ఫుడ్ ప్యాకెట్ల మీద ధరతోపాటు చూడాల్సిన కీలక అంశాలు ఇవీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సర్వప్రియ సాంగ్వాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక కస్టమర్ ఏదైనా ప్యాకెట్ ఫుడ్ ఐటమ్‌ను కొనడానికి 6 నుంచి 10 సెకన్ల సమయం మాత్రమే తీసుకుంటారని చాలా పరిశోధనల్లో తేలింది.
కస్టమర్లు ఎక్కువగా ఆ ప్యాకెట్ మీద గడువు తేదీ (ఎక్స్‌పైరీ డేట్), దాని ధరను చూస్తారు.
కానీ, ఆ ప్యాకెట్ వెనుక వైపు ముఖ్యమైన సమాచారం చాలా ఉంటుంది. దాన్ని సరిగ్గా చదవడం తెలిస్తే బహుశా మీరు దాన్ని కొనకపోవచ్చు కూడా.
కానీ, ప్యాకెట్ మీద సమాచారం, అది నిజంగా ఆరోగ్యానికి మంచిదా, కాదా అనేది కస్టమర్లు అర్థం చేసుకోలేని విధంగా రాసి ఉంటుంది.
ప్యాకెట్ మీద ఇచ్చిన పోషకాల సమాచారాన్ని చూడటం ద్వారా అందులోని ఆహార పదార్థం నాణ్యతను అంచనా వేయడం తెలుసుకోవచ్చు.
ఏదైనా ఆహార ప్యాకెట్లను కొనడానికి ప్రాతిపదిక ఏంటి? అందులో కాస్త విటమిన్లు, ఖనిజాలు ఉంటే దాన్ని ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తాం. అలాగే అందులోని మిగతా అంశాల స్థాయి కూడా ఆరోగ్యానికి హానికరం కాకపోతే దాన్ని మంచి ఆహార పదార్థంగా పరిగణిస్తాం.
ఇక్కడొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి డైట్‌ను రెండు వేల కిలో క్యాలరీలుగా భావించి భారత్‌లో ఆహార పదార్థాల డబ్బాలు, ప్యాకెట్లపై ఫుడ్ లేబులింగ్‌ను వేస్తారు. దీన్నే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఆహార ప్యాకెట్ మీద రెకమెండెడ్ డైటరీ అలవెన్స్(ఆర్‌డీఏ)ను నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
కార్బోహైడ్రేట్ల ఆర్‌డీఏ ఎంత?
భారత్‌లో ఫుడ్ లేబులింగ్ ప్రమాణాలను ‘‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’’ నిర్దేశిస్తుంది. ఈ సంస్థ లేబులింగ్ నిబంధనలను నిర్ణయిస్తుంది. వాటిని పర్యవేక్షిస్తుంది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ శాస్త్రీయంగా ఒక ఆరోగ్యకర వ్యక్తికి సరిపడేలా నిర్దేశించిన పోషకాల స్థాయిని రెకమెండెడ్ డైటరీ అలవెన్సు అని పిలుస్తారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్గదర్శకాల ప్రకారం, కార్బోహైడ్రేట్ల రెకమెండెడ్ డైటరీ అలవెన్స్ రోజుకు 130 గ్రాములు.
ఉదాహరణకు మీరు 30 గ్రాముల ప్యాకెట్‌లోని ప్రాసెస్డ్ పల్లీలను తిన్నారనుకోండి. లేబుల్‌లో పేర్కొన్నదాని ప్రకారం, అందులో కార్బోహైడ్రేట్లు 24 శాతం ఉంటాయి. రోజువారీ ఆర్‌డీఏలో ఇది దాదాపు 18 శాతం.
అంటే, మీకు గుప్పెడు ప్రాసెస్డ్ పల్లీలతో 18 శాతం కార్బోహైడ్రేట్లు లభించాయి. ఒకవేళ మీరు 100 గ్రాముల పల్లీలు తింటే రోజులో తినాల్సిన 80 శాతం కార్బోహైడ్రేట్లు తిన్నట్లు అవుతుంది.
కానీ, రోజులో ఇంకా వేరే ఆహార పదార్థాలు తిన్నప్పుడు, అందులోనూ కార్బోహైడ్రేట్లు ఉంటే రోజువారీ కార్బోహైడ్రేట్ల పరిమితి దాటుతుంది.
ప్యాకెట్ వెనుక మీకు ‘సర్వింగ్ సైజ్’ అనే లేబుల్ కనిపిస్తుంది. మిగతా సమాచారం అంతా ఆ సర్వింగ్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది.
100 గ్రాముల్ని ప్రామాణికంగా తీసుకొని భారత్‌లో ఫుడ్ ప్యాకెట్ లేబుల్ మీద పోషకాల జాబితా రాసి ఉంటుంది. ఒకవేళ మీరు 100 గ్రాముల కంటే ఎక్కువ పరిమాణంలో తింటున్నారంటే, ఆ స్థాయిలో పోషకాలు మీ శరీరంలోకి చేరతాయి.
ఆ ఆహారంలో ఉండే పదార్థాలన్నీ లేబుల్ మీద అవరోహణ క్రమంలో రాసి ఉంచుతారు. అంటే ఆహారంలో ఎక్కువ మొత్తంలో ఉండే పదార్థాన్ని అన్నింటికంటే పైన రాస్తూ, అతి తక్కువగా ఉండే పదార్థాన్ని జాబితా చివరలో పేర్కొంటారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమేం పదార్థాలు ఉంటాయి?
పుడ్ ప్యాకెట్లు అన్నింటి మీద అందులోని పదార్థాలు, పరిమాణాల గురించి సమాచారం ఇవ్వడం తప్పనిసరి.
ముఖ్యంగా నాలుగు పదార్థాల మీద మీరు బాగా శ్రద్ధ పెట్టాలి. అవేంటంటే, టోటల్ ఫ్యాట్, సాచ్యురేటెడ్ ఫ్యాట్, సాల్ట్/సోడియం, షుగర్.
ఈ పదార్థాలన్నీ మీ బరువు, బీపీల్లో మార్పులకు కారణం కాగలవు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాల ముప్పును ఇవి పెంచుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
చక్కెర
షుగర్ లేదా చక్కెరలో కార్బోహైడ్రేట్లు తప్ప మిగతా ఏ పోషకాలూ ఉండవు.
అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మీ శరీరమంతా క్యాలరీలతో నిండిపోతుంది. ఆరోగ్యకర భోజనాన్ని తినకుండా చేస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఆకలి చచ్చిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయులను సరిగ్గా నిర్వహించే శరీర సామర్థ్యం కూడా దీనివల్ల ప్రభావితం అవుతుంది.
చక్కెర, తేనె, బెల్లం, కార్న్ సిరప్, కార్న్ షుగర్, ఫ్రక్టోజ్ స్థాయులు అధికంగా ఉండే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
బ్రౌన్ షుగర్, కేన్ షుగర్, కార్న్ స్వెటెనర్, డెక్స్‌ట్రోజ్, మాల్టోజ్, ఫ్రూట్ జ్యూస్ కాన్సంట్రేట్, గ్లూకోజ్ వంటివి చక్కెరకు ఉన్న ఇతర పేర్లు.
ఇవేవీ ఆరోగ్యకర చక్కెరలు కావు.
ఒక లీటర్ జ్యూస్ ప్యాకెట్‌ను తీసుకోండి. కానీ, లేబుల్ మీద 100 మిల్లీలీటర్లకు సంబంధించిన సమాచారమే ఉంటుంది.
ఒకవేళ మీరు 100 మి.లీ. జ్యూస్ తాగితే మీకు 12.6 గ్రాముల చక్కెర అందుతుంది.
ఇందులో యాడెడ్ షుగర్ 8.3 గ్రాములు ఉంటుంది. దీనివల్ల మీ శరీరానికి ఎలాంటి ఉపయోగమూ ఉండదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఆరోగ్యకరమైన ఒక వ్యక్తి రోజూ 25 గ్రాముల కంటే ఎక్కువగా యాడెడ్ షుగర్ తీసుకోకూడదు. 25 గ్రాములు అంటే దాదాపు ఆరు టీస్పూన్ల చక్కెరకు సమానం.
రోజులో తీసుకోవాల్సిన చక్కెరలో సగభాగం ఒక చిన్న గ్లాస్ జ్యూస్ ద్వారా అందడం గురించి ఆలోచించండి.
అలాగే ఈ జ్యూస్ ప్యాకెట్‌లో 18 మిల్లీ గ్రాముల విటమిన్ ‘సి’ ఉంటుంది. ఒక వ్యక్తికి రోజుకు 40 మిల్లీ గ్రాముల విటమిన్ ‘సి’ అవసరం.
మీరు విటమిన్ ‘సి’ కోసం ఈ జ్యూస్ తాగుతున్నట్లయితే, చక్కెర వల్ల శరీరానికి కలిగే హాని చాలా ఎక్కువగా ఉంటుంది.
డబ్ల్యూహెచ్‌వో సూచించిన గణాంకాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుసరించాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి.
రెకమెండెడ్ డైటరీ అలవెన్సు భారత్‌లో భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు యాడెడ్ షుగర్ పరిమితిని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 50 గ్రాములుగా సూచించింది. ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసిన పరిమితికి రెట్టింపు.

ఫొటో సోర్స్, Getty Images
ఉప్పు
అధిక రక్తపోటు (హైబీపీ) ముప్పును తగ్గించుకునేందుకు సోడియం స్థాయి అతి తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి.
ఉప్పును చాలా రకాల సాధారణ ఆహార పదార్థాల్లో వాడతారు. కేక్, బ్రెడ్, బిస్కెట్ వంటి వాటిలో కూడా ఉప్పు ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించరు.
భారత్‌లో ఒక వ్యక్తి రోజుకు 5 నుంచి 6 గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును తినకూడదు. ఇది దాదాపు ఒక టీస్పూన్‌కు సమానం.
కొన్ని ఉత్పత్తుల లేబుల్ మీద ఉప్పుకు బదులుగా సోడియం అని రాసి ఉంటుంది. ఇలాంటి లేబుల్ ఉన్నట్లయితే అందులో ఉప్పు ఎంత ఉందో తెలుసుకోవడానికి అక్కడ పేర్కొన్న సోడియం స్థాయిని 2.5తో గుణించాలి. సోడియాన్ని రోజుకు 2,300 మిల్లీ గ్రాములు లేదా 2.3 గ్రాముల కంటే తక్కువే తీసుకోవాలి.
డబ్ల్యూహెచ్‌వో ఇటీవలి నివేదిక ప్రకారం, భారత్‌లో 18 కోట్ల 80 లక్షల మంది ప్రజలకు హైబీపీ(అధిక రక్తపోటు) సమస్య ఉంది. కానీ, 37 శాతం మంది ప్రజలు మాత్రమే దీన్ని గుర్తించారు. అందులో 30 శాతం మాత్రమే దీనికి చికిత్స పొందుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సాచ్యురేటెడ్ ఫ్యాట్
ఫుడ్ ప్యాకెట్ మీద సాచ్యురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఎంతెంత ఉన్నాయో చూడండి.
హెల్తీ డైట్ కోసం సాచ్యురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా, ట్రాన్స్ ఫ్యాట్ అస్సలు లేకుండా చూసుకోవాలి.
బటర్, వెన్న, కొబ్బరినూనె వంటివి సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ లేదా సంతృప్త కొవ్వులు.
అన్‌సాచ్యురేటెడ్ లేదా అసంతృప్త కొవ్వులు అంటే ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె వంటివి.
ఉదాహరణకు, ఒక 100 గ్రాములు ప్యాకెట్ చిప్స్ తిన్నారనుకోండి మీకు 555 కిలోక్యాలరీలు అందుతాయి. అందులో 51 గ్రాములు కార్బోహైడ్రేట్లు, 35 గ్రాముల కొవ్వులు ఉంటాయి.
ఒకవేళ మీరు రోజంతా 2000 కిలో క్యాలరీల డైట్ తీసుకున్నట్లయితే అందులో 20-35 శాతం అంటే 44-78 గ్రాముల కొవ్వులు ఉండాలి. కానీ, ఇప్పుడు చూడండి ఒక చిప్స్ ప్యాకెట్ ద్వారా మీ శరీరంలో 555 కిలో క్యాలరీలతోపాటు 35 గ్రాముల కొవ్వు వచ్చి చేరుతుంది.
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 13 రకాల క్యాన్సర్లు, డయాబెటిస్, గుండె, ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు రావడంతో పాటు ఒక్కోసారి మరణానికి కూడా కారణం అవుతుంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 28 లక్షల మంది ఊబకాయం కారణంగా చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫైబర్
ప్రతీ సర్వింగ్‌లో 5 గ్రాముల ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు తినాలి.
భారత్‌లో ఎస్‌ఎస్‌ఏఐ రెగ్యులేటరీ సంస్థ ‘పోషకాహార క్లెయిముల’కు సంబంధించి నియమ నిబంధనల్ని పేర్కొంది.
ఉదాహరణకు 100 గ్రాముల పదార్థంలో 6 గ్రాముల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటేనే దాన్ని హై ఫైబర్ పదార్థంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
కాబట్టి, మీరు ఏదైనా ఫుడ్ ప్యాకెట్ కొనడానికి వెళ్లినప్పుడు లేబుల్ మీద ఉన్న సమాచారాన్ని చదవడానికి కాస్త సమయం కేటాయించండి. అప్పుడే మీకు, మీ కుటుంబానికి మంచి చేసే ఆహార పదార్థాల్ని మీరు ఎంచుకోగలరు.
ఇవి కూడా చదవండి:
- ‘ఆంధ్ర ఖజురహో’: మొదటి రాత్రికి ముందు కొత్త దంపతులు దర్శించుకునే ఆలయం - శ్రీకాకుళం జిల్లాలోని ఈ గుడి ప్రత్యేకతలు తెలుసా
- భూమి పచ్చగా మారాలంటే భూగర్భంలోని మొత్తం బొగ్గును మండించాలన్న అమెరికన్ ఇంజనీర్, చివరకు ఏమైంది
- షియాంగ్ యాంగ్ హాంగ్ 3: ఈ చైనా నౌక మాల్దీవుల తీరానికి వస్తే భారత్‌కు టెన్షన్ ఎందుకు?
- కారు గ్యారేజీలో న్యూక్లియర్ మిసైల్ రాకెట్, ఇన్నేళ్లుగా అతను ధైర్యంగా ఎలా ఉన్నాడంటే....
- భారతరత్న పురస్కారానికి అర్హులను ఎలా ఎంపిక చేస్తారు...విజేతలకు కలిగే సదుపాయాలు, ప్రయోజనాలు ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














