ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు...

కుటుంబ రాజకీయాలు

ఫొటో సోర్స్, Madhu/ social media

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా కొన్ని కులాల వారికి ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయనేది బహిరంగ వాస్తవం. కానీ, కొన్ని సీట్లలో కొన్ని కుటుంబాల వారికి మాత్రమే అవకాశం దక్కుతోంది.

స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఏడు దశాబ్దాల రాజకీయాల్లో కేవలం రెండు, మూడు కుటుంబాల వారే గెలుస్తూ వస్తున్నారు. అలాంటి సీట్లు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి.

మూడు తరాలుగా ఒకే కుటుంబీకులు ఆయా సీట్లలో పాగా వేస్తుండడం, తరాలు మారుతున్నా పట్టు సడలకుండా చూసుకుంటున్న తీరు ఆసక్తికరం.

రాజకీయంగా కొత్త పార్టీలు రావడం, అధికారం మారుతుండడం వంటి ఎన్ని పరిణామాలు జరిగినా కొన్ని స్థానాల్లో ఆయా కుటుంబాల వారే స్థిరంగా తమ హవాను చాటుకుంటున్నారు.

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత కాలంలో ఏర్పడిన అసెంబ్లీ స్థానాల్లో కూడా కొన్ని కుటుంబాల వారే పెత్తనం చేస్తున్నప్పటికీ, ఏడు దశాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న తీరుని పరిశీలిద్దాం.

నరసన్నపేట

ఫొటో సోర్స్, Dharmana Prasada Rao/fb

ఫొటో క్యాప్షన్, ధర్మాన ప్రసాదరావు

నరసన్నపేటలో ఆ కుటుంబాలకే..

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు కుటుంబాల వారిదే ఆధిక్యం. 1952, 1978 ఎన్నికలను మినహాయిస్తే కేవలం మూడు కుటుంబాల వారికే అవకాశం వచ్చిందిక్కడ.

మొత్తం నరసన్నపేట అసెంబ్లీ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 దఫాలు మూడు కుటుంబాల వారికే విజయం దక్కింది. అందులో తొలుత శిమ్మ కుటుంబ హవా కనిపించింది. మూడు ఎన్నికల్లో శిమ్మ జగన్నాధం, ఆ తర్వాత ఆయన వారసుడు శిమ్మ ప్రభాకర్ రావు రెండు ఎన్నికల్లో విజయం సాధించారు.

ఆ తర్వాత బగ్గు కుటుంబం నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహించారు. 1972లో బగ్గు సరోజమ్మ గెలిచారు. ఆమె కుమారుడు బగ్గు లక్ష్మణస్వామి 1994లో విజయం సాధించగా, 2014లో బగ్గు కుటుంబం నుంచే బగ్గు రమణ మూర్తి గెలిచారు. దాంతో బగ్గు కుటుంబీకులు మూడుసార్లు గెలిచినట్టయ్యింది.

ఇక ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచారు. ఆ తర్వాత ఆయన శ్రీకాకుళం స్థానానికి మారగా, ఆయన స్థానంలో సోదరుడు కృష్ణదాస్ రంగంలోకి వచ్చారు. ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తం నాలుగు సార్లు కృష్ణదాస్‌‌ని ఇక్కడ విజయం వరించింది. దీంతో ధర్మాన కుటుంబానికి ఆరు దఫాలు నరసన్నపేట వాసులు పట్టం కట్టినట్టయ్యింది.

మొత్తంగా పోలినాటి వెలమ కులానికి చెందిన మూడు కుటుంబాల వారి ప్రాబల్యం కొనసాగుతుండడం విశేషం. వచ్చే ఎన్నికల్లో సైతం ధర్మాన, బగ్గు కుటుంబీకులే ఇక్కడ టికెట్ల రేసులో ముందంజలో ఉన్నారు.

తుని రాజా కుమార్తె విజయలక్ష్మి

ఫొటో సోర్స్, Madhu

తునిలోనూ అదే తీరు

కాకినాడ జిల్లాలోని తుని అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ మూడు కుటుంబాల వారికే అవకాశం దక్కింది.

అందులో 1952 నుంచి 67 వరకూ వరుసగా నాలుగు సార్లు జమీందార్ రాజా వత్సవాయి వెంకట కృష్ణంరాజు బహుదూర్ గెలిచారు. ఆయన తర్వాత వారసులు తెరమీదకు వచ్చారు. ఆయన కుమార్తె ఎన్.విజయలక్ష్మి కూడా వరుసగా రెండు దఫాలు 1972, 78లో విజయం సాధించారు.

టీడీపీ ఆవిర్భావంతో ఇక్కడ యనమల హవా మొదలయ్యింది. యనమల రామకృష్ణుడు వరుసగా ఆరు పర్యాయాలు గెలిచారు. 1983 నుంచి 2004 వరకూ ఆయనకు ఎదురులేదన్నట్టుగా సాగింది.

2009లో తొలిసారిగా యనమల రామకృష్ణుడి హవాకి అడ్డుకట్ట వేసి పూర్వపు జమీందార్ మనవడు, విజయలక్ష్మి మేనల్లుడు రాజా అశోక్ బాబు విజయం దక్కించుకున్నారు. యనమలకు వ్యతిరేకంగా ఆయన ఐదు దఫాలు పోటీ చేసి ఆఖరికి గెలుపు రుచి చూశారు.

2014, 19 ఎన్నికల్లో ప్రస్తుతం ఏపీ ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజాకి తుని ఓటర్లు పట్టంకట్టారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి దాడిశెట్టి, యనమల కుటుంబాల నుంచి తలపడే అవకాశం కనిపిస్తోంది.

పర్వత బాపనమ్మ

ఫొటో సోర్స్, Ramakrishna

ఫొటో క్యాప్షన్, పర్వత బాపనమ్మ, ప్రత్తిపాడు

ప్రత్తిపాడులో మరొకరికి చోటు లేదు..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానంలో అయితే కేవలం 1952 ఎన్నికలు మినహా, ఆ తర్వాత నుంచి మూడు కుటుంబాల వారే గెలుస్తూ వచ్చారు. 15 సార్లు ఎన్నికలు జరగ్గా పర్వత, ముద్రగడ, వరుపుల కుటుంబాల వారికే 14 దఫాలు విజయం దక్కింది.

1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో గెలిచారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలిచారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కి 2019లో విజయం దక్కింది. దీంతో పర్వత కుటుంబం నుంచి ఐదుగురు నేతలు ఐదు ఎన్నికల్లో గెలిచినట్టయ్యింది.

1962, 67 ఎన్నికలలో ముద్రగడ వీరరాఘవరావు గెలిచారు. ఆయన తనయుడు ముద్రగడ పద్మనాభం వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలిచారు. 1978, 83, 85, 89 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దీంతో ఆరు ఎన్నికల్లో ముద్రగడ కుటుంబీకులు విజయం దక్కించుకున్నట్టయ్యింది.

1972లో వరుపుల జోగిరాజు విజయం సాధించగా, 2004, 14లో రెండు సార్లు వరుపుల సుబ్బారావు గెలిచారు. దాంతో వరుపుల వారికి మూడు విజయాలు దక్కినట్టయ్యింది.

ఇప్పటి వరకూ కాపులు మాత్రమే గెలిచిన ఈ అసెంబ్లీ స్థానంలో వచ్చే ఎన్నికల్లో సైతం వరుపుల కుటుంబం నుంచి మరోసారి రంగంలో ఉండే అవకాశం స్పష్టంగా ఉంది.

ఎన్టీఆర్, మండలి వెంటక కృష్ణారావు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఎన్టీఆర్‌తో మండలి వెంకట కృష్ణారావు

అవనిగడ్డ కూడా అంతే..

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో కూడా అంతే. 1952, 55 ఎన్నికల్లో చల్లపల్లి జమీందారు కుటుంబీకుడైన యార్లగడ్డ శివరామ్ ప్రసాద్‌కి విజయం దక్కింది.

ఇక ఆ తర్వాత ఆరున్నర దశాబ్దాలుగా ఒకసారి మినహా మండలి, సింహాద్రి కుటుంబాల వారిదే ఆధిపత్యం.

2009లో మాత్రం అంబటి బ్రాహ్మణయ్య గెలవగా, ఆయన హఠాన్మరణం కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో వారి వారసుడు అంబటి శ్రీహరి ప్రసాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. దాంతో అంబటి కుటుంబీకులు ఇద్దరు అవనిగడ్డ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

మండలి వెంకట కృష్ణారావు 1972, 78, 83 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఆయన తనయుడు మండలి బుద్ధ ప్రసాద్ కూడా 1999, 2004, 2009 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. దీంతో మండలి తండ్రీ కొడుకులు ఆరుసార్లు అవనిగడ్డ సీటు కైవసం చేసుకున్నట్టయ్యింది.

ఇక సింహాద్రి సత్యనారాయణ కూడా 1985, 89, 94 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు. అదే కుటుంబానికి చెందిన సింహాద్రి రమేష్ బాబు 2019లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. దీంతో సింహాద్రి కుటుంబీకులకు నాలుగుసార్లు అవకాశం వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో సైతం మండలి, సింహాద్రి కుటుంబాల వారే తలపడాలని తహతహలాడుతున్నారు.

నాదెండ్ల మనోహర్

ఫొటో సోర్స్, Nadendla Manohar/FB

ఫొటో క్యాప్షన్, నాదెండ్ల మనోహర్

తెనాలిలో వారసురాళ్లు సైతం..

గుంటూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక తెనాలి అసెంబ్లీ స్థానం కూడా ఇలాంటి వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. ఆరంభం నుంచి ఇప్పటి వరకూ కమ్మ కులస్తులే గెలిచిన ఈ సీటులో వారసురాళ్లు కూడా అవకాశాలు దక్కించుకోవడం విశేషం.

తొలి మూడు ఎన్నికల్లో 1952, 55, 62 ఎన్నికల్లో ఆలపాటి వెంకట్రామయ్య గెలిచారు. ఆయన వారసురాలు దొడ్డపనేని ఇందిర కూడా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 1967 నుంచి 1978 వరకూ ఆమె ప్రాతినిధ్యం వహించారు. దాంతో మూడు దశాబ్దాల పాటు తండ్రి, కూతుర్లదే ఇక్కడ హవా సాగింది.

తర్వాత ఇందిర కుమార్తె గోగినేని ఉమ కూడా 1999 ఎన్నికల్లో గెలవడం విశేషం.

2014లో ఆలపాటి కుటుంబీకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇక్కడి నుంచి గెలిచారు.

1983, 85లో అన్నాబత్తుని సత్యనారాయణ గెలిచారు. ఆయన తనయుడు శివకుమార్ 2019లో గెలవడంతో ఆ కుటుంబాన్ని మూడు సార్లు విజయం వరించింది.

1989లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గెలిచారు. ఆయన తనయుడు నాదెండ్ల మనోహార్ వరుసగా రెండుసార్లు 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి చివరి స్పీకర్‌గా పనిచేశారు.

1994లో గెలిచిన రావి రవీంద్రనాథ్ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఆ మూడు కుటుంబాల వారే గెలవగా, వచ్చే ఎన్నికల్లో సైతం మరోసారి అవకాశం కోసం అన్నాబత్తుని, నాదెండ్ల కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు.

డీఎల్ రవీంద్రా రెడ్డి

ఫొటో సోర్స్, DL RAVINDRA REDDY YUVASENA/fb

ఫొటో క్యాప్షన్, డీఎల్ రవీంద్రా రెడ్డి

మైదుకూరులో ఐదు దశాబ్దాలుగా రెండే కుటుంబాలు

కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ స్థానంలో ఇప్పటి వరకూ రెండు కుటుంబాల నుంచి ముగ్గురు మాత్రమే ఎన్నికల్లో హవా చాటారు. ఐదు దశాబ్దాలుగా కేవలం ముగ్గురికే ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కడం విశేషం.

1972లో ఈ అసెంబ్లీ స్థానం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో శెట్టిపల్లి నాగిరెడ్డి గెలిచారు.

ఆయన తర్వాత దుగ్గిరెడ్డి లక్ష్మీరెడ్డిగారి రవీంద్రారెడ్డి( డీఎల్ రవీంద్రారెడ్డి) ఆరుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు.

శెట్టిపల్లి వారసుడు రఘురామిరెడ్డి 1985, 99, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. దీంతో శెట్టిపల్లి కుటుంబానికి ఐదు విజయాలు, డీఎల్ ఆరుసార్లు గెలిచినట్టయ్యింది.

వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి బరిలో ఉండాలని డీఎల్ ఆశిస్తున్నారు. అదే సమయంలో, శెట్టిపల్లి కుటుంబం నుంచి మూడోతరం రంగంలోకి రావాలని ఆశిస్తోంది.

వైఎస్ విజయమ్మ

ఫొటో సోర్స్, YSR CONGRESS PARTY

ఫొటో క్యాప్షన్, వైఎస్ విజయమ్మ

పులివెందుల కూడా ప్రత్యేకమే..

రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఏకైక అసెంబ్లీ స్థానంగా ఉన్న పులివెందులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1952 నుంచి పూర్తిగా రెడ్లు మాత్రమే ఇక్కడి నుంచి గెలవగా, అందులో 1978 నుంచి ఒకే కుటుంబం చేతిలో ఉంది.

వైఎస్సార్, ఆయన సోదరులు, భార్య, కుమారుడు కూడా ఇక్కడి నుంచి గెలిచారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు ఒకే స్థానం నుంచి గెలవడం రాష్ట్రంలో మరో చోట లేదు.

1978 నుంచి వరుసగా మూడుసార్లు రాజశేఖర్ రెడ్డి గెలిచారు. ఆయన తర్వాత 89లో వివేకానందరెడ్డి గెలిచినప్పటికీ 91లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ పురుషోత్తమ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు.

మళ్లీ 1994లో వైఎస్ వివేకానందరెడ్డి గెలిచారు.

1999 నుంచి 2009 వరకూ మూడు ఎన్నికల్లో వైఎస్సార్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మొత్తం ఆరు ఎన్నికల్లో ఆయన గెలిచినట్టయ్యింది. పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

2010, 11లో వరుసగా రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగిన ఈ స్థానాన్ని వైఎస్సార్ భార్య విజయమ్మ దక్కించుకున్నారు.

2014, 19 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.

వైఎస్ కుటుంబానికి ముందు 1955, 1967, 72 ఎన్నికల్లో పెంచికల బాసిరెడ్డి, గెలవగా, 1962లో మాత్రం చవ్వా బాలిరెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు

1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత కొన్ని కుటుంబాల వారు తమ సొంత సీట్లలో ప్రభావం చూపుతుండగా, 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మరికొన్ని కుటుంబాల హవా కనిపిస్తోంది.

అయితే, రాష్ట్రంలో ఇంకా కొన్ని సీట్లలో ఇలాంటి రాజకీయ కుటుంబాల ప్రభావం ఉన్నప్పటికీ రెండు, మూడు కుటుంబాల వారే సుదీర్ఘకాలం పాటు ప్రాతినిధ్యం వహిస్తుండడం మాత్రం వీటి ప్రత్యేకతగా చెప్పాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, పంజాబ్: వరిగడ్డితో టైల్స్ తయారీ, మంటల్లో వేసినా కాలవు

ఇవి కూడా చదవండి: