చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

చంద్రబాబు

ఫొటో సోర్స్, Facebook / Chandra Babu Naidu

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దాదాపు 42 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది.

ప్రస్తుతం రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభ నుంచి ఏప్రిల్లో రిలీవ్ అవుతుండగా, ఆ స్థానానికి ఆ పార్టీ పోటీ పడే అవకాశం ఉందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.

కానీ సాధారణ ఎన్నికల ముంగిట సాహసాలకు పోకూడదని పార్టీ అధినాయకత్వం నిర్ణయించడంతో ప్రధాన ప్రతిపక్షం పోటీకి దూరమయ్యింది. దాంతో అధికార వైఎస్సార్సీపీకి ఈసారి మూడు సీట్లు ఏకగ్రీవంగా దక్కనున్నాయి.

వైఎస్సార్సీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) ముకేశ్ కుమార్ మీనా ఫిబ్రవరి 16న ఆమోదించారు.

ఉపేంద్ర

ఫొటో సోర్స్, KV satyanarayana

ఫొటో క్యాప్షన్, పర్వతనేని ఉపేంద్ర (కళ్లజోడు పెట్టుకున్న వ్యక్తి)

1984లో టీడీపీ బోణీ

తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు ప్రారంభించారు.

ఎన్టీఆర్ నాయకత్వంలో 1983లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, 1984లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బోణీ కొట్టింది. ఆ పార్టీ తరపున ఐదుగురు ఎగువసభకు ఎన్నికయ్యారు. వారిలో పర్వతనేని ఉపేంద్ర, బి. సత్యన్నారాయణ రెడ్డి, పి రాధాకృష్ణన్, ప్రొఫెసర్ సి.లక్ష్మన్న, ఎల్లా శశిభూషణ్ రావు ఉన్నారు.

1984 ఏప్రిల్ 10న ఈ ఐదుగురు టీడీపీ తరపున ఎగువ సభలో అడుగుపెట్టడంతో ఆ పార్టీ ప్రాతినిధ్యం మొదలయ్యింది. తొలిసారి రాజ్యసభలో ప్రవేశించిన టీడీపీ ఎంపీల్లో ఉపేంద్ర, సత్యన్నారాయణ రెడ్డి వరుసగా రెండు దఫాలు అవకాశం దక్కించుకున్నారు.

అదే ఏడాది ఇందిరా గాంధీ మరణానంతరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీ హవా కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో42 సీట్లకు 30 స్థానాలను తన ఖాతాలో వేసుకుని, అధికార కాంగ్రెస్ తర్వాత లోక్‌సభలో అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

జయప్రద

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సినీ ప్రముఖుల్లో జయప్రద ఒకరు.
మాజీ ఎంపీ, నటులు రావు గోపాల రావు

ఫొటో సోర్స్, Facebook/Raoramesh

ఫొటో క్యాప్షన్, రావు గోపాల రావు (ఫైల్ ఫోటో)

టీడీపీ తరపున 44 మందికి అవకాశం

టీడీపీ తరపున 1984 నుంచి 2024 వరకు మొత్తం 44 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. వారిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.

సినీ నటులు రావు గోపాలరావు, మోహన్ బాబు, జయప్రద వంటి వారు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుజనా చౌదరి వంటి వారు రాజ్యసభ సభ్యులుగానే టీడీపీ తరుపున కేంద్ర మంత్రులు కూడా అయ్యారు.

టీడీపీకి చెందిన వారే కాకుండా మిత్రపక్షాలకు కూడా మద్దతు ఇచ్చి రాజ్యసభకు పంపించిన చరిత్ర టీడీపీది. సీపీఐ, సీపీఎంలకు చెందిన పలువురు నేతలు రాజ్యసభలో అడుగు పెట్టేందుకు టీడీపీ మద్దతిచ్చింది.

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీజేపీతో పొత్తులో భాగంగా అప్పటి కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ వంటి వారికి కూడా ఏపీ నుంచి రాజ్యసభ అవకాశాలు కల్పించింది.

ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కనపడేది.

ఒకనాడు అనేక పార్టీలు టీడీపీ మద్దతుతో రాజ్యసభలో ప్రవేశించగా, ఇప్పుడు టీడీపీకే రాజ్యసభలో బెర్త్ లేకుండాపోయే, అసలు పోటీకే వెనకాడే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా అసెంబ్లీలో బలం ఆధారంగానే రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి కష్టకాలమొచ్చింది.

టీడీపీ తరపున 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కించుకునే అవకాశం కోల్పోయింది. వరుసగా మూడు ఎన్నికల్లో- 2020, 2022, 2024లలో టీడీపీకి అవకాశం లేకుండా పోయింది.

2020లో నాలుగు సీట్లకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని బరిలో దింపినా ప్రభావం చూపలేకపోయింది. ఇక ప్రస్తుత ఎన్నికలతోపాటు 2022లోనూ టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోవడంతో ఏకగ్రీవంగా వైఎస్సార్సీపీ ఖాతాలో మొత్తం రాజ్యసభ స్థానాలు చేరిపోయాయి.

సుజనా చౌదరి

ఫొటో సోర్స్, YSCHOWDARY/FACEBOOK

ఫొటో క్యాప్షన్, చంద్రబాబుతో సుజనా చౌదరి (ఫైల్ ఫోటో)

ఫిరాయింపులు కూడా ఎక్కువే

టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైనవారు అనేక మంది ఆ తర్వాత ఆ పార్టీకి దూరమైన అనుభవాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అధికారంలో ఉండగా రాజ్యసభ అవకాశాలు దక్కించుకుని విపక్షంలో చేరగానే పార్టీ మారిపోయిన నేతల జాబితా కూడా పెద్దదే.

నాలుగేళ్ల క్రితం 2020లో టీడీపీకి రాజ్యసభలో ఐదుగురు సభ్యులు ఉండగా అందులో నలుగురు ఒకేసారి బీజేపీ పక్షాన చేరిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పేసుకుని ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించేశారు.

సీఎం రమేష్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావు పార్టీ ఫిరాయించేయడంతో టీడీపీకి కేవలం ఒకే ఒక్కరు మిగిలారు. నాలుగేళ్లుగా కనకమేడల రవీంద్రకుమార్ మాత్రమే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపిస్తూ వచ్చారు.

ఏప్రిల్లో ఆయన కూడా రిలీవ్ అవుతుండటంతోనే టీడీపీకి రాజ్యసభలో అవకాశం లేకుండా పోతోంది.

అంతకుముందు కూడా టీడీపీ తరపున గెలిచి, ఇతర పార్టీల్లో చేరిన వారిలో రేణుకా చౌదరి, దేవేందర్ గౌడ్, సి.రామచంద్రయ్య, ఎంవీ మైసూరారెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

మళ్లీ 2026లోనే అవకాశం

2024 సాధారణ ఎన్నికలకు ముందే ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు ముగుస్తున్నందున మళ్లీ టీడీపీకి అవకాశం రావాలంటే మరో రెండేళ్లు వేచి చూడక తప్పదు.

రాజ్యసభ సీట్లు దక్కించుకోవడమనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.

2026లో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డితోపాటు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి సన్నిహితుడైన పరిమళ్ నత్వానీ ఉంటారు.

ఈ నలుగురూ వైఎస్సార్సీపీ తరపున 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

రాజ్యసభ

ఫొటో సోర్స్, YouTube / Sansad TV

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు ఉన్నాయి.

అధికారంలోకి వస్తాం, బలం పెంచుకుంటాం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలో మొత్తం 11 స్థానాలు ఉండగా, తాజా పరిణామాలతో అన్ని స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో చేరుతున్నాయి. ఏపీ చరిత్రలో రాజ్యసభ స్థానాలన్నీ ఒకే పార్టీ ఖాతాలో ఉండటం ఇదే తొలిసారి కానుంది.

అయితే భవిష్యత్తులో అవకాశాలపై టీడీపీ విశ్వాసం వ్యక్తంచేస్తోంది.

2024 సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని, తదుపరి రాజ్యసభ ఎన్నికల్లో కచ్చితంగా అవకాశం దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశారు.

"రాజకీయ పార్టీ అనగానే ఉత్థాన పతనాలు ఉంటాయి. 2019 ఎన్నికల్లో ప్రజలు తప్పుడు వాగ్దానాలను నమ్మారు. ‘ఒక్క చాన్స్’ పేరుతో అనూహ్యంగా (వైఎస్ జగన్మోహన్ రెడ్డికి) పట్టం కట్టారు. ఇది రాజ్యసభలో మా అవకాశాల్ని దెబ్బతీసింది. తెలుగుదేశం పార్టీకి ఇలాంటివి కొత్త కాదు. తట్టుకుని నిలబడడమే మా పార్టీ ప్రత్యేకత. మేం త్వరలోనే పుంజుకుంటాం. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే కాకుండా, వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి మాకే అన్ని సీట్లు దక్కేటంత బలం రాబోతోంది" అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)