గ్రిప్పింగ్: మీ చేతుల్లో పటుత్వం తగ్గిందంటే ఆరోగ్యానికి పెను ప్రమాదం ఉన్నట్లేనా? ఈ టెస్టుతో ఎలా తెలుసుకోవచ్చంటే...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాఫెల్ అబుచైబే
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
మన చేతుల్లోని పటుత్వమే మన శరీరంలో ఏం జరుగుతోందని చెప్పడానికి ఓ సూచిక కావచ్చు.
స్ట్రెస్ బాల్ లాంటి వస్తువును ఒక్క చేత్తో మీరు ఎంతగట్టిగా ఒత్తగలుగుతారనే దానిని బట్టి మీ శరీరం వయసును నిర్థరంచే అంశాలపై అనేక శాస్త్రీయ అధ్యయనాలు ఉన్నాయి.
యురోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ 2020 లో ప్రచురించిన పరిశోధనా పత్రం 75 ఏళ్ళ పైబడిన రోగుల గరిష్ఠ పటుత్వ బలాన్ని విశ్లేషించింది. పటుత్వంలో బలహీనతకు, వయసుతోపాటు వచ్చే కండరాల క్షీణతకు ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిపింది.
చేతులు పటుత్వం కోల్పోవడమనేది కేవలం వృద్ధులు ఎలాంటి సమ్యలు ఎదుర్కొనే అవకాశం ఉందో చెప్పడంతో పాటు, వయసుతో నిమిత్తం లేకుండా ఎవరి చేతులు కనిష్ఠ బలాన్ని పొందలేవో వారికి గుండె, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు అన్నిరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇతర అధ్యయనాలు చెపుతున్నాయి.
‘‘చేతుల పటుత్వం అనేది మొండిరోగాలకు, మరణాలకు కూడా ఓ బయోమార్కర్ అని చెప్పడానికి మా దగ్గర అనేక అధ్యయనాలు ఉన్నాయి’’ అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో ఫిజికల్ మెడిసిన్, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ప్రొఫెసర్ మార్కర్ పీటర్సన్ చెప్పారు.
‘‘మన శరీరం ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇదో సాధారణ సూచిక’’ ఎవరికైతే చేతుల పటుత్వం బావుంటుందో వారికి కాళ్ళలోనూ, చేతుల్లోనూ, ఉదరభాగంలోని కండరాలు బలంగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పటుత్వాన్ని కొలవడం ఎలా?
ఓ మనిషి గరిష్ఠ పటుత్వం బలాన్ని తెలుసుకోవడానికి డాక్టర్లు డైనమోమీటర్ ను ఉపయోగిస్తారు. ఈ పరికరాన్ని పేషెంట్ తన పూర్తిబలాన్ని ఉపయోగించి నొక్కాల్సి ఉంటుంది. ఇలా మూడు వేరు వేరు సందర్భాలలో చేయించి, ఈ మూడింటి ఫలితాల సగటును తీసుకుంటారు.
ఎవరికైతే వయసు, ఎత్తు, జెండర్‌ను బట్టి సగటుకంటే తక్కువ పటుత్వం ఉంటుందో వారికి మరణం ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆస్ట్రియాలోని వియాన్నా యూనివర్సిటీ పరిశోధకుల 2022 నాటి అధ్యయనం చెపుతోంది.
‘‘పోల్చదగిన జనాభా లోని గరిష్ఠ పటుత్వం కంటే తక్కువ పటుత్వం ఉన్నవారికి అత్యధిక అనారోగ్య ముప్పు, ముందస్తు మరణం సంభవించే అవకాశం ఉంది’’ అని ఈ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఆస్ట్రియాలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలసిస్ సెంటర్ తెలిపింది.
చేతుల్లో పటుత్వం కోల్పోవడానికి ప్రధానకారణం కండరాలు బలహీనపడటమే. కండరాల బలహీనత, క్షీణత వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే సమస్య.
వయసుతోపాటు కండరాల బలాన్ని కోల్పోవడం సాధారణమే అయినా కదలకుండా కూర్చోవడం, స్థూలకాయం కూడా వృద్ధాప్యంలోని కండరాల క్షీణత ఎలా ఉంటుందో యూకేలోని సౌంతాప్టన్ యూనివర్సిటీ సహా అనేక అధ్యయనాలు అంచనా వేశాయి .
‘‘గ్రిప్పింగ్ (పటుత్వం) ఓ మంచి సాధనం, ఎందుకంటే ఎవరికైనా తక్కువ పటుత్వం ఉందని మనం తెలుసుకున్నప్పుడు వారికి శరీరం తక్కువబలంతో ఉందని అర్థమవుతుంది. దీంతో వారి జీవనశైలిని మార్చడం ద్వారా దీనిని ఎదుర్కోవచ్చు’’ అని చెపుతున్నారు.
వయోవృద్ధుల చేతుల్లోని గరిష్ఠ పటుత్వానికి, వారి కాళ్ళు, ఉదర కండరాల బలానికి మధ్య ఉన్న బంధాన్ని తేల్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు.
‘‘మీకు వయసు పెరుగుతున్న కొద్దీ మీ శరరీంలోని నడుముకింది భాగంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది, ఇవ్వన్నీ మీరు కుర్చీలోంచి లేవడానికో, మెట్లు ఎక్కి దిగడానికో ఉపయోగపడే కండరాలే’’ అని డాక్టర్ క్రిస్టోఫర్ హర్స్ట్ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూకాజిల్‌లో ఈయన లైఫ్‌స్టైట్, గుడ్ హ్యాబిట్స్ పై పరిశోధన చేస్తున్నారు.
చేతులకు, శరీరంలోని ఇతర కండరాలకు ప్రత్యక్ష సంబంధాలు ఉండటం వలన కండరాల క్షీణతను కనుక్కోవడం తేలిక అవుతుంది. గరిష్ట పటుత్వం కోల్పోవడమనేది కండరాలు బలం కోల్పోవడానికి సంబంధించిన ప్రమాదాలను కనుక్కోవడానికి సులభమైన సాధనం. దీనిని గ్రిప్పింగ్ విధానంలో తేలికగా కనుక్కోవచ్చు.
బలహీన పటుత్వం వృద్ధులలోనూ, లావుగా ఉన్న మహిళల్లోని ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి ఓ బలమైన సాధనం అని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గల మోనాష్ యూనివర్సిటీలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెరియాట్రిక్స్ పరిశోధకులు తమ అధ్యయనంలో చెప్పారు.
శరీరం తనను తానే బాగుచేసుకొనే తీరుకు కండరాలే ఆలంబనగా నిలుస్తాయి. కావాల్సినంత శక్తిని ఉత్పత్తి చేయలేని వాటికి కండరాలు సహాయపడతాయి . అందుకే పటుత్వ బలం అనేది కీలకమని హర్ష్ట్ చెప్పారు.
పటుత్వ సామర్థ్యాన్ని కొలవడమనేది ఓ ముందస్తు ఆనారోగ్యనిర్థరణ సాధనం అని నిపుణులు చెపుతారు. ఈ టెస్టును ఆస్పత్రులలో సులభంగా చేయడంతోపాటు, వారి ఆరోగ్య లక్షణాలను మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పదండి ముందుకు
‘‘ తక్కువ పటుత్వ సామర్ధ్యం కండరాల బలహీనతను ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనం, ఎక్సర్‌సైజులు ఇప్పటికీ చక్కనైన ఆరోగ్యానికి, లేదా ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి దారులు’’ అని యూనివర్సీటీ ఆఫ్ వియాన్నా పరిశోధకులు చెప్పారు.
‘‘మీరు మరీ ఎక్కువగా శ్రమపడాల్సిన పనిలేదు. మరీ బద్దకంగా ఉండకుంటే చాలని మనందరికీ తెలుసు’’ అని ఇటువంటి విషయాలలో ప్రజలకు సలహాలు అందించే పీటర్సన్ చెప్పారు.
గ్రిప్పు పెంచుకోవడమే కాకుండా, మొత్తం శరీరానికి ఉపయోగపడేలా ఈయన కొన్ని ఎక్సర్‌సైజులు చెప్పారు.
‘‘ బార్ నుంచి వేలాడటం, పుల్ అప్స్ చేయడం అంటే బార్ నుంచి మీ శరీరాన్ని పైకి లేపడం ఎవరైనా చేయగలిగే వ్యాయామం. ఇది మీ శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’’ పీటర్సన్ చెప్పారు. ఈ వ్యాయమం మెడవరకు, ఆపైన ఉండే కండరాలు, అలాగే తుంటిభాగంలోని కండరాలను చురుకుగా ఉండేలా చేస్తాయి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అలాగే రెండు చేతులలోనూ బరువులు పట్టుకుని వాటిని నడుముకు సమాంతరంగా ఉంచి ఒక కాలుతో అడుగు ముందుకు వేసి మోకాలును వంచాలి. మళ్ళీ వెనక్కి రావాలి. తరువాత మరో కాలును ముందుకు వేసి మోకాలును వంచి తిరిగి వెనక్కి వచ్చి వీపును నిటారుగా ఉంచాలి. ఇది మీ కండరాలను మెరుగైన స్థితిలో ఉంచుతుందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ కండలను బలోపేతం చేసే వ్యాయామం కొంతైనా చేయాలని అని హర్స్ట్ సూచించారు.
‘‘ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వ్యాయామం మొదలుపెట్టండి. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఎప్పుడైన మొదలుపెట్టవచ్చు... అయ్యో వయసైపోయిందే అనుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
‘‘70, 80 ఏళ్ళ వయసున్నవారు కొద్దిపాటి వ్యాయామాలు చేసిన అద్భుతమైన ఫలితాలు చూస్తారు. కేవలం కొద్దిగా ఒళ్ళు వంచితే చక్కని ప్రయోజనాలు పొందుతారు’’ అన్నది నిపుణులు మాట.














