చెరకు తింటే రక్తంలో చక్కెర లెవెల్స్ పెరుగుతాయా? 4 సందేహాలు, సమాధానాలు

చెరకు గడలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సంక్రాంతి పండగ సమయంలో చాలాచోట్ల చెరకు గడలు కనిపిస్తాయి. పండుగ సమయంలో దీన్ని తినడం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతోపాటు చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. సంక్రాంతి పండగను చేసుకోని వారు కూడా ఈ సమయంలో చెరకు గడలను తినకుండా ఉండలేరు.

అయితే, చెరకును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇటీవల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డయాబెటిస్ (మధుమేహం) ఉన్న వారు చెరకును తినకూడదని, ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయనే అభిప్రాయం బాగా వ్యాప్తి చెందుతోంది.

మరోవైపు, చెరకును తినడం వల్ల అరుగుదల పెరుగుతుందని, ఇవి మన పళ్లను బలంగా చేస్తాయనే పాజిటివ్ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అసలు దీనిపై వైద్య ప్రపంచం ఏం చెబుతుందో చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చెరకు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందా?

చెరకు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఎండోస్కోపీ నిపుణులు డాక్టర్ వి.జి మోహన్ ప్రసాద్ చెప్పారు.

''చెరకులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం. అలాగే, విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీనికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంచే సామర్థ్యం ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి పలు ఖనిజాలు ఉంటాయి. డయేరియా వస్తే శరీరంలో ఖనిజాలు తగ్గిపోతాయి. వీటిని చెరకు భర్తీ చేస్తుంది. అది మాత్రమే కాక, చెరకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది'' అని డాక్టర్ మోహన్ ప్రసాద్ ‘బీబీసీ’తో చెప్పారు.

''ఫైబర్ అనేది గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరించే ఒక పదార్థం. ముఖ్యంగా మెదడుకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది ఎంతో సాయం చేస్తుంది. గట్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ బ్యాక్టీరియా. జీర్ణశక్తిని పెంచేందుకు ఇది చాలా ముఖ్యమైన ఆహార పదార్థం'' అని వివరించారు డాక్టర్ మోహన్ ప్రసాద్.

చెరకు శరీరంలో ఎసిడిటీని తగ్గిస్తుందని డాక్టర్ మోహన్ ప్రసాద్ చెప్పారు. జీర్ణశక్తి పెరుగుతుంది కాబట్టి ఇది మలబద్దక సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.

శరీరంలో జీర్ణశక్తిని పెంచడం, సమతుల్యం చేయడం ద్వారా పేగులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

చెరకు తినడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది, కాబట్టి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని చెప్పారు. చెరకులో ఉండే ఏహెచ్ఏ (ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్) వయసు మళ్లడం వల్ల ఏర్పడే చర్మంలోని మార్పులను అరికడుతుందని వివరించారు.

చెరకు రసం

ఫొటో సోర్స్, ZUBAIR ABBASI/Middle East Images/AFP via Getty Images

చెరకు తినడానికి, చెరకు రసం తాగడానికి మధ్య తేడా ఏంటి?

‘‘చెరకులో మూడు రకాల షుగర్లు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్, రెండు సుక్రోజ్, మూడు ఫ్రక్టోజ్. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తింటే, బ్లడ్ షుగర్ లెవల్స్ కాస్త పెరుగుతాయన్నది నిజమే. కానీ, దీని రసం తాగకుండా, చెరకును మాత్రమే తింటే.. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థిరంగా ఉంటుంది. ఎక్కువ పెరుగుదలకు కారణం కాదు'' అని డాక్టర్ మోహన్ ప్రసాద్ తెలిపారు.

చెరకు రసం తాగడం వల్ల కడుపు నుంచి పిత్తం (బైల్) విడుదల అవుతుంది. దీనివల్ల, రక్తంలో షుగర్ లెవ్స్ పెరుగుతాయి.

అయితే, డయాబెటిస్ లేనివారు చెరకు గడల నుంచి తీసిన రసాన్ని డైరెక్ట్‌గా తాగవచ్చని డాక్టర్ చెప్పారు. అయితే, చెరకు రసాన్ని రసాయనాలతో కూడిన ఇతర పానీయాల్లో కలుపుకొని తాగడం ఏ వయసు వారికైనా మంచిది కాదని తెలిపారు.

''చెరకు రసం కోసం రెండు మూడు గడలను పిండాల్సి ఉంటుంది. అలాంటి రసాన్ని తాగితే వెంటనే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ఒక వ్యక్తి ఒక చెరకు గడను మాత్రమే తినగలరు. దీని నుంచి వచ్చే రసం చాలా తక్కువ. అందుకే, అంత ఎక్కువగా షుగర్ లెవల్స్ పెరగవు'' అని మధుమేహ నిపుణుడు డాక్టర్‌ కుమార్ పేర్కొన్నారు.

‘‘సరిగ్గా మందులు వేసుకుంటూ, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులోకి ఉంచుకున్న వారు, చెరకును కొంత తిన్నంత మాత్రాన ఏం కాదు. నియంత్రణలో ఉన్నవారు అప్పుడప్పుడు అర గ్లాసు చెరకు రసం తాగడానికి భయపడకూడదు. కానీ, రక్తంలో చక్కెర స్థాయిలు అనియంత్రిత స్థాయిలో 400 లేదా 500 వద్ద ఉన్నప్పుడు చెరకును పూర్తిగా మానేయాలి" అని డాక్టర్ కుమార్ చెప్పారు.

చెరకు రసం

ఫొటో సోర్స్, Getty Images

చెరకు తిన్నాక నాలుకపై సెన్సేషన్‌కు కారణమేంటి?

చెరకును తింటూ నీటిని తాగినప్పుడు నాలుక మీద కాస్త ఇబ్బందిగా ఎందుకు అనిపిస్తుంది? అనే ప్రశ్నకు చెవి, ముక్కు, గొంతు నిపుణులు వసుమతి విశ్వనాథన్‌ సమాధానమిచ్చారు.

''చెరకులో ఉండే ఎసిడిటీ వల్ల, చెరకు తిన్న తర్వాత నీళ్లను తాగితే.. రియాక్షన్‌ కలుగుతుంది. దీనివల్ల నాలుకపై ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు. కొంతమందికి గొంతు నొప్పి లేదా జలుబు చేసినట్లు అనిపించవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. 90 శాతం మందికి, ఒకటి లేదా రెండు గంటల్లోనే అది నయమైపోతుంది'' అని వసుమతి వివరించారు.

''చెరకు తిన్న తర్వాత ఏదైనా చల్లటి పానీయాలను తాగితే, గొంతు ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే, చెరకు గడలను నమలడం గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలను కలిగించవచ్చు. వేడి నీళ్లు తరచూ తాగుతూ ఉంటే తగ్గిపోతుంది'' అని డాక్టర్ వసుమతి విశ్వనాథన్‌ చెప్పారు.

చెరకు గడలు

ఫొటో సోర్స్, Getty Images

చెరకు తినడంవల్ల పళ్లు బలంగా, శుభ్రంగా మారతాయా?

చెరకులో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయని, ఇవి దంతాలను బలంగా మార్చేందుకు సాయపడుతుండొచ్చని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మోహన్ ప్రసాద్ చెప్పారు.

అయితే, చెరకు తినడం వల్ల పళ్లు బలంగా మారతాయన్నది కేవలం అపోహేనని డెంటిస్ట్ బాలచందర్ అన్నారు. అయితే, పళ్ల బలాన్ని చెరకు ద్వారా పరీక్షించవచ్చని ఆయన అన్నారు.

''సాధారణంగా ఒక వ్యక్తి దంతాలు సుమారు 16 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో చాలా బలంగా ఉంటాయి. ఆ తర్వాత వాటి బలం ఆ వ్యక్తి తీసుకునే సంరక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మన దంతాల బలాన్నిబట్టి చెరకు గడలను కొరకాలి. బలహీనమైన పళ్లతో చెరకు గడలను కొరికితే, పళ్లు ఊడిపోయే ప్రమాదం ఎక్కువ. చెరకులో ఫైబర్ ఉన్నప్పటికీ, అది దంతాలను కొంతవరకే శుభ్రం చేయడానికి సహాయపడుతుంది'' అని బీబీసీకి డెంటిస్ట్ బాలచందర్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)