ప్రిగాబలిన్: మూర్ఛ, నరాల వ్యాధులకు వాడే ఈ ఔషధం ఎందుకంత ప్రమాదకరం

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచంలోని అనేక దేశాలలో ఇటీవల కాలంలో కొందరు చనిపోవడానికి ప్రిగాబలిన్ అనే ఓ మందు కారణమని తేలింది.
చాలా మంది ఈ మందును బ్లాక్ మార్కెట్‌లో, నియంత్రణ లేని కొన్ని వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు.
నేషనల్ హెల్త్ సర్వీసులో పొందుపరిచిన సమాచారం ప్రకారం ప్రిగాబలిన్‌ను మూర్ఛ వ్యాధి, నరాల నొప్పి, తీవ్ర ఆందోళన వంటి అనారోగ్య పరిస్థితుల చికిత్స కోసం వాడతారు.
ఇది టాబ్లెట్లు, కేప్స్యూల్, లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. బ్రాండ్‌ను బట్టి దీన్ని అల్‌జైన్, అక్సాలిడ్, లిరికా వంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు.
బ్రిటన్‌లో 2022లో 80 లక్షలకు పైగా ప్రిగాబలిన్ ప్రిస్క్రిప్షన్లు అందించినట్లు తెలిసింది.
బ్రిటన్‌లో ప్రిగాబలిన్ ప్రిస్క్రిప్షన్ రేటు తగ్గుతున్నట్లు సంకేతాలున్నప్పటికీ, సరిగ్గా వాడితే రోగులకు చాలా ఉపయోగకరమైన చికిత్స అని వైద్యులు చెబుతున్నారు. ఇది అందుబాటులో ఉండాలన్నారు.
ప్రిగాబలిన్ వల్ల దుష్ఫ్రభావాలు ఏమిటి?
కొందరు ప్రిగాబలిన్‌ను సరికొత్త వాలియం లేదా బడ్(బడ్‌వైజర్ బీర్)గా పిలుస్తుంటారు. ఎందుకంటే, ఇది తీసుకున్న తర్వాత చాలా రిలాక్స్‌డ్‌గా(తేలికగా) ఉన్నట్లు భావిస్తారు. ఆల్కాహాల్ తీసుకున్నట్లు అనిపిస్తుంది.
కానీ, ఈ మందును ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ముఖ్యంగా ఇతర డ్రగ్‌లతో కలిపి తీసుకున్నప్పుడు ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
మగతగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు కారణమవుతుంది.
ప్రిగాబలిన్ తీసుకునే రోగులు ఆల్కాహాల్ మానేయాలని వైద్యులు సూచిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో ప్రిగాబలిన్‌తో ముడిపడి ఎన్ని
మెథడోన్ లేదా మార్ఫిన్ వంటి ఇతర మందులతో కలిపి దీన్ని తీసుకున్నప్పుడు ఇది ప్రాణాంతకమని, 2004 నుంచి 2020 మధ్య కొందరు ఇలా మరణించారని ఇంగ్లాండ్‌లోని రికార్డులు చెబుతున్నాయి.
చాలా కేసుల్లో ఈ మందును ఇతర మందులతో కలిపి ప్రిస్క్రైబ్ చేయరు. ఓపియేట్స్, ప్రిగాబలిన్ కలిపి తీసుకుంటే శ్వాస తీసుకోవడం తగ్గుతుంది.
ఇంగ్లాండ్, వేల్స్‌లో 2022 డేటా ప్రకారం ప్రిగాబలిన్ వల్ల 441 మంది చనిపోయినట్లు లెక్కలున్నాయి.
తూర్పు ఐర్లాండ్‌లో కూడా దీని వల్ల పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.
ఎన్ఐ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ(నిస్రా) తాజా డేటా ప్రకారం 2021లో నమోదైన 213 కేసుల్లో 71 మరణాలు ప్రిగాబలిన్ వల్ల తలెత్తినట్లు మరణ ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్నారు.
2013లో ఒకటి, 2016లో తొమ్మిది, 2019లో 77 మరణాలు దీనివల్లనే సంభవించాయి. ఆ తర్వాత కాస్త తగ్గి 71 మరణాలు తలెత్తాయి.
స్కాట్లాండ్‌లో ప్రిగాబలిన్, ఇదే రకమైన డ్రగ్ గెబపెంటిన్‌తో ముడిపడి 2020లో అత్యధికంగా 502 మరణాలు సంభవించాయని తెలిసింది. ఆ తర్వాత ఈ మరణాలు 2021లో 472కి, 2022లో 367కి తగ్గాయి.
ప్రిగాబలిన్‌కు బానిస అయ్యారా?
ప్రిగాబలిన్ డ్రగ్‌కు బానిసగా మారే స్వభావాన్ని కొందరు చాలా తక్కువగా అంచనావేస్తారు.
అంతకుముందు డ్రగ్ తీసుకున్నవారు కానీ, దానికి బానిసగా మారిన వారు దీనిపై ఆధారపడితే చాలా ప్రమాదకరం.
ఎలా బయటపడాలి?
కొంత మంది వ్యక్తులకు ప్రిగాబలిన్‌ను తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి చేరుతారు. దీన్ని తీసుకోవడం ఆపివేస్తే, కోపం, చిరాకు, ఆందోళన వంటి మానసిక మార్పులతో పాటు, చెమట పట్టడం, వికారంగా అనిపించడం, చలి పుట్టడం వంటి శారీరక లక్షణాలూ కనిపిస్తుంటాయి.
ఈ డ్రగ్‌ను తీసుకోవడం ఆపివేయాలని ప్రయత్నించే వారెవరైనా తొలుత వైద్యుల సూచన తీసుకోవాలి.
మీ వైద్యుని సూచన లేకుండా ప్రిగాబలిన్ తీసుకోవడం అకస్మాత్తుగా ఆపకూడదు. మెల్లగా వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు సమయం తీసుకుని ఈ డ్రగ్ మోతాదును తగ్గించాలి.

ప్రిగాబలిన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటే చట్టవిరుద్ధమా?
యూకేలో డ్రగ్స్ దుర్వినియోగ చట్టం ప్రకారం మూడు కేటగిరీలు ఏ, బీ, సీ కింద మందులను వర్గీకరించారు. వాటిని దుర్వినియోగం చేసినప్పుడు కలిగే ముప్పును బట్టి ఈ వర్గీకరణ చేపట్టారు.
ప్రిగాబలిన్ 2019లో క్లాస్ సీ డ్రగ్ కింద వర్గీకరించారు. అంతే, సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రిగాబలిన్‌ను దగ్గర ఉంచుకున్నప్పుడు లేదే వేరేవాళ్లకి దీన్ని ఇచ్చినప్పుడు అది చట్టవ్యతిరేకం.
గంజాయి, కొకైన్, బెంజోడియాజెపైన్స్ తర్వాత అత్యంత ఎక్కువగా సీజ్ చేసే డ్రగ్‌లలో ప్రిగాబలిన్ నాలుగో స్థానంలో ఉన్నట్లు పోలీసు సర్వీసు ఆఫ్ నార్తరన్ ఐర్లాండ్(పీఎస్ఐఎన్) గణాంకాలు తెలిపాయి.
2021 జూలై నుంచి 2022 జూన్ మధ్య కాలంలో 804 సందర్భాల్లో ప్రిగాబలిన్‌ను సీజ్ చేశారు.
ఆ తర్వాత 12 నెలల్లో, 1,081 సందర్భాల్లో ఈ డ్రగ్‌ను పట్టుకున్నారు. 34 శాతానికి పైగా ఈ డ్రగ్ పట్టుబడింది.
ఇతర దేశాల్లో ప్రిగాబలిన్‌ను ఎలా వాడతారు?
అమెరికా, బ్రిటన్‌లో 1993లో ఈ మందును అందుబాటులోకి తెచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్ బాగా విస్తరించింది.
మెడికల్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ విడుదల చేసిన అధ్యయనంలో, 2008 నుంచి 2018 మధ్య కాలంలో ప్రతి రోజూ ప్రపంచవ్యాప్తంగా తీసుకునే ప్రిగాబలిన్, గెబపెంటిన్ మోతాదుల సంఖ్య నాలిగింతలు పెరిగింది.
అంతేకాక, ప్రిగాబలిన్ దుర్వినియోగం, దాని మరణాలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయి.
ఆస్ట్రేలియా 2023 వార్షిక అధిక మోతాదు నివేదికలో 2000 నుంచి 2021 మధ్య కాలంలో ప్రిగాబలిన్, గెబపెంటిన్ వల్ల 887 మరణాలు సంభవించాయని, దానిలో 93 శాతం మరణాలు ప్రిగాబలిన్‌తోనే అనుసంధానమై ఉన్నాయని తెలిసింది.
సౌదీ అరేబియా, జోర్డాన్‌లో కూడా ప్రిగాబలిన్ దుర్వినియోగం పెరుగుతుందని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి.
ప్రిగాబలిన్, గెబపెంటిన్ డ్రగ్‌లను 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు అత్యంత సాధారణంగా వాడుతున్నారని 2017లో యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నేషనల్ రిహాబిలిటేషన్ సెంటర్ తెలిపింది.
యూఏఈ, కువైట్‌లో కూడా అక్రమంగా తరలిస్తున్న ప్రిగాబలిన్‌ను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు.
మార్చిలో యూఏఈలో సుమారు 30 లక్షల పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2023లో, కువైట్ అధికారులు 1.5 కోట్ల ప్రిగాబలిన్ క్యాపుల్స్‌ను, పౌడర్ రూపంలో ఉన్న అర టన్ను ఔషధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- ఆంధ్రప్రదేశ్: ధనవంతులైన ఎంపీల వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతుందా?
- దామోదరం సంజీవయ్య: సీఎం పదవి చేపట్టినా కులం పేరుతో అవమానాలు తప్పలేదా?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు...
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














