‘‘ముందు ఎక్కిళ్లు వచ్చాయి, తరువాత గొంతు మొత్తం వాచిపోయింది’’ డాక్టర్లు ఏం చెప్పారంటే?

రాహుల్‌తో వైద్య బృందం

ఫొటో సోర్స్, Doctor Krishnakant Sahu

ఫొటో క్యాప్షన్, రాహుల్‌తో వైద్య బృందం
    • రచయిత, విష్ణుకాంత్ తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"బ్రష్ చేసుకుంటుంటే చిన్నగా ఎక్కిళ్లు వచ్చాయి. ఆ వెంటనే, గొంతు కుడివైపు లోపల ఏదో ఒక బెలూన్ వేగంగా ఉబ్బుతున్నట్లు అనిపించింది. కొన్ని నిమిషాల్లోనే గొంతు మొత్తం వాచిపోయింది. ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉందంటే కళ్ల ముందు చీకట్లు కమ్మేశాయి.. "

ఇదీ ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన 40 ఏళ్ల రాహుల్ కుమార్ జాంగ్డే అనుభవం.

2025 డిసెంబర్ 1న అకస్మాత్తుగా భరించలేనంత నొప్పి రావడంతో, ‘ఏదో తేడాగా ఉంది, వెంటనే ఆసుపత్రికి వెళ్దాం’ అని తన భార్యకు చెప్పినట్లు మాత్రమే రాహుల్‌కు గుర్తుంది. ఆ తర్వాత ఆయనకు స్పృహ వచ్చేసరికి రాయ్‌పూర్‌లోని డాక్టర్ భీమ్‌రావ్ అంబేడ్కర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు.

ఇది ఏదైనా గాయం వల్లనో, అనారోగ్యం వల్లనో జరిగింది కాదని, మెదడుకు రక్తాన్ని చేరవేసే గొంతులోని ప్రధాన రక్తనాళం (ధమని) తానంతట అదే హఠాత్తుగా చిట్లిపోయిందని వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసు అత్యంత అరుదని చెప్పారు.

దీన్ని 'స్పాంటేనియస్ కరోటిడ్ ఆర్టరీ రప్చర్' అని పిలుస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రాహుల్ పరిస్థితిని వివరించే స్కాన్

ఫొటో సోర్స్, Doctor Krishnakant Sahu

ఫొటో క్యాప్షన్, రాహుల్ పరిస్థితిని వివరించే స్కాన్

‘ఇది చాలా ప్రాణాపాయ స్థితి.. ’

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం వైద్య రంగంలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.

రాయ్‌పూర్‌లోని భీమ్‌రావ్ అంబేడ్కర్ ఆసుపత్రికి చెందిన హార్ట్, చెస్ట్, వాస్కులర్ సర్జరీ విభాగం వైద్యులు సుమారు 6 గంటల పాటు అత్యంత సంక్లిష్టమైన సర్జరీ చేసి రాహుల్ ప్రాణాలను కాపాడగలిగారు.

‘‘మెడలోని రక్తనాళం చిట్లిపోవడమనేది ప్రాణాపాయ స్థితి. అలాంటప్పుడు రోగికి తక్షణమే శస్త్రచికిత్స చేయకపోతే నిమిషాల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయితే, సాధారణంగా ఇలాంటివి గొంతు క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నప్పుడు జరుగుతాయి’’ అని హార్ట్, చెస్ట్, వాస్కులర్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ కృష్ణకాంత్ సాహు బీబీసీతో అన్నారు.

కానీ ఏ అనారోగ్యంలేని ఒక సామాన్య వ్యక్తికి ఇలా గొంతు రక్తనాళం దానంతట అదే చిట్లిపోవడమనేది అత్యంత అరుదైన విషయమని ఆయన చెప్పారు.

‘‘మెడికల్ జర్నల్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటివి కేవలం 10 కేసులే నమోదయ్యాయి’’ అని డాక్టర్ కృష్ణకాంత్ సాహు వెల్లడించారు.

రాయ్‌పూర్ సమీపంలోని భన్‌పురి ప్రాంతంలో నివసించే రాహుల్, కాస్మెటిక్స్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

తనకు గతంలో ఎప్పుడూ ఇటువంటి సమస్య రాలేదని రాహుల్ బీబీసీకి చెప్పారు.

ఈ సంఘటన రాహుల్‌కే కాకుండా, వైద్యులకు కూడా ఒక అసాధారణమైన అనుభవం.

రాహుల్ కుడివైపు ఉన్న కరోటిడ్ ధమని (ఆర్టరీ) చిట్లిపోయినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధరణ అయింది.

అసలు ఇదెలా జరుగుతుంది?

మెడ భాగంలో ఉండే కుడి, ఎడమ కరోటిడ్ ధమనులే మనిషి గుండె నుంచి మెదడుకు ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని చేరవేస్తాయి. గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలను ధమనులు అంటారు.

మానవ శరీరంలో ఈ రక్తనాళాల వ్యవస్థ చాలా సురక్షితంగా విస్తరించి ఉంటుంది.

వైద్యుల చెబుతున్న వివరాల ప్రకారం, శరీరంలో ఎక్కడైనా కోతపడినా, గాయమైనా, అది గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులకు దెబ్బ తగిలి, వాటి నుంచి రక్తం బయటకు వచ్చినప్పుడే ప్రాణాంతకం అవుతుంది.

ఎందుకంటే ఈ ధమనులలో రక్తం చాలా ఎక్కువ ఒత్తిడితో ప్రవహిస్తుంది. కాబట్టి, అతి తక్కువ సమయంలోనే శరీరంలోని రక్తం అధికంగా బయటకు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

రాహుల్ శస్త్రచికిత్స బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ కృష్ణకాంత్ సాహు మాట్లాడుతూ, ''ఎటువంటి గాయం, ఇన్ఫెక్షన్, క్యాన్సర్ లేదా మునుపటి అనారోగ్య సమస్యలేవీ లేకుండా కరోటిడ్ ధమని తానంతట అదే చిట్లిపోవడం అత్యంత అరుదైన కేసు'' అని చెప్పారు.

రాహుల్ మెడ కుడివైపు ఉన్న కరోటిడ్ ధమని చిట్లిపోవడం వల్ల మెడ భాగం వేగంగా రక్తం నిండిపోయింది. ఆ ధమని చుట్టూ రక్తం చేరడం వల్ల ఒక బెలూన్ వంటి నిర్మాణం ఏర్పడింది. దీన్ని వైద్య పరిభాషలో 'సూడో-ఎనియూరిజం' అని పిలుస్తారు.

''ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెడికల్ లిటరేచర్‌లో ఇలాంటి కేసులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. నా సుదీర్ఘ వైద్య వృత్తిలో ఇటువంటి కేసును నేను ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు'' అని డాక్టర్ సాహు చెప్పారు.

రాహుల్ కుమార్ జాంగ్డే

ఫొటో సోర్స్, Lakshmi Jangde

ఫొటో క్యాప్షన్, రాహుల్ కుమార్ జాంగ్డే

ప్రాణాలను కాపాడటం ఎంతో కష్టం...

రాహుల్ పరిస్థితి గురించి వివరిస్తూ, "సాధారణ భాషలో చెప్పాలంటే, కరోటిడ్ ధమనిలో అడ్డంకులు ఏర్పడితే పక్షవాతం (స్ట్రోక్) వస్తుంది. కానీ రాహుల్ విషయంలో సమస్య అంతకంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే, ధమని దానంతట అదే చిట్లిపోయింది. అక్కడ పేరుకుపోయిన రక్తం గడ్డల్లో చిన్న ముక్క మెదడుకు చేరినా, పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండేది" అని డాక్టర్ సాహు చెప్పారు.

ఒకవేళ రక్తపు గడ్డలు పెద్ద పరిమాణంలో మెదడుకు చేరితే, మెదడు పూర్తిగా దెబ్బతినడం లేదా రోగి 'బ్రెయిన్ డెడ్' అయ్యే ప్రమాదం కూడా ఉండేది.

శస్త్రచికిత్సకు ముందు, సర్జరీ జరుగుతున్న సమయంలో కూడా ఆ ధమని మళ్లీ చిట్లిపోయే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్ సాహు చెప్పారు. అలా జరిగి ఉంటే, నియంత్రించలేని రక్తస్రావం వల్ల రోగి కొద్ది నిమిషాల్లోనే మరణించవచ్చు.

వైద్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం, రాహుల్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏమాత్రం నిలకడగా లేదు. మెడ లోపల రక్తం ఎంతలా పేరుకుపోయిందంటే, సర్జరీ సమయంలో ఆ ధమనిని గుర్తించడం కూడా వైద్యులకు చాలా కష్టమైంది.

"మెడలోని ఈ భాగంలో మాటల తీరును, కాళ్లూ చేతుల కదలికలను, గుండె కొట్టుకోవడాన్ని నియంత్రించే కీలకమైన నరాలు ఉంటాయి. మా నుంచి చిన్న పొరపాటు జరిగినా, అది రోగికి జీవితాంతం అంగవైకల్యం లేదా మరణానికి దారితీసేది" అని డాక్టర్ సాహు అన్నారు.

వైద్యులకు కేవలం ఆ ధమనిని గుర్తించి, అదుపులోకి తెచ్చుకోవడానికే సుమారు గంటన్నర సమయం పట్టింది. మొత్తం శస్త్రచికిత్స పూర్తికావడానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టింది.

చిట్లిపోయిన ధమనిని సరిచేయడానికి ఆవు గుండె పొర (బోవిన్ పెరికార్డియం ప్యాచ్)ను ఉపయోగించారు.

శస్త్రచికిత్స తర్వాత రాహుల్‌ను 12 గంటల పాటు వెంటిలేటర్‌పై ఉంచినట్లు వైద్యులు తెలిపారు.

''రాహుల్‌కు స్పృహ వచ్చిన తర్వాత, ఆయనతో మాట్లాడి గొంతు ఎలా ఉందో పరీక్షించాం. ఆ తర్వాత కాళ్లూ చేతుల కదలికలను, ముఖంలోని కదలికలను పరిశీలించాం. రక్తం గడ్డలేవీ మెదడుకు చేరలేదని, అలాగే సర్జరీ సమయంలో కీలకమైన నరాలకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధరించుకోవడానికి ఈ పరీక్షలు చేశాం" అని డాక్టర్ సాహు చెప్పారు.

‘భయంకరమైన అనుభవం’

రాహుల్ భార్య లక్ష్మీ జాంగ్డే ఫోన్లో బీబీసీతో మాట్లాడారు.

‘‘రాహుల్ పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో మాకు మొదట్లో చాలా భయమేసింది. ఇప్పుడు ఆయన కోలుకోవడం చూస్తుంటే, అసలు మెడలోని ధమని చిట్లిపోయిందంటే నమ్మలేకపోతున్నాను" అని అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లోనే మొట్టమొదటి కేసు అని వైద్యులు అన్నప్పుడు తనకు ఆందోళన కలిగిందని, ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది ఎంతో ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)