క్యాష్‌లెస్ ఎవ్రీవేర్: హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఇకపై నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లోనే కాదు, దేశంలో ఎక్కడైనా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్... 48 గంటల నిబంధన గుర్తుంచుకోండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారికి ఇకపై దేశంలోని అన్ని ఆసుపత్రులలోనూ 100 శాతం క్యాష్‌లెస్ చికిత్సలు చేయాలన్న భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) సూచనల అమలుకు బీమా సంస్థలు అంగీకరించాయి.
దీంతో జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ఈ ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ సేవలు అందుబాటులో ఉంటాయని ‘ది జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్’ వెల్లడించింది.
దేశంలోని అన్ని జనరల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అధికారిక సంస్థగా ఉండే ఈ కౌన్సిల్ ఐఆర్‌డీఏఐ, సంస్థల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తుంటుంది.
కాగా ‘క్యాష్‌లెస్ ఎవ్రీవేర్’ సదుపాయం తేవడంతో ఇకపై ఆరోగ్య బీమా పాలసీదారులు ఎవరైనా ఆసుపత్రి పాలైన సందర్భాలలో అక్కడ వారి నుంచి ముందుగా డబ్బు కట్టించుకోకుండానే చికిత్స చేయాలి. అంటే, నెట్‌వర్క్ హాస్పిటల్స్ మీదే ఆధారపడాల్సిన రోజులు పోయాయన్నమాట.
పాలసీ పరిమితి ఎంత మొత్తానికి ఉందో అంతవరకు కంపెనీలే భరించాలి, మిగతా మొత్తం మాత్రమే పాలసీదారుల నుంచి ఆసుపత్రులు వసూలు చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు ఇలాంటి సదుపాయం కేవలం ఆయా ఇన్స్యూరెన్స్ కంపెనీలతో ఒప్పందం ఉన్న ఆసుపత్రులలో(నెట్‌వర్క్ హాస్పిటల్స్) మాత్రమే అమలవుతూ వస్తోంది.
కంపెనీలలో ఒప్పందాలు లేని ఆసుపత్రులలో పాలసీదారులు చికిత్స చేయించుకున్నట్లయితే ముందుగా బిల్లు మొత్తం చెల్లించి ఆ తరువాత ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ చేయాల్సి వచ్చేది.
అలాంటప్పుడు ఒక్కోసారి క్లెయిమ్‌ల పరిష్కారంలో తగ్గింపులు, జాప్యం వంటి సమస్యలుండేవి.
తాజా నిర్ణయంతో ఇకపై కంపెనీల ఒప్పందంతో సంబంధం లేకుండా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలోనూ పాలసీదారులకు నగదు రహిత చికిత్సలు అందించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
48 గంటల నిబంధన
- నెట్‌వర్క్ హాస్పిటల్స్ కాని చోట క్యాష్‌లెస్ చికిత్సలు పొందాలనుకునే పాలసీదారులు చికిత్స కోసం చేరడానికి 48 గంటల ముందు సంబంధిత ఇన్స్యూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
- ఒకవేళ అత్యవసర చికిత్సల కోసం చేరితే ఆసుపత్రిలో చేరిన 48 గంటల లోగా ఇన్స్యూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
బీమా వర్తిస్తేనే క్యాష్‌లెస్
బీమా పాలసీలో ఉన్న నిబంధనల ప్రకారం పాలసీదారు పొందే చికిత్సకు బీమా వర్తిస్తేనే ఈ క్యాష్‌లెస్ సదుపాయం వర్తిస్తుంది.
నెట్‌వర్క్ హాస్పిటల్‌లో అయినా పాలసీ ప్రకారం ఆ చికిత్సకు బీమా వర్తిస్తేనే క్యాష్‌లెస్ పనిచేస్తుంది.
ఇప్పుడు మిగతా హాస్పిటల్స్‌లో చికిత్స పొందే సందర్భంలోనూ అదే నిబంధన వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు 63 శాతం మందే
100 శాతం క్యాష్‌లెస్ సేవల ప్రకటన సమయంలో ‘ది జనరల్ ఇన్స్యూరెన్స్ కౌన్సిల్’ చైర్మన్న తపన్ సింఘేల్ మాట్లాడుతూ ఇప్పటివరకు దేశంలోని హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీదారులలో 63 శాతం మంది మాత్రమే క్యాష్ లెస్ సేవలు ఎంచుకున్నారని.. ఇప్పుడు 100 శాతం మందికి క్యాష్ లెస్ అవకాశం దక్కుతుందన్నారు.
ఐఆర్‌డీఏఐ 2022-23 వార్షిక నివేదిక ప్రకారం చూస్తే ఆ ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా క్యాష్‌లెస్ సేవలు పొందినవారి శాతం 63.62.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 131.4 కోట్ల క్లెయిములతో రూ. 45,128 కోట్ల విలువైన చికిత్సలను పొందారు పాలసీదారులు.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి ప్రయోజనం?
కొన్ని బీమా సంస్థలకు దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఆసుపత్రులు ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో నెట్‌వర్క్ ఆసుపత్రులు లేని చోట చికిత్స పొందాల్సిన అవసరం వచ్చినప్పుడు గతంలో ఇబ్బంది ఎదురయ్యేది.
ఇకపై దేశంలో ఎక్కడైనా క్యాష్ లెస్ చికిత్స పొందే అవకాశం ఉండడంతో ఆ సమస్య పరిష్కారం కానుంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలలో ఉండేవారికి ఇది ప్రయోజనకరం.
అలాగే, ఇంతకుముందు నెట్‌వర్క్ ఆసుపత్రులలో కాకుండా వేరే ఆసుపత్రులలో చికిత్స పొంది రీయింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ చేసేటప్పుడు వృద్ధులు ఇబ్బందిపడేవారు.
అవసరమైన బిల్లులు, పత్రాలు సమర్పించడం, అవసరమైన కమ్యూనికేషన్స్ జరపడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి.
కొత్త విధానంలో ఆ అవసరం లేకపోవడంతో అలాంటి ఇబ్బందులు తప్పనున్నాయి.
అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు డబ్బు సమకూర్చుకోవడం కష్టం కావొచ్చు. ఏ ఆసుపత్రిలోనైనా క్యాష్‌లెస్ సదుపాయం వర్తిస్తే డబ్బు అత్యవసరంగా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉండదు.
క్యాష్‌లెస్ సేవల వల్ల పాలసీదారులు సులభంగా సేవలు పొందే అవకాశాలు ఉండడంతో బీమా తీసుకునేవారి సంఖ్య భవిష్యత్తులో పెరుగుతుందని.. దానివల్ల ప్రీమియంలు తగ్గుతాయని బీమా రంగ నిపుణులు చెప్తున్నారు.
ఆరోగ్య బీమా ఉన్నవారికి చికిత్సలు పొందే సమయంలో ఆర్థిక భారం తగ్గడంతో పాటు, చికిత్సలు కూడా సులభంగా క్యాష్‌లెస్ విధానంలో సాధ్యం కావడం వల్ల బీమా ప్రయోజనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని.. దానివల్ల బీమా తీసుకునేవారి సంఖ్య రానున్న కాలంలో పెరుగుతుందని హైదరాబాద్‌కు చెందిన ఇన్స్యూరెన్స్ అడ్వయిజర్ శ్రీనివాస్ చెప్పారు.
పాలసీదారుల సంఖ్య పెరగడం వల్ల సహజంగానే పాలసీల ప్రీమియం దిగొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉన్నట్లుగా ఇన్స్యూరెన్స్ విభాగాలు చిన్నచిన్న ఆసుపత్రులలో ఉండకపోవచ్చని.. అందువల్ల కొద్దికాలంపాటు ఇలాంటి 100 శాతం క్యాష్‌లెస్ సేవలలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
ఆసుపత్రులు, బీమా సంస్థల సమన్వయంతో అన్నిచోట్లా దీనికి కావాల్సిన వాతావరణం ఏర్పడాల్సి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
- బటర్ చికెన్, దాల్ మఖనీ వంటకాలు ఎవరు కనిపెట్టారు? తేల్చనున్న దిల్లీ హైకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















