ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు దిగితే ముస్లిం దేశాలు ఎటువైపు?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉధృతంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. అమెరికా సైనిక చర్య గురించి చర్చ జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సైతం ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇరాన్‌లో పాలన మార్పు గురించి అమెరికాలో ఎంతో కాలంగా చర్చ జరుగుతోంది.
అమెరికా 1953లో కూడా ఇరాన్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించింది. కానీ, 1979 నాటి ఇస్లామిక్ విప్లవం వల్ల అమెరికా అనుకూల ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చింది.
1953లో అమెరికా, బ్రిటన్ కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఇరాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ మొసాదెగ్‌ను పదవీచ్యుతుడిని చేసి, అధికారాన్ని పహ్లావీలకు అప్పగించాయి.
ఇరాన్ చమురు పరిశ్రమను జాతీయం చేసిన మొహమ్మద్ మొసాదెగ్.. షా (అప్పటి రాజు) అధికారాలను తగ్గించాలని కోరుకున్నారు.
ఎలాంటి యుద్ధ వాతావరణం లేని సమయంలో (పీస్‌టైమ్‌లో) అమెరికా ఒక విదేశీ నాయకుడిని గద్దె దించేందుకు ప్రయత్నించడం ఇరాన్‌లోనే మొదటిసారి.
అయితే, అదే చివరిసారి మాత్రం కాదు. ఆ తర్వాత ఇది అమెరికా విదేశీ విధానంలో భాగమైంది.
1953లో అమెరికా చేసిన తిరుగుబాటు కారణంగా.. 1979 ఇరాన్ విప్లవం వచ్చింది. కానీ, కొన్ని దశాబ్దాలు గడిచినా, ఇరాన్, పశ్చిమ ప్రాంతాల మధ్య నెలకొన్న ఈ వైరం మాత్రం ముగియలేదు.

ఒకవేళ దాడి చేస్తే.. రష్యా, చైనా వైఖరి ఏంటి?
1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి ముందు.. అయతొల్లా రుహుల్లా ఖమేనీ దేశ బహిష్కరణకు గురై, తుర్కియే, ఇరాక్, పారిస్‌లలో ప్రవాసంలో ఉన్నారు.
ఇరాన్ పాశ్చాత్యీకరణ, అమెరికాపై ఆధారపడటం పెరగడం వంటి విషయాల్లో షా పహ్లావీని ఖమేనీ విమర్శించేవారు.
ఇప్పుడు ఇరాన్‌లో అయతొల్లా ఖమేనీ పాలనకు ముగింపు పలకాలని మరోసారి అమెరికా వాదిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే.. ఎవరు ఎటువైపు ఉంటారు? అమెరికా వైపు ఎవరుంటారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇరాన్‌కు రష్యా, చైనా రెండూ చాలా ముఖ్యమైన భాగస్వామ్య దేశాలు. అమెరికా సైనిక చర్యను ఈ రెండు దేశాలు బహిరంగంగానే ఖండించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గతేడాది జూన్‌లో కూడా ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా దాడులు చేసినప్పుడు, రష్యా, చైనాలు బహిరంగంగా నిరసన తెలిపాయి. కాకపోతే, మౌఖిక నిరసనకే పరిమితమయ్యాయి.
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్, మాస్కోల మధ్య సహకారం మరింత పెరిగిందని స్పష్టమవుతోంది.
ఇరాన్ డ్రోన్లు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసింది. అదేవిధంగా రష్యా తన ఆర్థిక, సైనిక సంబంధాలను విస్తరించుకుంది.
దీంతో పాటు, రెండు దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడటం పెరిగింది.
రష్యాకు ఇరాన్ అత్యంత కీలకమైన భాగస్వామి. పశ్చిమ దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడంలో సహకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా, ఇరాన్‌లు అనేక విషయాల్లో సహకరించుకుంటున్నప్పటికీ, ఇరాన్‌కు మద్దతుగా నేరుగా అమెరికాతో ఘర్షణలకు దిగేంత మిత్ర దేశం కాదు. జూన్‌లో కూడా రష్యా అలా చేయలేదు.
''ఇరాన్‌పై పశ్చిమ దేశాలు విధించిన చట్టవిరుద్ధమైన ఆంక్షల వల్ల ఆ దేశంలో ఆర్థిక, సామాజిక సవాళ్లు నెలకొన్నాయి. దీనివల్ల ఇరాన్ సామాన్య పౌరులే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇరాన్ ప్రజల్లో పెరుగుతోన్న అసమ్మతిని ఆసరాగా చేసుకుని, దేశాన్ని బలహీనపర్చేందుకు, అస్థిరంగా మార్చేందుకు బాహ్య శక్తులు ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం 'కలర్ రివల్యూషన్స్(వర్ణ విప్లవాలు)' అని పిలిచే అపఖ్యాతి పాలైన ఎత్తుగడలు వేస్తున్నారు. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఇలాంటి వినాశకర బాహ్య జోక్యాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నాం'' అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా జనవరి 13న చెప్పారు.
''అమెరికా నుంచి ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్’ ఎదుర్కొంటోన్న సైనిక దాడుల బెదిరింపులు అస్సలు ఆమోదయోగ్యం కాదు. జూన్ 2025 మాదిరిగా ఇరాన్‌పై మరోసారి దారుణమైన దాడులు చేసేందుకు సాకులు వెతుకుతోన్న వారు.. ఇలాంటి చర్యల వల్ల మిడిల్ ఈస్ట్‌తో పాటు అంతర్జాతీయ భద్రత విషయంలో తీవ్రమైన పరిణామాలకు కారణమవుతాయని అర్థం చేసుకోవాలి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాను చైనా సవాలు చేస్తుందా?
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న చైనా కూడా ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తోన్న బెదిరింపులను ఖండిస్తోంది. కానీ, అమెరికాను ఇది సవాలు చేస్తుందా?
చైనా, ఇరాన్‌ల మధ్య ''సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం'' ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తున్న మాదిరిగా చైనా తన భాగస్వాములకు యుద్ధ భూమిలో మద్దతు ఇవ్వదు.
ఆర్థిక మనుగడ (చమురు విక్రయాలు), మిలిటరీ టెక్నాలజీ కోసం ఇరాన్ చైనాపై ఆధారపడాల్సిన పూర్తి నిస్సహాయ స్థితిలో చిక్కుకుంది. కానీ, చైనా అలా కాదు. ఎలాంటి సెక్యూరిటీ గ్యారెంటీని అందించలేనని స్పష్టం చేస్తోంది.
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సంబంధించి చైనా విదేశాంగ శాఖ బుధవారం ఇలా పేర్కొంది.
''ఇరాన్‌లో పరిస్థితిపై ఇప్పటికే మా వైఖరిని పలుమార్లు స్పష్టం చేశాం. ఇరాన్ ప్రభుత్వం, ప్రజలు ప్రస్తుత అవాంతరాలను అధిగమించి, దేశంలో స్థిరత్వాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాం. ఇతర దేశాల అంతర్గత వ్యవహరాల్లో విదేశీ జోక్యాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. అంతర్జాతీయ సంబంధాల్లో బల ప్రయోగాన్ని లేదా బెదిరింపులను మేం అస్సలు సమర్థించం. మిడిల్ ఈస్ట్‌లో స్థిరత్వం, శాంతి కోసం అన్ని పక్షాలు కలిసి చర్యలు చేపడతాయని ఆశిస్తున్నాం'' అని తెలిపింది.
ఇరాన్ విషయంలో చైనా మాట్లాడే తీరు అమెరికాకు వ్యతిరేకంగా మరీ అంత దూకుడుగా లేదు. చైనాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్టనర్ అమెరికా.
వైరం ఉన్నప్పటికీ, అమెరికాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించాలనే చైనా కోరుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
జీ-7 దేశాల వైఖరి ఏంటి?
ఇరాన్ విషయంలో జీ-7 దేశాలు కూడా ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రకటన ఉంది.
''కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) విదేశాంగ మంత్రులతో కలిసి మేం (ఈయూ ప్రతినిధులం) ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనలకు సంబంధించిన పరిణామాల పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం" అని జీ7 విదేశాంగ మంత్రులు ప్రకటన విడుదల చేశారు.
"ఇరాన్ పౌరులపై అక్కడి అధికారులు క్రూరమైన అణచివేత చర్యలను తీవ్రతరం చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. డిసెంబర్ 2025 చివరి నుంచి ఇరాన్ ప్రజలు మెరుగైన జీవితం, గౌరవం, స్వేచ్ఛ కోసం తమ చట్టబద్ధమైన ఆకాంక్షలను ధైర్యంగా వ్యక్తం చేస్తున్నారు'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
''ఇరాన్‌లో మరణాల సంఖ్య, గాయాలు పాలయ్యే వారి సంఖ్య పెరగడంపై మేం ఆందోళన చెందుతున్నాం. నిరసనకారులను భద్రతా దళాలు ఉద్దేశపూర్వకంగా చంపడం, ఏకపక్షంగా నిర్బంధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని తెలిపారు.
''ఇరాన్ అధికారులు హింసను నిరోధించి, సంయమనం పాటించాలని మేం కోరుతున్నాం. ఇరాన్ ప్రజల మానవ హక్కులను, ప్రాథమిక స్వేచ్ఛను కాపాడాలి. అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘిస్తూ.. ఇరాన్ నిరసనలను, అసమ్మతిని అణచివేయడం కొనసాగిస్తే.. అదనపు నియంత్రణ చర్యలు విధించడానికి జీ-7 సభ్య దేశాలు సిద్ధంగా ఉన్నాయి'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లామిక్ దేశాలు ఏమంటున్నాయి?
''ఇస్లామిక్ ప్రపంచం అంతకుముందు కంటే ఎక్కువగా విభజనకు గురైంది. ఉమ్మడి విజన్ లేదు, ఉమ్మడి వ్యూహం లేదు, ఉమ్మడి నిర్ణయాత్మక యంత్రాంగం కూడా లేదు. ఇది అక్కడి ఉన్నత వర్గాల ద్రోహాన్ని ప్రతిబింబిస్తోంది. నూతన సామ్రాజ్యవాద ఒరవడి ఉద్భవిస్తోన్న ట్రంప్ ప్రపంచంలో.. ఇస్లామిక్ దేశాలు వలస పాలనకు తలొగ్గుతున్నాయని అనిపిస్తుంది. అంటే ఐక్యత లేదు, సార్వభౌమాధికారం లేదు'' అని రష్యాకు చెందిన రాజకీయ విశ్లేషకులు అలెక్సాండర్ దుగిన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
ఇరాన్‌లో ఏం జరిగినా అరబ్ దేశాల స్పందన అంత వేగంగా లేదు.
తుర్కియే బహిరంగంగా మాట్లాడుతోంది. కానీ, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మాత్రమే. అమెరికా విషయానికొస్తే.. తుర్కియే వైఖరి, భాష కూడా పూర్తిగా మారుతుంది.
ఇరాన్ అంతర్గత సమస్యలో జోక్యం చేసుకోవద్దని తుర్కియే అధికార పార్టీ ప్రతినిధి ఓమర్ సెలిక్ జనవరి 13న ప్రపంచాన్ని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు మాత్రమే ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నిర్ణయించుకోవాలని అన్నారు.
''మా పొరుగు దేశం ఇరాన్‌లో ఎటువంటి గందరగోళ పరిస్థితులను మేం చూడాలనుకోవడం లేదు. ఇరాన్ సొంతంగా తన సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇజ్రాయెల్ అధికారులు బాధ్యతారహిత వైఖరిని అవలంభించేందుకు చూస్తున్నారు. ఇది ఈ ప్రాంతం అంతటా అతిపెద్ద సమస్యలను సృష్టిస్తుంది. ఇది ఆమోదయోగ్యం కాదు" అని పేర్కొన్నారు.
2023 అక్టోబర్ దాడుల తర్వాత.. ఇరాన్ ప్రాక్సీ నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్ దెబ్బకొట్టింది. ఒకప్పటి దీని అత్యంత శక్తివంతమైన మిత్రుడు హిజ్బొల్లాను లెబనాన్‌లో బలహీనపర్చింది.
సిరియా నుంచి బషర్ అల్-అసద్ బహిష్కరణకు గురయ్యారు. గత ఏడాది జూన్‌లో ఇజ్రాయెల్, అమెరికాల నుంచి 12 రోజుల పాటు ఇరాన్ బాంబు దాడులను ఎదుర్కొంది. ఈ పరిణామాలన్నింటిన్నీ చూస్తే.. ఈ ప్రాంతంలో ఇరాన్ బలహీనత స్పష్టంగా తేటతెల్లమవుతోంది.
తమపై మరోసారి దాడి జరిగితే, తమ లక్ష్యాలను విస్తరిస్తామని, బహుశా అమెరికా ఐదవ నౌకాదళం ఉన్న బహ్రెయిన్ వరకు ఈ విస్తరణ ఉండొచ్చని ఇరాన్ అధికారులు తమ గల్ఫ్ సహచరులను హెచ్చరించారు. ఇటువంటి బెదిరింపులు కేవలం నటన కూడా కావొచ్చు.
గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ఏదైనా దాడికి పాల్పడితే.. అది అసలైన డ్యామేజ్‌కు కారణమవుతుంది. దీనికి అమెరికా నుంచి గట్టి స్పందన రావొచ్చు.
దేశంలో జరుగుతోన్న నిరసనలు, విదేశీ దాడుల నుంచి తమ మనుగడకే ముప్పు ఉందని ఇరాన్ భావిస్తే.. ఇలాంటి ప్రమాదకరమైన సాహసానికి కూడా అది ఒడిగట్టవచ్చని నిపుణులు అంటున్నారు.
అమెరికా నేతృత్వంలో ఆక్రమణ జరిగిన తర్వాత ఇరాక్‌లో, సుదీర్ఘ కాలం పాటు జరిగిన అంతర్యుద్ధం వల్ల సిరియాలో పాలన మార్పు జరిగింది.
పొరుగున ఉన్న యెమెన్‌లో జరుగుతోన్న అంతర్యుద్ధంపై, ఎర్ర సముద్రం అవతల సూడాన్‌లో నెలకొన్న సంక్షోభాలపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అరబ్ పాలకులకు, ఇరాన్‌కు మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా లేవు. తన అణు కార్యక్రమాన్ని, అరబ్ మిలీషియాలకు (సాయుధ ముఠాలకు) మద్దతును కట్టడి చేసే ఇరాన్ కొత్త పాలనను అరబ్ దేశాలు స్వాగతిస్తాయని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అరబ్ దేశాల్లో భయాందోళనలు
అరబ్ దేశాల వైఖరిపై 'వాల్ స్ట్రీట్ జర్నల్' రాసిన వ్యాసంలో.. ఇరాన్‌పై ఏదైనా దాడి జరిగితే.. హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల కదలికలకు అంతరాయం ఏర్పడవచ్చని అరబ్ దేశాలు భయపడుతున్నాయని పేర్కొంది.
పశ్చిమాసియాలోని సంపన్న చమురు దేశాలను ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను హార్ముజ్ జలసంధి కలుపుతుంది.
పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య హార్ముజ్ జలసంధి ఉంది. ఇరాన్, ఒమన్ సముద్ర సరిహద్దు మధ్యలో ఈ జలసంధి ఉంటుంది. ఇది ఒక ఇరుకైన జలమార్గం. ఒక చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.
తన పొరుగు అరబ్ దేశాలతో ఇరాన్‌ను ఇది సెపరేట్ చేస్తోంది.
ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో ఐదోవంతు ఈ జలమార్గం ద్వారానే సరఫరా అవుతోందంటే ఇది ఎంత ముఖ్యమైందో అర్థమవుతుంది.
సౌదీ అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనంలో.. జరగబోయే ఎటువంటి సంఘర్షణలో తాము పాల్గొనమని, ఇరాన్‌పై దాడికి తమ ఎయిర్‌స్పేస్ వాడుకునేందుకు అమెరికాకు అనుమతి ఇవ్వమని సౌదీ అరేబియా హామీ ఇచ్చినట్లు పేర్కొంది.
ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడమే అమెరికా చర్యలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం.
ఈ సమస్యలను పరిష్కరించుకునే విషయంలో సాయం చేసేందుకు ఇరాన్, అమెరికాతో తమ దేశం సంప్రదింపులు జరుపుతోందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్-అన్సారీ రిపోర్టర్లతో అన్నారు.
అమెరికా అధికారుల ప్రకారం, ఇరాన్‌పై చర్యలు తీసుకునే విషయంలో ట్రంప్ ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. తన సలహాదారులతో చర్చలు జరుపుతున్నారు.
''సౌదీ అరేబియాను ఇరాన్ ప్రత్యర్థిగా చూస్తారు. కానీ తెరవెనుక సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్‌లు.. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఎలాంటి ప్రయత్నమైనా ప్రపంచ ఆయిల్ మార్కెట్లలో తీవ్ర అంతరాయానికి దారితీస్తుందని, చివరికి అమెరికా ఆర్థిక వ్యవస్థకే ఎక్కువ నష్టమని అమెరికాకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి'' అని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది.
తమ సొంత దేశాల్లో అస్థిరత్వంపై, దాని వల్ల కలిగే ప్రతిస్పందనలపై ఈ దేశాలు బాగా భయపడుతున్నాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి అధ్యక్షుడు ట్రంప్ ముందు అన్ని ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














