క్యాన్సర్‌ను జయించిన ఈ మహిళలు క్యాలెండర్ కోసం ఇలా ఎందుకు పోజులిచ్చారు?

ఫొటో సోర్స్, SALLY SMART
- రచయిత, సారా ఈసాడెల్
- హోదా, బీబీసీ న్యూస్
రొమ్ము క్యాన్సర్ బారిన పడి, చికిత్సతో కోలుకున్న ఆ మహిళలంతా ఒక్కచోట చేరారు.
‘బ్రెస్ట్ ఫ్రెండ్స్’గా పిలుచుకునే వారంతా న్యూడ్ క్యాలెండర్ కోసం నగ్నంగా ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
ఆ క్యాలెండర్ ఫోటోషూట్ తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని కూడా వారంతా చెప్పారు.
ఆ క్యాలెండర్ ఫోటో షూట్ నిర్వాహకురాలు 53 ఏళ్ల సాలీ స్మార్ట్ మాట్లాడుతూ, “తొలి షూట్‌లో ఒంటిపై దుస్తులు లేకుండా కెమేరాకు పోజులివ్వడానికి బిగుసుకుపోయిన వారంతా షూట్ చివరి దశకు వచ్చేసరికి తమను తాము దేవతల్లా చూసుకుని మురిసిపోయారు” అని చెప్పారు.
ఇదంతా వారేమీ సరదా కోసం చేయలేదు. క్యాన్సర్ బారిన పడి, జయించిన వారంతా కలిసి, తమలాంటి బాధితులకు సాయం చేయాలని ముందుకొచ్చారు.

ఫొటో సోర్స్, SALLY SMART
డెంబిగ్‌షైర్‌లోని బొదెల్‌విద్దాన్‌లో ఉన్న క్యాన్సర్ సెంటర్‌కు విరాళాల అందించేందుకు వినూత్న రీతిలో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.
20 వేల ఫౌండ్ల సాయాన్ని అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 30 ఏళ్ల నుంచి 63 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నారు.
వారంతా ఫొటో షూట్‌లో పాల్గొన్నాక స్నేహితులుగా మారారని సాలీ చెప్పారు.
“మొదట.. షూట్ అంటే, వారంతా భయపడ్డారు గానీ, అందరికీ నా ఆలోచన అర్థమై సహకరించారు” అని సాలీ స్మార్ట్ అన్నారు.
“భయంభయంగా షూట్‌లో పాల్గొన్న వారంతా, ముగిసే సమయానికి ధైర్యంగా, దేవతల్లా నడుచుకుంటూ వెళ్లారు.వారి మధ్య స్నేహం కూడా బలపడినట్లే ఉంది” అని చెప్పారు.
డెంబిగ్‌షైర్‌లోని ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌లలో సాలీ స్మార్ట్ ఒకరు. మిగిలిన వారిలాగే, సాలీ కూడా నార్త్ వేల్స్ పరిధిలో ఉన్న క్యాన్సర్ సెంటర్‌లోనే క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నారు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న సాలీకి తనలా బాధపడే వారికి దన్నుగా నిలవాలని అనిపించింది. క్యాన్సర్ చికిత్స మొదలైనప్పటి నుంచి, చివరి వరకు పలు దశల్లో, చికిత్స వల్లే తలెత్తే ఇబ్బందులు, శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల రోగులు నిరాశకు లోనవుతారు. ఆ సమయంలో రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని నింపేందుకు, ఆ వ్యాధిని జయించిన వారి ఫొటోలతో క్యాలెండర్ రూపొందించాలన్న ఆలోచన వచ్చింది సాలీకి.
అలా ఊపిరిపోసుకున్న ఆలోచనకు కార్యరూపమిచ్చారు సాలీ స్మార్ట్.
ఫోటోషూట్‌లో పాల్గొన్న వారంతా ఆ క్షణాలన్ని తమలో నూతనోత్సాహాన్ని నింపాయని తెలిపారు.
ఫ్లింట్‌షైర్‌కు చెందిన 49 ఏళ్ల క్లెయిర్ విలియమ్స్ మాట్లాడుతూ, షూట్ ఎంతో సరదాగా గడించిందని, ఓ అనుభవం తనకు బాగా గుర్తుండిపోయినట్లు చెప్పింది.
“షూట్ కోసం నేను రైడింగ్ బూట్లను తెప్పించాను. వాటిని తిరిగి ఇచ్చేద్దామని ప్రయత్నిస్తే, నా పాదాలకు అతుక్కుని పోయినట్లు తీసేందుకు రాలేదు, చివరికి స్థానికంగా ఉండే వెటర్నరీ డాక్టర్ వచ్చి, జెల్ లాంటిది రాసి, ఆ బూట్లను తొలగించారు. ఆ జెల్ ప్రభావాన్ని చూసి నా షూ ఏంటి, నా కాలే వచ్చేస్తుందేమో అనుకున్నాను” అంటూ ఆ సందర్భాన్ని పంచుకున్నారు క్లెయిర్.

ఫొటో సోర్స్, SALLY SMART
సాలీ కిచెన్‌లో రహస్యంగా మొదలైన షూట్, చాలా ప్రదేశాల్లో సాగింది. ఫ్లింట్‌షైర్‌లోని బీచ్ వంటి బహిరంగ ప్రదేశంలో కూడా జరిగింది.
ఆరోజు అందరూ “భయపడిపోయారని” సాలీ చెప్పారు.
“మొదట భయపడినా, ఆ తరువాత మాత్రం అందరూ సిగ్గును అధిగమించి,, సంతోషంతో షూట్‌కు సహకరించారు” అని చెప్పారు.
ఇప్పుడు వారంతా “బ్రెస్ట్ ఫ్రెండ్స్”గా పిలుచుకునే బలమైన స్నేహాన్ని ఏర్పరుచుకున్నారు. 60 ఏళ్ల క్రిస్టీన్ కెల్లీ గతంలోనూ క్యాన్సర్ చికిత్స కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు చేసినప్పటికీ, తాను ఇలాంటి ప్రయత్నం చేస్తానని ఎన్నడూ ఊహించలేదని అన్నారు.
ఆమె మాట్లాడుతూ, “సాలీ నాతో న్యూడ్ క్యాలెండర్ విడుదల చేసి, ఫండ్ రైజ్ చేద్దామని అన్నప్పుడు నిజంగా ఇది సాధ్యమా? అనుకున్నాను” అని చెప్పారు.
“మాతో చేరతారా? అని మేం ఇతరులను అడిగినప్పుడు భిన్నమైన సమాధానాలు వినిపించాయి. అంతా నవ్వుకున్నాం. చివరికి పూర్తి చేశాం. ఇదో గొప్ప అనుభూతి” అని చెప్పారు.

ఫొటో సోర్స్, SALLY SMART
ఆ బృందంలో చిన్న వయస్కురాలు 29 ఏళ్లున్న కమీలా హన్మెర్. గత ఏడాది మార్చిలో రొమ్ములో చిన్న గడ్డ ఉందని గ్రహించి, డాక్టర్ దగ్గరకు వెళ్లాక, తనకు రొమ్ము క్యాన్సర్ సోకిందని తెలుసుకున్నారు.
ఆమె మాట్లాడుతూ, “మొదట ఏం కాదు. చిన్నదే కదా తగ్గిపోతుందని అనుకున్నాను. కానీ, అలా జరక్కపోయేసరికి, వైద్యుల దగ్గరకు వెళ్లాను. అప్పుడే నిజం తెలిసింది” అని చెప్పారు
క్యాలెండర్ గురించి తెలుసుకున్నాక, తనకూ అది మంచి ఆలోచనే అనిపించిందని చెప్పారు కమీలా హన్మెర్. యువతులు కూడా చెకప్ చేయించుకోవలిసిన అవసరాన్ని గుర్తిస్తారని అన్నారు.
“క్యాలెండర్ షూట్ జరుగుతున్నప్పుడు నాకు చికిత్స కొనసాగుతోంది” అని చెప్పారు కమీలా.
“ఇక్కడున్న వారందరూ నేను పడే వేదనను చవిచూసినవారే. వారు దొరకడం నా అదృష్టం” అన్నారు.

ఫొటో సోర్స్, SALLY SMART
54 ఏళ్ల విగ్ కన్సల్టెంట్ సిల్వియా ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే చెప్పారు.
తాను క్యాన్సర్ బారిన పడిన చాలా మందికి సేవలందించానని, చివరకిి తాను కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడాల్సివచ్చిందని తెలిపారు.
కోవిడ్ సమయంలో క్యాన్సర్ బారిన పడిన తనకు చేదు అనుభవాలే మిగిలియాని చెప్పారు.
ఆమె మాట్లాడుతూ, “క్యాలెండర్ ద్వారా నిధుల సమీకరణ చేస్తున్నాం, అంతేకాకుండా నాకు స్నేహితులు కూడా లభించారు. ఒకరికొకరు తోడుగా నిలిచేందుకు సాయం దొరికింది” అన్నారు.
వారంతా క్యాన్సర్ బారిన పడి, మాటలకందని బాధని అనుభవించినప్పటికీ, అందులోనే సానుకూల దృక్పథాన్ని కూడా పొందారు.
సాలీ మాట్లాడుతూ, “వారందరిలోనూ ఒకే కామన్ పాయింట్ ఉంది. అలా మంచి విషయం కానప్పటికీ, అంతా స్నేహితులయ్యారు.
“ఈ మహిళలంతా ఎంతో ప్రత్యేకమైన వారు” అని చెప్పారు సాలీ స్మార్ట్.
ఇవి కూడా చదవండి..
- అయోధ్యకు, థాయ్‌లాండ్‌లోని అయుతయ నగరానికి సంబంధం ఏంటి?
- కశ్మీర్లో మంచు కురవని శీతాకాలం ఎప్పుడైనా చూశారా... ఈ ఏడాదే ఎందుకిలా?
- అయోధ్య: ‘దివ్యాంగ మందిరంలో సకలాంగుడైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ధర్మవిరుద్ధం’ -శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
- సచిన్ తెందూల్కర్: డీప్‌ఫేక్ బారిన పడిన భారత క్రికెట్ దిగ్గజం, కూతురుతో కలిసి ప్రమోషన్స్ చేస్తున్నట్లుగా వీడియో వైరల్...
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














