ఇరాన్‌‌లో గాంధీ హాస్పిటల్: తెహ్రాన్‌లో ఒక వీధికి, ఆసుపత్రికి ‘మహాత్ముడి’ పేరు ఎలా వచ్చింది?

గాంధీ ఆస్పత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మార్చి1న అమెరికా, ఇజ్రాయెల్ దాడులలో దెబ్బతిన్న గాంధీ ఆస్పత్రి
    • రచయిత, శ్రీనివాస్ నిమ్మగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు.

ఈ దాడులలో పాఠశాలలు, ఆస్పత్రులు లక్ష్యంగా మారాయాని ఇరాన్ ఆరోపిస్తోంది. శనివారం ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 160మందికిపైగా మరణించారని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదు.

మరోవైపు తెహ్రాన్‌లోని గాంధీ ఆస్పత్రిపై దాడులు జరిగాయని న్యూస్ చానల్ ఐఆర్ఐఎన్ఎన్ తెలిపింది. దీన్ని ‘‘యుద్ధ నేరం’’గా అభివర్ణించింది.

ఆస్పత్రులపై దాడులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఆస్పత్రికి నష్టం వాటిల్లడంతో రోగులను ఖాళీ చేయించారు.

ఇరాన్‌లో గాంధీ పేరుతో ఒక వీధి, ఆ ప్రాంతంలో గాంధీ పేరుతో ఆస్పత్రి ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్పత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ గాంధీ ఆస్పత్రి

అమెరికా,ఇజ్రాయెల్ దాడులలో దెబ్బతిన్న గాంధీ హోటల్ హాస్పిటల్ తెహ్రాన్‌లో 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.

జాతీయ అంతర్జాతీయ నిపుణుల కన్సార్టియం 2008లో దీనిని స్థాపించింది.

ఈ కాంప్లెక్స్‌లో రోగ నిర్ధరణ, చికిత్స సదుపాయాలతో 22 అంతస్తులు ఉన్నాయి.

ఇందులో 100 ఇన్‌పేషెంట్ పడకలు, 40 ఇంటెన్సివ్ కేర్ పడకలు, 17 అత్యాధునిక ఆపరేటింగ్ గదులు ఉన్నాయి. ఇందులో ఆస్పత్రితోపాటు హోటల్‌ కూడా ఉంటుంది.

హోటల్ నిర్వహణ, ఆరోగ్య సేవలు అందించడానికి గాంధీ హోటల్ హాస్పిటల్ అత్యాధునిక సాంకేతికతను ఆధారం చేసుకుందని పర్యటకరంగ సేవలు అందించే ఎర్మాటెబ్ వెబ్‌సైట్ తెలిపింది.

ఈ గాంధీ హోటల్ హాస్పిటల్ తెహ్రాన్‌లోని గాంధీ స్ట్రీట్‌లో ఉంది.

తెహ్రాన్

ఫొటో సోర్స్, Getty Images

ఆ వీధికి గాంధీ పేరు ఎందుకు పెట్టారు?

ఇండియాలో గాంధీజీ పేరుతో అనేక విద్యాసంస్థలు ఉన్నాయి. ఇక ఆయన విగ్రహాలు అనేక చోట్ల కనిపిస్తూనే ఉంటాయి. భారతీయ కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఉంటుంది. విదేశాలలోనూ గాంధీజీ విగ్రహాలు కనిపిస్తాయి.

దక్షిణాఫ్రికా, న్యూయార్క్, లండన్, స్పెయిన్ తదిర చోట్ల గాంధీ విగ్రహాలు ఉన్నాయి.

ఇరాన్‌లో కూడా ఓ వీధికి గాంధీజీ పేరు పెట్టారు.

ఈ వీధిలోనే ఉన్న గాంధీ ఆస్పత్రి మార్చి1న అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడిలో తీవ్రంగా దెబ్బతింది.

అయితే ఇరాన్‌లో గాంధీజీ పేరు కనిపించడానికి ప్రత్యేక కారణమే ఉందని ది పాలిటిక్స్ ఆఫ్ స్ట్రీట్ నేమ్స్: రీకన్‌స్ట్రక్టింగ్ ఇరాన్స్ కలెక్టివ్ ఐడెంటిటీ’ పరిశోధనా వ్యాసం చెబుతోంది.

ఇరాన్‌లో 1979 విప్లవం తరువాత అనేక వీధుల పేర్లను మార్చారు. ఇరాన్ రాజధాని తెహ్రాన్ నగరాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తూ 1979–2019 మధ్య కాలంలో షియాల గుర్తింపును పునర్నిర్మించడంలో వీధి పేర్ల పాత్ర ఎంతవరకు ఉందనే అంశాన్ని అధ్యయనం చేశారు ఆ పరిశోధనాకర్త ఎహ్సాన్ కాషిఫ్.

‘‘1979లో జరిగిన విప్లవాత్మక రాజకీయ మార్పుల తరువాత, ఇరాన్‌లో ఏర్పడిన ప్రభుత్వం గత చరిత్రపై దృష్టి పెట్టింది. దీని లక్ష్యం షియా గుర్తింపును ఏర్పరచడం’’ అని ఎహ్సాన్ రాశారు.

గాంధీ పాట్రిస్ లుముంబా

ఫొటో సోర్స్, Getty Images

కొత్త పేరు.. కొత్త భావజాలం

ఇరాన్‌లో వీధుల పేర్లను, గుర్తులను మార్చేయడంతో గతచరిత్రను పూర్తిగా తుడిచిపెట్టడం, తరద్వారా షియాల చరిత్రను మాత్రమే ఉనికిలోకి తీసుకురావడమనే వ్యూహం ఉందంటారు ఎహ్సాన్.

అయితే విప్లవ, సామ్రాజ్యవాద వ్యతిరేక నాయకుల స్మరణ కేవలం ముస్లింలకే పరిమితం కాకుండా వలసవాద పాలనపై గళమెత్తిన ఇతర దేశాలలోని స్వాతంత్య్ర యోధుల పేర్లను కూడా కొన్ని వీధులకు పెట్టారు.

ఇందులో భాగంగా మహాత్మాగాంధీ, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తొలి ప్రధాని పాట్రిస్ లుముంబా, దక్షిణ అమెరికా స్వాతంత్య్ర పితామహుడిగా పిలిచే సైమన్ బొలివర్ పేర్లను తెహ్రాన్‌లోని వీధులకు పెట్టారని ఎహ్సాన్ రాశారు.

పహ్లవీ రాజుల పాలన అంతమై, ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన పరివర్తనలో భాగంగా పాత పేర్లను మార్చారని, పాత కట్టడాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చారని, వాటిని కొత్త విప్లప భావజాలానికి చిహ్నంగా మార్చారని ఫ్రమ్ విన్‌స్టన్ చర్చిల్ టు బాబీ శాండ్స్ - ఐడిలాజికల్ స్ట్రీట్ నేమ్స్ అండ్ మాన్యుమెంట్స్ ఇన్ తెహ్రాన్‌ అనే వ్యాసం కూడా పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)