చికెన్‌గున్యా పనిపట్టే టీకా రెడీ, ఇది ఎవరు వేసుకోవచ్చంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నికోలస్ యాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న చికెన్‌గున్యాకు టీకా వచ్చేసింది.
చికెన్‌గున్యా వ్యాక్సీన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి లభించింది.
దోమల వల్ల వ్యాప్తి చెందే ఈ వ్యాధి కారణంగా జ్వరం, కీళ్ళ నొప్పులు వస్తాయి.
ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు ఇది ప్రాణాంతకమవుతోంది.
చికెన్‌గున్యా వ్యాక్సీన్‌కు ఎఫ్‌డీఏ అనుమతితో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా లభ్యత వేగవంతం కానుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ దాకా 4 లక్షల 40 వేల చికెన్‌గున్యా కేసులు నమోదైతే, అందులో 350 మంది మరణించారని నివేదికలు చెపుతున్నాయి.
ఇప్పటిదాకా చికెన్‌గున్యా చికిత్సకు నిర్దిష్టమైన ఔషధాలు లేవు.
ఈ ఏడాదిలో దక్షిణ అమెరికా, దక్షిణ ఆసియాలో చికెన్‌గున్యా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
ఈ టీకాను యూరప్‌కు చెందిన వాల్నెవా అభివృద్ధి చేసింది.
దీనిని ‘ఇక్స్‌చిక్’ పేరుతో పిలుస్తున్నారు. 18 ఏళ్ళు పైబడి, ఈ వ్యాధి బారినపడటానికి అవకాశం ఎక్కువ ఉన్నవారికి దీనిని ఇవ్వడానికి అనుమతిచ్చారు.
ఈ టీకాను సింగిల్ డోస్‌గా ఇస్తారు.

ఫొటో సోర్స్, SPL
2008 నుంచి ఇప్పటిదాకా 50 లక్షల కేసులు
‘‘ చికెన్‌గున్యా వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రమైన జబ్బులకు దారితీయడంతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ప్రత్యేకించి వృద్ధులలోనూ, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో ఈ సమస్యలు ఎక్కువవుతాయి’’ అని ఎఫ్‌ఢీఏ అధికారి పీటర్ మార్క్స్ చెప్పారు.
దద్దుర్లు, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు లాంటి లక్షణాలు నెలల నుంచి సంవత్సరాల తరబడి వేధిస్తాయని ఎఫ్‌డీఏ పేర్కొంది.
2008 నుంచి 50 లక్షల చికెన్‌గున్యా కేసులు నమోదయ్యాయని తెలిపింది.
ఆఫ్రికా, అగ్నేయాసియాలోని ఉష్ణమండలాల్లోనూ, అమెరికాలోని కొన్ని ప్రదేశాలలో చికెన్‌గున్యా ముప్పు ఎక్కువగా ఉంటోంది.
ఈ ప్రాంతాలలోని చికెన్‌గున్యా వైరస్‌ను దోమలు మోసుకుపోతుంటాయి కనుక ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చికెన్‌గున్యా వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చికెన్‌గున్యా వ్యాప్తి పెరుగుతోంది’’ అని ఎఫ్‌డీఏ తెలిపింది.
యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సమాచారం ప్రకారం ఈ ఏడాది చికెన్‌గున్యా కేసులో బ్రెజిల్‌లో ఎక్కువ నమోదయ్యాయి.
బ్రెజిల్‌లో ఈ ఏడాది ఇప్పటిదాకా 2,18, 613 కేసులు నమోదవ్వగా, భారతదేశంలో 93వేలకుపైగా కేసులు నమోదుయ్యాయి.
ఇక రాజధాని దిల్లీ 2016లో చికెన్‌గున్యా కేసులను పెద్ద ఎత్తున చూసింది.

ఫొటో సోర్స్, AFP
చికెన్‌గున్యా అంటే ఏమిటి?
చికెన్‌గున్యా దోమలద్వారా వ్యాపించే వ్యాధి. ఆఫ్రికా, ఆసియా, అమెరికా దేశాలలో ఇది విస్తరించగా, ఇతర ప్రాతాలలోనూ అప్పుడప్పుడు కనిపిస్తోంది.
డెంగ్యూ, జైకా వ్యాధులు కూడా చికెన్‌గున్యా లక్షణాలనే కలిగి ఉంటాయి. దీంతో చికెన్‌గున్యా నిర్థరణలో పొరపాటు జరిగే అవకాశం ఉంటోంది.
చికెన్‌గున్యా వ్యాధి నిర్థారణలోనూ, దాని నమోదులోని సవాళ్ళ కారణంగా ఈ వ్యాధి సోకినవారి సంఖ్యను తక్కువగా అంచనా వేస్తున్నారు.
పగటిపూట కుట్టే దోమల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. అంటే మనుషుల నుంచి మనుషులకు సంక్రమించదు.
చికెన్‌గున్యా అనే పేరు ఆఫ్రికన్ కిమాకొండే భాష నుంచి పుట్టింది. దీనర్థం ఆ భాషలో ‘కుంగిపోవడం’ అని .
హఠాత్తుగా జ్వరం, కీళ్ళనెప్పులు, ప్రత్యేకించి చేతులు, మణికట్టు, మడాలు, పాదాలను ప్రభావితం చేయడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం.
కొన్నిరోజుల చికిత్స అనంతరం చాలామంది రోగులు కోలుకుంటారు.
కానీ అనేకమందిలో కీళ్ళనెప్పులు కొన్నివారాల నుంచి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి.
చికెన్‌గున్యాతో మరణాలు సంభవించడం అరుదు. ఇతర అనారోగ్యకారణాలేవైనా తోడైతే తప్ప ఈ వ్యాధితో మరణించడం అరుదు.
చికెన్‌గున్యాను 1952లో టాంజానియాలో కనుగొన్నారు. అలాగే ఆప్రికా, ఆసియాలోనూ దీనిని గుర్తించారు.
1967లో థాయ్‌లాండ్ పట్టణ ప్రాంతాలలోనూ, 1970లో ఇండియాలోనూ దీని వ్యాప్తి బయటపడింది.
2004 నుంచి చికెన్‌గున్యా వ్యాప్తి పెరగడం మొదలైంది. ప్రస్తుతం ఆసియా, ఆప్రికా, యూరప్, ఆమెరికాలోని 110 దేశాలలో ఇది విస్తరించింది.

ఫొటో సోర్స్, ATISH PATEL
ముందుజాగ్రత్తలు, నియంత్రణ ఎలా?
పొడవు చేతుల దుస్తులు (ఫుల్ హ్యాండ్స్ ), శరీరాన్ని తక్కువగా బహిర్గతం చేసే దుస్తులు వేసుకోవాలి.
దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివారణా మందులను వినియోగించాలి.
ఏడిస్ ఈజీప్టీ, ఏడిసి అల్బోపిక్టస్ జాతికి చెందిన దోమలు సహజంగా చికెన్‌గున్యా వైరస్‌ను వ్యాప్తి చేస్తుంటాయి. ఇవి డెంగీ వ్యాప్తికి కూడా దోహదపడతాయి.
ఇంటి పరిసరాలలోనూ, పని ప్రదేశాలలోనూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
నిల్వ నీటిలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి.
బాత్రూమ్‌లు శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.
టాయిలెట్స్ మూతలను మూసి ఉంచాలి.
దోమలు రాకుండా కిటికీలను మూసి ఉంచాలి.
దోమకాటు నుంచి తప్పించోవడానికి మస్కిటో కాయిల్స్ సహా ఇతర కీటకనాశినులను వాడాలి.
ఇవికూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














