ఇంజినీర్ల బృందం విమానాన్ని మరమ్మతు చేసి, ప్రయాణానికి తగినట్లుగా మార్చలేకపోతే, దానిని సీ-17 గ్లోబ్‌మాస్టర్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ వంటి కార్గో విమానంలో తరలించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ మీడియాలో చర్చ
కేరళలో ఆగిపోయిన ఈ విమానంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పెరిగిపోయాయి. అందమైన కేరళ రాష్ట్రాన్ని జెట్ వదిలి వెళ్లాలనుకోవడం లేదని చాలామంది అంటున్నారు.
ఇదే క్రమంలో కేరళ పర్యటక శాఖ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. అందులో "మీరు ఎప్పటికీ వదిలి వెళ్లకూడదనుకునే ప్రదేశం కేరళ" అని రాసింది.
ఆ పోస్ట్‌లో రన్‌వేపై నిలబడి ఉన్న విమానం ఏఐ చిత్రం కూడా ఉంది, దాని వెనుక కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Media
ఏమిటీ ఎఫ్-35బీ జెట్?
రాయల్ ఎయిర్ ఫోర్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఎఫ్-35బీ అనేది విభిన్న అవసరాలకు వాడే జెట్. ఇది గగనతలంలో, నేలపై కూడా పోరాడగలదు.
ఈ జెట్ నిఘా సమాచారాన్ని సేకరించగలదు. గగనతలం నుంచి భూమిపై, గగనతలం నుంచి గగనతలంపై పోరాటంలో పనిచేస్తుంది. ఒకే సమయంలో వేర్వేరు మిషన్లను నిర్వహించగలదు.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేయడానికి సహాయపడే అధునాతన సెన్సర్లను ఎఫ్-35బీ కలిగి ఉంది. పైలట్ సేకరించిన సమాచారాన్ని సురక్షితమైన డేటా లింక్‌ని ఉపయోగించి ఇతర బృందాలతో కూడా పంచుకోవచ్చు.
హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యుద్ధ నౌకలోని జెట్ ఈ ఎఫ్-35బీ.
రాయల్ నేవీకి చెందిన హెచ్‌ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యుద్ధ నౌక 2025 ఏప్రిల్ చివరి వారంలో సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. పలు దేశాలలో సైనిక శిక్షణలో పాల్గొనడానికి ఇది యూకేలోని పోర్ట్స్‌మౌత్ నుంచి బయలుదేరింది.
ఈ విమాన వాహక నౌక జపాన్, ఆస్ట్రేలియా, మధ్యధరా సముద్రం, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియాలోని 40కి పైగా దేశాలలో ప్రయాణిస్తుంది. ఈ యుద్ధనౌకలో 24 ఆధునిక ఎఫ్-35బీ స్టెల్త్ జెట్‌లు ఉన్నాయి.
సుమారు 65,000 టన్నుల బరువున్న ఈ విమాన వాహక నౌకలో 1,600 మంది సైనికులు ఉండవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














