డార్క్ టూరిజం అంటే ఏంటి? కేరళ పోలీసులు వయనాడ్ రావొద్దని ఎందుకు కోరుతున్నారు

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కొటేరు శ్రావణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంతో శుక్రవారం వరకు 300 మందికి పైగా చనిపోయారని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ చెప్పారని వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

భారీ వర్షాల కారణంగా మెప్పాడి, చూరల్మలై, ముండక్కే, అట్టామలై తదితర ప్రాంతాల్లో భారీ కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు సహా అనేక భవనాలు మట్టిలో కూరుకుపోయాయి. చాలా మంది ప్రజలు కొండచరియల శిథిలాల కింద చిక్కుకుపోయారు.

ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, స్థానికులు రెస్క్యూ ఆపరేషన్స్‌ను కొనసాగిస్తున్నారు. మట్టిలో కూరుకుపోయిన వారి కోసం తవ్వుతున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మరోవైపు వయనాడ్‌లో వర్షాలు సైతం ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.

సహాయ చర్యలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను చూసేందుకు బయట ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని కేరళ పోలీసులు కోరుతున్నారు.

అలా రావడం వల్ల సహాయ చర్యలకు ఆటంకాలు ఎదురవుతాయని చెబుతున్నారు. సాయం కోసం ‘112’కి కాల్ చేయాలంటూ కేరళ పోలీసులు సోషల్ మీడియాలో మెసేజ్ పోస్టు చేశారు.

విషాదకర సంఘటనలు, మరణాలు, విపత్తులు, మారణహోమాలు జరిగిన ప్రాంతాలను చూడాలని ప్రజలు రావడాన్ని ‘డార్క్ టూరిజం’ అంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
కేరళలో విరిగిపడ్డ కొండచరియలు

ఫొటో సోర్స్, Getty Images

డార్క్ టూరిజాన్ని ‘‘గ్రీఫ్ టూరిజం’’, ‘‘బ్లాక్ టూరిజం’’ అని కూడా పిలుస్తుంటారు.

డార్క్ టూరిజం ప్రదేశాలకు వెళ్లే పర్యటకులలో ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.

కొందరు ఆ విపత్తులను, వాటి వల్ల కలిగిన ప్రభావాలను చూడ్డానికి వెళ్తే.. మరికొందరు ఆ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించేందుకు వెళ్తుంటారు.

చరిత్రాత్మక సంఘటనల గురించి మరింత తెలుసుకునే ఉద్దేశంతో ఇంకొందరు వెళ్తుంటారు.

ఇలాంటి ఘటనలు జరిగిన ప్రాంతాలను చూసేందుకు ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా వెళ్తున్నారు.

ప్రజలు ఎమోషనల్‌గా ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘటనలకు కనెక్ట్ కావడమే దీనికి ప్రధాన కారణం.

డార్క్ టూరిజం ప్రదేశాల్లో యుద్ధ క్షేత్రాలు, విపత్తులు, విధ్వంసం జరిగిన ప్రాంతాలు, మెమోరియల్స్, జైళ్లు, నేరాలు జరిగిన ప్రాంతాలు, సమాధులు వంటివి ఉంటున్నాయి.

చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం
ఫొటో క్యాప్షన్, చెర్నోబిల్‌ అణు రియాక్టర్‌పై ఏర్పాటు చేసిన ఉక్కు కవచం

డార్క్ టూరిజమనేది కొత్త విషయం కాదని స్కాట్లాండ్‌లోని గ్లాస్గౌ కాలెడోనియన్ యూనివర్సిటీ టూరిజం ప్రొఫెసర్ జే.జాన్ లెనాన్ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 1996లో తన సహోద్యోగితో కలిసి డార్క్ టూరిజం పదాన్ని ఆయన ఉపయోగించారు.

అయితే, ‘వాటర్లూ యుద్ధం’ సమయంలోనే ఇలాంటి డార్క్ టూరిజం ఉన్నట్లు ఆధారాలున్నాయని ప్రొఫెసర్ జాన్ లెనాన్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

అప్పట్లో యుద్ధం జరిగిన ప్రాంతాలను ప్రజలు తమ బండ్ల పైనుంచి చూశారని పేర్కొంది. ఈ యుద్ధం 1815 కాలంలో జరిగింది. 16వ శతాబ్దంలో లండన్‌లో బహిరంగంగా ఉరితీయడాన్ని కూడా ప్రజలు గుమిగూడి చూశారని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.

చెర్నోబిల్, ది డార్క్ టూరిస్ట్ వంటి టీవీ షోలతో ఇటీవల కాలంలో డార్క్ టూరిజానికి మరింత పాపులారిటీ పెరిగింది.

ప్రపంచంలో అత్యంత భయానకమైన అణు ప్రమాదం ధాటికి దెబ్బతిన్న ప్రాంతం చెర్నోబిల్. ఈ ప్రాంతం డార్క్ టూరిజం కారణంగా యుక్రెయిన్‌లోని ప్రముఖ పర్యటక స్థలాల్లో ఒకటిగా మారింది.

1986లో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో విధ్వంసకరమైన అణు ప్రమాదం సంభవించింది. విద్యుత్ కేంద్ర భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఇది జరిగింది.

పవర్ ప్లాంట్ వర్కర్లు నివసించే ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించారు. ఈ ఘటన తర్వాత 50 వేల మంది ప్రజలు తిరిగి ఆ ప్రాంతానికి రాలేదు. ఇప్పటికీ ఇది ప్రమాదకరమైన ప్రాంతంగానే చూస్తున్నా.. చెర్నోబిల్‌లో కొన్ని ప్రాంతాలను సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు యుక్రెయిన్‌లో ఎక్కువ మంది వెళ్లాలనుకొనే పర్యటక ప్రదేశాల్లో చెర్నోబిల్ ఒకటి.

పోలాండ్‌లోని ఆష్విట్జ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాజీల మారణహోమాన్ని గుర్తు చేసే పోలాండ్‌‌లోని ఆష్విట్జ్‌ శిబిరం

చెర్నోబిల్‌ను మాత్రమే కాక, ఇటలీలోని పాంపీ, పోలాండ్‌లోని ఆష్విట్జ్, న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్, కేప్ టౌన్ సమీపంలోని రాబెన్ ఐలాండ్, అట్లాంటిక్ సముద్రంలోని టైటానిక్ శిథిలాలున్న ప్రాంతం, తుర్కియేలోని బుర్జ్ అల్ బాబస్, కంబోడియాలోని చోయుంగ్ ఏక్ కిల్లింగ్ ఫీల్డ్స్‌ వంటివి డార్క్ టూరిజానికి ప్రసిద్ధి పొందాయి.

ఇటలీలోని పాపీ యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఏటా ఈ ప్రాంతాన్ని 25 లక్షల మంది వీక్షిస్తారని అంచనాలున్నాయి. ప్రముఖ పర్యటక స్థానాలలో ఇది ఒకటిగా ఉంది.

అలాగే, నాజీ నిర్బంధ శిబిరాలలో అతిపెద్దది పోలాండ్‌లోని ఆష్విట్జ్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్షల మంది యూదులను, పట్టుబడిన ఇతరులను చంపిన ప్రదేశం ఇది.

ప్రస్తుతం ఈ ప్రదేశం ఆ యుద్ధ సమయంలో అమరులైన వారి స్మారకంగా నిలుస్తుంది. నాజీల అఘాయిత్యాలను ఇది గుర్తు చేస్తుంది. పోలాండ్‌లోని క్రాకోవ్ నుంచి కొన్ని గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి ఏటా లక్షల మంది ప్రజలు వెళ్తుంటారు.

న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్, మ్యూజియం
ఫొటో క్యాప్షన్, న్యూయార్క్‌లోని 9/11 మెమోరియను వేల మంది సందర్శిస్తారు.

న్యూయార్క్‌లోని 9/11 మెమోరియల్ కూడా ‘డార్క్ టూరిజం’ స్పాట్‌లో ఒకటిగా ఉంది. అమెరికాలో 2001, సెప్టెంబరు 11న ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసిన ఆత్మాహుతి దళ సభ్యులు న్యూయార్క్‌లోని ట్విన్‌ టవర్స్‌పై దాడి చేశారు.

ఈ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ శతాబ్దంలోని అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు.

ఇప్పుడు ఆ ప్రదేశంలో ఒక స్మారక భవనం, మ్యూజియం ఉన్నాయి. కూలిన భవనాలను కొత్త డిజైన్‌తో తిరిగి నిర్మించారు. ఇది కూడా సందర్శకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

రాబెన్ ఐలాండ్
ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ దగ్గర్లో గల రాబెన్ ఐలాండ్ జైలు

కేప్ టౌన్ తీరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాబెన్ ఐలాండ్ కూడా డార్క్ టూరిజం ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.

నెల్సన్ మండేలా, ఆయన అనుచరులను ఎన్నో ఏళ్ల పాటు కఠిన పరిస్థితుల మధ్య ఉంచిన జైలు ఉన్న ప్రదేశం ఇది.

ప్రస్తుతం ఇది దక్షిణాఫ్రికా ప్రైమ్ డార్క్ టూరిజం డెస్టినేషన్‌గా, యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఉంది.

ఇంగ్లాండ్‌లోని సౌత్‌హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా జలసమాధి అయ్యారు. వందల ఏళ్ల తర్వాత కూడా టైటానిక్ ప్రమాదాన్నే అతిపెద్ద సముద్ర ప్రమాదంగా చెబుతుంటారు.

ఈ టైటానిక్ శకలాలున్న ప్రాంతానికి చూసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు.

కొద్దికాలం కిందట టైటానిక్‌ను చూడటానికి ఐదుగురితో వెళ్లిన ఒక జలాంతర్గామి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో జలాంతర్గామిలో ఉన్నవారందరూ మరణించారు. టైటానిక్ శకలాలున్న ప్రాంతం కూడా డార్క్ టూరిజం స్పాట్‌గా మారింది.

తుర్కియేలోని బుర్జ్ అల్ బాబస్ కూడా డార్క్ టూరిజం ప్రాంతాల్లో ఒకటి.

బుర్జ్ అల్ బాబస్ అనేది ఒక లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్. ఈ నిర్మాణ ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది. తుర్కియే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో, కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టు డెవలపర్లు దివాలా దాఖలు చేశారు. బుర్జ్ అల్ బాబస్ ప్రస్తుతం ఘోస్ట్ టౌన్‌గా మిగిలిపోయింది. సంపన్నులైన గల్ఫ్ టూరిస్ట్‌లకు హాలిడే హోమ్‌లుగా వీటిని నిర్మించడం ప్రారంభించారు.

జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జలియన్‌వాలా బాగ్ స్మారక స్తూపం

భారత్‌లో డార్క్ టూరిజం ప్రాంతాలు

భారత్‌లో కూడా డార్క్ టూరిజం ప్రాంతాలున్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాల్లో రాజస్తాన్‌లోని భాంగర్ కోట, కుల్దారా, అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్, గుజరాత్‌లోని డుమాస్ బీచ్, గోవాలోని త్రీ కింగ్స్ చర్చి, ఉత్తరఖాండ్‌లోని స్కెల్టన్ లేక్, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్‌లోని సెల్యులార్ జైలు, ముంబయిలోని తాజ్‌మహల్ ప్యాలస్ హోటల్ వంటివి ఉన్నట్లు తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రియాంక శెట్టి తన రిపోర్టులో పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)