ధోర్డో: ఎడారి మధ్యలోని ఈ గుజరాత్ గ్రామానికి లక్షల మంది టూరిస్టులు ఎందుకు వస్తున్నారు?

కచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కచ్ ప్రాంతంలోని మారుమూల ఎడారి గ్రామం ధోర్డో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా జనవరి 26న జరిగే పరేడ్‌లో వివిధ రాష్ట్రాల శకటాలు ప్రధాన ఆకర్షణ. ఈసారి గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఉన్న ఓ మారుమూల ఎడారి గ్రామం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది.

2024 రిపబ్లిక్ డే పరేడ్‌లో కచ్‌లోని భుంగా నిర్మాణ శైలి, కచ్ హస్తకళలు, రోగన్ ఆర్ట్, రణ్ ఉత్సవ్, టెంట్ సిటీతో పాటు ధోర్డో గ్రామ నమూనాలను గుజరాత్ ప్రదర్శించింది.

కచ్ సంప్రదాయ ప్రదర్శనలతో 'కచ్‌కి అంతర్జాతీయ గుర్తింపు' అనే నినాదం మరోసారి వార్తల్లోకెక్కింది.

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ(యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఇటీవల ధోర్డో గ్రామాన్ని 'బెస్ట్ టూరిజం విలేజ్'(ఉత్తమ పర్యాటక గ్రామం)గానూ ప్రకటించింది.

ఈ రెండు విజయాలు ధోర్డోకు విశిష్టతను తెచ్చిపెట్టడంతో పాటు, కచ్ రీజియన్‌లోని తెల్లని ఎడారి సహజ సౌందర్యాన్ని చర్చనీయాంశంగా మార్చాయి.

కచ్ ప్రాంత తెల్లని ఎడారికి ప్రవేశ ద్వారంలా ఉండే ధోర్డో గ్రామంలో ఏటా ఘనంగా రణ్ ఉత్సవ్ నిర్వహిస్తారు.

కచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రణ్ ఉత్సవ్ వల్ల ధోర్డో గ్రామానికి బాగా ప్రాచుర్యం లభించింది.

రణ్ ఉత్సవ్‌లో భాగంగా 2005లో ప్రారంభమైన 'వైట్ డిజర్ట్ ఆఫ్ కచ్ ఎక్సీపీరియన్స్' కార్యక్రమమే, ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఎడారి ప్రాంతంలోని ధోర్డో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందేందుకు నాంది పలికిందని విశ్వసిస్తారు.

మూడు రోజుల ఉత్సవంగా ప్రారంభమైన రణ్ ఉత్సవ్ ఇప్పుడు 100 రోజుల పండుగగా మారింది. టెంట్ సిటీగా పిలిచే ధోర్డో, కచ్ గ్రామీణ వాతావరణం, సంప్రదాయ కళలు, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

గుజరాత్‌లోని ఎడారి గ్రామం ధోర్డో, రణ్ ఉత్సవ్ కారణంగా ప్రపంచ ప్రఖ్యాతి పొంది, బెస్ట్ టూరిజం విలేజ్‌గా ఎదిగిన క్రమం కూడా ఆసక్తికరమే.

కచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భుంగా లాంటి నిర్మాణాలు కచ్ ప్రాంతం అంతటా కనిపిస్తాయి

'కచ్ కల్చరల్ టూరిజం - జీవనాధారం'

అక్కడి గ్రామీణ ప్రజల్లో శతాబ్దాల నాటి స్థానిక సంప్రదాయాలు నేటికీ కనిపించడం, వారి జీవన విధానం ధోర్డో ప్రత్యేకతలు.

బహుశా, ధోర్డో కళలు, సంస్కృతిలో అంతర్భాగమైన భుంగా కళ వారి జీవనశైలితో ముడిపడి ఉండడమే అంత ప్రసిద్ధి చెందేందుకు కారణమై ఉంటుంది.

భుంగాలు కేవలం ధోర్డోలో మాత్రమే కాదు, ఇలాంటి నిర్మాణాలు కచ్ ప్రాంతం అంతటా కనిపిస్తాయి. గుండ్రంగా ఉండే మట్టి గోడల గుడిసెలే ''భుంగాలు''.

బంకమట్టి, వెదురు, కలపతో నిర్మించి, గడ్డితో పైకప్పు వేసే భుంగాలు పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు భూకంపాలను కూడా తట్టుకోగలవు. అవి చలికాలంలో వెచ్చగానూ, వేసవిలో చల్లగానూ ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

కచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శతాబ్దాల నాటి స్థానిక సంప్రదాయాలు నేటికీ కనిపించడం ధోర్డో ప్రత్యేకతల్లో ఒకటి.

ధోర్డో పర్యటనకు వచ్చే సందర్శకులను కచ్ సంస్కృతి, కళలతో పాటు స్థానికుల సంప్రదాయ దుస్తులు ఆకట్టుకుంటాయి. వాటిపై చేతితో అల్లిన సంప్రదాయ డిజైన్లు స్థానికుల హస్తకళా నైపుణ్యాన్ని సందర్శకులకు పరిచయం చేస్తాయి.

అక్కడి ప్రత్యేక కళాఖండాలు సందర్శకులు ధోర్డోను మరచిపోకుండా చేస్తాయి. ఈ కళ స్థానికులకు జీవనాధారం కల్పించడంతోపాటు తమ సంస్కృతిని ప్రతిబింబించే సాధనంగానూ మారింది.

ధోర్డో గురించి రణ్ ఉత్సవ్.నెట్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సమాచారం మేరకు- ''కచ్ ఎడారిలోని ధోర్డో, ఇప్పుడు కచ్ సాంస్కృతిక పర్యాటకానికి జీవనాధారంగా మారింది. ధోర్డో టెంట్ సిటీ (డేరాల నగరం)గా ప్రసిద్ధి చెందడంతో కచ్ రణ్ ఉత్సవ్‌కు వచ్చిన సందర్శకులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశంగా భావిస్తున్నారు.

కచ్ సంస్కృతి, వంటకాలు, కళలను ఆస్వాదించేందుకు వచ్చిన సందర్శకులకు ధోర్డో ఒక 'అపూర్వమైన అనుభవం' అవుతుంది.''

కచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ 2005లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఐదు రోజుల కచ్ సఫారీని ప్రారంభించారు.

ధోర్డోను ‘వైట్ డిజర్ట్‌’ ప్రవేశ ద్వారమని ఎందుకంటారు?

భుజ్‌‌‌కు 80 కిలోమీటర్ల దూరంలో, బనీ ప్రాంతంలో ఉండే మారుమూల గ్రామం ధోర్డో. కచ్ ప్రాంతంలోని అతిపెద్ద ఎడారిలో భాగమైన వైట్ డిజర్ట్ (తెల్లని ఎడారి)కి దీనిని ప్రవేశద్వారంగా పరిగణిస్తారు.

వర్షాకాలంలో సముద్రపు నీరు ఎడారి వైపు పరుచుకుంటుంది. వర్షపు నీటి కారణంగా అందులోని ఉప్పు శాతం తగ్గుతుంది. చలికాలంలో నీరు ఆవిరైపోవడం మొదలయ్యాక, ఎడారి నేలపై ఉప్పు పొర కనిపిస్తుంది. ఆ ఉప్పు కారణంగా అది తెల్లని ఎడారిలా ప్రకాశిస్తుంది.

పౌర్ణమి రోజున ఈ తెల్లని ఎడారిని వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. రాత్రివేళ వెన్నెల్లో ఆ ప్రాంతమంతా దగదగా మెరిసిపోతుంది. దానితో పాటు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లోనూ పర్యాటకుల రద్దీ కనిపిస్తుంది.

వాచ్ టవర్ నుంచి చూస్తే కనుచూపు మేర తెల్లటి ఎడారి మాత్రమే కనిపిస్తుంది. అయితే, ఎడారిలో అక్కడక్కడ నీరు నిలిచిపోయే అవకాశం ఉండడం వల్ల ప్రయాణికులు అడుగుతీసి అడుగు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తగా ఉన్నప్పుడు 1988 ప్రాంతంలో నరేంద్ర మోదీ స్థానిక సంఘ్ కార్యకర్తలతో కలిసి ధోర్డోను సందర్శించారు. అక్కడి మనోహర దృశ్యాలకు ముగ్ధులైన మోదీ, ఆ సయయంలోనే దాని అభివృద్ధి గురించి చర్చించారు.

యాదృచ్ఛికంగా, 2001 కచ్ భూకంపం తర్వాత కేశూభాయ్ పటేల్ ప్రభుత్వాన్ని గద్దెదించి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ నాయకత్వం. మోదీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఐదు రోజుల కచ్ సఫారీని ప్రారంభించారు.

ఆ తర్వాత గుజరాత్ పర్యాటక శాఖ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంబాసిడర్‌గా 'కచ్ నహీ దేఖా, తో కుచ్ నహీ దేఖా' ప్రచార కార్యక్రమం నిర్వహిచింది. ఇప్పుడు రణ్ ఉత్సవ్ దాదాపు నాలుగు నెలలపాటు జరుగుతుంది.

కచ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత రణ్ ఉత్సవ్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది.

అతిపెద్ద ‘టెంట్ సిటీ’

రణ్ ఉత్సవ్ సందర్భంగా సందర్శకులు కచ్ సంస్కృతిని అనుభూతి చెందేలా ధోర్డో వద్ద అత్యాధునిక సౌకర్యాలతో టెంట్ సిటీ ఏర్పాటైంది. కచ్ ప్రాంత గ్రామీణ వాతావరణం, అక్కడి సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటయ్యాయి.

టెంట్ సిటీలో కచ్ సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, స్థానిక హస్తకళల వర్క్‌షాప్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సందర్శకులకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులను అందిస్తాయి.

నిరుడు నవంబర్ 10న మొదలైన ప్రస్తుత రణ్ ఉత్సవ్ ఈ ఏడాది ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది.

ఏటా 20కి పైగా దేశాల నుంచి వచ్చే విదేశీ పర్యాటకులతోపాటు దాదాపు పది లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ రణ్ ఉత్సవ్‌కు తరలివస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)