ముఖంపై ముడతలను, మచ్చలను కొల్లాజెన్ సప్లిమెంట్లతో తగ్గించుకోవచ్చా?

కొల్లాజెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గిలియా గ్రాంచీ
    • హోదా, బీబీసీ న్యూస్ బ్రెజిల్

కొల్లాజెన్ సప్లిమెంట్ చాలా పాపులర్. దీనివల్ల ముఖం మీద ముడతలు, చారలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం కోమలంగా మారడం వంటి ప్రధాన లాభాలు కలుగుతాయని భావిస్తారు.

క్యాప్యూల్స్, పౌడర్, క్యాండీల రూపంలో కొల్లాజెన్ సులభంగా ఆన్‌లైన్, హెల్త్ ఫుడ్ స్టోర్లలో దొరుకుతుంది.

కానీ, కొల్లాజెన్ వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయని నిరూపించే సరైన శాస్త్రీయ ఆధారాలు ఇంతవరకు లేవు.

మానవ శరీరంలో ఉండే ముఖ్యమైన ప్రొటీన్ కొల్లాజెన్. చర్మం, ఎముకలు, మృదులాస్థి వంటి కణజాలాలు బలంగా, స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ)తో ఉండటంలో కొల్లాజెన్ కీలక పాత్ర పోషిస్తుంది.

వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో ఈ ప్రొటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా అంతకుముందు మృదువుగా, దృఢంగా ఉన్న శరీరంపై ముడతలు రావడం, చర్మం సాగడం వంటివి జరుగుతాయి.

కొల్లాజెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొల్లాజెన్‌ క్యాప్యూల్స్, పౌడర్ రూపంలో అందుబాటులో ఉంటుంది

‘‘శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుదల కారణంగా ఓరల్ సప్లిమెంట్లను సిఫార్సు చేస్తారు. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడతాయని చెబుతారు’’ అని బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ డెర్మటాలజీ (ఎస్‌బీడీ) కాస్మియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్ కో ఆర్డినేటర్ ఎలిసెటె క్రోకో చెప్పారు.

ఓరల్‌గా తీసుకునే పదార్థాలతో ఆ ప్రయోజనాలు కలుగుతాయా, లేదా అనే ప్రశ్న రావడం చాలా సాధారణమని క్రోకో వివరించారు.

‘‘దీనికి సమాధానం సరైన డైట్‌లో దొరకవచ్చు. ఆహారంలో తగు మోతాదులో అమైనో అమ్లాలను తీసుకోవడం ద్వారా దీనికి సమాధానం దొరకవచ్చు. దురదృష్టవశాత్తు ఓరల్ కొల్లాజెన్ సప్లిమెంట్లు చూపించే ప్రభావాల మీద శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి’’ అని క్రోకో చెప్పారు.

ఈ ఉత్పత్తులను వాడే మహిళల చర్మం గట్టిపడటంలో కాస్త మెరుగుదల ఉన్నట్లుగా ఆల్ట్రాసౌండ్‌ల ద్వారా కొన్ని అధ్యయనాలు వివరించగలిగాయని క్రోకో అన్నారు.

‘‘అయితే, ఈ అధ్యయనాల్ని ఆయా పరిశ్రమలే చేశాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైగా ఇందులో 20 నుంచి 30 మందిపై మాత్రమే పరిశోధనలు చేస్తారు. పరిశోధన ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఇది చాలా చిన్న శాంపుల్ అవుతుంది’’ అని క్రోకో అభిప్రాయపడ్డారు.

కొల్లాజెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్ధిష్ట చికిత్సల్లో కొల్లాజెన్ సప్లిమెంట్లు పనిచేస్తాయి

కొల్లాజెన్ రకాలు

కొల్లాజెన్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనవి ఇక్కడ చూద్దాం.

టైప్ 1: ఇది చర్మం, ఎముకలు, స్నాయువు, దంతాల్లో ఉంటుంది. ఇది కండరాలకు బలం, నిర్మాణపరమైన మద్దతును అందిస్తుంది. చర్మంలో ఎలాస్టిసిటీ, దృఢత్వం ఉండేలా చేస్తుంది.

టైప్ 2: మృదులాస్థిలో ఉంటుంది. కీళ్లు సౌకర్యంగా కదలడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

టైప్ 3: రెటిక్యులర్ కణజాలాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయం, ప్లీహం, పేగులు వంటి అంతర్గత అవయవాలకు మద్దతునిస్తుంది. రక్తనాళాల్లో ఉండే కొల్లాజెన్ నాళాల స్థితిస్థాపకతలో కీలకంగా వ్యవహరిస్తుంది.

టైప్ 4: బేస్‌మెంట్ మెంబ్రేన్‌లోని ఈ భాగం, కణజాలాల నిర్మాణాన్ని కాపాడుతుంది. కణాలకు మద్దతుగా ఉండటంతో పాటు మెంబ్రేన్‌ను దాటే పదార్థాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

‘‘వెరిసోల్ అనే టైప్ 1 కొల్లాజెన్ అత్యధికంగా అమ్ముడవుతుంది’’ అని బీబీసీతో పోర్టో అలెగ్రెలోని మిన్హోస్ డి వెంటో ఆసుపత్రి డెర్మటాలజిస్ట్ మరీలే బేవిలాక్వా చెప్పారు.

బయో ఆక్టీవ్ కొల్లాజెన్ పెప్టైడ్స్‌తో వెరిసోల్ తయారవుతుంది. బయో ఆక్టీవ్ కొల్లాజెన్ పెప్టైడ్లు అనేవి ప్రొటీన్‌కు చెందిన అతిసూక్ష్మ భాగాలు. ఇవి శరీరంలోకి ప్రభావవంతంగా చొచ్చుకుపోతాయి.

‘‘వీటిని జంతువుల నుంచి సేకరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువల్ల వీగన్లు వీటిని తీసుకునే అవకాశం ఉండదు. పందులు, చేపలు, పక్షులు, పశువులకు చెందిన చర్మం, ఎముకలు, మృదులాస్థితో అనుసంధానమయ్యే కణజాలాల నుంచి ఈ ప్రొటీన్‌ను సేకరిస్తారు’’ అని ఆమె వెల్లడించారు.

కొల్లాజెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వయస్సు పెరిగినకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది

సప్లిమెంట్లు ఎప్పుడు పనిచేస్తాయి?

నిర్దిష్ట చికిత్స విధానాల్లో సప్లిమెంట్లు ప్రయోజనకరంగా ఉండగలవని డాక్టర్ ఎలిసెటో క్రోకో అన్నారు.

‘‘పీల్స్, లేజర్, మైక్రోనీడిలింగ్ వంటి డెర్మటాలాజికల్ చికిత్సలు చేసినప్పుడు, మేం కణ నిర్మాణాల్లో నియంత్రిత విభజన జరిగేలా చూస్తాం. ఇలా చేయడం వల్ల నియోకొల్లాజెనెసిస్ ఉత్పత్తి ప్రేరేపితం అవుతుంది. కాబట్టి కణ విభజనకు ప్రతిస్పందనగా శరీరం కొత్త ఫైబర్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కొల్లాజెన్ ప్రొటీన్ అధిక లభ్యత, నియోకొల్లాజెనెసిస్ ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. కొత్త ఫైబర్లను పునరుద్ధరించే ప్రక్రియలో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది.

కాబట్టి చికిత్సకు కనీసం నెల ముందుగా సప్లిమెంట్లు తీసుకోవడం ప్రారంభించాలని నా దగ్గరకు చికిత్స కోసం వచ్చేవారికి చెబుతాను. ఈ రకంగా చికిత్స తర్వాత కొల్లాజెన్‌ను ప్రేరేపించడానికి తగిన ముడిపదార్థం శరీరానికి అందుతుంది’’ అని బెవిలాక్వా అన్నారు.

ఆర్థోపెడిక్ గాయాలైనప్పుడు కొల్లాజెన్ సప్లిమెంట్లను వాడే అవకాశం ఉంది.

‘‘కీళ్లలోని ఫైబ్రస్ టిష్యూలను మరమ్మతు చేయడానికి నాణ్యమైన కొల్లాజెన్ సప్లిమెంట్లు ఉపయోగపడొచ్చు. అయితే దీనిపై బలమైన అధ్యయనాలు లేవు’’ అని చెప్పారు.

కొల్లాజెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చర్మం విషయానికొస్తే నివారణ పద్ధతులే మేలు

సప్లిమెంట్లా? నివారణ మార్గాలా?

ప్రత్యామ్నామ మార్గాల వైపు చూడటం కంటే నివారణ విధానాలు చూడటం ముఖ్యమని క్రోకో అన్నారు.

‘‘చిన్నతనం నుంచే జాగ్రత్తలు తీసుకోవడం, యవ్వనం, జీవితం మొదటి 50 ఏళ్లలో ఆరోగ్యకర అలవాట్లను చేసుకోవడం చాలా అవసరం’’ అని ఆమె చెప్పారు.

చర్మానికి మేలు చేసే అంశాల గురించి డాక్టర్ బెవిలాక్వా ప్రస్తావించారు. సూర్యరశ్మి నుంచి రక్షించుకోవడం, ధూమపానం చేయకపోవడం, మంచి డైట్‌ను పాటించడం, శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు రోజూ మంచి నిద్రవేళల్ని పాటించాలని సూచించారు.

ఒకవేళ ఇప్పటికే శరీరంపై ముడతలు, ఫైన్ లైన్స్, మచ్చలు వంటివి ఉంటే ఆమ్లాలు వంటి క్రియాశీల పదార్థాలతో కూడిన ఉత్పత్తులను స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చుకోవచ్చు. కానీ, ప్రతీ వ్యక్తి శరీరం అవసరాలను బట్టి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎవాల్యుయేషన్ తప్పనిసరి.

‘‘నాన్ ఇంజెక్టబుల్ చికిత్స విధానాలను కూడా ప్రయత్నించవచ్చు. ఇలాంటి పద్ధతుల్లో శరీరమే స్వయంగా కొల్లాజెన్ ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తారు.

మైక్రోనీడిలింగ్ వంటి పద్ధతుల్ని పాటించవచ్చు. వృద్ధాప్య చిహ్నాలను గమనించినప్పుడు ఏడాదికి రెండుసార్లు మైక్రోనీడిలింగ్ చికిత్స తీసుకోవచ్చు. దీన్నొక నివారణ విధానంగా పరిగణిస్తారు’’ అని క్రోకో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)