ఫ్లయింగ్ డాక్టర్: ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగమా?

ఫ్లయింగ్ డాక్టర్

ఫొటో సోర్స్, REBECCA PAYNE

ఫొటో క్యాప్షన్, డాక్టర్ రెబెక్కా పెయిన్
    • రచయిత, నికోలా బ్రయాన్
    • హోదా, బీబీసీ న్యూస్

స్కాట్లాండ్‌లోని డాక్టర్లు సముద్రంలోని మారుమూల ద్వీపాల్లో నివసించే ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు.

అందుకే డాక్టర్ రెబెక్కా పెయిన్ తాను చేస్తున్న పనిని చూసి ఎంతో సంతోషిస్తున్నారు.

ఆమె మారుమూల ద్వీపాల్లో వైద్యసేవలు అందిస్తుంటారు. ఈ పని తనకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది అంటారు ఆమె.

ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీపాల్లో ఆమె వైద్యసేవలు అందిస్తున్నారు.

ఈ పనిలో భాగంగా ఆమె అద్భుతమైన క్షణాలను ఆస్వాదిస్తుంటారు.

ఆమె తన ప్రయాణంలో సముద్రంలోని బేబీ సీల్స్‌ను, కింగ్ పెంగ్విన్‌లను తిలకిస్తూ మురిసిపోతుంటారు.

‘‘రోజూ నన్ను నేను గిచ్చుకుంటూ ఉంటాను. నేను ఇలాంటి జీవితం గడుపుతున్నాను అంటే నమ్మలేకపోతున్నాను. నేను నా పనిని నిస్సందేహంగా ప్రేమిస్తున్నాను’’ అంటారు రెబెక్కా.

కేర్ క్వాలీటీ కమిషన్‌లో డాక్టర్ రెబెక్కా పనిచేసేవారు.

ఆమె స్కాట్లాండ్‌లోని ఓర్క్నే దీవులలో పనిచేసే ఓ డాక్టర్‌తో చాటింగ్ చేశారు.

‘‘ద్వీపాలలో పనిచేయడం నా కల. కానీ నాకిప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే నాకిద్దరు పిల్లలున్నారు. నా భర్త ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు’’ అని చాటింగ్‌కు వచ్చిన డాక్టర్‌తో చెప్పారు.

‘కానీ ఆ డాక్టర్ ‘లేదు, లేదు. ఈ ఉద్యోగం అద్భుతమైనది, మేం నిన్ను నియమించేసుకున్నాం’’ అని చెప్పారు.

ఇప్పుడు డాక్టర్ రెబెక్కా జాతీయ ఆరోగ్య పథకం కింద ఓర్క్నే దీవుల కోసం నాలుగేళ్ళుగా పనిచేస్తున్నారు.

ఈ ద్వీప సముదాయాల మధ్య ఆమె తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటారు.

ఆమె మిగిలిన ఏడుగురు డాక్టర్లతో కలిసి రొటేషన్ పద్ధతిలో సేవలు అందిస్తుంటారు.

వీరందరూ ఒక్కో వారం ఓర్క్నే దీవులలో వైద్యసేవలు అందించాల్సి టుంది.

ఆమె మిగిలిన రోజులలో కార్డిఫ్‌లోని తన ఇంటి నుంచి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రీసర్చర్‌గా పనిచేస్తున్నారు.

ఇతర దీవులలో ఎవరైనా డాక్టర్ డ్యూటీకి హాజరు కాలేకపోతే వారి స్థానంలో తాత్కాలికంగా కూడా సేవలు అందిస్తుంటారు.

ఫ్లయింగ్ డాక్టర్

ఫొటో సోర్స్, REBECCA PAYNE

‘రైతులు చాలా వరకు సొంత వైద్యం చేసుకుంటారు’

మారుమూల ప్రాంతాలలో పనిచేయడం అనేక సవాళ్ళతో కూడుకున్నది.

‘‘నేను చాలా చిన్న చిన్న ద్వీపాలలో పనిచేశాను.అక్కడ అన్ని పనులు మనమే చూసుకోవాలి. అంటే అత్యవసర కేసులను చూడటం దగ్గరనుంచి హెలికాప్టర్ సేవలు కావాలని కోరడం, ఆస్త్మా పేషెంట్లను చుసుకుంటూ, పడవ నుంచి మందులు తీసుకోవడం, పేషెంట్ల నుంచి రక్తాన్ని సేకరించి దానిని పరీక్ష కోసం విమానం దగ్గరకు తీసుకువెళ్ళడం చేయాలి’’ అని రెబెక్కా చెప్పుకొచ్చారు.

‘‘ఇది ఒకరకంగా ఇంటి వద్దకే వైద్యం అందించడం లాంటిది. ఈ క్రమంలో మీరు అనేక రకాల చికిత్సలు అందించాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్య సమస్యలు మొదలుకొని తీవ్ర గుండెపోటుతో ఇబ్బందిపడే రోగుల వరకు అందరినీ చూసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆమె తెలిపారు.

ఇక వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదని, అదెప్పుడూ మన ఊహలకు అతీతంగా ఉంటుందని చెప్పారు.

భారీ తుపాను కారణంగా ఆమె విమానం రద్దు కావడంతో ఒకరోజు డాక్టర్ రెబెక్కా ఒర్క్నేలోనే చిక్కుకుపోయారు.

దీవులలో చాలా సాధారణమైన విషయం ఏమిటంటే ఇక్కడ నివసించే ప్రజలు ఏ సహాయాన్ని వెంటనే కోరరు అని రెబెక్కా వివరించారు.

‘‘కొన్నిసార్లు ప్రత్యేకించి రైతులు చాలా రోజులపాటు డాక్టర్ దగ్గరకు రాకుండా సొంతంగా వైద్యం చేసుకుంటూ ఉంటారు. మరికొందరేమో దీన స్థితిలో వస్తుంటారు’’ అని ఆమె వివరించారు.

తన నాలుగేళ్ళ ఉద్యోగ కాలంలో డాక్టర్ రెబెక్కా, ఓర్క్నేపై అపారమైన ప్రేమను పెంచుకున్నారు.

‘‘ఇది మీరు ఊహించగలిగే ఓ అద్భుతమైన ప్రదేశం’’ అంటారు ఆమె.

ఇక్కడ పేషెంట్లు కూడా డాక్టర్లను అభినందిస్తుంటారు.

‘‘ఈ ప్రాంతానికి డాక్టర్లు రావడం అంత తేలిక కాదనే విషయం వారికి తెలుసు. మరీ ముఖ్యంగా ప్రతికూల వాతావరణంలో ఇక్కడ పని చేయడం ఎంత కష్టమో ప్రజలకు బాగా తెలుసు’’ అని ఆమె వివరించారు.

ఫ్లయింగ్ డాక్టర్

ఫొటో సోర్స్, GARETH PAYNE

పెంగ్విన్‌లు ఎంత అందంగా ఉన్నాయో!

స్కాట్లాండ్‌కు పశ్చిమ తీరంలోని హెబ్రైడ్స్ ద్వీపాలలోని బర్రాలో ఆమె పనిచేస్తున్నప్పుడు ఆమె విమానం బర్రా బీచ్‌లో లాండ్ అవడాన్ని, ‘‘నా జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణంగా భావిస్తాను’ అంటారు ఆమె.

కిందటి వేసవిలో దక్షిణ అమెరికాకు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని ఫాల్కలాండ్ దీవులలో ఆమె నెల రోజులకు పైగా గడిపి తన కలను నెరవేర్చుకున్నారు.

ఆమె ఇక్కడ ఆస్పత్రిని చూసుకోవడంతోపాటు ప్రమాదాలు, అత్యవసర కేసుల సంగతి చూసుకోవాలి. ఈమెకు తోడుగా ఆమె ఇద్దరు పిల్లలు, భర్త కూడా వచ్చారు.

ఈ దీవులకు పది నిమిషాల ప్రయాణ దూరంలో 8వ కింగ్ ఎడ్వర్డ్ హాస్పటిల్ ఉంది. ఇక్కడ బీచ్‌లో పెంగ్విన్లు కనిపిస్తుంటాయి. అవి గబగబా బీచ్‌ను దాటి వెళ్ళడాన్ని ఈ కుటుంబం చూడగలిగింది.

‘‘అవి ఎంతో అందంగా ఉన్నాయి’’ అని డాక్టర్ రెబెక్కా చెప్పారు.

‘‘నిద్ర లేవగానే ఇది నిజంగానే జరిగిందా? లేదంటే నేనేమన్నా కలగంటున్నానా’’ అనిపిస్తుంటుంది.

ఓ ఫ్లయింగ్ డాక్టర్‌గా ఈ దీవులలో వైద్యసేవలు అందించడం ‘‘తన జీవితంలో ఉత్తమమైన రోజులు’’ అని ఆమె చెపుతారు.

ఫ్లయింగ్ డాక్టర్

ఫొటో సోర్స్, REBECCA PAYNE

తప్పిపోయిన పిల్లి.. దారి తప్పిన ఆవుల మంద

చిన్న దీవులకు ప్రత్యేకంగా విమానాలు ఉండవు. దీంతో ప్రజలు తామెక్కడకు వెళ్ళాలనుకుంటుంది, ఏం తీసుకువెళ్ళాలుకుంటున్నది ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.

అయితే 8 సీట్ల బ్రిటెన్ నార్మన్ ఐలాండర్ విమానం ద్వారానే ప్రజలకు కావాల్సినవన్నీ చేరవేస్తుంటారు.

ఓ రోజున ఈమె ఆ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పైలట్ వెనుక గొర్రెలను వధించే వ్యక్తి ఒకతను కూర్చొని ఉన్నారు.

పక్కనే యజమాని నుంచి తప్పిపోయిన పిల్లి కూడా ఉంది. ఈ పిల్లిని యజమాని వద్దకు చేర్చడంతోపాటు తప్పిపోయిన ఆవుల మందను వెదుకుతున్న రైతుకు అవెక్కడున్నాయో విమానం నుంచే చూసి ఆ రైతుకు చెప్పడం మొదలైనవి డాక్టర్ రెబెక్కాకు చక్కని అనుభూతిని పంచాయి.

ఈ విమానం దిగాల్సిన చోట బురద ఉండటంతో బీచ్ దగ్గరే దింపారు.

‘‘పేషెంట్లకు వైద్యసేవలు అందించాక అలా పెంగ్విన్‌లను చూడటం అదో మంచి అనుభూతి’’ అని ఆమె చెప్పారు.

ఆ తరువాత వీరి జీవితంలోకి మరో మరిచిపోలేని రోజు చేరింది.

ఫాల్కలాండ్ దీవులలో వీరు 8 సీట్ల విమానంలో పెంగ్విన్‌లను వీక్షించే పాయింట్ వద్దకు చేరుకున్నారు.

‘‘అక్కడ ఎక్కడపడితే అక్కడ పెంగ్విన్‌లు కనిపించాయి. పిల్లల మధ్య పెద్ద పెంగ్విన్‌లు కూర్చుని వాటిని జాగ్రత్తగా చూడటాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’’ అని డాక్టర్ రెబెక్కా చెప్పారు.

దీవులలో వైద్యసేవలు అందించడం నుంచి మిగిలిన ప్రపంచం ఏం నేర్చుకోవచ్చు అని ప్రశ్నిస్తే- ‘‘నన్ను చెడ్డ డాక్టర్‌గా భావించే చోట నేనెక్కడా పనిచేయలేదు. నువ్వు మారుమూల పేషెంట్లకు సేవ చేయాలనే ఆలోచనే నిన్ను ఉదయాన్నే మంచం మీద నుంచి లేపుతుంది’’ అంటారు డాక్టర్ రెబెక్కా

‘‘చాలా దీవులలో పడవల్లోకి ఎక్కకుండా ఆస్పత్రికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ జనరల్ ప్రాక్టీస్ మనల్ని బయటి ప్రపంచానికి భిన్నంగా ఉంచుతుంది.

కెరీర్ మధ్యలోనే నిరాసక్తత రావడం, త్వరగా ఉద్యోగ విరమణ చేయాలనుకునే ఆలోచనలకు ఇలాంటి ఉద్యోగాలు ఫుల్ స్టాప్ పెడతాయి. మన ఆనందాన్ని కూడా తిరిగి తెచ్చిస్తాయి’’ అంటారు రెబెక్కా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)