హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ఇరానీ చాయ్ కథేంటి, ఈ కేఫ్‌లు ఇప్పుడెందుకు మూతపడుతున్నాయి?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెల్లని కప్పూ సాసర్‌లో, పొగలు కక్కుతూ ఘుమఘుమలాడే ఇరానీ చాయ్ తాగనిదే హైదరాబాద్‌లో చాలా మందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు.
ఎడారి దేశం ఇరాన్ నుంచి వచ్చిన ఈ వేడి పానీయం, 500 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన హైదరాబాద్ నగర సంస్కృతిలో భాగమైపోయింది.
ఉస్మానియా బిస్కెట్.. బన్ మస్కా (బ్రెడ్ అండ్ బటర్).. సమోసా.. పఫ్.. ఇలా ప్లేటులో ఏది ఉన్నా.. పక్కనే ఒక కప్పు ఇరానీ టీ ఉండి తీరాల్సిందే.
దాదాపు వందేళ్ల కిందట భారత్‌లోకి ప్రవేశించిన ఈ ఇరానీ చాయ్‌కి హైదరాబాద్ అడ్డాగా ఎలా మారింది? ఇప్పుడా ఇరానీ కేఫ్‌లు క్రమంగా ఎందుకు తగ్గిపోతున్నాయి?

హైదరాబాద్ నడిబొడ్డున ఆబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌ది దాదాపు 90 ఏళ్ల చరిత్ర. ఇరానీ చాయ్ తాగేందుకే వేల మంది నిత్యం ఇక్కడికి వస్తుంటారు.
ఈ కేఫ్‌ను బీబీసీ సందర్శించినప్పుడు బన్ మస్కా తింటూ, చాయ్ తాగుతూ స్నేహితులతో కబుర్లు చెప్పుకొనేందుకు వచ్చినవారు కనిపించారు.
పంజాబ్‌కు చెందిన యాన్నీ.. తోటి ఉద్యోగులతో కలిసి ఇరానీ చాయ్ తాగేందుకు వచ్చారు. ఆమె పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. ఐదేళ్ల కిందట హైదరాబాద్‌కు బదిలీపై వచ్చారు.
ఇప్పుడు ఇరానీ టీ తన జీవితంలో భాగంగా మారిపోయిందని ఆమె చెప్పారు.

‘‘హైదరాబాద్ వచ్చాక ఒకసారి ఇరానీ చాయ్ తాగాను. ఆ టేస్ట్‌కు ఫిదా అయిపోయా. మేం ఇంట్లో టీ చేసుకోం. బయటకు వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా ఇరానీ టీనే తాగుతా. ఇలాంటి రుచి ఉన్న టీ హైదరాబాద్‌లో తప్ప మరెక్కడా దొరకదు’’ అని చెప్పి తన సహచర ఉద్యోగులతో మాటల్లో మునిగిపోయారు యాన్నీ.

ఫొటో సోర్స్, Grand hotel
బాతాఖానీ వేదికలు ఈ కేఫ్‌లు..
ఉదయాన్నే బన్ మస్కా లేదా బిస్కెట్లు తిని, ఇరానీ టీ తాగి పనులకు వెళ్లే శ్రామికుల నుంచి.. కార్లలో తిరిగేవారి వరకు.. అందరూ అవే కేఫ్‌లకు వచ్చి చాయ్ రుచి చూస్తుంటారు.
రెగ్యులర్ కెఫేలతో పోలిస్తే, ఇరానీ కేఫ్‌లు కాస్త భిన్నంగా ఉంటాయి. బయట ప్రపంచం కనిపించేలా విశాలమైన ఓపెన్ గదులు.. చెక్కతో చేసిన టేబుళ్లు.. గంటల తరబడి కూర్చుని కబుర్లు చెప్పుకొనే వాతావరణం కనిపిస్తుంటుంది.
సామాన్య ప్రజలకే కాదు, చాలామంది ప్రముఖులకు కూడా ఈ ఇరానీ కేఫ్‌లతో విడదీయరాని అనుబంధం ఉంది.
ఎంఎఫ్ హుస్సేన్ మొదలుకుని ఎంతోమంది ప్రముఖులు అబిడ్స్‌లోని గ్రాండ్ హోటల్‌కు వచ్చి గంటలకొద్దీ సమయం గడిపేవారని ఇక్కడి నిర్వాహకులు చెప్తున్నారు.
కేవలం హైదరాబాద్‌లోనే కాదు, ముంబయి, పుణె వంటి నగరాల్లోనూ ఇరానీ చాయ్ దుకాణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
కానీ, రానురానూ హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లోనూ ఇరానీ కేఫ్‌లు తగ్గిపోతున్నాయి.

ఫొటో సోర్స్, Grand hotel
అప్పట్లో 450 ఉండేవి, ఇప్పుడవి 125కి తగ్గాయి..
దాదాపు వందేళ్లుగా వస్తున్న మార్పులను తట్టుకుని, హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకున్న ఈ ఇరానీ కేఫ్‌ల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
చైన్ నెట్‌వర్క్ తరహా టీ కేఫ్‌లు ఎక్కువయ్యాయి. అక్కడ వైఫై వంటి సౌకర్యాలు కల్పించడంతోపాటు విభిన్న రకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. దాని ప్రభావం కూడా ఇరానీ కేఫ్‌లపై పడింది. క్రమంగా టీ విక్రయాల నుంచి బిర్యానీ, టిఫిన్లు, రెస్టారెంట్ బిజినెస్‌లలోకి మారారు నిర్వాహకులు.
కేవలం ఇరానీ టీ అమ్ముకుంటే రెస్టారెంట్లను నడిపించే పరిస్థితి లేదని చెబుతున్నారు గ్రాండ్ హోటల్ యజమాని జలీల్ ఫరూఖ్ రూజ్.

‘‘ఒకప్పుడు రోజుకు 8-9 వేల కప్పుల ఇరానీ టీ అమ్మేవాళ్లం. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. టీ స్టాళ్లు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఇప్పుడు రోజుకు 4 వేల కప్పుల టీ అమ్ముతున్నాం’’ అని బీబీసీతో చెప్పారు రూజ్.
ఈ గ్రాండ్ హోటల్‌ను 12 మంది ఇరానియన్లు కలిసి 1935లో ఏర్పాటు చేశారు.
ప్రస్తుత యజమాని రూజ్ తాత (తల్లి తరఫున) 1951లో ఇరాన్ నుంచి వచ్చి హోటల్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి వీరి కుటుంబమే దీన్ని నిర్వహిస్తోంది.
ఐదు దశాబ్దాల కిందట హైదరాబాద్‌లో 450 ఇరానీ కేఫ్‌లు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 125కు తగ్గిపోయిందని ఆయన వివరించారు. వాటిల్లోనూ ఇరానీయన్లు నడిపించే కేఫ్‌లు చాలా తక్కువని చెప్పారు.

రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్..
రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా 2,000 సంవత్సరం తర్వాత వచ్చిన రియల్ ఎస్టేట్ భూమ్ కారణంగా విశాలమైన స్థలాలు తక్కువ ధరకు లభించడం కష్టంగా మారిందని ఇరానీ కేఫ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు.
‘‘ఇరానీ కేఫ్‌లు ఉన్న రెస్టారెంట్లు చాలావరకు స్థలాలు లీజుకు తీసుకుని నడిపించారు. రియల్ ఎస్టేట్ ధరలు పెరగడంతో లీజులు పెంచాలని యజమానుల నుంచి ఒత్తిడి వచ్చింది. కేవలం టీ, బిస్కెట్లు అమ్ముకుని భారీగా లీజులు చెల్లించాలంటే కుదరదు కదా!
అందుకే స్థల యజమానులు ఇరానీ కేఫ్‌లను ఖాళీ చేయించారు. ఇరానీ కేఫ్‌లు రోడ్లకు మూలన ఉంటాయి. రోడ్ల విస్తరణ జరిగినప్పుడు కేఫ్‌లు, రెస్టారెంట్లు పోతున్నాయి. మాకు ఉన్న రెండు రెస్టారెంట్లను రోడ్డు విస్తరణలో కోల్పోయాం. పెరిగిన టీపొడి ధరలతో తక్కువ ధరకు టీ అమ్మడం కష్టంగా మారింది’’ అని చెప్పారు జలీల్ ఫరూఖ్ రూజ్.
చార్మినార్ వద్ద ఉండే ఫరాషా రెస్టారెంట్ ఒకప్పుడు ఇరానీ టీకి ఎంతో ప్రసిద్ధి. కానీ, ఇప్పుడదీ కళ తప్పింది.
తరాలు మారుతున్నకొద్దీ ఈ వ్యాపారంలోకి వచ్చే ఇరానీ కుటుంబాల సంఖ్య తగ్గిపోతోందని, కేఫ్‌లు తగ్గిపోవడానికి అది కూడా ఒక కారణమని బీబీసీతో చెప్పారు ఫరాషా రెస్టారెంట్ యజమాని మహమూద్.
‘‘ప్రస్తుత తరం చదువుకుని ఉద్యోగాలకో.. వేరే దేశాలకో వలస వెళ్లిపోతున్నారు’’ అని ఆయన చెప్పారు.

ముంబయి, పుణెలోనూ ఇదే పరిస్థితి..
ఇరానీ కేఫ్‌లకు ప్రసిద్ధి చెందిన ముంబయి, పుణెలోనూ అదే పరిస్థితి.
ముంబయిలో బ్రిటానియా ఇరానీ రెస్టారెంట్‌కు 101 ఏళ్ల చరిత్ర ఉంది. దాని యజమాని అఫ్సిన్ కొహినూర్ బీబీసీతో ఫోన్‌లో మాట్లాడారు.
‘‘ముంబయిలో 1950-60 సమయంలో 500-550 ఇరానీ కేఫ్‌లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 40-45కు తగ్గిపోయింది.
పుణెలోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు 75-80 ఉన్న ఇరానీ రెస్టారెంట్లు ఇప్పుడు 15కు పడిపోయాయని సమాచారం ఉంది.
ఇండియాలో ఇరానీ కేఫ్‌ల పతనం 1979కి ముందు నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆ సమయంలో ఇరాన్‌లో కరెన్సీ వాల్యూ పెరిగే సరికి, ఇక్కడ కేఫ్‌లు అమ్ముకుని ఇరానియన్ కమ్యూనిటీ తిరిగి ఇరాన్ వెళ్లిపోయారు’’ అని చెప్పారు 63 ఏళ్ల అఫ్సిన్ కొహినూర్.
ప్రస్తుతం నా కుమారుడు కూడా రెస్టారెంట్ బిజినెస్‌లోకి రావడానికి ఇష్టపడటం లేదు. ఏదో ఒకరోజు బ్రిటానియా రెస్టారెంట్ కూడా మూతపడే అవకాశం ఉందని చెప్పారు.

కష్టమైనా నడుపుతున్నాం: మూడో తరం
కొన్ని ఇరానీ కుటుంబాల మూడోతరం యువతీయువకులు ఉన్నత చదువులు చదివినప్పటికీ, ఇదే రెస్టారెంట్ బిజినెస్ కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్‌లో రెడ్ రోజ్ రెస్టారెంట్ బాధ్యతలు చూస్తున్నారు సయ్యద్ మొహమ్మద్ రజాక్. ఇరానీ చాయ్ విక్రయాల్లో తాత, తండ్రి వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత ఆయన తీసుకున్నారు.
రజాక్ తాత టెహ్రాన్ నుంచి వలస వచ్చి 1970ల్లో సిటీ లైట్ హోటల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రజాక్ తండ్రి రెడ్ రోజ్ రెస్టారెంట్ ప్రారంభించారు.
‘‘నేను ఇంజినీరింగ్ చేశా. యూఎక్స్ డిజైనర్‌ని. 35 ఏళ్ల నుంచి మాకంటూ ఒక బ్రాండ్ ఏర్పడింది. ఇప్పుడు ఇరానీ చాయ్ ఒక్కటే అమ్మడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదిగా మారింది. నాకున్న నైపుణ్యాలను వ్యాపారం పెంచుకోవడానికి, బ్రాండింగ్ కోసం, ఉత్పత్తులు ప్రోత్సహించడానికి ఉపయోగించుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నాం’’ అని బీబీసీతో చెప్పారు రజాక్.

ఇరానీ చాయ్ చరిత్ర ఏంటి?
ఇరానీ చాయ్.. పేరు చూస్తేనే ఇది ఇరాన్‌కు చెందిన పానీయం అని గుర్తించవచ్చు.
20వ శతాబ్దం ఆరంభంలో ఇరాన్‌లో విప్లవం, తీవ్ర కరవుకాటకాలతో వలసలు ఎక్కువగా జరిగాయి. ఆ సమయంలో ఇరానియన్లు మొదట పాకిస్థాన్‌లోని కరాచీ (అప్పట్లో అది బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం)కి వలసొచ్చారు. అక్కడి నుంచి వారు ముంబయికి సముద్ర మార్గం ద్వారా చేరుకుని.. తర్వాత పుణె వంటి నగరాలకు చేరుకున్నారు.
‘‘స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిషర్ల పాలనలో పుణెలోని మిలిటరీ క్యాంపులలో ఉదయం ఏదో ఒక పానీయం ఉండాలనే ఉద్దేశంతో ఇరానీ చాయ్ తాగడాన్ని ప్రోత్సహించారు. మొదట అలా మొదలైంది. తర్వాత హైదరాబాద్‌కు పాకింది.’ అని బీబీసీతో చెప్పారు హైదరాబాద్‌కు చెందిన చరిత్రకారుడు షఫి ఉల్లా.
ఇరానీ చాయ్‌పై ఆయన గతంలో పరిశోధన పత్రాలు సమర్పించారు.

‘‘హైదరాబాద్ నగరం నిజాం పాలనలో ఉండడంతో పర్షియన్ రెండో భాషగా ఉండేది. హైదరాబాద్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు నడిచేవి. అందుకే కొంతమంది ఇరానీ వ్యాపారులు ముంబయి, పుణె నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చినవారు ఇరానీ చాయ్ దుకాణాలు తెరిచారు'' అని చెప్పారు మొహమ్మద్ షఫి ఉల్లా షఫి ఉల్లా.
ఇరానీ కేఫ్‌ల పేర్లు కూడా భిన్నంగా ఉంటాయి.
దీనిపై చరిత్రకారుడు పరావస్తు లోకేశ్వర్ మాట్లాడుతూ ‘‘గ్రాండ్, రెడ్ రోజ్, సర్వి, ఆదర్శ్, కెఫే బహార్, ఆల్ఫా.. ఇలా ఒక మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఉంటాయి. అందుకే అన్ని వర్గాల నుంచి ఆదరణ లభించింది’’ అని చెప్పారు.

ఇరానీ చాయ్ తయారీలోనూ ప్రత్యేకం
ఇరాన్‌లో అందించే టీ అనేది కేవలం డికాక్షన్. అందులో పాలు పోయరు. చక్కెర క్యూబ్ నోట్లో పెట్టుకుని డికాక్షన్ తాగుతుంటారు.
భారత్‌లో మాత్రం రుచి కోసం పాలు కలుపుకుని తాగుతున్నారు.
రెగ్యులర్‌గా టీతో పోల్చితే తయారీ విధానమూ భిన్నమని చెప్పారు చార్మినార్ సమీపంలోని నిమ్రా కేఫ్ నిర్వాహకులు అస్లాం బిన్ అబూద్.
‘‘ముందుగా నీటిలో టీపొడి, పంచదార వేసి 4-5 నిమిషాలు కాయాలి. తర్వాత 18-20 నిమిషాలు సన్నటి సెగపై మరిగించాలి. ఆ డికాక్షన్‌ను సమావర్ అనే మరో పాత్రలోకి వడకట్టాలి. మరో పాత్రలో పాలను మరగకాయాలి.
కప్పులో డికాక్షన్ 60 శాతం, మరిగించిన పాలు 40 శాతం కలిపితే అసలు సిసలు ఇరానీ టీ సిద్ధమవుతుంది’’ అని చెప్పారు.

అయితే, ఇరానీ టీ అనగానే గుర్తుకువచ్చేది తెల్లని కప్పు సాసర్.
చాలామంది కప్పులో టీని సాసర్‌లో పోసుకుని తాగుతుంటారు లేదా స్నేహితులతో షేర్ చేసుకుంటారు.
కోవిడ్ తర్వాత చాలా కెఫేల్లో పింగాణీ కప్పులు, సాసర్లు మాయమైపోయాయి. వాటి బదులుగా పేపర్ కప్పులలో టీని అందిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















