మానవ మలంతో విమాన ఇంధనం తయారు చేసిన సైంటిస్టులు

ఇంధనం
    • రచయిత, డేవ్ హార్వే
    • హోదా, బీబీసీ వెస్ట్ బిజినెస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

పూర్తిగా మానవ వ్యర్థాలతో ఒక విమానయాన సంస్థ సరికొత్త ఇంధనాన్ని తయారు చేసింది.

యూకేలోని గ్లాస్టర్‌షైర్‌లోని ఒక ప్రయోగశాలకు చెందిన రసాయన శాస్త్రవేత్తలు ఈ కొత్త ఇంధనాన్ని తయారు చేశారు. మానవ వ్యర్థాలను వారు కిరోసిన్‌గా మార్చగలిగారు.

''తక్కువ ధరకు దొరికే ఇంధనాన్ని కనుక్కోవాలని అనుకున్నాం. ఇది అదే. మానవ వ్యర్థాలు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి దాంతో తయారు చేయాలనుకున్నాం'' అని ఫైర్‌ఫ్లై గ్రీన్ ఫ్యూయెల్స్ సీఈవో జేమ్స్ హైగేట్ అన్నారు.

అంతర్జాతీయ విమానయాన నియంత్రణ సంస్థలు (ఇంటర్నేషనల్ ఏవియేషన్ రెగ్యులేటర్స్) పలు దఫాలుగా నిర్వహించిన పరీక్షల్లో ఇప్పటి శిలాజ ఇంధనాలకు ఇది ఏమాత్రం తీసిపోదని తేలింది.

ఇంధన వినియోగం వల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాల ప్రభావాన్ని పరిశీలించేందుకు ఫైర్‌ఫ్లై బృందం క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేసింది. ఫైర్‌ఫ్లై కనుగొన్న ఇంధనంలో కర్బన్ ఉద్గారాలు 90 శాతం తక్కువని నిర్ధరణ అయింది.

తక్కువ కర్బనం విడుదల చేసే ఇంధనాల ఉత్పత్తిపై హైగేట్ 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ కిరోసిన్ రసాయన పరంగా సాధారణ కిరోసిన్‌లాగే ఉందని ఆయన అన్నారు. ''ఇందులో శిలాజ ఇంధనాల్లో ఉండే కర్బన ఉద్గారాలు లేవు. ఇది శిలాజ రహిత ఇంధనం'' అన్నారు.

''ఇలాంటి ఇంధనాలు చాలా అవసరం. కర్బన ఉద్గారాలు 90 శాతం వరకూ తక్కువగా ఉండడం సాధారణ విషయం కాదు. ఇలాంటి ఇంధనాలు మనకు అవసరం. కానీ, శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి ఇంధనాల ఉత్పత్తి చాలా తక్కువ'' అన్నారాయన.

ఇంధనం
ఫొటో క్యాప్షన్, ఫైర్‌ఫ్లై గ్రీన్ ఫ్యూయెల్స్ సీఈవో జేమ్స్ హైగేట్

విమానాల నుంచి కర్బన ఉద్గారాలు

ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాల్లో ఏవియేషన్ వాటా 2 శాతం. వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్‌)లోనూ దాని ప్రభావం ఉంటుంది.

ఇది చాలా తక్కువ పరిమాణమే అయినప్పటికీ, క్రమంగా పెరుగుతోంది. కర్బన ఉద్గారాలు విడుదల చేయని విమానయానం అనేది ప్రధాన సవాళ్లలో ఒకటి.

ప్రస్తుతం విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల అభివృద్ధి దిశగా పనులు జరుగుతున్నాయి.

ఎలాగైనా 2026 నాటికి డజను మంది ప్రయాణికులను తీసుకెళ్లగలిగేలా ఎలక్ట్రిక్ హైడ్రోజన్‌తో నడిచే విమానాలను తయారు చేస్తామని యూకేలోని కాట్స్‌వాల్డ్స్‌కి చెందిన ఒక కంపెనీ ప్రకటించింది.

అయితే రోజురోజుకీ విమానయానం పెరిగిపోతున్న నేపథ్యంలో, పూర్తిగా కొత్త సాంకేతితతో నడిచేందుకు ఏళ్లు, బహుశా దశాబ్దాల కాలం పట్టొచ్చు.

అందుకే, శిలాజ ఇంధనాలకు బదులుగా పర్యావరణ హితంగా రూపొందించిన ప్రత్యామ్నాయ ఇంధనం (కిరోసిన్) నిజంగా అద్భుతం.

ఇంధనం
ఫొటో క్యాప్షన్, క్రూడ్ ఆయిల్ తరహాలోనే బయోక్రూడ్ పనిచేస్తుంది

20 ఏళ్ల కిందట

ఇరవై ఏళ్ల కిందట గ్లాస్టర్‌షైర్‌లోని ఒక చిన్న వ్యవసాయ క్షేత్రంలో రాప్సీడ్ ఆయిల్‌ (ఒక రకం మొక్క విత్తనాల నుంచి తీసే నూనె)ను కార్లు, ట్రక్కుల కోసం వాడే బయోడీజిల్‌గా మార్చడం ప్రారంభించారు హైగేట్.

ప్రస్తుతం ఆయన కంపెనీ గ్రీన్ ఫ్యూయెల్స్ వంట నూనెను బయోడీజిల్‌గా మార్చే పరికరాలను(ఎక్విప్‌మెంట్) విక్రయిస్తోంది. ఆయన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు ఉన్నారు.

ఆ తర్వాత ఆయన విమానాల కోసం పర్యావరణ హితమైన ఇంధనం కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆయన వాడేసిన నూనెలు, ఆహార వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలతో ఇంధన తయారీ ప్రయోగాలు చేశారు.

వాటి తర్వాత మానవ వ్యర్థాలను ప్రయత్నించారు. దీని కోసం లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన కెమిస్ట్ సెర్గియో లిమాతో జట్టుకట్టారు. ఇద్దరూ కలిసి మానవ మలాన్ని విద్యుత్ శక్తిగా ఎలక్ట్రిసిటీ(విద్యుత్ శక్తి)గా మార్చే ప్రక్రియను అభివృద్ధి చేశారు.

దాని కోసం ముందుగా వారు 'బయోక్రూడ్'ను రూపొందించాల్సి ఉంటుంది.

అది నల్లగా, మందంగా ఆయిల్‌ రూపంలో(బాగా వాడిన తర్వాత ఉండే ఇంజిన్ ఆయిల్ తరహాలో) ఉంటుంది. రసాయనపరంగా క్రూడ్ ఆయిల్ తరహాలో పనిచేస్తుంది.

ఇంధనం
ఫొటో క్యాప్షన్, కర్బన్ ఉద్గారాలు లేని ఇంధనం బయోక్రూడ్ అని సెర్గియో లిమా చెప్పారు

''ఎలాంటి ఉద్గారాలు లేని ఇంధనాన్ని ఇక్కడ తయారు చేస్తున్నాం'' అని లిమా అన్నారు. ఆయన ఫైర్‌ఫ్లై గ్రీన్ ఫ్యూయోల్స్ సంస్థ రీసెర్చ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

మొదటిసారి ఆ ఇంధనాన్ని తయారు చేసినప్పుడు, దాని ఫలితాలను చూసి లిమా ఆశ్చర్యపోయారు.

''చాలా బాగా అనిపించింది. ఎందుకంటే, అది మనందరి నుంచి వచ్చే పునరుత్పాదక ముడి పదార్థం నుంచి తయారైంది.'' అన్నారాయన.

ఆయన ప్రయోగశాలలో, ఆయిల్ రిఫైనరీస్(చమురు శుద్ధి కర్మాగారాలు)లో కంటే అతి సూక్ష్మమైన, ప్రతి బొట్టునూ ఒడిసిపట్టే పరికరాలు(డిస్టిలేషన్ కాలమ్స్) ఉన్నాయి.

అవి కూడా రిఫైనరీ తరహాలోనే పనిచేస్తాయి. ఆయిల్‌ను వేడి చేసినప్పుడు నిర్దిష్ట ఉష్ణోగ్రతల వద్ద అది వివిధ వాయువులుగా విడిపోయి, స్వేదబిందువుల రూపంలో వేర్వేరు ఇంధనాలుగా మారతాయి.

బొట్టుబొట్టుగా తెల్లని ద్రవం అక్కడ ఏర్పాటు చేసిన ట్యూబుల్లోకి చేరుతుంది.

''అదే మన బయోఫ్యూయెల్'' అని చెబుతూ ఆయన నవ్వేశారు.

''ఈ ఇంధనం అద్భుతం'' అన్నారు.

ఇంధనం
ఫొటో క్యాప్షన్, వ్యర్థాల రసాయనిక ప్రక్రియ అనంతరం కిరోసిన్ వస్తుంది

మంచి అవకాశం

వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సహకారంతో, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్‌లోని డీఎల్ఆర్ కంబషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో బయోకిరోసిన్‌ను పరీక్షిస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌లో ఉన్న యూకేకి చెందిన ఎస్‌ఏఎఫ్ (సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్స్) కూడా మున్ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించనుంది.

ఈ కిరోసిన్ ఏ1 ఫాజిల్ జెట్ ఫ్యూయెల్ కెమికల్ కాంపోజిషన్‌తో దాదాపుగా పోలి ఉందని ప్రాథమిక పరీక్షల్లో తేలింది. దీంతో యూకే రవాణా శాఖ తన వంతుగా ఈ బృందానికి రెండు మిలియన్ డాలర్ల రీసెర్చ్ గ్రాంట్‌ను మంజూరు చేసింది.

ఈ సైంటిస్టుల బృందం ప్రయోగశాలలోని టెస్ట్ ట్యూబ్‌లో కిరోసిన్‌ను తయారు చేయగలదు. అయితే, ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఇది అందుబాటులోకి రావడానికి, విమాన ఇంధనాన్ని భర్తీ చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

ఒక వ్యక్తి ఏడాది వ్యర్థాలతో సుమారు 4 నుంచి 5 లీటర్ల విమాన ఇంధనం 'బయోఫ్యూయెల్' తయారు చేయొచ్చని హైగేట్ అంచనా వేశారు.

ఒక విమానం ప్రయాణికులతో లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు పది వేల మంది ఏడాది వ్యర్థాలు అవసరమవుతాయి.

తిరిగి వచ్చేందుకు మరో 10 వేల మంది వ్యర్థాలు అవసరమవుతాయి.

యూకేలో ఉత్పత్తవుతున్న మురుగు నీటితో దేశంలో ప్రస్తుతమున్న విమాన ఇంధన డిమాండ్‌లో 5 శాతం ఇంధనాన్ని ఉత్పత్తి చేయొచ్చు.

అది అంత పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ, అది మంచి విషయమని ఆయన నొక్కి చెప్పారు.

చమురు వ్యర్థాలు, మొక్కజొన్న నూనెలు, శిలాజాలు కాని వాటి నుంచి తయారు చేసిన ఇంధనాలను సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్‌గా వ్యవహరిస్తారు.

ఇంధనం
ఫొటో క్యాప్షన్, ల్యాబొరేటరీలో సెర్గియో లిమా

ఇవి విమానాలు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అయితే, మొక్కలు పెరిగేందుకు మళ్లీ అదే కార్బన్ డై ఆక్సైడ్‌ను సంగ్రహిస్తాయి. అలా చూస్తే, శిలాజ ఇంధనాల కంటే 80 నుంచి 90 శాతం కర్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

అయితే, పర్యావరణవేత్తలు మాత్రం ప్రజలు విమాన ప్రయాణాలు తగ్గించాలని, అలాగే ఆహారం, జెట్ ఫ్యూయెల్ లాంటి ఇంధనాల కోసం మొక్కలపై ఆధారపడాలని సూచిస్తున్నారు.

''మురుగునీటితో ఉత్పత్తి చేసే ఇంధనాన్ని పర్యావరణ వేత్తలు ఇష్టపడతారు. ఎందుకంటే, ఈ సమాజం నివారించలేని చెత్త ఏదైనా ఉందంటే అవి మానవ వ్యర్థాలే'' అని ఏవియేషన్ ఎన్విరాన్‌మెంట్ ఫెడరేషన్ పాలసీ డైరెక్టర్ కెయిట్ హెవిట్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న ఏవియేషన్ ఫ్యూయెల్‌లో సస్టైనబుల్ ఫ్యూయెల్ కేవలం 0.1 శాతం మాత్రమే. దీని ప్రకారం చూస్తే, హైగేట్ పెట్టుకున్న 5 శాతం లక్ష్యం అర్థవంతంగానే కనిపిస్తోంది.

ఇంకా చెప్పాలంటే, ఈ ఇంధనం వినియోగానికి వాడే ముడిపదార్థం ఎవరికీ అసవరం లేనిది. ప్రపంచమంతా దొరికేది.

''దీనిని యూకేలో కనిపెట్టినా, ఇది ప్రపంచానికి దొరికిన మంచి అవకాశం'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)